చిత్రలిపి

ఆశల తీరమది

-మన్నెం శారద

గూడు చెదరి  వీడి పోదామనను కున్నప్పుడాచెట్టు కనులు చెదిరే  రంగులతో …మనసు  పొంగే హంగులు  వడలంతా నింపుకుని  వయ్యారంగా ఆగమని ఆకుల కన్నులతో అలవోకగా సైగ చేస్తుంది !  చూరు మీద ఆకులు రాలి ఆకాశం కనిపిస్తున్నప్పుడు  కదలిపోదామిక  అని గాఢంగా  నిట్టూర్చినప్పుడు తారలు కుట్టిన ఆకాశం  కప్పుమీద  దుప్పటిపరచి  తళుకులీనుతూ మురిపిస్తుంది ! నిరాశనిండిన మనసుతో  నాదిక ఈ స్థానం కాదనుకుని  తెల్లారగానే  వీడ్కోలు  తీసుకుందామని  గట్టిగా అనుకుని  నిద్రలేచీ లేవగానే వెలుగుకిరణమొకటి  నా గుడిసెలో  దూరి ధైర్యానికి  భాష్యం చెబుతుంది ! వరదనీటిని చూసి  వలస పోదామంటే  వద్దు వద్దంటూ అలలు ఆర్తిగా  కాళ్ళని చుట్టేసుకుంటాయి ! ప్రకృతంతా  సద్దుమణిగి  పడక వేసినప్పుడు సవ్వడి లేకుండా సాగిపోదామంటే పేరు లేని పక్షి ఒకటి  చెట్టుపై చేరి  చెలికాడా  నేను లేనా నీకై  అంటూ  శోకారాగమొకటి  ఆలపించి ఆగి పొమ్మంటుంది  ఇన్ని బంధాలు వదలి ఎక్కడకి సాగగలను నేను !నా ఆశల తీరం .అనురాగ సీమ ఇదే కదా …ఇక్కడే ఆగిపోతాను  నా మమతల కుటీరంలో వెన్నెలని గ్రోలుతూ ….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.