చిత్రలిపి

ఆశల తీరమది

-మన్నెం శారద

గూడు చెదరి  వీడి పోదామనను కున్నప్పుడాచెట్టు 
కనులు చెదిరే  రంగులతో …
మనసు  పొంగే హంగులు  
వడలంతా నింపుకుని  
వయ్యారంగా ఆగమని 
ఆకుల కన్నులతో అలవోకగా సైగ చేస్తుంది !
 
 చూరు మీద ఆకులు రాలి 
ఆకాశం కనిపిస్తున్నప్పుడు  
కదలిపోదామిక  అని గాఢంగా  నిట్టూర్చినప్పుడు 
తారలు కుట్టిన ఆకాశం  
కప్పుమీద  దుప్పటిపరచి  
తళుకులీనుతూ మురిపిస్తుంది !
 
నిరాశనిండిన మనసుతో  
నాదిక ఈ స్థానం కాదనుకుని  
తెల్లారగానే  వీడ్కోలు  తీసుకుందామని  
గట్టిగా అనుకుని  నిద్రలేచీ లేవగానే 
వెలుగుకిరణమొకటి  
నా గుడిసెలో  దూరి 
ధైర్యానికి  భాష్యం చెబుతుంది !
 
వరదనీటిని చూసి  వలస పోదామంటే 
 
వద్దు వద్దంటూ అలలు 
ఆర్తిగా  కాళ్ళని చుట్టేసుకుంటాయి !
 
ప్రకృతంతా  సద్దుమణిగి  పడక వేసినప్పుడు 
సవ్వడి లేకుండా సాగిపోదామంటే 
పేరు లేని పక్షి ఒకటి  చెట్టుపై చేరి 
 చెలికాడా  నేను లేనా నీకై 
 అంటూ  శోకారాగమొకటి  ఆలపించి ఆగి పొమ్మంటుంది 
 
ఇన్ని బంధాలు వదలి ఎక్కడకి సాగగలను నేను !
నా ఆశల తీరం .అనురాగ సీమ ఇదే కదా …
ఇక్కడే ఆగిపోతాను  నా మమతల కుటీరంలో 
వెన్నెలని గ్రోలుతూ ….
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.