
గోడలు
(సుభద్రాదేవి గారి కథపై సమీక్ష)
-డా. సిహెచ్.సుశీల
గోడలు… గోడలు… మనిషికి మనిషికి మధ్య గోడలు. మానవత్వానికి అడ్డుగోడలు. స్త్రీ చుట్టూ నిర్మించిన కట్టుబాట్ల గోడలు. సంప్రదాయాల పేరిట నిలిచిన బలమైన గోడలు. శీలా సుభద్రాదేవి గారు తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను కథావస్తువుగా, కవితాంశంగా తీసుకుంటారు. నాగరికంగా ఎంతో ఎదిగాం అనుకొన్న ఈ రోజుల్లో, సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అనుకుంటున్న ఈ రోజుల్లో – ఇంకా మూఢ విశ్వాసాల సుడిగుండంలో మనుషులు మునిగితేలుతున్న కఠినసత్యాన్ని చెప్పారీ కథలో. ఎంతో ధనం వెచ్చించి, దగ్గరుండి ముచ్చటగా కట్టించుకొన్న ఫ్లాట్ లోకి విగతజీవిగా మారిన రాజారాం శరీరాన్ని తీసుకురావడానికి అనుమతించని అపార్ట్మెంట్ వాసుల మొండి వైఖరికి భార్య ఎంత క్షోభపడి ఉంటుంది! విదేశాల్లో ఉన్న అన్నలు రావాలని కూతురు ప్రాధేయ పడటంతో చివరికి సెల్లార్ లో ఉంచటానికి అంగీకరిస్తే, అదే చాలనుకునే పరిస్థితి. ” శవం” వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందో రాదో కానీ, ఈ ఇరుకు మనసుల సంకుచిత భావాల వల్ల మాత్రం సమాజానికి తప్పక “ఇన్ఫెక్షన్” వస్తుంది. ఈ వాదోపవాదాల మధ్య భౌతిక దేహం తరలి పోయింది. ఇంక అసలు తంతు – ఆ స్త్రీ “ముఖం చూడటం” అనే తంతు. భర్తను కోల్పోయిన స్త్రీ చివరిసారిగా పసుపు కుంకుమలతో, పూలు గాజులతో అలంకరించుకుంటే, అందరూ వెళ్లి చూసి రావటం. కొండంత భాధని ఆమె గుండెలో దాచుకొని, ఒక ‘ప్రదర్శన’గా కూర్చోవటం… ఎంత హేయమైన సంఘటన! ఇక్కడే సుభాషిణి చలించిపోయింది. మొదటి నుంచి జరుగుతున్న గేటెడ్ కమ్యూనిటీ వారి చర్చోపచర్చల్లో తానేమీ చేయలేని నిస్సహాయురాలు. కానీ 11వ రోజు రాజారాం భార్యని వెళ్లి చూడటం, చూడకపోవడం అన్నది తన స్వంత నిర్ణయం. అందుకే 11వ రోజు వెళ్ళవద్దని, మరో రోజు వెళదాం అని చెప్పింది కోడలితో. పదిరోజుల నుండి జరుగుతున్నదంతా చూసి, వికలమైన మనసుతో సుభాషిణి “నేను చనిపోతే అనాధప్రేతంలా సెల్లార్ లోనో, మంచు పెట్టెలో పెట్టి ఇంట్లోనో పెట్టకుండా నా శరీరంలోని ఏ అవయవం అయినా ఎవరికైనా ఉపయోగపడితే ఇచ్చేసి, అటు నుంచి అటే బూడిద చేసేయండి” అని స్ధిరనిశ్చయంతో చెప్పింది కోడలికి. స్త్రీని బ్రతికుండగానే చంపేసేంత ఎత్తుగా బలంగా నిర్మింపబడ్డ గోడలు ఇంకా… ఇంకా.. అవసరం లేదు. సుభాషిణి లాంటి స్త్రీ ఆ గోడల్ని బద్దలు కొట్టడానికి ఒక అడుగు ముందుకేస్తే, మరిన్ని అడుగులు అనుసరిస్తాయన్నది ,రాబోయే కాలంలో తప్పక జరుగుతుంది. జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచింపజేసే కథ నందించిన సుభద్రాదేవి గారికి అభినందనలు.
*****

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)

నా” గోడలు” కథపై సుదీర్ఘ సమీక్ష రాసినందుకు ధన్యవాదాలు సుశీల గారూ