
నలిగే క్షణాలు
-గవిడి శ్రీనివాస్
గూడు విడిచిన పక్షి మాదిరి
తపనపడ్డ క్షణాలు నలిగిపోతున్నాయి .
తుఫాను వీచినట్లు
ఎడారులు ఎత్తిపోసినట్లు
ఇంటికి దూరమైన పిల్లలు
హాస్టల్ లో వేలాడుతున్నారు.
గుండెను తడిపే పలకరింపు కోసం
దూర భారాన్ని దింపుకోవటం కోసం
కన్నీటి తీగలు చెవిలో మోగుతున్నాయి .
కొన్ని చేరువ కావలసినపుడు
కన్నీటి చినుకులూ కురుస్తాయి .
ఈ కాసింత కాలాన్ని
ఓపిక మీదే ఆరేయాలి
కన్నవారి కలలు పిల్లల్లో
పిల్లల కలలు ఆప్యాయతల్లో
వాలుతుంటాయి .
రాత్రులు కన్నీటి నదుల్లో తడిపేస్తే
మీ జ్ఞాపకాలు కలవరపెడతాయి.
మళ్ళీ తెల్లవారు కోసం
రాత్రుల్ని చించుకోవాలి .
పేగుబంధమంటే ఏమని చెప్పాలి
తీగలు లేకుండానే
దూరాల్ని సైతం కుదిపేది
మనసుని సైతం కూల్చేదీ ……….
అయినా చిట్టి తల్లీ
కాస్తా చదువుకో వచ్చేస్తా ….
సమయాల్ని నిద్రలేపి
అనురాగపు తీరాల్ని మీ దరికే
తీసుకొచ్చేస్తా …
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.


