రాగో

భాగం-19

– సాధన 

గాండో ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక ఫకీర అతని వెనుక గిరిజ, కర్పలు నడుస్తున్నారు. ధీకొండ నుండి మడికొండ చాల దగ్గర, నడుమ బాండే నదే అడ్డం. ఆ ఒడ్డుకు మడికొండ. ఈ ఒడ్డుకు ధీకొండ. కాస్తా పైకి పోతే మధ్యప్రదేశ్ – మహారాష్ట్రల సరిహద్దుగా వస్తుంది బాండే. ఆపై నుండి తిరిగి మళ్ళీ మహారాష్ట్రలోనే పారుతుంది. పాము మెలికలు తిరిగే బాండే యం.పి.లో పుట్టి యం.పి. – మహారాష్ట్ర సరిహద్దులో ఇంద్రావతిలో కలుస్తుంది. ఈ బాండే నదికి అక్కడక్కడ ‘జారామి’ (ఓడ నడిపేవారు)లు డోంగా (ఓడ)లు వేస్తూ ప్రయాణికులని దాటిస్తూంటారు. విపరీతంగా వర్షాలు వస్తే వారం – పదిరోజుల వరకు కూడా బాండేలో కాలేవుల్లో దాటడం కుదరదు. బాండే ఒడ్లుపట్టి పారుతుంటే డొంగ వేయడానికి జారామి భయపడుతుంటాడు. వృత్తిరీత్యా అతన్ని జారామి అంటారు. తల్లి బాండే ఎన్ని జీవాలను సముద్రం పాలు చేసిందో’, ఏం జారామి కూడా తొలకరి వర్షాల తర్వాత పూజ చేసి కానీ ఓడ వేయడానికి సాహసించడు. తల్లి బాండేను శాంతపర్చాలి అంటారు. ఎంతో అవసరం అయితే తప్ప రాత్రి పూట పొంగిపొరిలే నదిలో ఓడ వేయడానికి అసలే సాహసించరు. నదిలో కొట్టుకు వచ్చే అడవి దుంగలు ఓడను ఢీ కొడితే అది పల్టీ ఇచ్చిందంటే ఓడలోని మనుషులు అడ్రసు లేకుండా పోతారనేదే జారామి మామ భయం. పారే నీళ్ళపై నురుగులు వస్తున్నాయంటే నది పొంగుతున్నదన్నమాట. ఈ బాండేనది పైన ఏటపల్లికి 10 కి.మీ. దూరంలో చంద్రకండి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి పనులు సాగుతున్నాయి. ఈ డామ్ మూలంగా చుట్టుపట్ల ఇరవై ఐదు – ముప్పై గ్రామాలు లేవాలి. అందుకే ఆదివాసీలు డామ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఇంత నదిలోనూ ఎండా కాలం వస్తే పారకం మాయమై అక్కడక్కడ మడుగులుంటాయి.

“అక్కా! బాండే ఎంత ఉందో” కర్ప మెల్లగా గిరిజను కదిలించాడు.

“ఏమో దాదా – నాకు ఆ మహా భయం. చిన్నప్పుడు ఈత నేర్చుకుందామని ఎంత ప్రయత్నించినా అమ్మ పడనివ్వలేదు” అని తన ఆతురత వెళ్ళబుచ్చుతూ “అయినా డోంగ ఉండవచ్చులే” అనుమానంగా అది గిరిజ.

“ఏమో అక్క – వేస్తుండవచ్చు. వాళ్ళ వృత్తే అది కదా. ఈ మధ్య కొడుకులు ఎదిగాక వ్యవసాయం చేస్తున్నారు కానీ ముందు ముసలోడు ఇరువై నాలుగు గంటలు ఇక్కడే. ఈ ఒడ్డుకే ఆయన పొలం, వలలు, చేపలు ఉన్నదేనాయెదంటకు” అంటూ కర్ప గడగడ చెప్పుకుపోతున్నాడు.

“జారామి! ఏయ్ జారామి” అంటూ ఒడ్డును ముందుకు చేరిన గాండో వేసిన కేక కర్ప – గిరిజల సంభాషణను తుంచేసింది. దూరంగా పొలం పని చేసుకుంటున్న జారామి ఈ కేకతో పని ఆపి “వాయినన్” (వస్తున్నాను) అంటూ రాసాగాడు.

“లాల్ సలాం దాదా” – అంటూ జారామి పీడో కుడిచేయి ముందుకు జాపి “ జావ తాగిరానుపోయినా దాదా” అంటూ చేయి కలిపి పలకరించాడు.

“డోంగలో ఎందరం పోవచ్చు దాదా?” – భయంతోనే ఆ ప్రశ్న వేస్తుందని పీడో సులభంగానే గుర్తించాడు.

“అందరు రావచ్చు బాయి – డోంగ పెద్దదే -డోఖా లేదు” అన్నాడు పీడో.

“ఔ అందరం ఒకేసారి పోవచ్చు.” అన్నాడు గాండో ఆలస్యం కాకూడదనే ఆతురతతో.

“మనం నలుగురం – మన సామాను అంతా ఒక మనిషి బరువు అంటే ఐదుగురం – జారామితో ఆరు. కష్టం గాండో దాదా” అంది గిరిజ బెదురుతో..

“అక్కా నీవు ముందురా. ఈ అన్నలందరు తర్వాత వస్తారు. నిన్ను, సామాన్ను ఓ ట్రిప్పు దాటిస్తా” అంటూ పీడో డోంగలో కెళ్ళిపోయాడు.

“అమ్మో? ఎవరి తుపాకులు వాళ్ళవెంటే ఉండాలి” అంటూ డిసిప్లిన్ గుర్తు చేశాడు గాండో.

“మీ ఇష్టం దాదా మొన్న పోలీసోళ్ళను దాటిస్తే ముందు వాళ్ళ తుపాకులను, వాళ్ళ సాయబును దాటించి ఆ తర్వాత అందరిని తీసుకెళ్ళా” అంటూ గిరిజ డోంగలో కూచోగానే డోంగను ముందుకు నెట్టాడు పీడో.

“పోలీసు సాయబుకు వాడి తుపాకులే ముఖ్యం తప్ప ఒడ్డున మిగిలిన పోలీసులు ఏమైతే వాడికేం కావాలి. ఆ లంజకొండుకులంతే” అంటూ “ఫకీరా నువ్వు అక్కతో పో” అని గాండో అనగానే ఫకీర డోంగలోకి దూకాడు. ఆ ఊపుకి కాస్తా డోంగ అటిటు అయ్యేసరికి గిరిజ ‘కయ్యి’మని కేకపెట్టింది.

జారామి పక పక నవ్వుతూ “నీకేం కాదు బాయి! కదలకు” అంటూ తెడ్డు వేశాడు.

“దాదా! నాకు ఈత రాదు. కాస్తా మెల్లగా” గిరిజ మొదటి మాట.

“ఏం గాదు అక్కా – డోంగా దొర్లి నా నువు డోంగను విడవకు. మునగవు – అక్కా! నీళ్ళపైన డోంగ ఎంత తేలి ఉందో చూడు. మూరెడుంది. ఏం మునగద’ంటూ డోంగ సూత్రం చెప్పాడు ఫకీరా.

డోంగ అవతలివైపు చేరింది. గిరిజ గబుక్కున లేచింది. “బాయి మెల్లగ – అట్ల లేస్తేనే దొర్లి పడతరు. జాగ్రత్త. ఈ ఒడ్డుకు లోతు ఎక్కువ” అంటూ గుర్తు చేశాడు పీడో – మరో ట్రిప్పుకై డోంగ తిరుగుముఖం పట్టింది.

పీడో మాటతో గిరిజ మనసులో ‘గోదావరి దుర్ఘటన’ తళుక్కున మెదిలింది.

అది వర్షాకాలం. గోదావరి పొంగుతూంది. ఒడ్డు పాళం నీళ్ళు – ఓడ వేయడానికి జారామికే భయమవుతుంది. అయినా అర్జంటు అపాయింట్ మెంట్, తప్పితే కష్టం అని తప్పనిసరంటూ ఓడ వేయించారు అన్నలు. వెంకన్న, మాధన్న జారామి – ముగ్గురూ తూలుతూ, ఊగుతూ సాగే డోంగలో “ఏంగాదు అన్నా” అంటే “ఏం గాదు దాదా” అంటూ ఒకరికొకరు ధైర్యమిచ్చుకుంటా దరిజేరబోతున్నారు. ఆవలివైపు మిణుకు మిణుకుమంటూ టార్చిలైటు వెలుగుతూ ఆరిపోతూ అన్నలు వచ్చారని సంకేతం ఇస్తూ ఉంది. మరో 10 గజాల్లో ఒడ్డు చేరుతుంది ఓడ. అంతలోనే ఒక దుంగ వచ్చి డోంగను గుదుకొని తలక్రిందులు చేసిపోయింది. జారామి ఈదుకుంటూ ఒడు చేరాడు. అన్నల జాడ లేదు. జారామి కళ్ళ ), “వీపుకు కిట్లు – జబ్బులకు తుపాకి ఉంటే మనిషి ఈదలేడు దాదా. ఒక్క క్షణమైతే ఒడ్డెక్కుదుం. గంగపోయితా (చీకటి పట్టింది). వూపులో వచ్చిన దుంగ ఒక్క దొబ్బు దొబ్బింది” అంటూ, జారామి గొల్లుమన్నాడు. జారామితో సహా అన్నలు అమరులకి జోహారు అర్పించారు.

“దాదా మరో గంటకి కమాండర్ అన్నలు వస్తారు. వారిని కూడ దాటివ్వాలి” అంటూ దిగుతున్న గాండో, కర్పలను చూసి గిరిజ ఈ లోకంలోకి వచ్చింది.

అందరికన్నా ముందుగా ఒడ్డెక్కిన ఫకీరా దూరంగా కొడిశ చెట్టుకొమ్మ మీద గొర్రెంక పిలుపు విన్నాడు. చూశాడు “ఏముందమ్మా? పామా? ఉడుమా?” అంటూ అటు కదిలాడు. అక్కడికి చేరిన కర్ప కూడా అనుసరించాడు. గిరిజకు ఏమీ అర్థం గాకపోయేసరికి గాండో భుజాలెగురవేస్తూ చిటికె వేశాడు.

“పద ఫకీరా! ఉర్పల్ (ఉడుం) గావచ్చు. సాయంకాలం మంచి మంచి భోజనం. నక్కను తొక్కి వచ్చినం” అంటూ తోవ తీశాడు గాండో. కర్ప, ఫకీరా, గిరిజలు అనుసరించారు.

చెట్టుమీద ఉన్న ఉడుం నాలుగు కాళ్ళతో కొమ్మను బలంగా పట్టుకుంది.

గాండో కొక్కెం తయారుచేసాడు. కర్ప, ఫకీరలు కర్రలు అందుకున్నారు. గిరిజకో కర్ర ఇచ్చి అలర్ట్ గా ఉండమన్నారు.

గిరిజ ఇంకా సర్దుకుంటూ ఉండగానే కొక్కెంలో ఇరికిన ఉడుం గిరిజ ముందే టమని పడింది.

“అక్కా! అక్కా! వేసేయ్-” ఫకీరా, కర్పల గాబరా.

గాబరలో గురి తప్పి, కర్ర విరిగి గిరిజ ముందుకు తూలిపడింది. పళ్ళు విరిగినంత పనైంది.

కర్ప, గాండో, ఫకీరాలు కిల్లుమన్నారు. ఉడుం కొక్కెంలో గిలగిలమంది.

“అక్కా! ఉరిలో చిక్కిన ఉడుం ఎటు పోతుందక్కా” అంటూ గాండో అనే సరికి తనను ఆట పట్టించినట్లు గిరిజకు అర్థమైంది.

ఆదివాసీ కామ్రేడ్స్ మధ్య జీవితంలో గిరిజకు కాలం తెలియకుండానే పరుగు తీస్తూంది. వీళ్ళు ఏదీ విడువరు. ఊహకు అందని ఉపాయాలతో ఉచ్చులో దేన్నైనా ఇట్టే పట్టేస్తారు. తేనె, చేపలు, కప్పలు, పాములు ఏదైనా కంటబడితే పూర్తి గావలసిందే.

“అక్కా! మీది ‘టాండో) పాడికదా ఉడుం తినకూడదు” చమత్కరించాడు ఫకీరా.

“అవును – టాండో పాడికి ఉడుం నడువదు. అక్క కూర నాకే” అంటూ లొట్టలు వేయసాగారు కర్ప.

“అక్కా – తెలివి ఉపయోగించు అక్కా! ఈసారి పల్టీకొట్టడం వాళ్ళ వంతు గావాలి” అంటూ ఉడుం కొద్దిగా చీరి అందులో దాని కాలు ఇరికింది. ఆ ముడిలో దాని మెడ తగిలించి ఉడుంను చేతబట్టుకుంటూ గిరిజకు ధైర్యం ఇస్తున్నాడు గాండో.

గిరిజ ఈ మధ్యనే ఇంటి పేరు (పాడి) చెప్పుకుంటుంది. టాండోవారు తాబేలు తినరని తెలిసి ‘సర్లే! అదేం దొరికేదా?” అని టాండో పాడి ఖరారు చేసుకుంది. ఇపుడెలా? “ఏం ఉపాయం అన్న” అంటూ గాండో వైపు చూసింది.

“అక్కా! మీ ఆయన పాడి ‘మడావి’ అనేసేయ్ చెల్లుతుంది” అంటూ క్లూ ఇచ్చాడు గాండో.

“నో! నో! ఉడుం కోసం మా ఆయన ఇంటి పేరు పెట్టుకోవడమా! చచ్చినా మీ సాంప్రదాయాలకి నేనొప్పుకోను” అంటూ మూతి బిగించింది గిరిజ.

“పెళ్ళయితే ఇంటి పేరు మారిపోతుంది కదక్కా” అన్నాడు గాండో మళ్ళీ.

“కమ్యూనిస్టుల్లో కూడ ఆ పాడు రూలేనా” అంది గిరిజ మరింత బెట్టుగా.

       “అక్క మళ్ళీ ఓడిపోయింది. కూర మాకే” అంటూ కేరింతలు కొడుతూ ఆ నలుగురు ఊరి చివరి ఇళ్ళు చేరుకున్నారు.

మడికొండ 10 ఇళ్ళకు మించని ఊరు. అవన్నీ గడ్డి గుడిసెలే. పేదరికం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కొన్ని గుడిసెల మీద గడ్డి సైతం మొలిచింది. నిరుడు కప్పని గుడిసెల్లో నుండి పగలు రేయి కానవస్తున్నవి. ఆ ఊళ్లో నోరు, డబ్బు ఉండి పైరవీ చేసేవాళ్ళు లేకపోవడంతో తిరిగి తిరిగి చెప్పులరిగినయి తప్ప సర్కార్ వారి కనేల (బెంగుళూరు పెంకలు) వారికి చేరలేదు. ఏ ఆఫీసుకు పోయినా ‘అంగట్ల అవ్వ అంటే ఎవనికి పుట్టినవే బిడ్డా’ అన్నట్లైంది వారి పని. ఊరి నడుమ గోటుల్ కూడ ఆ ఇళ్ళకేం తీసిపోదు. తాతల నాటి డోళ్ళు, డప్పులు చూరుకు వేళ్ళాడుతున్నాయి. అక్కడ యువకులు పడుకునే మంచాలు కీళ్లూడి లుకలుకలాడుతున్నాయి. వారం రోజులు ముసుర్లలో ఆ ఊరికి తగ్గట్టే తుప్పుపట్టుతున్న సోలార్ లైటు స్తంభం, హేండిల్ ఊడిపోయిన బోరింగు చారిత్రక శిథిలాల్లాగా మొండిగా నిలబడి ఉన్నాయి.

గోటులకు కుడివైపు ఉన్న చిన్న గుడిసెలో అడ్డంగా తడిక పెట్టి రెండు గదులు చేశారు. అది పిల్లలకు పాఠాలు చెప్పే బడి అనుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అందులో ఊరి గొడ్లు పొర్లుతున్నవి. ఆ బడి పంతులుకు కూచోను కూర్చీ ఇంకా మంజూరు కాలేదు. ఏకోపాధ్యాయ పాఠశాల అది. గుంజకు ఒరిగించిన నల్లబల్ల కింద పడ్డట్టుంది. ఓ పంది దానిపై పడుకుంటే కూనలు పాలు చీకుతున్నవి. గురూజి, ఎప్పుడో బుద్ది పుట్టిన్నాడు తప్ప రాడు. ఎందుకయ్యా అంటే ‘ఇక్కడ నేను ఎవరికి చదువు చెప్పాలి. గొడ్లకు, పందులకా!’ అంటాడు. ‘పిల్లలను బడికి తోలాలి కదా దాదా’ అంటే ‘ఆడికి పోటీ ఈడికెట్లా రావాలి’ అంటూ జానెడు లోతుకు తప్ప ఎన్నడు నిండుగా కనపడని బొత్త (పొట్ట) వైపు చూపిస్తారు జనాలు.

వర్షాకాలం ఊర్లో దారికి రెండు వైపులా గడ్డి పెరిగింది. ఇండ్లలోని చెత్తా చెదారం తోవలో పారేయడంతో అది మురిగి మరింత కంపు వస్తుంది. ఊరవతలి పశుల కొట్టాల్లోంచి పారిన రొచ్చుతో నిండిన ఆ దారిలో కాలు పెడితేనే ఒళ్ళు జివ జివ అంటుంది. అందులో కాసేపు నడిస్తే చాలు పాదాలు చెడిపోతాయి. కొట్టాల్లో మోకాళ్ళ బంటి పేరుకపోయిన రొచ్చుల ఎటు మెసలరాక పశువులన్నీ అలా నిలబడే ఉంటాయి. ఉదయం బాగా పొద్దెక్కాక ఆ కొట్టాల్లో నుండి వాటి విముక్తి. పొద్దుపోతే మళ్ళీ ఆ కొట్టాలే గతి. కరువు, దరిద్రం, ఆకలితో మందు మాకు లేకుండా రోగాలు నొప్పులతో సతమతమవుతున్న ఆ ఊరి ప్రజలకు తమ పశువులు ఇంతటి దుర్గంధంలో గతిలేక పొర్లుతున్నాయని స్పృహ కూడ లేదేమోననిపిస్తుంది. ఆ బాధ ఉన్నా వాళ్ళు చేయగలిగింది లేదు.

“గిరిజక్కా! ఇక్కడ ఆగుదామా” – అంటూ పుష్పి గుమ్మంలో నిలబడుతూ అన్నాడు గాండో.

“మరో ఇల్లు లేదా? కాస్తా వాకిలి అయినా ఉంటే అందరం కూచోవచ్చు” – గిరిజ.

“ఈ మడికొండలో మనకు తెల్వనిది ఎక్కుడుంది. ఇదైతే ఉరావ్ వాళ్ళది. అడవికి దగ్గరుంటుంది. మనకు సేఫ్టీ.”

అక్కడ ఆగారు ఆ నలుగురు ఉడుముతో.

ఉరావ్ తెగ ఆచార వ్యవహారాల్లో మాడియాల కంటే మరీ వెనుకబడిన తెగ. వారి స్త్రీలకు పచ్చబొట్లు మరీ జాస్తి కొందరి కుంటో, సెంటో భూమి ఉన్నా వారందరికీ ప్రధానంగా వ్యవసాయ కూలీలుగానే పొట్ట గడువడం. గత 15-20 ఏళ్ళ నుండి వీరు బీహార్, మధ్యప్రదేశ్ నుండి వలస రావడం జరుగుతున్నా ఈ మధ్య అన్నల రాకతో భూములు నరుక్కునే అవకాశాలు పెరిగాయని వారి వలస కూడా పెరిగింది.

ఆ ఊరి ఆడవాళ్ళు అప్పుడే పొలం పనుల నుండి వచ్చినట్టున్నారు. అలసిన ముఖాలతో పొయ్యిలు రాజేస్తున్నారు. చిన్న పిల్లలు మరుగాళ్ళపై నడుస్తూ కాలికి బురద అంటకుండ ఆడుకుంటున్నారు. బురదలో పొలం దున్ని జంబుకొట్టి కాళ్ళు చెడిన అన్నలు ఎత్తయిన కర్ర పాకోళ్ళతో నడుస్తున్నారు. అక్కలకు అవీ లేవు. అన్నలను చూసిన పిల్లలందరు ఇంటి ముందు జమయినారు. వారి కళ్ళు వారి స్నేహితులు ఊల్లె, టుగెల కోసం వెతుకుతున్నాయి.

అన్నలొచ్చారని తెలిసి సంఘం వత్తె ఎదురు వచ్చాడు.

“లాల్ సలాం” అంటూనే చేయి ఎత్తేడు వత్తె.

“లాల్ సలాం – అంతా మంచిదేనా” – గాండో ప్రశ్న.

“ఆఁ! ఏం మంచి దాదా! ఒక్కటే ముసుర్లు – దీనితో ఊరంతా జ్వరాలే, బళ్ళే. పని రోజులు” – అని ఆ ఊరి యోగక్షేమాలు సంక్షిప్తంగా అప్పచెప్పి “ఎందరు దాదా!” అని దళం సంఖ్య అడిగాడు.

“పదమూడు దాదా” కర్ప జవాబు.

“దాదా వత్తే మీరు కూర జమ చేయకండి మేం ఉడుం తెచ్చినం” – ఫకీర అనేశాడు.

“మంచి మని చేసిండ్రు దాదా. కూరలకు మహా తస్లీపుగ ఉంది” అంటూ నూకలు జమ చేయడానికి వెళ్ళబోతున్న వత్తెను మరో ప్రశ్న వేసింది గిరిజ.

“గురూజి ఉన్నాడా దాదా?”

“లేడు” – అంటూనే వత్తె తన పని మీద కదిలాడు.

గోటుల్ ముందు చిన్న గంపతో కూచుని నూకలు వసూలు చేస్తున్నాడు వత్తే వంతు ప్రకారం ప్రతివారు బియ్యం, పొడిగటుక తెచ్చి అందులో పోస్తున్నారు. ఉన్నవాళ్ళు దొప్పల్లో ఉప్పు, కారం, పసుపు తెస్తున్నారు. అన్నలు వచ్చినారని తెలిసి ఆ పూటకు తాము గుడాలు పోసుకొని ఆ బియ్యం తెచ్చి గంపలో పోసినవారు కూడ లేకపోలేదు. పోగయిన బియ్యం వత్తె తెచ్చేసరికి గాండో పొయ్యి రాళ్ళు తయారుచేశాడు.

ఫకీరా, గిరిజల మధ్య ‘ఉడుం ఎలా వండాలి’ అన్న అంశం ప్రధానంగా చర్చ అయి కూచుంది. “తోలుతోనే రుచి” అంటాడు ఫకీరా – కాదు “ఉడకదు. అరగదు” అంటుంది గిరిజ.

దూరంగా కూచొని వీరి చర్చ వింటున్న కర్ప పాట ఎత్తుకున్నాడు.

“కర్ప జాగ ఆస్కు మూర్తి పోలోయె” (కోసే దగ్గర అక్కలు అసలే పనికి రారు) పాట చరణం విన్న గిరిజ గయ్యిన లేచింది.

“ఔను నాయనా – ఒట్టే పోలో అన్ చడకు (స్త్రీకి ఏదీ పనికి రాదు). వేటకు వెళ్ళి అర్వ తిప్పలు పడి మీతోపాటు జంతువును దొరక బుచ్చుకున్నాక పంపకాల దగ్గరకి వచ్చే సరికి మాత్రం ఆడదాన్ని ఆమడ దూరం ఉంచుతారు. మంచి మంచి ముక్కలన్నీ మీరు కొట్టేసి ఆడదానికి మాత్రం కార్జం లాంటివి పోలో అంటారు. కోడిగుడ్డు, ఆఫ్టరాల్ కోడిగుడ్డు కూడ మన గొట్టె జాతిలో ఆడదానికి నిషేధమే కదనయ్యా బాబు? అన్ని రకాలు తింటే ఒళ్ళు బలిసి మీ మగజాతికి వినకుండా పోతారనే ఇన్ని కట్టడాలు చేశారన్నది మాకు తెలుసు. నాయనా కర్ప – ఇది గొట్టోళ్ళ కులం పార్టీ కాదు. గోండోల్ల ఇంట్ల పుట్టింది కాదు. ఆడదానిపై మీ నిషేధాలు, రివాజులు రుద్దడానికి – ఇది విప్లవ పార్టీ – ఇది కమ్యూనిస్టు పార్టీ, ఇది కార్మికవర్గ పార్టీ – మేము మీతో ఎందులో తీసిపోము” అంటూ ‘మరోసారి మా అక్కల జోలిక వస్తావా!! అన్నట్టు సవాలు చేసినంత పని చేసింది గిరిజ.

“వెరీగుడ్ కామ్రేడ్ – ఇంత పెద్ద ఉపన్యాసం దంచిన మీరు, టాండో పాడి అయినా సరే ఇవాళ ఆ ఉడుం కూర మీరే వండాలి అక్కా” అంటూ గాండో పురెక్కించాడు.

“గాండో దాదా! పెడుసు చెట్టు ఎక్కిస్తున్నవ్ – అయినా నీ కోరిక ప్రకారం నేనే వండుతాను” అంటూ గిరిజ టకీమని ఒప్పేసుకుంది. పొయ్యివద్ద నూనె, పోపు గింజల కోసం వెతకసాగింది. “అక్కా గంజు మాడిపోతుంది” అని అరుస్తున్న గాండో అల్లరితో ఏం చేయాలో తోచడం లేదు. కాలుతున్న గంజులో నీళ్ళ చుక్కలు చల్లి చుయ్ మనగానే మాంసం ముక్కలు వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి నీళ్ళతో గాండో గంజు నింపాడు. విస్తుపోవడం మినహా గిరిజ చేయగలిగిందేమీ లేదు. అడవిలో వంటని బయట పద్ధతిలో పోల్చుకుని ఓ నిట్టూర్పు విడిచి గిరిజ “అన్ని నీళ్ళలో గంజు నింపేశావ్ కనీసం గోంగూర వేసిన పులుపుంటుంది. లేకపోతే నీళ్ళల్లో వేలు పెట్టి నోట్లో పెట్టుకున్నట్టుంటుంది గాండో” అంటూ గిరిజ మొహం వేలేసింది.

“అక్కా? ఇంకా ‘నొవ్వ’ పండుగ చేయలేదు అక్కా! అందుకే గోంగూర ఇపుడు ముట్టకూడదు. ఆ పండుగ అయ్యిందంటే కనీసం నాల్గు మాసాలు మనకు పచ్చి గోంగూరే. అడపా దడపా ఆ తర్వాత ఎండిన గోంగూరే దిక్కు కదా అక్కా – అయినా మన కోసం మినహాయింపు అమలు చేస్తున్నారు కదా మన దాదాలు. వత్తేను పంపి చూద్దాం” అంటూ గాండో వత్తేను కేకేశాడు.

గిరిజ ఆలోచనలన్నీ రివాజు వైపు మళ్ళాయి. ఇవ్వాళ మనకోసం ప్రారంభించిన మినహాయింపు రేపు రివాజ్ అయిపోవచ్చు. అసలు ఈ కట్టుబాట్లు అన్నీ కరువులో నుండే పుట్టి ఉండాలి. ఏ అడ్డు, అదుపు లేకుంటే ఇల్లు గుల్లేకదా. నోరు కట్టుకొని, పొట్ట కట్టుకొని ఇంత కాపాయం (పొదుపు) చేస్తుంటేనే వీరి బతుకులు ఇట్లా ఉన్నాయ్ ఖాయా – పీయా – మజా ఉడాయా (తిని, తాగి, మజా చేయడం) అన్నట్లు ఎప్పటికప్పుడే తినేస్తే రేపటికి తిండి గ్యారంటీ లేని జీవితాల్లో కష్టమే కదా! అయితే అసలు విషయం మరుగున పడిపోయి ప్రతీదీ దేవుడి పేరుతో చెలామణి అవుతుంటే అవి అంధ విశ్వాసాలై కూచున్నాయి.

ఎంత మూఢ విశ్వాసాలైనా, ఎంత ప్రాచీన సాంప్రదాయాలైనా కాల క్రమంలో పొట్టతిప్పల ముందు తలవంచక తప్పదు. బతుకు పోరాటం పై చేయి అవుతున్న కొద్దీ ఈ ఆచారాలు, రివాజులు తొలగక తప్పదు. ఒకప్పుడు అధికారుల ముందు గజగజలాడిన ఈ ఆదివాసులే ఇవాళ అధికారులనే గజగజలాడించడం లేదా! పోరాటం పెరిగే కొద్దీ మార్పు త్వరితం కాకతప్పదు. ఈ మార్పులను ఇంకా అధ్యయనం చేయాలి అనుకుంటూ తన ఆలోచనల్లో తాను మునిగిపోయింది గిరిజ.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.