విజయవాటిక-6

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

ఇంద్రపాల నగరం.

విశాలమైన రాజప్రసాదంలో దివ్యమైన మందిరం. అది రాజమాత వాకాటక మహాదేవి పూజా మందిరం. ఎనుబది రెండు సంవత్సరాల రాజమాత ప్రతిదినం దీర్ఘకాలం ఈశ్వర ధ్యానంలో ఉంటుంది. 

 అందమైన శిల్పాలతో, ఈశ్వరుని దివ్య లీలలను చూపుతూ అలంకరించిన పూజాగృహమది. 

బంగారు దీపపు కాంతులలో మహాదేవుడు లింగాకారంగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు. మరో ప్రక్కన శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరి కొలువై ఉన్నది. దేవదేవుని ముందర, అమ్మవారి ముందర నేతి దీపాలు ప్రజ్వలితంగా వెలుగుతున్నాయి. 

దేవుడ్ని అభిషేకానంతరం చిత్రవిచిత్రమైన పువ్వులతో అలంకరించారు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ధూపప్రియడు. అలంకారం అనంతరం ఇచ్చిన అగరు ధూపము మందిరమంతా వ్యాపించింది. 

రాజమాత మహాదేవి ప్రణవము ఉచ్ఛరించి, అనంతరం పంచాక్షరి పఠిస్తూ ధ్యానంలో నిమగ్నమైంది. 

తెల్లని ఆమె మేను ఉదయపు సూర్యుని లేత వెలుగుపడి బంగారు రంగులో మెరుస్తోంది. ముడతలు పడిన ముఖము కాంతితో వెలుగులు చిమ్ముతోంది. నుదుటమీద ఉన్న విభూతిరేఖ ఆమెలోని ఈశ్వర అంశను చూపుతోంది. ఆమె తేజస్సు ముందర హరిణము చిన్నబోతుంది. వైదిక మతాన్ని ప్రేమించి, ఆరాధించి, తన మతాన్ని పునఃప్రతిష్ఠించిన ధీర మహిళ రాజమాత మహాదేవి. ఆమె రెండవ మాధవవర్మ హృదయేశ్వరిగా ఆ రాజ్యంలోకి ప్రవేశించింది.  

***

బలమైన వాకాటకులు తుంగభద్రా తీరం దక్షిణ సరిహద్దుగా, వింధ్య పర్వతాలకు అటునిటు వ్యాపించిన విశాలమైన, బలమైన రాజవంశం. వీరి రాజధాని పురికాపట్టణం. తదనంతరం వీరు వార్ధా వద్దకు తమ రాజధానిని మార్చుకున్నారు. సంస్కృతం వీరి రాజభాష. సాహిత్యం, శిల్పం వీరి ఏలుబడిలో వృద్ధి చెందాయి. బౌద్ధ మతాన్ని కూడా వీరు ఆదరించారు. వీరు అజంతాలోని గుహలను తొలిపించారు, విద్యలను పోషించారు, విద్యాలయాలను నిర్మించారు. 

 వాకాటక రెండవ ప్రవరసేనుడు పాలనలో విష్ణుకుండిన మహారాజు రెండవ మాధవవర్మతో పోరు సంభవించింది. మాధవవర్మ బలమైనవాడు, పరాక్రమవంతుడు, ధీశాలి. విష్ణుకుండినరాజు చేతిలో ఓడిన ప్రవరసేనుడు, తన కుమార్తెను వివాహము చేసుకోవలసినదిగా కోరాడు మాధవవర్మను . ఆనాటికే మాధవవర్మకు వివాహమైయింది. ఆయన పట్టపురాణి కుంతలాదేవి. ఆమెకు ఒక పుత్రుడు కూడా ఉన్నాడు. అందుకే వివాహానికి ముందు తను యువరాణితో మాట్లాడాలని కోరాడు మహారాజు రెండవ మాధవవర్మ. 

     రాజ భవనము ప్రక్కన ఉన్న ఉద్యానవనలోని రంగ మండపములో వారిరువురి సమావేశం ఏర్పాటు చెయ్యబడింది. కొంత మంది పరిచారికలు, చెలులు తప్ప అన్యులచ్చటలేరు. పల్చటి తెరలు ఇద్దరి మధ్య దూరం పెంచలేకపోతున్నాయి. చెలుల మధ్య వెలుగులు చిమ్మతున్న మహాదేవి, చుక్కల మధ్య వెలిగే తారలా ఉంది. మృదువైన ఆమె అప్పుడే విచ్చుకున్న ముద్దమందారంలా తోచింది మహారాజుకు. 

పదహారేళ్ళ పడుచు….అప్పుడే యవ్వనంలో అడుగుపెడుతున్న జవ్వని, సుకుమార పారిజాతంపుష్పంలా, బ్రహ్మ అపురూపంగా చెక్కిన దంతపు శిల్పంలా మెరుపులు చిందుతున్నది. ఆమెను చూస్తూ మహారాజు మాటలు మరిచాడు. ఆమె అందం ఆయనను వివశుని చేసింది. తల ఎత్తి పరదాలకావల ఉన్న మహారాజును చూసింది వాకాటక యువరాణి. ఆమె చూపు హృదయాంతరాలలోకి గ్రుచ్చుకుపోయింది మహారాజుకు.

వీరత్వం అణువణువునా నిండిన పాండవమధ్యముడు అర్జునుని వలె తోచాడామెకు మహారాజు. 

బలమైన వాకాటకులను గెలిచిన వీరుడు. దక్షిణాపథంలో తెలుగు సామ్రాజ్యాన్ని, విష్ణుకుండిన ప్రతిష్ఠను దిగంతాలకు విస్తరింపచేసిన ధీరోధాత్తుడు…. ఆయన ప్రస్థావన అంతఃపురంలో వచ్చేది. ఎన్నో మార్లు తన వారు ఆయన వీరత్వం గురించి అనుకుంటుండగా ఆమె విన్నది. 

ఆ వీరుని చూసిన తక్షణమే ఆమె మనసు పూర్తిగా వశము తప్పింది. 

మహారాజు ఎంతో సౌమ్యంగా “దేవీ! మీకు మాతో వివాహం సమ్మతమా?” అడిగాడు.

ఆశ్చర్యపోయింది ఆమె. ఆనాటి పరిస్థితులలో ఓడిన రాజు కూతురును అంత మర్యాదగా ప్రశ్నించటం. ఆయన హక్కుగా పొంద తగినదైనా…

“ప్రభూ! మీకు నా హృదయము అంకితమైనది…” అన్నది నునుసిగ్గులు కమ్ముతుండగా తల వంచుకొని…

ఆయన నవ్వాడు. ఆ నవ్వు హృదయంలోంచి వచ్చినది.

“మాకు పట్టపురాణి యున్నది…” అన్నాడు మహారాజు. నీవు పట్టపురాణివి కావు అన్న హెచ్చరిక అంతర్లీనంగా కనిపించింది యువరాణికి.

తల వంచి “మీ తోడు తప్ప మీ రాజ్యం కోరను ప్రభూ…” అంది మృదువుగా.

“మీరు నా హృదయరారాణి నేటి నుంచి…” అన్నాడు మహారాజు.

అలా ఆమెను, ఆమెతో పాటు వచ్చిన రాజ్యలక్ష్మినీ చేపట్టి తెలుగు ప్రభను దక్షిణాదిన వ్యాపింపచేశాడు. రెండు సముద్రములను తన సరిహద్దులుగా చేసుకున్నాడు. రేవా (నర్మదా) నది ఉత్తర సరిహద్దుగా చేసి పాలించిడాయన. 

వాకాటక మహాదేవిని వివాహమాడి ఇంద్రపురికి తీసుకొచ్చాడు, అజేయుడైన రెండవ మాధవవర్మ. ఆమె పట్టపురాణి కాలేదు కానీ, ఆయన హృదయరాణిగా ఆయనను, రాజ్యాన్నీ ఏక కాలంలో కట్టడి చేసింది. 

మహాదేవి వైదిక మతాభిమాని. అప్పటి వరకూ అక్కడ ప్రబలి ఉన్న బౌద్ధం స్థానే నెమ్మదిగా వైదికం ప్రవేశించింది. దేశమంతా ఈశ్వర ఆరాధన పెరిగింది . 

ఇంద్రపురిలో పంచేశ్వరాలయం, కీసరగుట్ట వద్ద రామలింగేశ్వరాలయం నిర్మించారు. ఇవే కాకుండా దేశంలో ఎన్నో శివాలయాలు పునరుద్ధరించబడినాయి. మహారాజు మహాదేవితో కలసి అశ్వమేధ యాగాలు చేశాడు. 

వైదీకం వెల్లువిరిసింది. అయినా మహారాజు బౌద్ధాన్ని ఆదరించాడు. 

“మేము బ్రాహ్మణ వంశ సంజాతులం. మాకు వైదిక మతముతో పాటూ బౌద్ధమన్నా అభిమానమే…” అనే వాడు మహారాజు. మహాదేవికి వైదికమే పరమ మతము. ఆమె నెమ్మదిగా రాజ్యంలో బౌద్ధాన్ని తగ్గించదలచింది.  ఆమె నిత్య ఈశ్వర ఉపాసుకురాలు. ఆమె శివపూజ చెయ్యనిదే పచ్చి గంగ ముట్టదు.

దేశంలో వేదవిద్య వ్యాప్తిచేసింది, ఘటికలను విరివిరిగా ప్రోత్సహించింది.

శ్రీపర్వత స్వామికి ప్రత్యేక భూరి దక్షిణలు సమర్పించింది. త్రికూటములో దేవాలయం పునరుద్ధరించింది. అమరావతిలో, ఇంద్రకీలాద్రి పై దేవాలయాలను ఆమె ఎంతో వృద్ధి చేయించింది. రాజగురువుల, వేద పండితుల ఆశీర్వచనాలు ఆమె వెంట ఉండేవి.

మహారాజు రెండవమాధవవర్మ మరణసమయంలో ఆమె నలుబది వత్సరాల ప్రౌఢ. ఆమెకు చెప్పినట్లుగా పట్టపురాణి కుమారుడే తదనంతరం రాజైనాడు. కాని దేవవర్మ రెండేళ్ళకే వింత జబ్బుతో మరణించాడు. ఆయన కుమారుడు మూడవమాధవవర్మ ఆరేళ్ళ పసివాడిని సింహాసనం ఎక్కించింది రాజమాత కుంతలాదేవి. ఆనాడు రాజగురువులు శ్రీ పరమేశ్వరశాస్త్రి ఆ విషయాన్ని సమర్ధించాడు. మాధవవర్మకు ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆమె కూడా మూడవ మాధవవర్మ విషయములో మిన్నకుండిపోయింది.

 కుంతలాదేవి పరమపదించింది మొదలు మహాదేవిని అందరూ రాజమాత గా పూజిస్తున్నా, విక్రమేంద్రవర్మ మాత్రం యువరాజుగానే ఉండిపోయాడు. అతనికి రాజయోగమున్నదోలేదో…ఈశ్వర లీల ఎటులున్నదో…

***

“త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి

ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ,

రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిలనానాపథజుషాం

నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణవ ఇవ”

రాజమాత వాకాటక మహాదేవి పూజ కావొచ్చింది గుర్తుగా గంటలు మ్రోగాయి . 

వేద పండితులు వేదగానం ఆలపించారు. 

ఆమె వారికి దక్షిణలు ఇచ్చి నెమ్మదిగా లేచింది. 

ఆ మందిరానానుకొని ఉన్న వనం నుంచి పారిజాతాల పరిమళం వ్యాపించి మనసుకు ప్రశాంతతనిస్తోంది. 

నెమ్మదిగా వచ్చి ఉద్యానవనంలో కూర్చుంది ఆమె. 

ఆమె కోసం అప్పటికే అక్కడ ఆమె కుమారుడు, యువరాజు విక్రమేంద్రుడు ఎదురు చూస్తున్నాడు. 

ఆమె వచ్చి కూర్చున్న తరువాత, ఆమె పాదాలకు వందానాలర్పించి ప్రక్కనే కూర్చున్నాడు. 

“అమ్మా! రమ్మని కబురు చేశారు…” 

“అవును నాయనా! రాజగురువులను దర్శించాలి…”

“కబురు పంపుతానమ్మా! వారూ పెద్దవారైనారు. తపస్సు తప్ప అన్యము చూడటం లేదని విన్నాను. నేనూ వారిని దర్శించాలి…” చెప్పాడు యువరాజు విక్రమేంద్రుడు. 

“ఈ సంవత్సరమైనా నాకు శ్రీ పర్వత స్వామిని దర్శించే భాగ్యమున్నదా? నాహృదయం కొట్టుకుంటున్నది…” అన్నది రాజమాత.

“అమ్మా!” 

“నాయనా! నేను త్రికూటం కూడా వెళ్ళాలి…” అన్నదార్తిగా రాజమాత

ముడిపడిన భృటికతో ప్రశ్నార్థకంగా చూసాడు యువరాజు.

“మన సామ్రాజ్యమును సదా శాంతిభద్రతలతో చూడమని త్రిలింగ స్వామిని పూజించాలి…” మృదువుగా నవ్వుతూ అన్నదామె.

“అమ్మా శివరాత్రికి ముందు మేము విజయవాటిక వెళ్ళక తప్పదు. ఆనాడు మాహరాజు చేసే యాగములో పాల్గొనకా తప్పదు…” అన్నాడు యువరాజు విక్రమేంద్రుడు. 

“నిజము. వెళ్ళిరా! రాజులు సంపదలు పెంచుకోవటానికి యుద్ధాలు చెయ్యాలి. వారి బలం సుస్థిరం చేసుకోవటానికి యాగం చెయ్యాలి…” సమర్థిస్తూ అన్నదామె.  

“గురుదేవులకు కబురు పంపుతాను…”

“మనకు గురుదేవుల ఆశీర్వచనాలు అవశ్యం. వారి దర్శనానికి మనమే వెళ్ళాలి…” చెప్పిందామె హెచ్చరికగా.

“కుర్రవాడిని యువరాజుగా ప్రకటిస్తాడని అనుమానము వ్యక్తమగుచున్నది…” అన్నాడు విక్రమేంద్రుడు.

“నీకెలా తెలిసినది?”

“కొంత అనుమానపు కదలికలు గుర్తించాము రాజధానిలో…”

ఆమె దీర్ఘంగా చూస్తూ “మాకూ అనుమానముగానే ఉంది రాజధానిలోని కదలికలుపై. దానిని అనుమానంగానే ఉంచుదాము…”

“ఏది ఎమైనా మీకు రక్షణ అత్యంత అవసరము… మీరు మన వసంతునికి తెలియకుండా కదలకూడదు, ఏమీ తినకూడదు…”

“అంత భయపడకు. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ ఎలా అలా నడుస్తుంది. ఆ నమ్మకము చాలు…” అంటూ నమస్కారం చేసింది. 

రాజనీతిలో ముందు వెనకలు, మిత్రులు, బంధువులూ చూడరని మహా భారత కాలం నుంచి తెలుస్తోంది. 

రాజమాత అంటే భక్తి, అంతకు మించి భయం ఉన్నాయి మహారాజుకు. ఆమె ఎన్నో ధర్మకార్యాలు చెయ్యటం, ప్రజల హృదయాలలో ప్రియమైన రాజమాతగా నిలబడటమే కాదు, వాకాటక రాజ్యమామె కనుసన్నలలో ఉందని తెలుసతనికి. కాని, మహారాజుగా దాదాపు నలుబది సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యమేలుతున్నాడు మూడవ మాధవవర్మ. పైపెచ్చు బలవంతుడు. రాజ్యాన్ని సుసంపన్నం చేశాడు. అయినా తన పుత్రునికి యువరాజ పట్టాభిషేకం చెయ్యలేకపోతున్నాడు. ఆ విషయములో ఆయన అహం దెబ్బతింటున్నది.

గురువుదేవులు పరమేశ్వశాస్త్రుల దీవెనలుంటే జరగవచ్చుకానీ, ఆయన రాజగురువే కాదు, రాజమాతకు ప్రియమైనవాడు కూడాను. వృద్ధురాలైన ఆమె నడిపే తంత్రం మేముంటుందన్న ఆలోచన కూడా ఉన్నది మహారాజు మనసులో.  అయినా ఎవరి జాగ్రత్తలో వారుంటారు రాజరికంలో. వారి వ్యక్తిగత రక్షణతో పాటూ వారి వ్యక్తిగత చారులు కూడా ఉంటారు.  సమాచారం, రాజ్యంలో ప్రతి కదలికా తెలుసుకోవటమే రాజనీతికి ఊపిరి.

వసంతుడు పరమ నమ్మకస్తుడు. రాజమాత కోసం ప్రాణాలను తృటిలో తీసెయ్యగలడు, ఇవ్వగలడు. అతని కనుసన్నలలోనే అన్నీ జరుగుతాయి. రాజమాత కొద్ది సంవత్సరాలుగా ఎటూ వెళ్ళటంలేదు. కాని ఆమెకు త్రికూటం, శ్రీపర్వతం యాత్ర చెయ్యాలని కోరిక మాత్రం ఉంది. 

తన భర్త మాట ప్రకారం మొదటి అవకాశం పట్టపురాణి కుమారునికి ఇచ్చినా, తదనంతరం సింహాసనం విక్రమేంద్రునికే రావాలి. కానీ కుంతలాదేవి కుతంత్రంతో అది మారింది.  

 ఈ మధ్య మహారాజు తన కుమారుని యువరాజుగా చెయ్యాలన్న నిర్ణయం చేసుకున్నాడని ఆమెకు నమ్మకమైన వార్త అందింది. కానీ, ఆమెకు రాజ్యము ముక్కలు కావటము ఇష్టం లేదు. ఎవరో ఒకరు తమ వంశము వారి పాలన ఉండాలన్నది ఆమె అభిమతం. ఆమె తన ధ్యానంలో భవిష్యత్తును గురించి కొంత దర్శించింది. అది ఆమె హృదయాన్ని కొంత కలత పరిచింది. అయినా కాగలది కాక మానదని సమాధానపరుచుకుంది.  తనకు రాజగురువును చూడాలన్న ఆకాంక్షను తెలుపుతూ ఘటికాపురికి వర్తమానం పంపించింది మహారాణి.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.