
కొడిగట్టిన దీపం
-ములుగు లక్ష్మీ మైథిలి
నడుస్తున్న దేహం పై రాబందులు వాలుతాయి
బతికి ఉండగానే నిలువునా చీల్చి చెండాడతాయి
ఆకలి తీరగానే నిర్దయగా వదిలేస్తాయి
తనువు అచేతనంగా మిగులుతుంది
ఆప్యాయతల తాలుకు కట్టిన తాయెత్తులు,
రక్షరేకులు ఫలించవెందుకో?!..
చలనం లేని ఆ దేహం కోసం
కొన్ని నేత్రాలు అశృపూరితాలవుతాయి
కొన్ని చూపులు అగ్ని కురిపిస్తాయి
సాయంత్రానికి వాడవాడలా
కొవ్వొత్తులు ప్రశ్నిస్తాయి
ఏవేవో గొంతుకలు నినదిస్తాయి…
తనరాక కోసం ఎదురుచూస్తున్న
కళ్ళు…నిదురను వారిస్తున్నాయి..
ఇంటి దీపం ఎక్కడ కొడికడుతుందేమోననీ
ఆకాశంలో వెన్నెల ముఖం మసకబారింది
నిన్నటిదాకా ఆడిపాడిన మేను
ఇనుపహస్తాల గోట్లకు గాటుపడి రక్తమోడుతోంది…
రాకాసుల కసికి
వారి కంటి వెలుగు శిథిలమైంది
నిండు పున్నమిని
మాంసపుముద్ద ను చేసే
అమానవీయమైన కౄరమృగాలు
ఇంకా సజీవంగానే ఉన్నాయి
ఉరితాళ్ళను ధిక్కరిస్తూ…!!
*****

ములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, ఊహలు గుసగులాడే కవితాసంపుటాలు, 50 కథలు ప్రచురణ అయ్యేయి.

mulugu.mythili @gmail.com