అనుసృజన-కబీరుదాసు 

అనువాదం: ఆర్. శాంతసుందరి

‘రామ్ చరిత్ మానస్ ‘ రాసిన తులసీదాస్ తో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రాచీన హిందీ కవి కబీర్. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యంలా వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు.
ఆయన బెనారస్ లో పుట్టాడు. పుట్టిన తేదీ గురించి ఏకాభిప్రాయం లేదు- పధ్నాలుగో శతాబ్దమని కొందరూ( 1398-1448), పదిహేనో శతాబ్దమని కొందరూ(1440-1518) అంటారు. అలాగే ఆయన ఎప్పుడు చనిపోయాడనే విషయం గురించీ, వివాహం చేసుకున్నాడా లేదా అనే దాన్ని గురించీ కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.కొందరైతే ఆయన వందేళ్ళకి పైగా జీవించాడని అంటారు. కబీర్ ఒక వితంతువుకి పుట్టాడనీ , ఆమె పసిబిడ్దని చెరువు ఒడ్డున వదిలేసి పోతే నీమా, నీరూ అనే ముస్లిమ్ దంపతులు ఆ బిడ్డని తీసుకెళ్ళి పెంచుకున్నారనీ ఒక వదంతి ఉంది. నీమా, నీరూ వృత్తి రీత్యా సాలెలు. కబీర్ కూడా నేతగాడేననేది నిర్వివాదం.ఆయన కవితల్లో ‘తానా బానా'(పడుగూ పేకా)అనే మాటలు తరచు వినిపిస్తాయి.
 
కబీర్ యువకుడుగా ఉన్నప్పుడు స్వామీ రామానంద్ అనే ఆయన్ని గురువుగా స్వీకరించాడు(కబీర్ గురుమహిమ గురించి ఎన్నో కవితలు రాశాడు).ఆ విధంగా ఆయనకి హిందూ మతం గురించి తెలియవచ్చింది.దీన్ని గురించి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది.ఒకరోజు కబీర్ కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు.అదే సమయంలో రామానంద్ గంగా స్నానానికి మెట్లు దిగు తున్నాడు.ఇంకా పూర్తిగా తెలవారలేదు.ఆ మసక చీకట్లో రామానంద్ కాలు కబీర్ శరీరాన్ని తాకింది.వెంటనే ఆయన,’రామ్ రామ్’ అన్నాడు. ఆ రామ శబ్దాన్నే కబీర్ గురుమంత్రంగా భావించి ఆయన శిష్యుడైపోయాడు.ఆయన రాముడు అయోధ్యా రాముడు కాడు.రామనామాన్ని మాత్రమే నమ్మిన కబీర్ నిర్గుణ బ్రహ్మోపాసకుడు.ఆయన దృష్టిలో ఈశ్వరుడు ఒక్కడే. మతాచారాలనీ, జంతుబలులనీ ఆయన వ్యతిరేకించాడు.ఒక దోహాలో-‘ ఆకులని తిన్నందుకే మేక తోలు వలుస్తారే, మరి ఆ మేకని చంపి తినేవారికి ఎటువంటి శిక్ష పడుతుందో!’ అంటాడాయన.భగవంతుడి అవతారాలనీ, విగ్రహారాధననీ, ముస్లిమ్ పండగలనీ, మసీదులనీ, ఆలయాలనీ నమ్మలేదాయన. మానవతావాది , సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేసిన గొప్ప మనీషి.
 
ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఆయన కవితల గురించి అందరిదీ ఒకే అభిప్రాయం – నిరక్షరాస్యుడై కూడా అద్భుతమైన సూక్తులు అందించాడు.దోహాలూ , పద కవితలూ ముఖతః వినిపిస్తే ఆయన శిష్యులు వాటిని రాసేవారట.ఆయన భాష కూడా ప్రామాణికమైనది కాదు.చదువుకోక పోవడం వల్ల, ఒక చోట స్థిరంగా ఉండకపోవడం వల్ల ఆయన భాషలో ఎన్నో భాషా పదాలు వచ్చి చేరాయి…పంజాబీ,రాజస్థానీ, ఖడీ బోలీ( ప్రస్తుతం వాడుకలో ఉన్న హిందీ),అవధీ(తులసీదాస్ వాడిన భాష),వ్రజభాష(సూర్ దాస్ వాడిన భాష)-ఈ రెండూ హిందీ మాండలికాలు)
 
కబీర్ శాంతికాముకుడు.అహింస, సత్యం, మంచి నడవడి ఆయనకి నచ్చే విషయాలు. భక్తికాలం లో చాలామంది రచనకవులు చేశారు. ముసల్మానుల దాడి ప్రభావమే ఇన్ని భక్తి కావ్యాలని సృష్టించింది. వీరిలో కొందరు కవులకి ‘సంత్’ అనే ఉపసర్గ వచ్చి చేరింది. వారిలో ఒకరే సంత్ కబీర్. హిందీ సాహిత్యానికి అమూల్యమైన సాహితీ సంపదని వదిలి వెళ్ళిన మహానుభావుడు.
 
కబీర్ దోహాలు ఎన్నో ప్రసిద్ధి చెందాయి. వాటిలో కొన్ని:
రహిమన్ పానీ రాఖియే , బిన్ పానీ సబ్ సూన్
పానీ గయే న ఊబరే , మోతీ , మానుష్ , చూన్
నీటిని రక్షించుకోండి, నీళ్ళు లేకపోతే అంతా శూన్యమే
నీటిని కోల్పోతే ముత్యమూ, మనిషీ ,గోధుమ పిండి ( ఆహారమూ) ఎందుకూ పనికిరావు
( ఈ దోహా లో ‘పానీ’ అనే మాటకి గల మూడు వేర్వేరు అర్థాలని చమత్కారంగా ఉపయోగించాడు కవి – ముత్యానికి మెరుపు,
మనిషికి ఆత్మగౌరవం,పిండికి నీళ్ళూ లేకపోయినట్టయితే అవి ఎందుకూ కొరగావు)
రహిమన్ వే నర్ మర్ గయే , జే కఛు మాంగన్ జాహి
ఉనతే పహలే వే ముయే , జిన్ ముఖ్ నికసత్ నాహి
ఎవరి ముందైనా చెయ్యిజాచినవారు మరణించినవారితో సమానం
వారికన్నా ముందు మరణించేవారు ఏమీ లేదు పొమ్మనేవారు
 
జ్యో తిల్ మాహీ తేల్ హై , జ్యోం చకమక్ మే ఆగ్
తేరా సాయీ తుజ్ఝ్ మే , జాగ్ సకే తో జాగ్
నువ్వుల్లో నూనెలా , చెకుముకి రాళ్ళలో అగ్గిలా
నీ భగవంతుడు నీలోనే ఉన్నాడు , మేలుకో గలిగితే మేలుకో
దోనో రహిమన్ ఏక్ సే , జో లో బోలత్ నాహి
జాన్ పరత్ హై కాక్ పిక్ , రుతు బసంత్ కే మాహి
గొంతు విప్పేదాకా రెండూ చూసేందుకు ఒకలాగే ఉంటాయి
కాకికీ కోయిలకీ తేడా తెలిసేది వసంత రుతువులో మాత్రమే
(వేమన పద్యం- ఉప్పు కప్పురంబు గుర్తుకొస్తుంది)
 
బిగరీ బాత్ బనై నహీ , లాఖ్ కరో కిన్ కోయ్
రహిమన్ ఫాటే దూధ్ కో , మథే న మాఖన్ హోయ్
ఒకసారి ఏదైనా వికటిస్తే అది ఎంత ప్రయత్నించినా బాగుపడదు
విరిగిపోయిన పాలని ఎంతసేపు చిలికినా అందులో వెన్న రాదు
 
రూఠే సుజన్ మనాయియే , జో రూఠే సౌ బార్
రహిమన్ ఫిరి ఫిరి పోయియే , టూటే ముక్తా హార్
సజ్జనులు అలిగితే వందసార్లైనా సరే వాళ్ళ కోపం పోగొట్టండి
ముత్యాల హారం ఎన్ని సార్లు తెగిపోయినా మళ్ళీ మళ్ళీ (ముత్యాలని ఏరి) కూర్చినట్టు
 
రహిమన్ నిజ్ మన్ కీ బిథా , మన్ హీ రాఖో గోయ్
సుని అఠిలైహై లోగ్ సబ్ , బాంటి న లైహై కోయ్
నీ మనసులోని వ్యథని మనసులోనే దాచి ఉంచుకో
విని అందరూ ఎగతాళి చేస్తారే తప్ప ఎవరూ నీ బాధని పంచుకోరు
 
ఛిమా బడన్ కో చాహియే , ఛోటన్ కో ఉత్పాత్
కహ్ రహీమ్ హరి కా ఘట్యో , జో భృగు మారీ లాత్
చిన్నవాళ్ళు అమర్యాదగా ప్రవర్తించినా,పెద్దలు ఓరిమితో ఉండాలి ,
భృగువు కాలితో తన్ని నంత మాత్రాన హరికి ఉన్న గౌరవం ఇసుమంతైనా తగ్గిందా?
 
రహిమన్ ధాగా ప్రేమ్ కా, మత్ తోరో చటకాయ్
టూటే పే ఫిర్ నా జురై , జురై గాంఠ్ పరి జాయ్
ప్రేమ అనే దారాన్ని చటుక్కున తెంపకు
తెగిపోతే ఇక మళ్ళీ అతకదు , ఒకవేళ అతికినా మధ్యలోముడి పడుతుంది
 
రహిమన్ దేఖ్ బడేన్ కో , లఘు న దీజియే డార్
జహా కామ్ ఆవై సుయీ , కహా కరే తలవార్
పెద్దది దొరికింది కదా అని చిన్న వస్తువుని పారవేయకండి
సూది చేసే పని ఖడ్గం ఎలా చెయ్యగలదు?
 
విపదా హూ భలీ , జో థోరే దిన్ హోయ్
హిత్ అనహిత్ యా జగత్ మే ,జాన్ పరత్ సబ్ కోయ్
కొద్దికాలం ఉండి పోయే కష్టాలు మనకి మేలే చేస్తాయి
ఈ లోకంలో మన హితవు కోరే వారెవరో , కోరని వారెవరో తెలిసిపోతుంది
 
వృక్ష్ న కబహూ ఫల్ బఖై , నదీ న సంచై నీర్
పరమారథ్ కే కారనే , సాధున్ ధరా సరీర్
చెట్టు ఎప్పుడూ తన పళ్ళని తాను తినదు, నది నీటిని కూడబెట్టదు
పరోపకారం కోసమే సాధువైన వ్యక్తి ఈ దేహాన్ని ధరిస్తాడు.
 
గురు గోవింద్ దోనో ఖడే , కాకే లాగూ పాయ్
బలిహారీ గురు ఆపనే , గోవింద్ దియో బతాయ్
గురువూ , భగవంతుడూ ఇద్దరూ నా ముందు నిలబడ్డారు, నేను ముందుగా ఎవరికి పాదాభివందనం చెయ్యాలి?
గురువర్యా , మీకు శతాధిక వందనాలు, మీరే కదా నాకు భగవంతుడి గురించి తెలియజేశారు !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.