ఏడు సామ్రాజ్యాల రాజధాని – ఢిల్లీ

-కందేపి రాణి ప్రసాద్

          భారతదేశ రాజధాని ఢిల్లీ గురించి కొన్ని విశేషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళితే పరీక్షలు రాయడం కోసమే తప్ప ప్రశాంతంగా చూసేందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈసారి మరల  అన్నీ చుద్దామనుకున్నాం గానీ మొత్తం చూడటం కుదరలేదు. ఢిల్లీలో 59వ పిల్లల వైద్య నిపుణులు సమావేశం జరుగుతున్నది. ఇది జాతీయ సమావేశం కనుక అందరూ కుటుంబాలతో వస్తారు. కుటుంబాల కోసం చాలా సరదా ఆటలు, పాటలు వంటివి ప్లాన్ చేసి పెడతారు. కరోనా దెబ్బకు రెండు సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్ళని జనాలకు ఎడారిలో ఒయాసిస్ లా ఈ పర్యటన కనిపించింది. మీకూ ఈ విశేషాలు చెప్పేస్తున్నా.
          పిల్లల వైద్య నిపుణుల సమావేశానికి ముఖ్య అతిధిగా కేంద్ర శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఆత్మీయ అతిధిగా నోయిడా  ఎమ్.పి మహేష్ శర్మ లు వచ్చారు. పిల్లల మరణాల నిష్పత్తి తగ్గాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర శిశు మరియు మహిళా శాఖ మంత్రి డాక్టర్లకు పిలుపునిచ్చారు. గ్రేటర్ నోయిడా ఎం.పి మహేష్ శర్మ ఎం.పి మాత్రమే కాదు డాక్టర్ కూడా. ఈ సమావేశం గ్రేటర్ నోయిడా లోని ‘ఇండియన్ ఎక్స్ పో మార్ట్’ లో అధ్బుతంగా జరిగింది. కొన్ని ఎకరాల స్థలంలో ఈ కట్టడం ఎంత బాగుందో!
          మేము ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగే సరికి సాయంత్రం 4.30pm అయింది. అక్కడ నుంచి కన్నాట్ ప్లేస్ లో ఉన్న శాంగ్రిలా ఎరోస్ హోటల్ కు కార్లో బయల్దేరాము. గంట తర్వాత హోటల్ కు చేరుకున్నాం. బోలెడు పూలు మాకు బయటా, లోపలా స్వాగతం పలికాయి. ఇది 19 అంతస్తుల భవనం. మేం 410 లో దిగాం. మా హోటల్ కు చుట్టు పక్కలా లీమెరిడియన్, రాయల్ ప్లాజా వంటి పెద్ద హోటల్స్ ఉన్నాయి. అంతే కాదు మా హోటల్ కు దగ్గర్లోనే ఇండియా గేట్, పార్లమెంట్ హౌస్, జంతర్ మంతర్, దూరదర్శన్, ఆకాశవాణి, అన్ని రాష్ట్రాల భవనాలు కన్పించాయి. తెలుగు వాళ్ళకు ప్రీతీ పాత్రమైన భోజనాన్ని అందించే ఆంధ్రా భవన్ ఈ హోటల్ వెనకాలే ఉన్నది. అందుకే మేము రెండు మూడు రోజులు ఆంధ్రా భవన్ లోనే తిన్నాం. ఇంకా ఇక్కడికి దగ్గర లోనే సంగీత నాటక అకాడమీ, లలితకళా అకాడమీ, సాహిత్య అకాడమీ ఉన్నాయి. మన సాహిత్యానికి సంబందించిన అకాడమీ ఇంత దగ్గర్లో ఉందంటే ఊరుకుంటామ! వెళ్ళి పుస్తకాలను చూసి పలకరించి వచ్చాము. ఇవన్నీ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి.ఐదారు కిలోమీటర్ల దూరంలో ప్రముఖమైన లోటస్ టెంపుల్ ఉన్నది. మేం వెళ్ళేసరికి మూసేయడంతో గేటు బయట నుంచి ఫోటోలు తీసుకున్నాం. ఇండియా గేట్ దగ్గరంతా రిపేరు వర్కు నడుస్తున్నందున లోపలికి పంపట్లేదు. దూరం నుంచే ఫోటోలు తీసుకోవాల్సి వచ్చింది. తవ్వుతూ JCB లతో గందర గోళంగా ఉంది.
డిల్లీ నగరం కోటి పందోమ్మిది లక్షల జనాభాతో కిక్కిరిసి ఉన్నది. పాత ఢిల్లీ, న్యూ ఢిల్లీ కంటోన్మెంట్ అని మూడు ప్రాంతాలుగా విభజింపబడి ఉన్నది. దేశ రాజధాని న్యూ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1వ తేదిన ఏర్పాటు చేయబడింది. పాత ఢిల్లీగాపేరు బడిన షాజహానాబాద్ ను 1639 లో షాజహాన్ నిర్మించాడు. రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చటానికి నిర్మించాడు. మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యేదాకా ఇది రాజధాని గానే ఉన్నది. దీనిని ఢిల్లీ కాంట్ లో 165 గ్రమాలు, 59 పట్టణాలు ఉన్నాయి. యు.కె కు చెందిన ‘ఎడ్విన్ లుట్ యేన్స్ ‘ న్యూ ఢిల్లీ నగరాన్ని, రోడ్లనూ, డిజైన్ చేసి నిర్మించాడు. ప్రస్తుతం చట్ట పరంగా ఢిల్లీ జాతీయ రాజధానిని నేషనల్ కేపిటల్ టేరిటరిగా పేరు మార్చారు.
          వేల సంవత్సరాల చరిత్రలో ఢిల్లీని ఎన్నో సామ్రాజ్యాలు పరిపాలించాయి, విలసిల్లాయి, పతనమైనాయి. శౌర్యులు, గుప్తులు సామ్రాజ్యాలను ఢిల్లీ కేంద్రంగా విస్తరించుకున్నాయి. ఢిల్లీని ‘ఏడు సామ్రాజ్యాల రాజధానిగా’ ప్రధానంగా వర్ణిస్తారు. ఢిల్లీ పురాతన కాలం నుండి వర్తక మార్గాలకు కూడలిగా ఉన్నది. ఒక పక్క గంగా యమునా మైదానం, మరొక వైపు ఆరావళి, వింధ్య పర్వతాలకు మధ్యగా ఉండటం వలన రాజధానిగా నిలబడింది. అశోకుడి కాలం నాటి శాసనాలను కనుక్కున్నారు. కుతుబ్ మినార్ దగ్గరున్న ఉక్కు స్తంభాన్ని గుప్త వంశీయుడైన కుమార గుప్తుడు తయారు చేయించాడు. 1) కిలరాయి పితౌడా 2) సిరి 3) తుగ్లకాబాద్ 4) జహానపనా 5) కోట్లా పిరోజ్ షా 6) పురానా కిలా 7) షాజహానాబాద్ వంటి ఏడు నగరాల సమ్మేళనం ఢిల్లీ ప్రాంతం.
మహాభారతం లోని పాండవులు పరిపాలించిన ఇంద్రప్రస్థ నగరం అంటే ఢిల్లీనే అని చెపుతారు. బ్రిటిష్ పాలకులు తొలిగా కలకత్తాను రాజధానిగా చేసుకుని పాలించారు తర్వాత 1911 లో రాజధానిని ఢిల్లీకి మార్చారు. మొఘలుల పాలనలో షాజహాన్ పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ఢిల్లీలో ఎటు తిరిగినా లోడీమార్గ్, ఫిరోజ్ షా  రోడ్, అశోకా రోడ్, అంటూ పూర్వ రాజుల పేర్లతో రోడ్లు, ఆయా రాజుల శిధిల కోతలు ఆనాటి వైభవాలకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇదే కాక టాల్ స్టాయ్ మార్గ్, అని రచయితల పేర్లు, కోపర్నికస్ లేన్ అని శాస్త్రవేత్తల పేర్లు ఢిల్లీ రోడ్ల పై పలకరించాయి. ఢిల్లీ లోని ఆంధ్ర భవన్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వైభవోపేతంగా కనిపిస్తున్నది. కుతుబ్ మినార్ ను చూసినప్పుడు ఇండో ఇస్లామిక్ నిర్మాణాలకు ఒక అధ్బుతమైన ఉదాహరణగా అనిపించింది. నేటికి తుప్పుపట్టని ఉక్కు స్థంబం కుతుబ్ మినార్ ఆవరణ లోనే ఉన్నది. కుతుబ్ మినార్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో పేరు లిఖించబడింది. ఇది ప్రపంచంలోనే ఇటుకలతో కట్టబడిన ఎత్తైన మినార్. దీని ఎత్తు 72.5 మీటర్లు కుతుబుద్దీన్ ఐబక్ దీనిని నిర్మించటం వలన అయన పేరు మీదుగా కుతుబ్ మినార్ అని పేరు వచ్చింది. అత్యద్బుతమైన శాస్త్ర నిగూడతను తెలిపే ప్రాచీన చారిత్రక కట్టడం. ప్రతి సంవత్సరం జూన్నెలలో 22 వ తేదినాడు కుతుబ్ మినార్ యొక్క నీడ భూమి మీద పడదు. ఇదొక అపూర్వమైన విశేషం. ఉత్తర అక్షాంశం మీద 28.5 వద్ద కుతుబ్ మినార్ ఉండి 5 డిగ్రీల వంపు కలిగి ఉండటం వలన దీని నీడ భూమి మీద పడటం లేదు.
          ఇవన్నీ తిరిగి సాయంత్రానికి హోటల్ కు వచ్చేసరికి అక్కడ పూల డెకరేషన్ మనసును ఆహ్లాద పరిచింది. పురాతన కట్టడాల మధ్య నుంచి పూ బాలల లలిత సోయగంలో పడి మనసు మైమరిచింది. మరుసటి నాటి ఉదయం టిఫిన్ కు వెళ్ళినపుడు అక్కడ “చాయ్ వాలా టేల్స్” అనే బోర్డు మొదట్లోనే కనిపించింది. టామ్రా అనే భవనం టిఫిన్ కు వేచి చూస్తూ ఏమిటి బోర్డు అని పరిశీలిస్తే అక్కడ టీ తయారు చేసే వ్యక్తి రాసిన పుస్తకాలను ఒక ప్రదర్శనగా పెట్టారు. ఆ పుస్తకాలను పరిశీలిస్తుండగా పొట్టిగా ఉన్న ఒక మనిషి వచ్చి “ నా పేరు లక్ష్మణ రావు. ఈ పుస్తకాలు రాసింది నేనే” అంటూ పరిచయం చేసుకున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. టీ తయారు చేస్తూ జీవనం సాగించే వ్యక్తి సాహిత్య పరంగా ఇన్ని పుస్తకాలు రాయడం వింతగా ఆశ్చర్యంగా అనిపించి నేను అతనితో ఫోటో తీసుకున్నాను. నన్ను చూసి చాల మంది ఫోటో దిగారు. నా పుస్తకాన్ని అతనికి బహుమతిగా ఇచ్చాను. అతనిచ్చిన ‘టీ ‘ బాగుంది. అతని సంభాషణా బాగుంది. ఇదొక ఆత్మీయమైన అనుభూతి.
          బిర్లామందిర్, అక్షరధామ్, ఎర్రకోట, జామామసీదు వంటివి ఇంతకు ముందే చూసి ఉన్నాం కాబట్టి మరల వెళ్ళలేదు. ఆగ్రా తాజ్ మహల్, మధుర శ్రీ కృష్ణ దేవాలయం వంటివి కూడా మరల చూడటానికి టైం దొరకలేదు. మా హోటల్ శంగ్రీలా కు దగ్గర గానే ఉందని జంతర్ మంతర్ కు వెళ్ళాము. ఢిల్లీ లోని ఈ జంతర్ మంతర్ లో పదమూడు రకాలైన ఖగోళ పరికరాలున్నాయి. సూర్యుడు, చంద్రుడు గ్రహాల గతులను ఈ అబ్జర్వేటరి ద్వారా తెలుసుకోవచ్చు. ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేక గణాంకాల కోసం ఈ ప్లానెటోరియం ను నిర్మించారు. దీనిని మహారాజ జైసింగ్-2 నిర్మించాడు. ఇటువంటి ప్లానెటోరియం నే జైపూర్ లో కూడా నిర్మించారు. ఈ అబ్జర్వేటరీ లో రామ్, సామ్రాట్, జై ప్రకాష్, మిశ్ర యంత్రాలు ముఖ్యమైనవి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ గొప్ప ప్రకృతి పరిశోధకుడు. ఖగోళ శాస్త్ర వేత్త కూడా. ఖగోళ శాస్త్ర సాంకేతిక శాస్త్ర గ్రంధాలను ఉర్దూ భాషలో రచించారు.సూర్య చంద్ర గ్రహణాలు, తోక చుక్కల గురించిన తన పరిశోధనలను గ్రంధస్తం చేశారు. సమకాలీన శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను కూడా లిఖించారు. ఖగోళ శాస్త్ర విన్యాసాలతో పాటుగా మొక్కల, పక్షుల పరిశీలనలతో జీవన విధానాల గురించి గ్రంధాలు రాశారు. యుద్దాలు, అంతర్యుద్ధాలు, తిరుగుబాట్ల నడుమ రాజులూ పరిశోధకులు కూడా కావడం విశేషం.
          రోజులో సగం పూట కాన్ఫెరెన్స్ లో ఉండటం, సగం పూట బయట తిరగటం చేశాం. కాన్ఫరెన్స్ లో ఈ సారి పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్లు వేశారు. అందరం అక్కడ ఫోటోలు తీసుకున్నాం. పల్లెటూరి వాతావరణంలో కనిపించే చేదభావి, కుండలు చేసే కుమ్మరి వారు, గాజులు అమ్మే స్త్రీ, కుండలో మజ్జిగ చిలికి వెన్నను తీసే మహిళా, చిలక జోస్యం చెప్పే వారు, చెయ్యి రేఖల్ని పట్టి జ్యోతిష్యం చేప్పే హస్త సాముద్రికులు, ఇల్లిల్లు తిరిగి వేణువులను అమ్ముకునే అతను, చెట్టు కింద పాని పూరిల బండి, తమలపాకుకు సున్నం రాసి కట్టే  కిళ్ళి కొట్టు, ఎండు గడ్డిని నెత్తి మీద వేసుకుని చల్లగా ఉండే పూరి గుడిసెలు – అన్ని కలిసి పల్లెను తలపించాయి. ఇంకా రకరకాల రాష్ట్రాల చేనేతల బట్టలు కూడా కొలువు తీరాయి. రకరకాల ఫ్యాషన్ జువెలరీలు ఎన్నో మహిళల మనసును దోచేస్తూ కనువిందు చేస్తున్నాయి. ఒకపక్క కొంతమంది గోరింటాకు డిజైన్లు చేతుల్లో వేస్తూ మగువల్ని అటూ ఇటూ తిరగనివ్వకుండా కట్టి పడేస్తున్నారు. ఎలెక్ట్రిక్ కార్లను కూడా ఈ సారి ప్రదర్శనలో పెట్టారు. కొత్త కంపెనీలు ఈ మధ్య ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. పెట్రోల్, డీసెల్ వంటి ఇంధనాల ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్యాయంగా ఎలక్ట్రిక్ కార్లను వినియోగంలోకి తీసుకురావడం ప్రజలకు ఆనందదాయకమైన విషయం.
          గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో మార్ట్ కు వెళుతున్నపుడు శ్రద్ధా యూనివర్సిటీ, ఏమైటి యూనివర్సిటీ కనిపించాయి. అదే దారిలో నాలెడ్జిపార్క్ కూడా ఉన్నది. నాకు నాలెడ్జ్ పార్క్ అనే పేరు బాగా నచ్చింది. ఎంట్రన్స్ లోనే కాశి విశ్వనాథుని ఆలయం, అయోధ్య రామ మందిరం, బృందావనంలోని ప్రేమ మందిరం, లక్నో లోని బారా ఇమంబారా ల యొక్క రెప్లికాలను అమర్చారు. అందరూ ఇక్కడ ఫోటోలు తీసుకున్నారు. మనిషి మధ్యలో నిలబడితే ఫోన్ మన చుట్టు తిరిగి విడియో తీస్తుంది. ఇది నాకు నచ్చింది.
          మా శంగ్రీలా కు దగ్గరగా బంగ్లా సాహెబ్ గురుద్వారా ఉన్నది.ఇది రాజా జైసింగ్ యొక్క నివాసం తర్వాత దీనిని గురుద్వారా గా మార్చారు. బంగారు గోపురంలో మెరిసే ఈ గురుద్వారా సిక్కుల పవిత్ర పుణ్యస్థలం. దీని సెల్లార్ లో ఒక ఆసుపత్రి, ఒక ఆర్ట్ గ్యాలరీ, ఒక మ్యూజియం ఉన్నాయి. యాత్రికులు నివాసం ఉండటానికి రూమ్స్ కూడా ఉన్నాయి. లోపల గురుద్వారా లో అంత బంగారంతో చేసినా అలంకరణలా అనిపించి నాకు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ గుర్తు వచ్చింది. లోపలికి వెళ్ళేవారు అక్కడ ఉన్న స్కార్ఫ్ ను కట్టుకొని వెళుతున్నారు. మేం కూడా జరిలతో మెరిసే స్కార్ఫ్ లను చుట్టుకొని దర్శనం చేసుకున్నాం.
          ఇది మా ఢిల్లీ విశేషాలు. మా కాన్ఫరెన్స్ మరియు ఢిల్లీ నగర సుందర దృశ్యాలు.

****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.