ఆడబ్రతుకే మధురము

-యామిజాల శర్వాణి

1930,1940 నాటి కోస్తా ఆంధ్ర సమాజము ముఖ్యముగా మధ్యతరగతి కుటుంబాల గురించి తెలుసుకోవాలంటే  కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలు చదవాల్సిందే. ఇరవయ్యో శతాబ్ది సాహిత్య సంచనాలకు అద్దము పట్టిన కుటుంబరావు గారిని అధ్యయనము చేయకపోతే తెలుగు సమాజ సాహిత్యాల పోకడ పూర్తిగా అర్ధము చేసుకోలేము. అయన పుట్టి పెరిగింది పూర్తిగా కరుడుగట్టిన చాదస్తపు వాతావరణము అయినప్పటికీ పరోక్షంగా బ్రిటిష్ ప్రభావము వల్ల మరియు స్వస్థలమైన తెనాలి లో ఉన్న ప్రగతిశీల భావాలు బాగా వంటబట్టాయి ఈయన పై వీరేశలింగము గురజాడ, చలము, మార్క్సిజాల ప్రభావము ఉంది.కుటుంబరావు సాహిత్య ప్రక్రియలన్నింటిని సొంతము చేసుకున్నాడు కానీ కవిత్వము జోలికి పోలేదు. 50 ఏళ్ల పాటు సుమారు 500 లకి పైన కధలు నవలలు, నాటికలు కొన్ని వందల వ్యాసాలు వ్రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి “కధలు వ్రాయటం చాలా తేలికైన పని నిరూపించేందుకు నేను విరివిగా కధలు వ్రాసాను” అని అయన చెప్పారు. సంఘాన్ని సాహిత్యము ద్వారా మార్చలేమని తెలిసినా కొంత వరకైనా పాఠకుల చైతన్య పరిధి ని పెంచేందుకు తన  రచనల ద్వార కృషి చేశారు. 
సంఘములో స్త్రీ ఎంత దయనీయ స్థితిలో ఉందొ నిశితముగా కుటుంబరావు గారు వివాహ వ్యవస్థను, బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే నీతి  నియమాలను అయన పరిశీలించినంత శాస్త్రీయముగా  సృజనాత్మక సాహిత్యములో మరెవరు పరిశీలించలేదని చెప్పవచ్చు. భార్యాభర్తలు వివాహ బంధానికి కట్టుబడి ఉన్నంతగా ప్రేమ బంధానికి ఉండటం లేదని, పైపెచ్చు వివాహ బంధము స్త్రీని కట్టివేసినంత బలంగా మగవాడిని  కట్టి వేయలేదని కుటుంబరావు గారు తన అభిప్రాయాన్ని స్పష్టము చేశారు.  ఈయన స్త్రీ పక్షపాతి. స్త్రీ హృదయాన్ని కాచి వడపోసి అనేక కధలుగా, నవలలు గా తెలుగు పాఠకుల ముందు ఉంచిన మేధావి కుటుంబరావు.స్త్రీ జీవితములో అన్ని దశలను వెనుకబాటు తనాన్ని గొప్ప ఆలోచనా పటిమను, పురోగామి దృక్పధాన్ని చాలా చక్కగా తన రచనలలో చిత్రీకరించారు. ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి తల్లులు పడే ఆరాటం (పూర్వము) ఆడపిల్లగా పుట్టిన దౌర్భాగ్యాన్ని కళ్ళకు కట్టినట్లు కుటుంబరావుగారు చుపిస్తారు “మన సమాజములో కొందరు తక్కువ కులాల్లో పుడతారు మరికొందరు ఆడవాళ్ళుగా పుడతారు” అన్న అయన కొటేషన్ ఆడవాళ్ళ పట్ల ఆయనకు ఉన్న సానుభూతిని తెలియజేస్తుంది అటువంటిదే “ఆడబ్రతుకే మదురము” అనే కధ ఈకథ 1947 లో తల్లి లేని పిల్ల కధల సంపుటిలో ప్రచురించబడింది నాకు నచ్చిన కధల్లో ఇది ఒకటి ఈకథను మీకు పరిచయము చేస్తాను ఆ కథ ద్వార కుటుంబరావు గారి స్త్రీ వాద  ధోరణిని అర్ధము చేసుకోవచ్చు ఈయన కల్పనా సాహిత్యానికి మధ్యతరగతి జీవితమే పట్టుగొమ్మ అని అర్ధము అవుతుంది.అంతే  కాకుండా అయన రచనలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను కూడ పాఠకులు గమనించవచ్చు. సాధారణముగా మధ్యతరగతి వాళ్ళు గానుగెద్దుల్లా సంసార వలయములో పడి  కాలము గడుపుతుంటారు వీళ్లలో సామాజిక చైతన్యము కలుగ జేయటం అంత సులువైన పని కాదు కానీ ఈ పనిని సమర్ధవంతముగా చేసిన వ్యక్తి కుటుంబరావు గారు.
ప్రస్తుత కధ లోకి వద్దాము ఇది కధ అనటం కన్నాఆనాటి యదార్ధ సామాజిక స్థితి అని చెప్పవచ్చు అంటే ఆనాటి స్త్రీల ఆలోచనలు వారి దృక్పధాలు మొదలైనవి రచయిత  మధ్యతరగతి ఆడ పిల్ల  పాత్ర లో ప్రవేశించి ఆడవారి భావనలను ఆలోచనా ధోరణులను పాఠకుల ముందు ఉంచుతారు కధ  మొదలు పెట్టటం మగవాడు ఆడదాన్ని ముఖ్యముగా భార్యను కొట్టటం అనే విష సంస్కృతితో మొదలుపెడతారు అమ్మమ్మను తాతయ్య ,అమ్మను నాన్న, అక్కయ్యను బావ కొట్టటం, ఏతావాతా మగవాళ్ళు ఆడవాళ్లను కొడతారు తిడతారు కూడా రేడియోలో ఏమో “ఆడబ్రతుకె మధురము”అనే పాట వస్తు ఉంటుంది.అమ్మమ్మ చెప్పినదాని ప్రకారము ఎంతో పాపము చేసుకుంటే గాని ఆడవాళ్లుగా పుట్టరు అందుకేనేమో మగవాళ్ళు ఆడవాళ్లను తిడతారు కొడతారు. మహా పతివ్రతాలు కూడ వచ్చే జన్మలో ఆ  మొగుడే కావాలని కోరుకుంటూ పూజలు వ్రతాలూ చేస్తారు అసలీ అడజన్మ వద్దని ఎందుకు కోరుకోరో ఆడవాళ్లు అంతా పుణ్యము చేసుకుంటే వచ్చే జన్మలో ప్రపంచములో ఆడవాళ్లు ఉండరేమో (ప్రస్తుతము ఆడవాళ్ల సంఖ్య తగ్గటానికి కారణము ఇదేనేమో) అలా అయితే మనమంతా(ఆడవాళ్లు) క్రాఫులు పెంచుకొని సూట్లేసుకొని సిగరెట్లు కాలుస్తూ తిరగవచ్చు అన్నమాట.కిందటి జన్మలో చేసుకున్న పాపము విరగడైపోవటానికి ఆడవాళ్లు మొగుళ్లచేత తన్నులు చివాట్లు తింటూ చాకిరి చెయ్యాలి ఆఫీసుకు వెళ్లే నాన్నకు ఆదివారము సెలవు కానీ అమ్మకు సెలవులు లేవు పని ఎగ్గొట్టానికి వీల్లేదు ఎందుకంటే అమ్మకి జీతము లేదుగా. 
కృష్ణ మూర్తిగారు వాళ్లావిడను కొట్టడు పైగా ముద్దు చేసి పాడు చేస్తాడు ఆవిడేమో మొహానికి పౌడర్ పూసుకుంటుంది సినిమాలకు నాటకాలకు మీటింగులకు వెళుతుంది అందుకని ఆవిడ మంచిది  కాదు వచ్చే జన్మలో కూడా ఆవిడకు కృష్ణమూర్తిగారు మొగుడవూతాడేమో అయితే ఆవిడకు ఎప్పుడు  ఆడజన్మే ఆవిడ ఖర్మ ఆడవాళ్లు చదువుకోరాదు చదువుకుంటున్న పెళ్లి అయితే చదువు మానెయ్యాలి  కృష్ణమూర్తి గారి  పెళ్ళాము పెళ్లి అయి పిల్లల తల్లి అయినా చదువుకుంటూనే ఉంది బియ్యే కూడా పాస్ అయింది.,చదువుకుంటే ఆడవాళ్లు చెడిపోతారుకానీ కృష్ణమూర్తి గారి పెళ్ళాము చెడిపోయినట్లు కనిపించదు ఎప్పుడు అందర్నీ నవ్విస్తూ మాట్లాడుతుంది చిన్న పిల్లలకు అన్ని విషయాలు తెలియవు కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అడగరాదు.కొందరు ఆడవాళ్లు చదువుకోకుండానే చెడిపోతారు, చదువుకోకుండా చెడిపోతే అది వాళ్ళ కర్మ. కృష్ణమూర్తి గారి పెళ్ళాము పిల్లలను కొట్టదు .వాళ్ళ అమ్మాయి వాణీని నిన్ను నీ మొగుడు కొడితే ఏమి చేస్తావు అని అడిగితె చంపేస్తా అంటుంది.అంటే వాణీ కూడా వాళ్ళ అమ్మలాగే ఎప్పటికి ఆడదే అవుతుంది దాన్ని వాళ్ళ అమ్మే పాడు చేస్తుంది అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు అంటారు. 
ఆడవాళ్ళతో అన్ని చిక్కులే,బాధలే,అమ్మ బయట ఉన్నప్పుడు నాన్న చేసే అల్లరి అంతాఇంతా కాదు తెగ గొణుక్కుంటాడు. పిల్లలను కనేటప్పుడు చచ్చినంత  పని అవుతుంది కొంతమంది ఆడవాళ్లు పిల్లలను కని చనిపోతుంటారు.ముత్తయిదువ చావు రావటము ఎంతో పుణ్యముట. వాళ్ళు మొగాళ్ళు గా పుడతారేమో. ఆడవాళ్ళతో అంతా ఖర్చే ఒక చీర ఖర్చుతో నాలుగు ధోవతులు వస్తాయి.ఆడపిల్ల అంటేనే ఖర్చు పెళ్లి చేయాలంటే బోలెడు కట్నాలు ఇవ్వాలి ఆడపిల్లకు చిన్నప్పుడే పెళ్లి చేస్తే పుణ్యముట. అమ్మకు ఎనిమిది ఏళ్లప్పుడే పెళ్లి చేసి తాతయ్య కన్యాదాన ఫలము పొందాడు. ఇప్పుడంతా పెద్ద పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు కలికాలం కనుక అలా చేస్తున్నారు అలా చేయటము పాపము.నేను మటుకు పెద్ద దాన్ని అయితే కొట్టే మొగుడిని మాత్రము చేసుకోను. పుణ్యము లేకపోతె పీడాపోయే ఈ దెబ్బలు తిట్లు ఎవరు పడతారు పెద్దదాన్ని అయితే ఎవరికీ తెలీయకుండా కృష్ణమూర్తి గారినే చేసుకుంటా ఈ విధముగా ఆడపిల్ల స్వగతము సాగుతుంటే రేడియో “ఆడబ్రతుకే మధురము “పాట వినిపిస్తూనే ఉంటుంది. ఇన్ని భాదలు ఉన్నప్పటికీ “అడ  బ్రతుకే మధురము” అనుకోవటమే ఆనాటి మధ్యతరగతి ఆడదాని ఆలోచనలకే హ్యాట్స్ ఆఫ్ 

*****

Please follow and like us:

One thought on “నాకు నచ్చిన కొడవటిగంటి కుటుంబరావు గారి కధ “ఆడబ్రతుకే మధురము””

  1. ఆ నాటి సామాజిక పరిస్థితులు కూడా కారణం.
    ఇంకా మనకు స్వాతంత్ర్యం రాలేదు.అన్ని
    వర్ణాల్లోనూ కట్టుబాట్లు చాలా వుండేవి.అన్ని
    కట్టుబాట్లు దాటుకుని చదూకున్న వాళ్ళున్నారు.

Leave a Reply

Your email address will not be published.