
అనుసృజన
యుద్ధం సోకని మూడడుగుల నేల (కవిత)
మూలం : రిషభదేవ్ శర్మ
అనువాదం: ఆర్.శాంతసుందరి
(రిషబ్ దేవ్ శర్మ కవి, విమర్శకులు, స్నేహశీలి. హైదరాబాద్ లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ సంస్థ నుంచి ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. చిల్లర భవానీదేవి, పెద్దింటి అశోక్ కుమార్, సలీం లాంటి ఎందఱో తెలుగు రచయితల హిందీ అనువాదాలకు విశ్లేశానాత్మకమైన ఉపోద్ఘాతాలు రాసారు. ఇటీవల రాసిన ఈ కవిత వారి కవిత్వానుభావానికి ఒక మచ్చు తునక.)
***
ఇరవైయొకటో శతాబ్దంలో..
మొట్టమొదటి చీకటి రాత్రి..
పుట్టాలని చూస్తున్నదొక శిశువు..
కానీ ఊరికే బెదిరిపోతోంది..
మళ్ళీ వెళ్ళిపోతోంది అదే చీకటి గుహలోకి ..
అనాది నుంచి
తను నిద్రిస్తూ ఉండిన చల్లని గర్భంలోకి.
‘ఏయ్.. !
ఏమిటీ మొండితనం,
ఎందుకంత భయం,
ఎందుకు జన్మించవు నువ్వు?’
తన నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ..
అడిగింది వృద్ధురాలైన భూమి.
అష్టావక్రుడిలాంటి శిశువు..
కెవ్వుమని అరిచింది గర్భంలోనుంచి ..
‘నేను రాను ఈ నరకంలాంటి నీ లోకంలోకి.
నాకిచ్చేందుకు ఏముంది నీవద్ద?
నేను పుట్టానన్న సంబరంతో
ఇంకా కొన్ని కొత్త ఆయుధాలని తయారు చేస్తావు,
నా భవిష్యత్తు ఛాతీ మీదికి గురిపెట్టి కాలుస్తావు
తుపాకులూ, మెషిన్ గన్ లూ..
కొన్ని కొత్త బాంబులు పేలుస్తావు.
రేడియోధార్మిక కిరణాలని కురిపిస్తావు.
నా మస్తిష్కంలోని మూల మూల మూలల్లో ..
నీ ఈ లోకంలోకి నేను రాను గాక రాను.
రాను…రాను…రానంటే రాను …!’
ఆ తరవాత పరుచుకుంది నిశ్శబ్దం.
ఇంకా పుట్టని ఆ శిశువు నిరాకరణకి..
ఎవరి దగ్గరా లేదు సమాధానం.
మళ్ళీ వినిపించింది శిశువు గొంతు..
బలి చక్రవర్తి గుమ్మం దగ్గర నిలబడి పిలిచిన
వామనుడి గొంతులా :
‘నేను నీ లోకంలోకి రావాలంటే..
నాకు మూడడుగుల నేల కావాలి.
కేవలం మూడడుగులే..
స్వచ్ఛమైన, శుభ్రమైన నేల!
ఆ మూడడుగుల నేల మీద
ఎప్పుడూ ఎటువంటి అస్త్ర శస్త్రాల నీడా
పడి ఉండకూడదు.
అక్కడి గాలి పరిశుభ్రo గా ఉండాలి
ప్రకృతి పవిత్రంగా ఉండాలి !’
ఆ గొంతు ఎక్కడో మాయమైంది.
శిశువు మౌనంగా ఉండిపోయాడు.
నేలతల్లీ మాట్లాడలేదు.
మహారాజులూ, భూపతులూ మౌనం దాల్చారు.
ప్రగల్భాలు పలికే భూమిపుత్రులూ మాట్లాడలేదు.
పరిశుభ్రమైన గాలి,పవిత్రమైన ప్రకృతితో విలసిల్లే
మూడడుగుల నేల వాళ్ళెవరి దగ్గరా లేదు!
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
