విజయవాటిక-11

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

మహాదేవవర్మ మందిరము

          ఎత్తైన పది మెట్లు ఎక్కిన తరువాత దేవడిలోకి ప్రవేశిస్తాము. రెండు సింహపు శిల్పములు ఆ మెట్లపైన కూర్చొని రాజసంగా చూస్తున్నాయి. దేవడిలోకి ప్రవేశించగానే ఎతైన స్తంభాలతో, గోడలనలంకరించిన తైలవర్ణ చిత్రాలతో, రకరకాల గాజు బుడ్డీలలో పెట్టిన దీపాలతో మందిరము మహోత్సవంగా ఉంది.

          ఆ చిత్రాలు విష్ణుకుండిన పూర్వపు రాజులవి. వీరత్వంతో తొణికిసలాడుతున్నాయి. విశాలమైన ఆ దేవడిలో ఒక వైపు వచ్చిన వారికి కూర్చోటానికి ఆసనాలు వేసి ఉన్నాయి. మరోవైపు ఎత్తైన సింహాసనము వంటిది ఉంది. ప్రభువులు ఆ సింహాసనము పై కూర్చుంటారు. ప్రక్కనే కొద్దిగా క్రిందన మరో సింహాసనము, కొన్ని ఆసనాలు ఉన్నాయి.
గదిలో దీపాల వెలుగు దేదీప్యమానముగా ఉంది. ఆ కాంతికి అప్పుడు సాయంకాలమైనా మధ్యహ్నంలా ఉంది. వచ్చిన కళాకారులు ఒక ప్రక్కగా నిలబడ్డారు. సేవకులు వచ్చి లోపలికి రమ్మనమని ఆ మందిరం నుంచి వారిని తోట వైపుకు తీసుకుపోయారు.
తెల్లని పరువులు పరుచుకున్న వెన్నెలలా ఉన్నాయి. ఉద్యానవనం నుంచి పూల సుగంధం పరవశింపచేస్తోంది. ఒక ప్రక్కన ఎత్తైన వేదిక మీద వేసిన పరుపు మీద ప్రభువు విలాసంగా కూర్చొని ఉన్నాడు. మరో వైపు సరంగు సంగీతం వీనుల విందు చేస్తోంది. వచ్చిన వీరిని చూసి మహాదేవవర్మ చిన్న చిరునవ్వుతో తల ఊపాడు. అనుచరులు వారికి ఆసనములు చూపారు.
“కళాకారులు మాకు ఇష్టులు!” అన్నాడు ప్రభువు.
కళాకారులంతా సంతోషించారు. “నిన్నటి మీ నృత్యం మమ్ముల మైమరపింపచేసింది…” చెప్పాడు మహాదేవవర్మ ఆరాధనగా హరిక వైపు తిరిగి.
“మిమ్ముల సత్కరించుకోవాలి. అందుకే పిలిచాము…” అన్నాడు ప్రభువు. అక్కడే మరో ఉన్నతాసనము పై కూర్చొని ఇదంతా చూస్తున్నాడు శ్రీకరుడు . “ముందు విందు…” అంటూ వడ్డించమని సైగ చేశాడు మహాదేవవర్మ. బల్ల మీద వివిధ భక్ష్య భోజ్యాలు వడ్డించారు సేవకులు. కళాకారులు తినవలసిన దానికిన్నా ఎక్కువే తిన్నారు. తాగ గలిగినంత సురను త్రాగారు. అందరికీ తాంబూలం ఇచ్చాడు ప్రభువు. తాంబూల మివ్వటము గౌరవ సూచకం. కేవలం సత్కరించాలనుకున్నప్పుడే తాంబూలమిస్తాడు ప్రభువు. గోవిందుడు పరమానందభరితుడైనాడు. “మీరు నా కోరిక మన్నించాలి…” అన్నాడు మహాదేవవర్మ…గోవిందుని చూస్తూ.

          “ఆజ్ఞాపించండి ప్రభూ!” అన్నాడు గోవిందుడు వినయంగా.

          “నాకు హరిక నృత్యము చాలా నచ్చినది. మీరంతా మా ఆస్థానములో ఉండిపోవాలి…” చెప్పాడు మహాదేవుడు.

          గోవిందునికి నోట మాట రాలేదు. సంతోషం కలిగినా మనసులో గుబులు కలిగింది.
వినయంగా “ప్రభూ! మా అదృష్టదేవత వరమిచ్చినట్లుగా మీరు మమ్ముల ఇక్కడే ఉండమంటున్నారు. కళాకారులకు తమ కళను సర్వులకు చూపితే తప్ప సంతోషం కాదు. మాకు దేశ సంచారానికి అనుమతి ఇవ్వండి. సంచారమైన తరువాత మీ పాదాల వద్ద సేవ చేసుకుంటాము…” అన్నాడతను.

          మహాదేవవర్మ నవ్వాడు. “గోవిందా! నీవు చెప్పినది నిజమే. కానీ నేను హరిక నృత్యము అనుదినము చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను. అందుకే మీరు కొంత కాలమన్నా నా కోరిక ప్రకారం ఇక్కడే ఉండిపొండి. మీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటాము మా రాజ్యంలో…” అంటూ శ్రీకరుని వైపు చూసి “కారా! వీరికి కావలసినవి చూడవలసిన భాద్యత నీదే. వీరు మన అతిథులు…” అని ఆజ్ఞాపించాడు.

          “చిత్తం ప్రభూ!” అని శ్రీకరుడనటము, ‘హరిక’కి లోలోపల అనుమానం కలిగించింది.

          మహాదేవవర్మ వారికి ధనమిచ్చి వారి వసతిగృహానికి పంపాడు.

          ఆ రాత్రి ఆ వసతి గృహం చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు అవటం చూసి కళాకారులు నివ్వెరపోయారు. కొంత ఆందోళన కూడా కలిగింది వారికి. ఒకరినొకరు చూసుకొని మౌనంగా ఎవరికి కేటాయించిన స్థలంలో వారు సర్దుకున్నారు.

          ఆ నాటి రెండవ జాము గడిచాక ఆ వసతిగృహం నుంచి ఒక పావురం ఎగిరింది.
ఆ పావురం అరగడియలో శ్రీకరుని ముందు ఉంచబడింది. అభ్యంతర మందిరంలో శ్రీకరుడు కూర్చొని ఆ చిన్న పత్రాన్ని పరీక్షగా పరిశీలించాడు. అందులో రెక్కలు ముడుచుకున్న డేగ, పై గుణకారపు గుర్తుతో ఉంది. అంటే పక్షి బంధించబడినదని సంకేతం. శ్రీకరుని అనుమానము తీరింది. పక్షి బందీ అయింది.

***

          శ్రీకరుడు మహారాజు చెప్పిన పని మీద వ్రాయసగాళ్ళను రప్పించాడు. ఆరోజులలో వ్రాయసగాళ్ళకు ఎంతో మర్యాద ఇచ్చేవారు. వ్రాయసగాళ్ళ పని కవులు, రాజులు చెప్పినవి రాసుకోవటం. అవి రాళ్ళ మీద, లోహ పత్రాలపై రాయటము, లేదా చెక్కటం.
ఆనాటి సమాజంలో తల్లితండ్రులు పిల్లలకు అక్షరాలు నేర్పి కొలువులో ఉద్యోగానికి పంపేవారు, వ్రాయసగాళ్ళుగా. కొలువులోని కవులు చెప్పినది రాయటం, చెక్కటము వీరి పని. మహారాజు మాధవవర్మ పేరు మీద ఒక మహాశాసనం పనిలో ఇదంతా సాగుతోంది. మహారాజు మాధవవర్మ బలవంతుడు, సత్యసంధుడు, తెలివైనవాడు. పితృపితామహుల వద్ద నుంచి వచ్చిన రాజ్యాన్ని బలోపేతం చేశాడు. శత్రువులైన పల్లవులను కావేరీ దక్షిణానికి తరిమివేశాడు. మరో శత్రువులు కళింగులను ఉత్తరానికి తరిమివేశాడు.తూర్పు, పశ్చిమ సముద్రాలు సరిహద్దుగా కలవాడు, ఆయన గుర్రాలు రెండు సముద్రాలలో నీరు త్రాగాయి. శైవమును ఆదరించిన, మాధవవర్మ శ్రీపర్వత (శ్రీశైల) మల్లన్న భక్తుడు. శ్రీపర్వత దాసుడనని చెప్పుకున్నడాయన. ‘త్రికూటామలయాధిపతి’ అన్న బిరుదు గ్రహీత. ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపించినవాడు. ఆయన విజయాలను చాటుతూ చెక్కిన ప్రసిద్ధ శాసనము ‘ఈవూరి శాసనము’. ( చరిత్రకారులకు అది తెనాలి మండలంలో ఈవూరిలో లభ్యయమైనందున ‘ఈవూరు శాసనం’ అని పేరు- ర. ) ఈ శాసనము మూడు రేకులతో కూడి ఉంది. రాగి లోహముతో చేసిన పత్రాల పై చెక్కిన శాసనమది. ఆనాటి వారి రాజభాష సంస్కృతములో వారి పండితులు చెప్పగా, వ్రాయసగాళ్ళు చెక్కినది.

(“స్వస్తి శ్రీ పురాదీశ దశాశ్వమేధా భృదావధూతజగత్కల్మ
స్యాగ్నిష్టోమ సహస్రయాజినోనేక సామన్తమకుటకూటయ
ణి కచిత చరణ యుగల కమలస్య మహారాజ
మాధవవర్మణః ప్రియనప్తాక్షత్రియావస్కన్ద ప్రవతి తాప్రతిమతి” (శాసనము పైన ఉన్నది యధాతథంగా ఇది)

          ఇది మొదటి తామ్రపత్రం. అర్థం “జయనామ సంవత్సరమున విజయవాటిక పురములో అశ్వమేధయాగము చేసిన మాధవవర్మ మహారాజు”

రెండవ రేకు మీద
(“ప్రఖ్యాత పరాక్రమస్య శ్రీదేవవర్మః ప్రియపుత్రస్య త్రికూటమలయాధిపతి
వినయ సత్వసంపన్న భగవచ్ర్ఛీపవ్వ…..గ్రామ జనానేవమా
విష్ణుకుండిన మాధవవర్మ ….గ్రామే జనానేవమా…”)
“శాసనము వేయించిన మాధవవర్మ త్రికూటమలయాధిపతి. నయవినయసత్వసంపన్నుడు. భగవత్ శ్రీ పర్వతస్వామి పాదదాసుడు. బ్రాహ్మణులకు భూమి దానము చేసినాడు. దేవవర్మ ప్రియ పుత్రుడు. పరాక్రముడు. క్షత్రియులలో గొప్పవాడు.”

          ఇలా మొత్తం నాలుగు తామ్ర రేకుల పైన వాయసగాళ్ళు చెక్కారు. ఇలా చెక్కిన తామ్ర పత్రములను ఒక తీగతో కట్టి పైన విష్ణుకుండినుల ముద్రను రచించారు. ఇటు వంటి దాన శాసనములను ప్రతి దానములో ఇచ్చారు.

          ఈ పనులన్నీ చూడటంలో శ్రీకరునికన్నా మిన్న లేరని మహారాజు నమ్మకం.
శ్రీకరుడు దాన శాసనాలను వేయించి బ్రాహ్మణులకు భూరి దానాలు సక్రమంగా జరిపించాడు. ఈ దానాలన్నీ మహారాజు చేసే యాగంలో భాగంగా చేశారు.

***

          అశ్వమేధ యాగం ఎంతో గొప్ప యాగం, ప్రసిద్ధ క్రతువు. చరిత్రలో చూసుకుంటే పాండురాజు కుమారుడు ధర్మరాజు తరువాత ఆ యాగం చేసినది విష్ణుకుండినులే అని తెలుస్తుంది. అశ్వమేధయాగం రాజులు తమ బలాన్ని ప్రకటించుకోవటానికి చేసేవారు. అన్ని యుద్ధాలు ముగిసిన తదనంతరం, రాజ్యం తమదని, తమ బలానికి ఇక ఎదురులేదని ప్రకటించుకుంటూ ఈ యాగం చేసేవారు. లేదా తమ రాజ్యం విస్తరించుకోవాలనుకున్న రాజులు ఈ యాగం చేసేవారు. భూమి మీద విజయం సాధించిన విజేత ఈ యాగం నిర్వహిస్తాడని ‘బౌద్ధాయన శ్రౌత సూత్ర’ చెబుతుంది.
బలహీనమైన రాజు ఈ యాగం చెయ్యటానికి అనర్హుడు. ఈ విషయం తైత్తిరీయం కూడా చెబుతుంది. సార్వభౌముడైన రాజే ఈ యాగం చెయ్యటానికి అర్హుడు.

          ఈ యాగం చెయ్యటానికి ఎంతో మంది బ్రాహ్మణులు, ధనం కావలసి ఉంటుంది. యాగం కోసం ఒక బలమైన, గొప్పనైన అశ్వాన్ని ఎన్నిక చేసుకుంటారు. ఈ అశ్వం వేగంగా పరిగెత్తుకెళ్ళేదై ఉండాలి. ఈ అశ్వానికి ముందు భాగం నలుపు, వెనక భాగము తెలుపు ఉండాలి. వెనక తెలుపు పైన నల్లటి మచ్చలు ఉండాలి. ఈ అశ్వాన్ని ఎన్నిక చేసుకున్న తరువాత జాగ్రత్తగా చూసుకుంటూ యాగం వరకు సంరక్షిస్తారు.
పుణ్యాహవాచం అయిన తరువాత ఈ యాగాశ్వాన్ని తన ఇష్టమైన రీతిలో సంచరించటానికి వదిలి పెడతారు. వేగంగా పరుగెత్త గలిగిన ఈ అశ్వం రాజ్యమంతా, సరిహద్దులలో, ఇతర రాజ్యాలలో సంచరిస్తుంది. ఈ అశ్వానికి తోడుగా వందల సంఖ్యలో అశ్వాలపై వీరులు అనుసరిస్తారు. ఇలా యాగాశ్వామును ఒక సంవత్సరం పాటు తిరగనిచ్చి, సంవత్సర కాలమైన తరువాత యాగం మొదలుపెడతారు. ఈ యాగం మూడు రోజుల క్రతువు.

          మొదటి రోజు రాజుగారి విజయగాధలు గానం చేస్తారు. వైణికులు సంగీతం వినిపిస్తారు. ఈ విజయగాధలు దేశమంతటా విరివిరిగా పాడుకుంటారు. రెండవ రోజు యాగాగ్నికి ఆహుతులు. మూడవ రోజు దానాలు, పెద్దలను పూజించటం. దీనితో యాగం పూర్తి చెయ్యబడుతుంది.

          మహారాజు మాధవవర్మ పంపిన యగాశ్వాసం తిరిగి వచ్చేస్తుంది. యాగం కోసము హడావిడి విజయవాటికలో మొదలయింది.

 * * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.