
అందీ అందని ఆకాశం (కవిత)
-ఝాన్సీ కొప్పిశెట్టి
ఓ కవి ‘మధుశాల’ లోతుల్లో మునిగి వున్నాన్నేను
అదేమిటో…
మనసు పొరల్లో దాచుకున్న
ఇష్టమైన అనుభవాలన్నీ
అనుభవంలోకి వచ్చాయి..!
జ్ఞాపకాల పొరల్లోని
కౌగిలింతల స్పర్శలు
చిక్కటి స్నేహాలు
జో కొట్టిన హస్తాలు…
ఎందుకో మరోసారి
పితృస్వామ్యం పైన అక్కసు ఎగిసిపడింది..!
పురుషుడు ఆడమాంసపు ఆఘ్రాణింపుపై రాసినా
వేశ్యల భోగలాలసపై మనసు పడినా
ప్రియురాళ్ళ ఓణీల్లోని అందాల్లో ఓలలాడినా
అన్నీ స్వానుభవాలేనని ఒత్తి పలికినా
ఆక్షేపణ లేదు ఈ పితృస్వామ్య సమాజానికి…
ఎంత ‘టెస్టోస్టిరోన్’స్థాయిల్లో తేడాలున్నా
స్త్రీత్వానికీ శృంగారభావ సంక్షోభాలు
మానసిక వికార సంచలనాలు తప్పవు…
ఎందరు స్త్రీలు మనసు విప్పి చెదిరిన మనసును బహిర్గతం చేయగలరు..?
తమకున్న కొద్దిపాటి స్నేహాలను ధైర్యంగా పరిచయం చేయగలరు..?
మనసుకు నచ్చిన మగాడిపై నాలుగు అక్షరాల మాలలల్ల గలరు..?
చలం అఖుంటిత అభిమానులైనా
లత సాహిత్యాన్ని ఆస్వాదించిన రసజ్ఞులైనా
ఆమోదించరెందుకో స్త్రీ స్వేచ్చను
అయినా వీళ్ళంతా ఆకాశంలో సగం మరి.. !!!
*****

ఝాన్సీ కొప్పిశెట్టి గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు, ఆంగ్ల భాషలలో డబుల్ MA, భవన్స్ నుండి IRPM డిప్లొమా చేసారు. ఆర్మీలో ముప్పై మూడేళ్ళ ఉద్యోగ నిర్వహణానంతరం స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వీరి సాహితీ ప్రస్థానం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ వేగవంతంగా
సాగుతోంది. ‘అనాచ్చాదిత కథ’, ‘విరోధాభాస’, ‘అగ్ని పునీత’ అనే నవలలు, ‘గొంతు విప్పిన గువ్వ’ అనే అనుస్వనమాలిక, ‘చీకటి వెన్నెల’ అనే కథా సంపుటి,
‘ఆర్వీయం’ అనే చిత్ర కవితల దృశ్య మాలిక, ‘ఎడారి చినుకు’ అనే అనుభూతి కావ్యం వీరి సాహితీ పంటలు. నాటి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుగారి ప్రశంసా పత్రం, అంపశయ్య నవీన్ తొలి నవలా పురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం, నవలా రాణి బిరుదు ప్రదానం, తెన్నేటి హేమలత సాహితీ పురస్కారం, శ్రీ మక్కెన రామసుబ్బయ్య కథా పురస్కారం, కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం, HRC కథా పురస్కారం, నెచ్చెలి కథా పురస్కారం వీరి సాహితీ కృషికి లభించిన గుర్తింపులు. ప్రతిలిపి నుండి వీరి కథలకు అనేక బహుమతులు లభించాయి. వీరి కథలు, కవితలు తెలుగు వెలుగు, పాలపిట్ట, స్వాతి, ఆంధ్ర భూమి, సారంగ వంటి పలు పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.

సుప్రసిద్ధ నవలారచయిత్రి, కవయిత్రి
శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి కవిత బాగుంది.
కవిత్వం కూడా అశ్రద్ద చేయవద్దని కవయిత్రికి
మనవి,అభినందనలు.
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా