
తీపి దుఃఖాలు
-గవిడి శ్రీనివాస్
ఒక అసంపూర్ణ సంధ్యాకాలం
నీ విచ్చిన సంతోషంతో
నువ్ పంపిన సందేశంతో
ఇక్కడ నీ జ్ఞాపకాల్ని ధ్యానిస్తున్నా .
ఒక్క మాట చెప్పు
నీ తపస్సులో
ఉషస్సుని చూస్తున్న నాకు
ఈ తీపి దుఃఖాలు ఓదారుస్తాయా ..!
నీ చూపులు వెన్నెల్ని కురుస్తున్నపుడు
నీ ఊహలు తూనీగల్ని ఎగరేస్తున్నపుడు
నీ కన్నుల్లో అఖండ దీపాలు వెలుగుతున్నపుడు
నిశ్చేష్ఠుడనై నిర్ఘాంత పోయినపుడు
ఆ ఉఛ్వాస నిశ్వాసాల్లో ధ్వనించిన
అనురాగ మధురిమల్ని ఏరుకుంటున్నపుడు
నాలో కలల పూలు విరిశాయి .
నీ పెదవులపై మెరిసే నిశ్శబ్దాక్షరాలు
నాలో చెక్కిన మౌన భాషితాలుగా మిగిలాయి .
అలా రువ్విన నవ్వులలో
తడిసిపోతూ తనువు మురిసిపోతూ
కాలాల్ని దాటుతుంది .
ఇన్ని జ్ఞాపకాల్ని దోసిళ్ళలో పోసి
ఆ ఒడ్డు నుంచి అనుభవాల్ని ఆస్వాదించమంటావ్ .
ఈ దుఃఖాన్ని ఈదుకుంటూ
నీ జ్ఞాపకాల వైపు
నా పయనం కొనసాగుతుంది .
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
