కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు

పుస్తకాలమ్’ – 10

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు

          పురిపండా అప్పలస్వామి గారు అనువదించి సంకలనం చేసిన ఆరు సంపుటాల ‘విశ్వకథావీథి’ మొదటి సంపుటంలో బహుశా దాదాపు యాబై ఏళ్ల కింద మొదటిసారి ఫ్రెంచి రచయిత మపాసా కథ ‘సమాధి నుండి’ చదివాను. దానికి కాస్త ముందో వెనుకో వట్టికోట ఆళ్వారుస్వామిగారి దేశోద్ధారక గ్రంథమండలి పుస్తకాలలో రచయితల పరిచయం పేజీలో ఆయా రచయితల అభిమాన రచయితల జాబితాలో ఆ పేరు చాలసార్లే చూశాను. మానవ స్వభావపు వైచిత్రిని ఎత్తిపట్టిన ఆ ‘సమాధి నుండి’ కథ ఎన్ని దశాబ్దాలు గడిచినా మరచిపోలేనిది. తర్వాతి కాలంలో తెలుగులోకి వచ్చినవీ, ఇంగ్లిష్ లో ఉన్నవీ మపాసా కథలు కొన్ని చదివాను గాని ఆయన రాసిన ఆరు నవలల్లో ఏమన్నా తెలుగులోకి వచ్చాయేమో తెలియదు. బెల్లంకొండ రామదాసు గారు 1950ల చివరిలో మపాసా నవల Une Vie ని, బహుశా ఇంగ్లిష్ నుంచి తెలుగు చేసి, ‘కన్నీరు’ అనే పేరుతో ప్రచురించారని గతంలో విన్నాను. మొన్న నెల్లూరులో సభల దగ్గర ఒక పుస్తకాల దుకాణంలో ఆ పుస్తకపు పునర్ముద్రణ దొరికింది. ఆ నవల పేరును ఫ్రెంచిలో ఇన్ వీ అని పలకాలట – ఒక జీవితం అని అర్థం, కాని ఇంగ్లిష్ అనువాదం ‘ఎ వుమన్స్ లైఫ్’ అని చేసి ఆ దుఃఖభరితమైన జీవితానికి స్త్రీత్వం అద్దారు. తెలుగులో మరింత స్వేచ్ఛ తీసుకుని ‘కన్నీరు’ అన్నారు. (పురిపండా అప్పలస్వామి గారు కూడా స్వేచ్ఛ తీసుకుని The Dead Girl అనీ Was it a Dream? అనీ ఇంగ్లిష్ లోకి వచ్చిన కథను ‘సమాధి నుండి’ అని చేశారు). 

          హెన్రీ రెనీ ఆల్బర్ట్ గై డి మపాసా (1850-1893) పందొమ్మిదో శతాబ్ది ఫ్రెంచి సమాజంలో శిథిలమవుతున్న భూస్వామ్యానికీ, అప్పుడప్పుడే విస్తరిస్తున్న ఆధునికతకూ మధ్య సంధి దశలో సహజవాద, వాస్తవికతావాద రచయితగా ఎదిగాడు. గుస్తావ్ ఫ్లోబేర్ (1821-1880) శిష్యుడిగా, ఎమిలీ జోలా (1840-1902) వంటి నవలా రచయితల, ఎ సి స్విన్ బర్న్ (1837-1909) వంటి కవుల సమకాలికుడిగా మపాసా నలబై మూడేళ్ల జీవితంలో రచనా జీవితం పదిహేను సంవత్సరాల కన్నా తక్కువే. కాని ఆ స్వల్పకాలం లోనే మూడు వందల కథలు, ఆరు నవలలు, మూడు యాత్రాకథనాలు, ఒక కవితా సంపుటం ప్రచురించాడు. ఫ్లోబేర్ ద్వారా పరిచయమైన రష్యన్ మహా రచయిత ఇవాన్ తుర్గేనెవ్ (1818-1883), మపాసా రచనలను టాల్ స్టాయ్ (1828-1910) కి చేర్చాడు. మపాసా మరణించాక ఏడాదికి ఆయన రచనల రష్యన్ సంపుటానికి ఆయన రచనలను మొత్తంగా అంచనా వేస్తూ టాల్ స్టాయ్ అద్భుతమైన ముందుమాట రాశాడు.

ఆ వ్యాసంలో తనకు మొదట తుర్గేనెవ్ 1881లో మపాసా కథల సంపుటం ఇచ్చినప్పుడు తనకు వాటిలో ఒకటి రెండు కథల కన్నా ఎక్కువ నచ్చలేదని, ఆ మాట తుర్గేనెవ్ కి చెప్పి అసలు మపాసా గురించే మరిచిపోయాననీ, కాని ఇన్ వీ తన చేతికి వచ్చాక తన అభిప్రాయం మారిపోయిందనీ అన్నాడు టాల్ స్టాయ్. ఈ నవల తర్వాత మపాసా పేరుతో వచ్చిన ప్రతి రచనా చదివానన్నాడు. “ఇన్ వీ అద్భుతమైన నవల, మపాసా రాసినవాటిలోకెల్లా అనుపమానమైన ఉత్తమ నవల మాత్రమే కాదు, హ్యూగో రాసిన లె మిజరబ్లే తర్వాత అంత గొప్ప నవల. ఆయన ప్రజ్ఞకు ఉన్న అసాధారణమైన శక్తితో పాటు, ఒక వస్తువు మీద ఆయన చూపిన ప్రత్యేకమైన, కష్టతరమైన కేంద్రీకరణ, దాని ఫలితంగా తాను వర్ణిస్తున్న జీవితంలో సంపూర్ణంగా కొత్తవైన విషయాలను చూడగలగడం, అన్నీ కలగలిసి ఈ నవల ఒక కళాత్మక సృజనకు ముఖ్యమైన మూడు లక్షణాలనూ దాదాపు సమాన స్థాయిలో సమ్మిళితం చేసింది. ఆ మూడు లక్షణాలు,

1. తాను రాస్తున్న విషయంతో రచయితకు సరైన, అంటే నైతికమైన, సంబంధం ఉండడం.

2. శిల్ప సౌందర్యం.

3. నిజాయితీ, అంటే తాను వర్ణిస్తున్న విషయం పట్ల రచయితకు ఉన్న ప్రేమ” అని మహా రచయిత, తాత్వికుడు లెవ్ టాల్ స్టాయ్ ప్రశంసించిన నవల ఇది.

          నూటనలబై ఏళ్ల తర్వాత చదువుతున్నప్పుడు, ఈ నవల సాధారణమైనదనీ, వస్తువు లోనూ శిల్పం లోనూ పెద్ద తళుకుబెళుకులు లేనిదనీ అనిపించవచ్చు. లేదా కాలం చెరిపెయ్యలేని అద్భుతాలు ఈ నవలా రచనలో ఇంకా మిగిలి ఉన్నాయనీ, ఈ నవల స్థల కాలావధులను అధిగమించిందనీ అనిపించవచ్చు. ఒక మహారచయిత తొలి నవలగా, ఒక సంఘర్షణామయ కాలపు సామాజిక చలనాలను, ఉన్నత, ప్రభువర్గాల వ్యక్తుల జీవితాల ద్వారానైనా పట్టుకున్న నవలగా, మానవ స్వభావపు వైవిధ్యాన్నీ, వైచిత్రినీ, రాగద్వేషాల, మంచి చెడుల, హేతురహిత హేతుబద్ధ భావాల ఏకకాల సమ్మేళనాన్నీ అద్భుతంగా వివరించిన నవలగా, పందొమ్మిదో శతాబ్ది ఫ్రెంచి గ్రామసీమల, పట్టణాల, సముద్ర తీరాల నిసర్గ సౌందర్యాన్ని చిత్రపటాల్లో లాగ రూపుకట్టిన నవలగా ‘కన్నీరు’కు అనేక ప్రత్యేకతలున్నాయి.

          “ఇది అంతులేని వేదనల దృశ్యం” అని వర్ణించిన అమెరికన్-బ్రిటిష్ సాహిత్య విమర్శకుడు, నవలా రచయిత హెన్రీ జేమ్స్ (1843-1916) ఈ నవలలో కథాంశం అంటూ ఏమీ లేదని కొట్టి పారేశాడట. “రాజు చనిపోయాడు, తర్వాత రాణి చనిపోయింది” అన్నది కథ అవుతుందని, “రాజు చనిపోయాడు, గుండె పగిలి ఆ తర్వాత రాణి చనిపోయింది” అన్నది కథాంశం అవుతుంది అని ఇంగ్లిష్ నవలా రచయిత, సాహిత్య విమర్శకుడు ఇ ఎం ఫార్ స్టర్ (1879-1970) అన్న మాటను తోడు తెచ్చుకుని మపాసా మొదటి నవలను విమర్శించినవారున్నారు.

          అలా చూస్తే ‘కన్నీరు’ కథాంశం చెప్పుకోదగినదేమీ కాదు, అసలు లేదేమో కూడా. ఒక యువతి పందొమ్మిదేళ్ల దగ్గర ప్రారంభించి నలభయ్యో పడి మధ్య దాకా సాగిన అంతులేని కష్టాల అనంత గాథ అది. ఆ గాథ కూడా కేవలం కాలక్రమంలో చెప్పినదే. ఆసక్తిదాయకమైన మలుపులు కల్పించినదేమీ కాదు. మహారచయితగా ఎదగనున్న ఒక యువకుడు తన ఇరవై ఏడో ఏట ప్రారంభించి, నలభయో ఏట పూర్తి చేసిన తొలి నవలగా దీని పరిమితులను అర్థం చేసుకోవాలి. ఆ పరిమితుల లోపలే అది సాధించ గలిగిన అసాధారణత్వాన్ని పసిగట్టగలగాలి.

          నవయవ్వనంలో అప్పుడే కాన్వెంట్ చదువు ముగించుకుని కోటి కలలతో, ఆశలతో జీవితంలో ప్రవేశించిన ఒక యువతి జీన్ కథ ఇది. తండ్రి ప్రభువర్గీయుడు, పెద్ద భూస్వామి. దాతృత్వంతో తన ఆస్తి పోగొట్టుకుంటున్నవాడు. తల్లి అనారోగ్య పీడితురాలు. జీన్ కు తల్లిదండ్రుల పట్లా, తల్లిదండ్రులకు జీన్ పట్లా అపారమైన ప్రేమ. అనుకోకుండా కలిసిన పొరుగు భూస్వామి జూలియన్ పట్ల ఆకర్షితురాలై ప్రేమలో పడుతుంది జీన్. త్వరలోనే పెళ్లి కూడా అవుతుంది. కాని పెళ్లి అయిన మరుక్షణం నుంచే జూలియన్ అవలక్షణాలు తెలిసిరావడం మొదలవుతుంది. తన కుటుంబంలో అలవాటయిన దాతృత్వం లేదు సరిగదా మితిమీరిన పిసినారితనం, కాఠిన్యం, లోభత్వం. జీన్ ఆస్తి మీద బలవంతంగా పెత్తనం ఆక్రమించడం. పెళ్లికి ముందు, యవ్వనంలో కన్న కలలన్నీ కొద్ది నెలల్లోనే ఒకటొకటిగా కూలిపోవడం మొదలవుతుంది. ఈలోగా జీన్ సేవకురాలిగా వచ్చిన రోసలీ గర్భవతి అని తెలిసి, ప్రసవం కూడా అవుతుంది. తండ్రి ఎవరని ఎంత అడిగినా చెప్పదు. ఆ దుర్మార్గుడెవరో చూసి పెళ్లి చేద్దామని జీన్ జూలియన్ వెంటబడితే ఆ మాటలకే జూలియన్ కు కోపం వస్తుంది. ఒక చలిరాత్రి ఏదో తెలియని భయంతో రోసలీని లేపుదామని ఆమె గదికి వెళ్లి, ఆమె కనబడక, భర్త గదిలోకి వెళితే అక్కడ జీన్ కు కనబడినది గుండెలు పగలదీసిన దృశ్యం. ఆ దుర్మార్గుడైన, భోగలాలసుడైన భూస్వామి ఎప్పటి నుంచో తన సేవకురాలిపై అత్యాచారం చేస్తున్నాడనీ, అనాథ శిశువుకు తండ్రి అతడేననీ తెలిసిపోతుంది. రోసలీని మరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపడానికి, పరిహారంగా వారికి కొంత భూమి ఇవ్వడానికి తండ్రి, మతగురువు నిర్ణయిస్తే జూలియన్ దానికీ అడ్డు చెపుతాడు. పదిహేను వందల ఫ్రాంకులు పారేసి వదుల్చుకునేదానికి ఇరవైవేల ఫ్రాంకుల ఆదాయం వచ్చే భూమి ఇవ్వడమేమిటంటాడు. ఈలోగా జీన్ కు కొడుకు. తండ్రిలా అవుతాడేమో అని భయపడినా, ప్రసవం తర్వాత పుత్రప్రేమలో తన కష్టాలన్నిటినీ మైమరిచిపోతుంది జీన్. అప్పుడే పొరుగు యువ భూస్వామ్య దంపతులతో స్నేహమై, జూలియన్ ఆ యువతితో సంబంధాలు మొదలుపెడతాడు. ఆ సంగతి తెలిసిన ఆ యువతి భర్త వారిద్దరూ కొండకొమ్మున గుడిసెలో ఉన్న సందర్భం చూసి ఆ గుడిసెను అక్కడి నుంచి సముద్రంలోకి తోసేసి ఆ ఇద్దరినీ చంపేస్తాడు. జీన్ తల్లి చనిపోతుంది. తండ్రీ చనిపోతాడు. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు వ్యసనపరుడై, ఎప్పటికప్పుడు డబ్బు కోసం తల్లిని పీడిస్తుంటాడు. ఈ మధ్యలో మత భావాలకూ హేతుబద్ధతకూ మధ్య చర్చ. రోసలీ తిరిగివచ్చి యజమానురాలిని ఆదుకుని, ఆమె వ్యవహారాలు చక్కదిద్ది, పాత భవనం అమ్మించి, అప్పులన్నీ తీర్చి, మరొక గ్రామంలో చిన్న ఇల్లు రూపొందించి ఒక రకమైన ప్రశాంతత చేకూరుస్తుంది. కొడుకు నుంచి మళ్లీ డబ్బుల కోసం వేధింపు. చివరికి ఆ కొడుకుకు పుట్టిన పసికందును వదిలి తల్లి పురిట్లోనే చనిపోతుంది. జీన్ తన మనవరాలిని, ఆ పసికందును తీసుకొచ్చుకుని గుండెలకు అదుముకుని ఒకానొక చిరు సంతోషాన్ని అనుభవిస్తుండగా నవల ముగుస్తుంది. “చూడూ, జీవితం మనం అనుకున్నంత మంచిదీ కాదు, చెడ్డదీ కాదు” అని రోసలీ జీవిత సత్యాన్ని వివరిస్తుంది.

          అత్యంత సున్నితమైన, శబలమైన, ఉత్సాహభరితమైన ఒక హృదయం ఎన్నిసార్లు పగలడానికి అవకాశం ఉంది? ఎన్నిసార్లు పగిలి, ఎన్నిసార్లు అతుక్కుని, మళ్లీ ఎన్నిసార్లు పగలడానికి సిద్ధమయ్యే అనంత యాత్ర జీవితమంటే? కష్టం మీద కష్టం మీద కష్టం తోసుకొచ్చినా, బతుకు కన్నీటి వరదలో గడ్డిపోచలా కొట్టుకుపోతున్నా ఎప్పటికప్పుడు ఆ గడ్డిపోచకు ఏదో ఆధారం అందించే అపురూప జీవితాకాంక్ష చెక్కుచెదరదనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరనివ్వగూడదనీ ఒక శాశ్వత అద్భుత జీవన సత్యాన్ని ఈ నవల నాకు మరొకసారి నేర్పింది.

*****
Please follow and like us:

One thought on “పుస్తకాలమ్ – 10 కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు”

  1. మీరు సంక్షిప్తంగా చాలా చక్కగా సమీక్షించారు అభినందనలు

Leave a Reply to Akkinapalliraghu41@gmaildoctcom Cancel reply

Your email address will not be published.