దేశ బాంధవి, “దువ్వూరి సుబ్బమ్మ”

-యామిజాల శర్వాణి

          మనదేశానికి స్వాతంత్య్రము అనేక త్యాగమూర్తుల ఫలితము. ఎంత మందో వారి ఆస్తులను సంసారాలను వదలి జైళ్లలో మగ్గి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని అమరు లైనారు నేటి తరానికి అటు వంటి త్యాగధనుల పేర్లు చాలా మటుకు తెలియదు. స్వాతంత్య్ర పోరాటనికి నాయకత్వము వహించిన గాంధీ, నెహ్రు లాంటి నాయకుల పేర్లు చరిత్ర పాఠాల్లో ఉండటం వల్ల తెలుస్తున్నాయి. కానీ, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధుల పేర్లు చరిత్ర పుటల్లో కలిసిపోయి సరి అయిన గుర్తింపు లేకుండా ఏ విధమైన స్మారక చిహ్నాలు లేకుండ కాలగర్భములో కలిసిపోయినాయి  అటువంటి మహానుభావుల పేర్లను స్వాతంత్య్రము వచ్చి 75 సంవత్సరాలు అయిన  సందర్భముగా గుర్తు చేసుకోవటం వీలయితే వారి గురించి తెలుసుకోవటం మన కర్తవ్యము. అటువంటి వారిలో మన తెలుగునాట స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారిలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు, బులుసు సాంబమూర్తి గారు దువ్వూరి సుబ్బమ్మ లాంటి వారు ముఖ్యులు. వీరి పేర్లు నేటి తరానికి తెలియనివి ప్రస్తుతము దువ్వూరి సుబ్బమ్మగారి గురించి తెలుసు కుందాము. 

          గాంధీ గారి పిలుపుతో మేలుకొని సమాజములో వివిధ వర్గాల వారు స్పందించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అటువంటి వారిలో శ్రోత్రీయ కుటుంబానికి చెందిన ఒక వితంతువు తొలిసారిగా ఆంధ్ర దేశములో స్వాతంత్య్ర సంగ్రామములో పాల్గొని అధికార వర్గములో కలకలం లేపిన మహిళ దువ్వూరి సుబ్బమ్మగారు ఈవిడ స్వాతంత్రోద్యమములో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ. అంతే కాకుండా సమాజ సేవకు, స్త్రీ జనోద్ధరణకు విశేషముగా కృషి చేసిన మహిళ కూడ. సుబ్బమ్మ గారు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలము లోని పంచారామములలో ఒకటైన ద్రాక్షారామములో 1880వ సంవత్సరము నవంబరు నెలలో మధ్య తరగతి వైదిక బ్రాహ్మణ  కుటుంబములో మల్లాది సుబ్బావధాని దంపతులకు జన్మించారు. దురదృష్టవశాత్తు ఆనాటి పద్దతుల ప్రకారము బాల్యము లోనే కడియం గ్రామానికి చెందిన దువ్వూరి వెంకటప్పయ్య గారితో వివాహము జరిగింది. కానీ, భర్త మరణించటంతో బాల వితంతువు అయ్యింది. అప్పటికి పెద్దగా చదువుకోలేదు కానీ సమీప బంధువు అయిన చల్లపల్లి వెంకట శాస్త్రి గారు అనే పండితుడు ఆవిడకు సంస్కృతాంధ్ర భాషలలో చక్కటి శిక్షణ ఇచ్చారు. 

          స్వాతంత్రోద్యమము వైపు ఆకర్షితురాలైన సుబ్బమ్మగారు 1921లో కాకినాడలో టంగుటూరి ప్రకాశముగారి అధ్యక్షతన జరిగిన రాజకీయ సమావేశములో పాల్గొని సంపూర్ణ స్వాతంత్య్రమే లక్ష్యము అన్న బులుసు సాంబమూర్తి గారి తీర్మానాన్ని బలపరుస్తూ అనర్గళముగా మాట్లాడి చాలా మంది నాయకుల దృష్టిని ఆకర్షించింది. గంభీరమైన స్వరముతో మైకుల అవసరము లేకుండా బిగ్గరగా మాట్లాడేది. ఈమె  దేశభక్తి పాటలు పాడుతూ ఉంటె ప్రజలకు వినిపించ కూడదని పోలీసులు డప్పులు డబ్బాలు మోగించేవారు. తరువాతి కాంగ్రెస్ సభలలో భారత, భాగవతాల నుండి సందర్భాను సారంగా పద్యాలనూ శ్రావ్య కంఠముతో పాడుతూ ప్రజలకు ఏంతో స్ఫూర్తిని , దేశభక్తిని ప్రేరేపించే వారు. ఈవిడ ఉపన్యాసాలు పాటలు వినడానికి ఆ రోజుల్లో దూరప్రాంతాల నుండి కూడ ప్రజలు వచ్చేవారు. ఆ సభలలో చిలకమర్తి వారి పద్యము,”భరత ఖండంబు చక్కని పాడి యావు” అనే పద్యాన్ని రాగయుక్తముగా పాడుతూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ శ్రోతలను మంత్ర ముగ్దులను చేసేది  సుబ్బమ్మగారు. అలాగే గరిమెళ్ళ వారి ,”మాకొద్దీ తెల్ల దొరతనం”, అనే పాటను పాడుతూ ఉంటె విన్న ప్రజలు ఉద్రేక పూరితులయ్యేవారు ఇదంతా గమనిస్తున్న తెల్లవారికి కంటగింపుగా ఉండేది. 

          ఈమె 1922వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. అంతే కాకుండా ఈమె ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొంది. 1922 ఏప్రిల్  4 న అరెస్టు చేసి జామీను కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్  జైలుకు పంపారు. ఆ  సందర్భములో జిల్లా కలెక్టర్ స్వయముగా వచ్చి ఈమెను  వ్రాత పూర్వకముగా కాకపోయినా నోటి మాటగా క్షమాపణ చెబితే విడిచి పెడతామనప్పుడు “నా కాలి గోరు కూడా అలా చేయదు” అని నిస్సంకోచంగా చెప్పిన  ధైర్యవంతురాలు సుబ్బమ్మగారు.  ఒకసారి పెద్దాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మ గారు అనే మరో స్వాతంత్య్ర సమర యోధురాలు, సుబ్బమ్మ గారి అభిమానురాలు, మరియు మరో 15 మంది  వన భోజనాల పేరుతో ఒక రాజకీయ సభ ఏర్పాటు చేశారు. అందులో సుబమ్మ గారు పాల్గొటుంటున్నట్లు బ్రిటిష్ అధికారులకు తెలిసి  అక్కడ దాడి చేశారు. అందరి చేతుల్లో తినుబండారాలు ఉన్నాయి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.  దీనికి సుబమ్మ ఆగ్రహించి వారిపై విరుచుకుపడింది.  ఆమె ధైర్యానికి చూసి మిగిలిన వారు ధైర్యం తెచ్చుకొని బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు. పోలీసులు కూడ వెనక్కి తగ్గి వెళ్లిపోయారు.   

          సుబ్బమ్మ మహాత్మా గాంధీ ఆదేశాలపై ఖద్దరు కట్టింది. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పింది, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. 1923 లో కాకినాడలో  జరిగిన కాంగ్రెస్ మహాసభలలో బులుసు సాంబమూర్తి గారు ఆవిడను ,”దేశ బాంధవి” బిరుదుతో సత్కరించారు.  రాజమండ్రిలో సనాతన స్త్రీ విద్యాలయం అనే బాలికల పాఠశాలను స్థాపించింది. 1930 లో ఉప్పు సత్యాగ్రహములో పాల్గొన్నందుకు వెల్లూరు జైలులో 6 నెలలు గడిపింది జైల్లో తన పాటలతో పద్యాలతో తోటి ఖైదీలను ఉత్తేజపర్చేది. క్విట్ ఇండియా ఉద్యమములో పాల్గొన్నందుకు కూడ జైలుకు వెళ్ళింది గాంధీ గారు ఆమె సాహసాన్ని పలుమార్లు ప్రశంసించేవారు   స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఈమె అందరికి మిఠాయిలు పంచింది. ఏనాడు ఏ పదవులు ఆశించలేదు  ఈమె 16 సంవత్సరాల పాటు ఏ.ఐ.సి.సి. సభ్యురాలిగా ఉన్నారు..జవహర్ లాల్ నెహ్రూ మే 27,1964లో మరణించాక మరణవార్త విని ఈమె ఔషధ సేవనం మాని  1964వ సంవత్సరం మే 31న ఈమె పరమపదించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.