రాగో

భాగం-27

– సాధన 

          ఊరివాళ్ళే పొల్లు పోకుండా కరువు దాడిని వర్ణిస్తూ పోటీపడుతూ దళంతో చెప్పు తున్నారు. ఆ ఊరి మహిళా సంఘం ముఖ్యులను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని గిరిజ ఆ విషయాన్ని ప్రస్తావించింది.

          అంతే!

          దల్సు – ఆ ఊరి శేడో (పెళ్ళి అయిన స్త్రీ)ల్లో నుండి తన మరదల్ని, సుశీల్ని, మరొకర్ని సూచించాడు.

          అక్కడ కూచున్న వారందరు సంతోషంగా ‘ఇంగో” అన్నారు.

          ఇది జరుగుతున్నంత సేపు ఇల్లంతా తల్లితో కలసి కలియ తిరిగి వచ్చిన జైనికి పంజరంలో రాగో లేకపోయేసరికి అనుమానం వచ్చింది. తల్లిని వాకబు చేసింది.

          “నువు పోయిన తెల్లారే దాన్ని ఒదిలిండు” అన్న తల్లి జవాబుతో జైనికి తండ్రి బాధ అర్థమై గుండెలవిసిపోయాయి.

          మీటింగ్ దగ్గరికి వచ్చిన జైనిని చూస్తునే సుశీల ఆప్యాయంగా మట్టలు ముద్దు పెట్టు కుంది.

          “బాగున్నావే” – సుశీల.

          “ఇంగో” – జైని.

          “పెళ్ళి అయిందా?” – సుశీల.

          పగలబడి నవ్వి ఊరుకుంది జైని.

          “పోదామా జైని! మనతో వచ్చిన అక్కలు ఇక్కడే ఉంటారు. రేపు దల్సు దాద వారికి తోడిచ్చి ఊరిదాక దిగబెడుతారు” అంది గిరిజ.

          “ఇంగో” – అంటూనే దళం బయల్దేరింది.

          పున్నమి చంద్రుని వెన్నెల్లో ఇంటి నుండి, తల్లి-తండ్రి నుండి, ఊరి నుండి సెలవు తీసుకొన్న జైని ఠీవిగా ముందు నడుస్తుంది.

          తోకాడిస్తూనే ఇంటి కుక్క జైనిని ఊరి పొలిమేరలు దాటించింది.

14

          వాగులో చువ్వ (చెలిమె) తవ్వి డబ్బాలో నీళ్ళు నింపి గడ్డకెక్కుతున్న కర్పనికి దూరం నుండి వస్తున్న జైని కంటపడగానే “లాల్ సలాం అక్కలూ” అని అక్కడి నుండే ఓ పొలికేక పెట్టాడు.

          “లాల్ సలాం” అంటూ అటు నుండి నాలుగు స్త్రీ కంఠాలు ఒకేసారి నినదించాయి.

          మొహాలు కుడుగుతున్న రుషి, గాండోలు తొందర తొందరగా ముగించి పైకెక్కారు. ఉల్లే, టుగ్గిలు తెస్తున్న కట్టెలు దబ్బున కింద పడేసి “లాల్ సలాం అక్కా!” అంటూ పిడికిళ్ళెత్తి గట్టిగా అరిచారు.

          బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటున్నట్టున్న ఉదయం వాతావరణం ఒక్కసారిగా సందడితో కిలకిలలాడింది.

          అక్కలూ, అన్నలూ అందరూ చేతులు కలిపి లాల్ సలాంలు చెప్పుకున్నారు.

          “ఆఁ ఆఁ కిట్లు దించుకోండి, కేంపెయిన్ ఎలా ఉంది. అంతా లావెక్కినట్టున్నారు కదా” అంటూ రుషి యోగక్షేమాల్లోకి దిగాడు.

          మొహాలు కడిగేవారు కడుగుతూ ఉంటే కర్ప, డుంగాలు టీ తయారు చేస్తున్నారు. ఈలోగా రుషి, గాండో, గిరిజ, జైనిలతో ఓ పక్కగా ముచ్చట్లు పెడుతూ కేంపెయిన్ వార్తలు తెలుసుకొంటూ కబుర్లు చెబుతున్నాడు.

          అందరూ టీ తాగడం పూర్తికాగానే దళం సమావేశం అయింది. రుషి గొంతు సవరించుకొని “కామ్రేడ్స్! ముందు అర్జంటు విషయాలు మాట్లాడుకుందాం” అనే సరికి అక్కడ సీరియస్ వాతావరణం నెలకొంది.

          “మన డివిసి వారు అర్జంటుగా రమ్మని కబురు చేస్తే, అక్కలు అటు కేంపెయిన్ కి వెళ్ళిన తర్వాత మేం ఆ కాంటాక్టుకు పోయి వచ్చాం. అక్కల కేంపెయిన్ జయప్రదంగానే జరిగింది. ఆ వివరాలు తర్వాత తెలుసుకుందాం. ముందుగా మన డివిసి వార్తలు మాట్లాడుకుందాం” అంటూ రుషి జేబులో నుండి డైరీ తీసి ముందు పెట్టుకొని మళ్ళీ ప్రారంభించాడు.

          “ముఖ్యంగా మన డివిజన్ లో ఈ మధ్య పెరుగుతున్న నిర్బంధం గురించి మాట్లాడడానికే పిలిపించింది, డివిసి. పోలీసులు తిరగడం ఎక్కువైందనీ, వర్షాకాలం మొదలయినా ఈసారి నిర్బంధంలో సడలింపు ఏమీ లేదనీ మనందరికీ తెలుసు.

          పోలీసులు తిరిగే పద్ధతుల్లో మార్పు వచ్చింది. అడవి అంతా కూంబింగ్ చేస్తున్నారు. పిచ్చిగా ఫైరింగ్లు చేస్తున్నారు. జనాలను ఫైరింగుల్లో కాల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఆంధ్ర పద్దతులన్నీ అమలు చేసి అన్నల అడ్రస్ లేకుండా చేస్తామంటున్నారు. మన జిల్లా, రేంజి ప్రజా సంఘాల నాయకులు ఎవరు ఇళ్ళలో ఉంటలేరు. మన మహిళా నాయకుల కోసం కూడ వాడు తిరుగుతున్నాడు. మనం ఈ మధ్య ప్రవేశ పెట్టిన మహిళా ఆర్గనైజర్లు – ఎకెఎస్ఎస్ ఆర్గనైజర్లు వాడికి ఏక్సపోజ్ అయ్యారు. వారు దొరికినా చంపాలనేది వాడి ప్లాను. టెర్రర్ సృష్టించడానికి వాడు చేసే కుట్రలన్నీ చేస్తున్నాడు. ఆయుధాలు, వాహనాలు, వైర్ లెస్ సెట్లు విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నాడు. సివిల్ దుస్తుల్లో తిరగడం పెరిగి పోయింది. అనేక సందర్భాల్లో మన దళాలు తృటిలో తప్పుకున్నాయి. మన కొరియరింగ్ వ్యవస్థను దెబ్బ తీయాలన్నది వాడి ప్లాను. మన డంపుల కోసం వాడి గాలింపు మరింత తీవ్రమౌతుంది. ప్రజల్లో పెద్ద భయ సంచలనాన్ని సృష్టించి మన ఉనికి లేకుండా చేయాలనుకుంటున్న వాడి కుట్రలను ఓడించాలి. మన తాహత్తు కూడ వాడికి చూపించాలి. ఎక్కడో దగ్గర వాడికి బ్రేక్ వేయక తప్పదు. ప్రజల నుండి కూడ ఈ డిమాండ్ వస్తుంది. ప్రధానంగా ఈ మధ్య ట్రైబ్స్ నుండి రిక్రూట్ అయినవారు పోలీస్ టీంలను లీడ్ చేయడం దురదృష్టం. అయితే వాళ్ళు మాడియా అన్న ఫీలింగ్, సానుభూతి జనాల్లో ఎక్కడా లేదు. మన క్యాంపులో కూడ పోలీసులకు గట్టి బుద్ధి చెప్పాలని మొత్తం కామ్రేడ్లో ఉంది. మనకు ఆయుధాల అవసరమూ ఉంది”.

          రుషి మధ్యలో ఆగేసరికి “మీటింగ్ ఆలస్యం అవుతుందేమో వంట డ్యూటీ చెప్పుతారా కామ్రేడ్స్” అని మధ్యలో కలిగించుకుంది జైని.

          “అవుసరం లేదు జైనక్కా! మేం దారిలో చెప్పే వచ్చాం. అన్నం వస్తుంటుంది” అన్నాడు గాండో.

          రుషి మళ్ళీ ప్రారంభించాడు.

          “కామ్రేడ్స్,

          విన్నారు కదా! మొత్తం డివిజన్ పరిస్థితిని డివిసి సీరియస్ గా ఆలోచించింది. ప్రతి ఏరియాలోనూ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఇచ్చారు. మనకీసారి ఓ అంబూష్ అప్ప చెప్పారు. కనీసం కొన్ని ఆయుధాలైనా పట్టుకోవాలి. టైం కూడ ఎక్కువ లేదు. మీరేమంటారు?” అని ఆపాడు.

          డుంగ, కర్పలు చటుక్కున లేచి మోకాళ్ళ పై కూచున్నారు. టుగ్గి విజిల్ వేశాడు. సీదో, మిన్కోలు ఒకేసారి “ఇక చేసుడే మళ్ళీ అభిప్రాయం లేదు” అని లేచి కూచున్నరు.

          రుషి నవ్వుతూ “కూచోండి కామ్రేడ్స్! కాసేపాగండి. ఇంకా మాట్లాడేది ఉంది కదా” – అన్నాడు.

          “మన డివిజన్లో కూడా షురూ చేసుడన్నట్టే ఇగ” అన్నాడు ఫకీర.

          “నిజమే కామ్రేడ్స్. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్క అంబూష్ ప్లాను చేసుకున్నామంటే ఇక వరుసగా దాడులే చేస్తూ ఉంటామనీ, సర్కార్ మీద మన అఫెన్స్ ప్రారంభమైందనీ అనుకోకూడదు. అలాంటి అవగాహనతో పోతే తప్పులు చేసి దెబ్బతింటాం. మనం చేసేది ఇప్పటికీ ఆత్మరక్షణ యుద్ధమే. మన బలం పెరగక ముందే మనల్ని నాశనం చేయాలని విరుచుకుపడే శత్రువుకి ఆ చొరవ మిగలనివ్వకుండా దెబ్బ తీయడానికి, వాన్ని చెక్ చేయడానికి, అంటే మన ఆత్మరక్షణ కోసమే ఇవన్నీ చేస్తాం. ఆ దృష్టితోనే మనం ఈ యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఇందులో మనం ఏ మాత్రం నష్ట పోకూడదు. శత్రువు చొరవను దెబ్బతీయడం, కనీసం కొన్ని ఆయుధాలు సంపాదించు కోవడం ఈ దాడి లక్ష్యం. అందులో మనం పూర్తిగా విజయం సాధించాలి. అలా చిన్న చిన్న విజయాలు ఖచ్చితంగా సాధిస్తూ పోతే క్రమంగా మన బలం పెరిగి శత్రువును దెబ్బతీసి ఓడించే స్థితికి మనం పెరుగుతాం. ఇది ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి” అని రుషి వివరించాడు.

          అందరూ ఒక్కసారే “అలాగే చేద్దాం – చేద్దాం” అన్నారు.

          “కామ్రేడ్ – నీవు వివరాలు చెప్పు” అంటూ గాండో వైపు తిరిగాడు రుషి.

          కామ్రేడ్స్,

          అపాయింట్ మెంటు నుండి తిరిగి వస్తూ మేము స్థలం చూసి కొంత సర్వే కూడ చేసి వచ్చాం. అక్కడికి వెళ్ళాక ప్లాను వివరాలు మాట్లాడుకుందాం. అక్కడ పెట్రోలింగ్ రెగ్యులర్ గా ఉంది. భోజనం చేయగానే బయల్దేరి డుంగ, ఉల్డేలు, జెలిటిన్, ఎక్స్ప్లోడర్స్ తేవాలి. కర్ప, ఫకీరలు వెళ్ళి మన సంఘం దాదాలను కొందరిని తెస్తారు. డెన్ సామానులు, గంజులు కూడ తేవాలి. మిగతా వాళ్ళు పగటికి బయల్దేరి ఆ స్థలానికి పోదాం. సామానులు, మనుషులు వచ్చాక మళ్ళీ కూచొని ప్లాను మాట్లాడుకుందాం” అని వివరిస్తుండగా అన్నం గంజులతో ఊరి దాదాలు వచ్చారు.

          “తిండి తిని తొందరగా తయారవుదాం. మరి లేద్దామా” అన్నాడు రుషి.

          అందరూ ఉత్సాహంగా భోజనాలపై బడ్డారు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.