కథా మధురం 

కె.కె.భాగ్యశ్రీ

‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత’ అని చెప్పిన
కథ..అనుసరణీయం !

 -ఆర్.దమయంతి

***

          ‘వివాహానంతరం అమ్మాయికి అత్తమామల బాధ్యత వున్నట్టే అబ్బాయికి కూడా ఆ నైతిక బాధ్యత తప్పనిసరి, అని మరవకూడదు. ఇది చట్టంగా రూపు దిద్దుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.’

***

          ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ చదువుకుని, ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నవారే! అయినా అమ్మాయి పెళ్ళయ్యాక, అత్త వారింటికెళ్తుంది. ఇంటి పేరు మార్చుకుంటుంది. అత్తగారి, మామగారిని గౌరవిస్తుంది.  మరుదులు, ఆడపడుచులను తన తోబుట్టువులన్నట్టు ఆదరిస్తుంది. అంతా బాగానే వుంది. కానీ తన తల్లితండ్రులకు తాను ఒక్కర్తే అయినప్పుడు, వృద్ధాప్యంలో వారి బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. భర్త అంగీకారం కోసం దీనంగా అతని వైపు చూస్తుంటుంది. అతను సరే అని తలూపడం కోసం!

          ఇది అంత పెద్ద సమస్యా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ అవును. ఈ కాలానికీ ఇది పెద్ద సవాల్ గానే మిగిలింది. పరిష్కారం దొరకని సమస్యగానే పేరుకుపోయి వుంది’ అని నొక్కాణిస్తూ వినిపించే కథారావం – శ్రీమతి కె.కె.భాగ్యశ్రీ రాసిన ‘అనుసరణీయం ‘!

***

అసలు కథేమిటంటే :

          సహజ – చిన్నతనంలోనే తల్లి తండ్రుల్ని కోల్పోతుంది. అప్పట్నించి తానే అన్ని అయి పెంచుతుంది నాయనమ్మ. చెట్టంత కొడుకు, కోడలు మరణించిన దుఃఖం నిలువునా ముంచేస్తున్నా, మనవరాలి కోసం గుండె  రాయి చేసుకుని బ్రతుకుతుంది. అందుకే సహజకి నాయనమ్మ అంటే ప్రాణం. భవిష్యత్తులో ఆవిడ బాధ్యత తన మీద వుంటుందని ప్రేమించిన ప్రణయ్ కి  పెళ్ళికి ముందే చెబుతుంది. అప్పుడు సరే అన్న వాడు కాస్తా, పెళ్ళయ్యాక  సరే అనలేకపోవడం సహజకి మింగుడుపడని సమస్యగా మారుతుంది.

          ‘ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం ఏమిటి?’ అనే విచారంలో మునిగిపోతుంది.

          అంతలో ఆ ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన దీప్తి చెప్పిన వాస్తవాలతో ప్రణవ్ కళ్ళు తెరిపిన పడతాయి.

          అతని గ్రీన్ సిగ్నల్ కోసం..సహజ ఆశగా అతని వైపు చూస్తుంటుంది.

సంక్షిప్తంగా ఇదీ కథ.

          ఐతే..అందరినీ విస్మయపరిచే లా దీప్తి చెప్పిన సంగతులేమిటో తెలుసుకోవాలంటే శ్రీమతి కె.కె. భాగ్యశ్రీ గారు రాసిన  ఈ కథ ‘అనుసరణీయం ‘ చదివి తెలుసుకోవాలి.

***

కథలోని స్త్రీల పాత్రలు – స్వరూప స్వభావాలు :

          ముందుగా – సహజమైన స్త్రీ మనోభావాలను ప్రతిబింబించే పాత్రలో ఒదిగిన సహజని పరిశీలించి చూద్దాం.

          మగాని మాటలు గాలిలో మూటలని తెలీని సహజకి, తెలిసాక విల విల్లాడే సహజకి మధ్య జరిగిన ఘర్షణా సంఘర్షణలకి ప్రతిరూపం ఈ పాత్ర.

          ఒకే ఆడపిల్ల సంతానంగా గల తల్లితండ్రులు – వృద్ధాప్య దశలో ఎక్కడుండాలనే పెద్ద ప్రశ్నకి చాలెంజ్ లా, సరైన జవాబులా  నిలుస్తుంది ఈ కూతురు.

          మగాణ్ణి నమ్మడంలో ఆడవాళ్ళు ఉత్తి అమాయకులనుకుంటే పొరబాటు. అతని పై గట్టి నమ్మకం, విశ్వాసం ఎందుకు కలుగుతుందంటే..స్వచ్ఛంగా ప్రేమించడం వల్ల! కొండంత అనురాగాన్ని హృదయాన నిలిపి వుంచడం వల్ల. దేవునిలా ఆరాధించుకోవడం వల్ల.

          తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత గల వ్యక్తి ఎవరూ అంటే ‘ ఇతను..’ అని రూఢీ చేసుకోవడం వల్ల.

          పెళ్ళంటే నూరేళ్ళ పంట! అనుక్షణం శాంతియుత జీవనానికి ఒకే ఒక్క సూత్రం. భర్త ఒక్కడే సత్యం..అని మనసా వాచా నమ్మి, అనుసరించడం వల్ల.

          కానీ, ఆమె మనో భావాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా..నిమిత్తం లేకుండా తన విపరీత ధోరణితో, వికారపు మాటలతో చేష్టలతో మెట్టు మెట్టుగా తన మనసులోంచి అతను దిగిపోతున్నప్పుడు ఆ భార్య పడే మానసిక హింస ఎంత ఘోరంగా వుంటుందీ అంటే..తన మీద తనకు కలిగే భరించలేని జాలి కలిగి, పెద్ద పెట్టున ఏడ్వాలనిపించేంత నిరాశ నిస్పృహలకి లోనవుతుంది.

          చివరికి ఎలాటి నిర్ణయానికి చేరుకుంటుందీ అంటే -‘ ఇక ఇతనితో కలిసి బ్రతకడం కష్టం. ఇంతటితో ఆపేద్దాం.’ అనే ముగింపుకి, కంక్లూజన్ కి వచ్చేంత!

          అదే జరిగినప్పుడు ఏమౌతుందంటే – సమాజానికి ఆమె తీసుకున్న నిర్ణయమే కనిపిస్తుంది..తప్ప ఆమె ఆ చివరి క్షణం వరకు పడ్డ సంఘర్షణ అర్ధం కాదు. ఈ లోకం తేలికగా ఒకే ఒక్క స్టేట్మెంట్ విసిరేస్తుంది. మొగుణ్ణి వదిలేసిందని. కొందరు, ‘ఈ మాత్రానికే వదిలేయాలా, అహం కాకపోతే!’ అని మరికొందరు మాటల బాణాలేస్తారు. కానీ మూల సమస్యని కానీ, అందుకు పరిష్కారం దొరకలేదని కానీ అనుకోరు. ఇతరులెవరికీ అర్ధం కాని ఎన్నో సమస్యలతో నేటి మహిళలు వేగిపోతున్నారు. లోలోన కుమిలి పోతున్నారు అన్నది మాత్రం నిజం. అందుకు – మన ముందు నిలువెత్తు అద్దంలా నిలిచిన పాత్ర సహజ పాత్ర!

          అమాయికి తల్లి తండ్రుల బాధ్యత వుంటే పెళ్ళికి ముందే చెప్పి, ఒప్పందం చేసుకోవద్దూ? అంటూ దీర్ఘాలు తీసే వారిని చూసి ఓ వేదాంతిలా నవ్వుతుంది సహజ.

          ‘ఆడాళ్ళూ, మీరెంత పిచ్చోళ్ళూ..’ అన్నట్టు వినిపిస్తుంది ఆ నవ్వు.

          ఎందుకంటే! ఆ పని ఆమె చేయకపోతే కదా!

          ఈ ఆధునిక కాలంలో విచ్ఛిన్న మౌతున్న వివాహాలలో ప్రేమ వివాహాలు కూడా చోటు చేసుకోవడం చాలా విషాదకరం.

          కారణం-తొందరపాటు అనే పదాన్ని పక్కన పెట్టి చూస్తే, పెళ్ళికి ముందు చేసుకునే బాసలన్ని బూటకాలు కావడం ఒక పెద్ద కారణంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుందనడానికి ప్రత్యక్ష బాధితురాలు – సహజ.

          ‘వివాహానికి ముందే ఇతగానికి విషయం అంతా వివరించాను కదా! పెళ్ళయ్యాక,  ఇప్పుడేమిటీ..ఇలా మాట్లాడుతున్నాడు?’ అంటూ నోటమాట రానిదై చిత్తరువులా నిలిచి పోయినప్పుడు ఈ బేలని చూస్తే అనిపిస్తుంది..

          ‘మాయగాని మాటల వలలో నువ్వు సైతం చిక్కుకున్న లేడి పిల్లవా తల్లీ!’ అని..ఓదార్చాలనిపిస్తుంది.

          మోసపోయిన స్త్రీలను చూసి అనుకుంటూ వుంటాం. ‘అయ్యో. ఇంత చదువు చదివి, అంత పెద్ద ఉద్యోగం చేసుకుంటూ ఇంతలా మోసపోయిందేమిటి తెలివి తక్కువగా’ అని. నిజమే. అందుకేగా ఆమెని మోసపోయిన ఆడది అని అంటాం! – ఈ కథలో సహజ అందుకు మారుపేరులా నిలిచిన పాత్ర అని చెప్పాలి.

          పెళ్ళి నాటి ప్రమాణాలు – పెళ్ళయ్యాక నిలవవు. ప్రేమ కాలంనాటి ఒప్పందాలు – కూడా అంతే..జ్ఞాపకానికి రావు. అది కాదు సహజని నిశ్చేష్టురాలిని చేస్తోంది!

          నాయనమ్మ బాధ్యత తనకుందని, అందుకు అంగీకారమైతేనే పెళ్ళికి తాను సిద్ధమని అని అన్నప్పుడు అతను ఆమెనొక ఆదర్శ మూర్తిలా పొగుడుతూ, అందుకు ఎలాటి అభ్యంతరం లేదని తెలిపిన ఆ మనిషే..ఇప్పుడు..ఏమంటున్నాడూ అంటే..వృద్ధాశ్రమంలో చేర్చేద్దాం. సమస్యకి చెక్ పెట్టేద్దాం అనే భర్త నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది.

          ఇతను అతనేనా? అతను ఇతనెలా అయ్యాడనే సందిగ్ధావస్థలో పడే అనేకానేక మంది స్త్రీల అయోమయ స్థితికి – ప్రత్యక్ష సాక్షి సహజ పాత్ర.

          భర్తల మీద ఈ ఇల్లాళ్ళకి ఎంత గొప్ప అంచనాలుంటాయంటే..తన కన్న వారికి ఏదైనా సమస్య వస్తే..’ బాధ పడకు. నేనున్నా కదా! ‘ అంటూ అతను కొండంత అండలా నిలుస్తాడని భ్రమిస్తారు.

          అది జరగనప్పుడు నిరాశపడతారు. సహజం. 

          అదే సమస్య భర్తకి వస్తే..అన్నీ తానై చూసుకునే ఆ ఇల్లాలు..ఆ మాత్రం సపోర్ట్ భర్త నించి కోరుకోవడంలో తప్పేమిటి? అని ప్రశ్నిస్తుంది – సహజ.

          తన పాలిట దైవంలా నిలిచిన నాయనమ్మ కోసం అవసరమైతే భర్తనే దూరం చేసుకోవడానికి, సిద్ధ పడిన నిజాయితీ పరురాలు – సహజ.

          సమస్య ఎదురైనప్పుడు ముందు బేలగా విలపించినా, ధైర్యంగా ఎలా ఎదిరించాలో నిరూపించే స్త్రీ మూర్తిని చూస్తాం – సహజ పాత్రలో!

          అలానే, కాపురంలో కలతలు రాకుండా సాధ్యమైనంత వరకు ఓర్పు పట్టాలని, అందుకు స్త్రీలు మగవానిలా తొందరపడి మాట్లడకుండా..నిదానించడం కూడా అవసరమే అని చెప్పిన స్త్రీ పాత్ర – సహజ.

          ‘ఇంటి కోడలికి అత్తమామల బాధ్యత ఎంత సహజమో, ఇంటి అల్లునికి కూడా అదే స్థాయిలో ఆ బాధ్యత  వుంటుంది…వుండాలి.’ అని తన గంభీర స్వరాన్ని వినిపిస్తుంది. అందుకు ఒక చట్టం కూడా వుంటె బావుణ్ను అని పరోక్షంగా మంచి సూచనని అందించిన పాత్రగా సహజని పేర్కొనక తప్పదు.

          కథలో సహజ పడే ఆవేదన అందరి స్త్రీల మనోవేదన అని చెప్పాలి.

          అంతే కాదు. కని పెంచిన కన్న వారిపట్ల ఆడపిల్లలకి వుండే అంకిత భావానికి ప్రతినిధిలా నిలుస్తుంది.

          ప్రతి స్త్రీ మూర్తిలో ఒక న్యాయమూర్తి దాగి వుంటుందనడానికి నిదర్శనాభరిత నారీ మణిలా అనిపిస్తుంది – సహజ.

          కుటుంబాలలో స్త్రీలకి జరిగే అన్యాయాలను తిప్పి కొట్టాల్సింది ఎవరో కాదు. సాటి స్త్రీలే అనే అద్భుతమైన సందేశాన్ని అందిస్తుంది – సహజ.

          ఇలాటి ఉన్నత భావాలు, మనస్తత్వాలు గల స్త్రీలు నేటి సమాజానికి ఎంతైనా ఆదర్శనీయులు.

***

          గొంగళి పురుగు నించి సీతాకోక చిలుకలా మారే అందమైన మార్పుకి అద్దం పట్టిన పాత్ర – దీప్తి : ఈ కథలో కథానాయిక సహజ పాత్రకి సమాన స్థాయిలో మలచిన పాత్ర – దీప్తి.

          ఇంట్లో పెద్ద వాళ్లని గౌరవించడం, ఆదరించడం, ప్రేమతో సేవలందించడం వంటి పనులు ఆదర్శాలు కాదు. సహజమైన బాధ్యతలుగా స్వీకరించాలి. ‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత ‘ అని చెప్పిన కథ..అనుసరణీయం! నిజాయితీగా నిర్వర్తించాలి. ఎవరి కోసమో కాదు. మన కోసం.

          ముసలి తనంలో ఆదుకునేది కేవలం దాచుకునే డబ్బు మాత్రమే కాదు. ఆచరించే ధర్మం కూడా. అది – మనం పెద్దలకి చేసే సేవలే మనకి శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఎలా అంటే మన పిల్లల్లో కూడా ఆ ఉన్నత భావనలు నాటుకుపోతాయి. పిల్లలు – నీతి మాటలు విని గ్రహించరు. ఆచరణలు చూసి అనుసరిస్తారు. ‘జాగ్రత్త సుమా! నీ వృద్ధాప్యం జీవితం! అని అందమైన హెచ్చరికని జారీ చేసే పాత్రలో దీప్తి సజీవమై, మన మనసుల్లో నిలిచి పోతుంది.

          ఈ పాత్ర వెదజల్లే సంస్కార కిరణాలు చీకటి మనసులను సైతం కాంతివంతం చేస్తాయి.

          తన అన్న గారి ఇంటికి ఆడపడుచు స్థానంలో విచ్చేసినా..ఆమె ముందుగా మెచ్చుకుని, ప్రశంసల వర్షం కురిపించింది మాత్రం వదిన గారి మీదే! కుటుంబాలలో మనిషి మనిషికీ మధ్య దూరాలు పెరగకుండా వుండాలంటె..స్త్రీలు దగ్గరవ్వాలి. సన్నిహితంగా మెలగాలి. స్నేహ పూరిత వాతావరణాన్ని నెలకొలిపే ప్రయత్నంలో తన పాత్రను తాను సమర్ధవంతంగా నిర్వహించాలి అని చెప్పే పాత్ర – దీప్తి.

          పెళ్లికి ముందు దీప్తి – ఇంటి ఇల్లాలుగా మారిన దీప్తి వ్యక్తిత్వాన్ని పోల్చుకుంటూ  నమ్మలేని వానిలా తన వైపు చూస్తున్న అన్న గారితో దీప్తి జరిపే సంభాషణ – కథకి కొత్త జీవాన్ని పోసిందని చెప్పాలి.

          కొందరి స్త్రీల రాక జీవతాలను ఎంతలా చైతన్యవంతం చేస్తుందో, ఎలాటి అద్భుతమైన మలుపులకు దారి తీస్తుందో చెప్పిన పాత్ర – దీప్తి.

          ఆమె వచ్చి వెలిగించిన జ్ఞాన బోధనా దీపం ఎంతలా కాంతివంత మౌతుందంటే.. అన్న గారి వక్రమైన ఆలోచనలను సక్రమం చేసి, జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రసాదించేలా!

          మనిషి ఎదగడం అంటే తన కోసం తాను బ్రతకడం కాదు. తన వారి కోసం బ్రతకడం..

          వ్యక్తి, సమాజం వేరు కాదు. కుటుంబంలో వ్యక్తి నీతి నియమాలు, నైతిక బాధ్యతా నిర్వహణలే – సామాజిక సూత్రాలుగా రూపు దిద్దుకుంటాయి.

          నైతిక ధర్మాలే సామాజిక ధర్మాలు. – అనే సత్య ప్రకటన చేసిన ఔన్నత్య పాత్రలో దీప్తి – పదికాలాల పాటు గుర్తుండిపోయే పాత్రగా అభివర్ణించక తప్పదు.

          ఇంతకీ ఈ ఇరువురి స్త్రీ మూర్తుల ఔన్నత్యం, త్యాగ నిరతి, కుటుంబం పట్ల వీరికి గల బాధ్యత ప్రణవ్ మీద ప్రభావం చూపాయా? అతను తన తప్పుని సరిదిద్దుకున్నాడా లేదా అనే సందేహాలకి సమాధానం – కథ చదివి తెలుసుకోవాల్సిందే!

***

నడి వయసు దాటినా సరికొత్త బాధ్యతని భుజానికెత్తుకుని మోసిన పాత్ర – కామాక్షమ్మ :

          కొడుకు, కోడలు ఆక్సిడెంట్  లో చనిపోయారని తెలిసిన ఆ తల్లి గుండె బద్దలౌతుంది. నిజానికి ఏ తల్లికైనా ఆ పైని బ్రతుకు దుర్భరమౌతుంది. అంత శోకంలోనూ కామాక్షమ్మ మనవరాలిని గుండెకి చేర్చుకుని, ఇక ఈ బిడ్డే తన బిడ్డ అని భావిస్తుంది. కొడుకు కోడలు లేరన్న సునామి వంటి ఉధృత విషాదాన్ని పక్కన బెట్టి, మనవరాలికి  తల్లీ తండ్రీ బంధువు అన్నీ తానే అయి నిలుస్తుంది.

          నిజానికి ఆమెకి అది రిటైర్మెంట్ వయసు. బాధ్యతలు తీరి, ఒడ్డున పడ్డ ప్రాణం.. విశ్రాంతి చాలా అవసరమయ్యే కాలాన తనకి కలిగిన విపత్తులో సైతం ఆమె కొత్త బాధ్యతని తలకెత్తుకుంది. కొత్తగా మళ్ళీ అమ్మగా మారి, నాయనమ్మ స్థానం నించి అమ్మ పాత్రని పునః ప్రారంభించి, విజయవంతంగా తన బాధ్యని నిర్వర్తిస్తుంది. ఎంత అద్భుతమైన్న స్త్రీ శక్తి కదూ!

          మనవరాలిని కాచి, కాపాడి, విద్యావంతురాలిని చేసి, ఉద్యోగస్తురాలిగా తీర్చిదిద్ది, వివాహం చేసి ఆమె జీవితన్ని తీర్చిదిద్దడం ఒకటే కామాక్షమ్మ ధ్యేయం. అదే ఆమె జీవితాశయం. 

          అదే ఆమెకి పుణ్యక్షేత్ర సందర్శనం. అదే పరమ పావనం.

          ఎంత గొప్ప పాత్ర అంటే..కొంత మంది అమ్మలు – కొడుకు పిల్లలని కోడలికి పుట్టిన వారుగా, కూతురికి పుట్టిన పిల్లలు తన వాళ్ళుగా ఒక విపరీతపు పక్ష’వాత’ భావాన్ని ప్రదర్శిస్తుంటారు.

          కానీ ఈ కథలో కామాక్షమ్మ అందుకు పూర్తి వ్యతిరేకం.

          కొడుకు బిడ్డని సొంత బిడ్డలా సాకుతుంది. ఎనలేని ప్రేమని పంచుతుంది.

          కన్న కొడుకుని పోగుటుకున్న ఏ తల్లి పరిస్థితి అయినా..యుద్ధం తర్వాతి వాతావరణంలా..వుంటుంది. ఎటు చూసినా విషాదమే. శోకమే. అంధకారమే. అయినా అలాటి కఠిన పరిస్థితిలో కూడా కామాక్షమ్మ నిలిచి గెలిచిందంటె – అది కేవలం స్త్రీ సంకల్ప బలం..దీక్షా పట్టుదలలే కారణం. ఇవి – స్త్రీల శారీరక బలహీనతని అణచి, బలవంతురాలిని చేస్తాయనడానికి గొప్ప నిదర్శనంలా నిలిచిన పాత్ర కామాక్షమ్మ పాత్ర.

          ఇంతటి ప్రేమ మూర్తులు, త్యాగమయిలు లేకపోతే ఎమైపోవునో కదా కుటుంబాలు! 

          కామాక్షమ్మ వంటి స్త్రీ మూర్తుల ధైర్యసాహసాలు ఎంతైనా ప్రశంసనీయం. వీరి అడుగు జాడలు అనుసరణీయం. ఆచరణాయోగ్యం.

          ఇలా స్ఫూర్తి దాయకమైన స్త్రీ పాత్రలతో నిండిన కథ ఇది.

***

          ఇవండీ ఈ నాటి కథామధురంగా అందిస్తున్న ఈ కథలొని స్త్రీ పాత్రలు, విశిష్ట లక్షణాలు.

          కథామధురం కోసం మంచి కథని అందచేసిన రచయిత్రి శ్రీమతి కె.కె.భాగ్యశ్రీ గారికి మన నెచ్చెలి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే సుభాభినందనలూ!

          ఈ కథ చదివి, మీ హృదయ స్పందనలను తెలియచేయవలసిందిగా ప్రియ పాఠకులను కోరుతూ..

అందరికీ వందనాలు.

***

అనుసరణీయం

-కె.కె.భాగ్యశ్రీ

          ఆలోచిస్తున్న కొద్దీ సహజకి మతిపోతోంది. అసలు ఏ సమస్యలూ తలెత్త కూడదనే కదా…పెళ్ళికి ముందు అన్ని రకాల చర్చలూ చేసి, ఎన్నో ఒప్పందాలు చేసుకుని, వాటన్నింటికీ ఒడంబడిక ఉండాలని తీర్మానించుకునే కదా కలిసి జీవన ప్రయాణం సాగిస్తున్నది. తీరా…ఇప్పుడు చూస్తే జరుగుతున్నదేమిటి? అసలు…వివాహానికి మూలం నమ్మకమే కదా! ఆ నమ్మకం పోయిననాడు కలిసి ఉండడంలో అర్ధం ఏముంటుంది?
సహజ ఆలోచనలు పరిపరివిధాల సాగుతున్నాయి.

          “అమ్మలూ… ఒక్కదానివే కూర్చుని ఏమిటాలోచిస్తున్నావే?” అప్పుడే గదిలోకి వచ్చిన కామాక్షమ్మ అడిగింది.

          ఆమెని చూసి తడబడి “అబ్బే…ఏమీలేదు నాయనమ్మా…” కళ్ళనీళ్ళు ఆమెకి కనబడకుండా ముఖం తిప్పుకుంది సహజ.

          కామాక్షమ్మ మనవరాలి దగ్గరగా వచ్చి తలమీద చేయివేసి నిమిరింది. ఆప్యాయత‌ నిండిన ఆ స్పర్శ సహజలోని ఆర్తిని మరింత అధికం చేసింది.

          “నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకోకు…’’ నవ్వింది కామాక్షమ్మ.

          “తెలుసా? ఏం తెలుసునీకు?’’ అదిరిపడి అన్న సహజ ముఖం పాలిపోయింది.

          “అదేనే అమ్మలూ… పొద్దున్న నువ్వు, ప్రణవ్ దేనికో ఘర్షణ పడుతున్నారు కదా! ఆ సంగతి…’’ చెప్పింది కామాక్షమ్మ.

          ‘హమ్మయ్య!’ తేలికగా నిట్టూర్చింది సహజ. అసలు విషయం నాయనమ్మకి తెలియదు. తెలిస్తే… ఆవిడ ప్రశాంతత అంతా ఒక్క క్షణంలో మాయం అయిపోతుంది.

          ఆవిడ చూడకుండా కళ్ళనీళ్ళు తుడుచుకుని “అవును నాయనమ్మా… ఏదో…చిన్న విషయమేలే’’ నింపాది నటించింది సహజ.

          “అవునే అమ్మలూ… భార్యాభర్తల నడుమ ఇలాంటి చిలిపి తగాదాలు సర్వ సాధారణమేలే. అలాంటి చిన్న చిన్నకలహాలుంటేనే కాపురానికి అందం. మీ తాతయ్య
కూడా ఇంతే. ఉత్తిపుణ్యానికి నాతో తగవు పెట్టుకునేవారు. నేను ఉడుక్కుంటే  మురిసి పోయేవారు.’’ గతించిన జ్ఞాపకాలు తలచుకుని తన్మయత్వం చెందింది కామాక్షమ్మ.

          “అవునా నాయనమ్మా…’’ కనురెప్పలు అల్లల్లాడించింది సహజ. మనసులో మాత్రం “ పిచ్చి నాయనమ్మా… అసలు విషయం తెలిస్తే నువ్వేమైపోతావో…’’ అనుకుంది
వేదనగా.

          కామాక్షమ్మ కాలగర్భంలో కలిసిపోయిన తన అనుభవాలను, మనసులో సజీవంగా నిలిచిపోయిన అనుభూతులను నెమరువేసుకుని ఆత్మానందాన్ని అనుభవించింది కాసేపు.

          కడుపులో నుంచీ దుఃఖం తన్నుకొస్తున్నా దాన్ని బలవంతాన అదిమిపెట్టి, తలాడించింది సహజ.

          అసలు… ఎంత నమ్మింది ప్రణవ్ ని! ఎన్నెన్ని ఆశలు కల్పించాడు తనకి! ఎన్ని వాగ్దానాలు చేశాడు! అవన్నీ నిజమేనని నమ్మి మోసపోయింది.

          ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర పగిలిపోతోంది సహజకి.

***

          సహజ తల్లిదండ్రులు ఆమె చిన్న తనంలోనే ఒక ప్రమాదంలో కన్నుమూస్తే , ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది కామాక్షమ్మ. చెట్టంత కొడుకుపోయిన కష్టాన్ని సైతం దిగమింగుకుని, మనవరాలిని ప్రాజ్ఞురాలిని చేయడమే తనముందున్న
ఏకైక లక్ష్యమని భావించింది ఆవిడ.

          సహజని ఉన్నత విద్యాపారంగతురాలిని చేయడంతో పాటు, ఉత్తమమైన సంస్కారం, మంచి విలువలు మూర్తీభవించిన వ్యక్తిగానూ మలచింది. తన వ్యవహారదక్షతతో ఆమెకు ధైర్యసాహసాలు అలవడేలా చేసింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్తితప్రజ్ఞతను ఆమెకు అందించింది. తానింత ఎత్తుకి ఎదగడం వెనక ఎన్నో ఏళ్ళ నాయనమ్మ కృషి దాగుందని ఎరిగిన సహజకు ఆవిడ అంటే అపారమైన గౌరవం.

          సహజ ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే తన సహోద్యోగి అయిన ప్రణవ్ తో ప్రేమలో పడింది.

          “ చూడు ప్రణవ్…మా నాయనమ్మంటే నాకు చాలా ఇష్టం… ఆమె చేసిన త్యాగానికి విలువ కట్టలేము. గర్భశోకాన్ని కూడా దిగమింగుకొని ఆవిడ నా కోసం బతికిన తీరు అపూర్వం. మన పెళ్ళి తరువాత కూడా ఆవిడ బాధ్యత నాదే. దీనికి నువ్వొప్పుకోవడమే కాదు. మీ వాళ్ళని కూడా ఒప్పించాలి. తరువాత గొడవలు తలెత్తడం నాకిష్టం లేదు. అందుకనే ముందే చెప్తున్నాను.’’ సూటిగా తన మదిలోని భావాలను అతడి ముందు పరిచింది సహజ. 

          ఆరాధనగా చూశాడు ప్రణవ్.

          “అమ్మాయిలు నీలా స్వతంత్రంగా ఉంటేనే నా కిష్టం సహజా… ఆకాశంలో సగంగా ఎదుగుతున్న అతివలకి స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా ఉండాలి. అప్పుడే కుటుంబం, ఈ సమాజం బాగుంటాయి. నేను నీ నిర్ణయాన్నిఆమోదిస్తున్నాను.  గౌరవిస్తాను కూడా.’’ మనస్ఫూర్తిగా పలికిన ప్రణవ్ ని చూసి ఆనందంతో  పులకించి పోయింది సహజ.

          కాని, తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా… పెళ్ళికి ముందు ప్రణవ్ చేసిన ప్రమాణాలు, ఇచ్చిన హామీలు అన్నీ సునామీ వచ్చినప్పుడు కూలిపోయిన కట్టడాల్లా, తుడిచిపెట్టుకుపోయాయి.

          సహజ దురదృష్టమో, ఏమోగాని… సహజ పెళ్ళైన ఆరునెలలకి కామాక్షమ్మ విపరీతంగా జబ్బుపడింది. అలాంటి సందర్భంలో ఆవిడని కంటిపాపలా సాకాల్సిన
బాధ్యత సహజ భుజస్కందాల మీద పడింది.

          అది ప్రణవ్ తల్లిదండ్రులకి కంటగింపుగా మారింది. జీతం నష్టం మీద సహజ సెలవు పెట్టడం వాళ్ళకి నచ్చలేదు. పెళ్ళికి ముందు మాటైతే ఇచ్చాడు కాని, కామాక్షమ్మ బాధ్యత తాము తీసుకోవాల్సి రావడం ప్రణవ్ కి నచ్చడం లేదు. పెళ్ళైన తమకి ఏకాంతం లోపించడానికి కారణం కామాక్షమ్మేనని మనసులో ఒక ముద్ర పడిపోయింది.

          ఫలితం…ఇంట్లో తీరని అశాంతి. అనుక్షణం సూటిపోటీ మాటలతో సహజని వేధింఛడం మొదలెట్టాడు.

          “చూడు ప్రణవ్…మనం పెళ్ళికి ముందే అన్ని విషయాలూ మాట్లాడుకుని ఓ అవగాహనకి వచ్చాము. నేను మా నాయనమ్మ బాధ్యతని కొత్తగా నీపై మోపలేదు.
ఇప్పుడావిడని బరువుగా భావించి వదిలేయమంటే ఎలా? ఇది ఆడి తప్పడం అవుతుంది.’’ ప్రణవ్ కి నచ్చచెప్పడానికి ప్రయత్నించింది సహజ.

          “ అప్పుడున్న పరిస్థితిలో ఏవేవో అనుకున్నాము. అవన్నీ నెరవేరతాయని భావించడం తప్పు. నువ్వే ఆలోచించు… మనం ఏ రోజైనా కొత్త దంపతుల్లా సంతోషంగా గడుపుతున్నామా! పెళ్ళై ఏడాది కావస్తోంది. ఎక్కడికన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేశామా! పెళ్లైన దగ్గర నుంచీ ఆవిడ అనారోగ్యంతోనే నీకు సరిపోతోంది.’’ నిష్టూరంగా
అన్నాడు ప్రణవ్.

          నివ్వెరపోయింది సహజ. “అంటే…అప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధా లేనా? ఎలాగోలా నన్ను పెళ్ళి చేసుకోవడం కోసం నన్ను మభ్యపెట్టావన్నమాట! ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడంలేదూ!’’ సహజలో ఆవేశం కట్టలు తెంచుకుంది.

          “దీనికి నువ్వు ఏపేరన్నా పెట్టుకో… నేను అమ్మమ్మగారిని పట్టించుకోవద్దని  చెప్పడం లేదు. ఇప్పుడు సిటీలో చాలా మంచి ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయి. మనకి డబ్బుకి లోటులేదు కాబట్టి ఒక మంచి ఆశ్రమంలో చేర్పిద్దాము. తన వయసువాళ్ళు నలుగురితో గడిపితే ఆవిడకి కూడా హాయిగా ఉంటుంది.’’ తన వాదన మీద బలంగా నిలబడ్డాడు ప్రణవ్.

          సహజకి అర్ధమైంది…ఈ విషయంలో అతడు ఒక నిర్ణయానికి వచ్చేశాడని. ఇప్పుడేం చెప్పినా అతడు వినిపించుకోడని కూడా బోధపడింది. కాని, తనేంచేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో మాత్రం తెలియడం లేదు.

          అతడు చెప్పినట్లుగా విని నాయనమ్మని వృధ్ధాశ్రమంలో చేరిస్తే… ఆత్మవంచన
చేసుకున్నట్లే. అంతరాత్మని చంపుకున్నట్లే.

          అతడి మాటని తోసిరాజని, ఆవిడని ఇంట్లోనే ఉంచుకుంటే తన కాపురం  ముక్కలౌతుంది. ప్రేమించి పెళ్లాడిన తమ బంధం బీటలువారుతుంది. ఏంచేయాలి! ఏంచేయాలి!

          పగలురాత్రి ఒకటే ఆలోచన…

          ఈ రభస అంతా నాయనమ్మ చెవిన పడితే ఆమె బాధపడుతుందేమోనన్న భయం ఒకపక్క వెంటాడుతోంది. మనవరాలు భర్తతో ఏదో ఘర్షణ పడుతోందని కామాక్షమ్మకి అర్ధమైనా, అది ఎందుకో రూఢిగా తెలియలేదు. అందుకే పెద్దదానిగా తనవంతు చెప్పాల్సిన నాలుగు మాటలూ చెప్పేసింది.

          ఆ క్షణానికి గండం గడిచినా ముందు ముందు ఏ పరిణామాలు ఎదుర్కోవాలోనని సహజకు ఒకటే దిగులుగా ఉంది.

***

          “ సహజా…రేపు ఆఫీసుకి సెలవుపెట్టు…మా చిన్నాన్న కూతురు దీప్తి మనింటికి వస్తోంది.’’ ముక్తసరిగా చెప్పాడు ప్రణవ్ ఆ రోజు ఆఫీసుకి బయలుదేరే ముందు.

          “అలాగే” ముభావంగా చెప్పింది. కామాక్షమ్మని వృధ్ధాశ్రమంలో చేర్చే విషయంలో
భార్యాభర్తల నడుమ తలెత్తిన ఘర్షణ… దాని ప్రభావం చూపెడుతూనే ఉంది. ప్రణవ్ పట్ల తన అంచనాలు తల్లకిందులయ్యాయని ఒకటే తల్లడిల్లుతోంది.

          ప్రణవ్ కోరిన విధంగా ఆ మరునాడు ఆఫీసుకి సెలవుపెట్టింది.

          మరునాడు పొద్దున్న దీప్తి వచ్చింది తన ముగ్గురు సంతానాన్ని తీసుకుని. తనకి ప్రణవ్ కి మధ్యన ఉన్న విబేధాలను మనసులో పెట్టుకోకుండా ఆమెను సాదరంగా
స్వాగతించింది సహజ.

          దీప్తికి మొదట ఆడపిల్ల, తరువాత కవలలు ఇద్దరు మగపిల్లలు. పిల్లల కోడిలా చకచక తిరుగుతూ, వాళ్ళకి కావల్సినవి అమరుస్తూ ఎంతో సహనంతో మసలుకుంటున్న
దీప్తిని చూసి కామాక్షమ్మ ముచ్చటపడింది.

          దీప్తి కూడా ‘ మామ్మగారూ’ అనుకుంటూ ఆవిడతో సన్నిహితంగా మసలుకుంటోంది. ఆ రోజు దీప్తికి ఏ వంటలు  ఇష్టమో అడిగి కనుక్కుని మరీ వండి పెట్టింది సహజ.

          “థాంక్యూ వదినా… మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు…ఎటువంటి అమ్మాయి వస్తుందోనని అనుకున్నాం కాని, నువ్వు చాలా మంచిదానివి. మాలో కలిసి పోయావు.’’ చనువుగా సహజ వెనకవెనకే తిరుగుతూ అంది దీప్తి.

          సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది సహజ. ప్రణవ్ మాత్రం ముఖంముడుచు కున్నాడు.

          దీప్తిని చూస్తే అతడికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే కాలేజీ రోజుల్లో దీప్తి ఎలా ఉండేదో అతడికి తెలుసు. ఎప్పుడూ బిందాస్ గా ఉంటూ బాధ్యతలు  పట్ట కుండా, ఇటుపుల్ల తీసి అటు పెట్టకుండా చాలా జాలీగా గడిపేసేది. అలా ఏమీ పట్టనట్లుగా అల్లరిగా ఉండే అమ్మాయిలు, పెళ్ళైన తరువాత చక్కటి గృహిణులుగా మారిపోయి ఇల్లు చక్కదిద్దుకుంటారని అతడికి తెలుసు.

          అతడు విస్మయం చెందుతున్నది అందుకు కాదు. దీప్తికి పసిపిల్లలన్నా,  ముసిలి వాళ్ళన్నా పరమ చిరాకు. పసిపిల్లల దగ్గర మలమూత్రాల వాసన, కక్కు కంపులు
వస్తాయని వాళ్ళని దగ్గరకు కూడా తీసుకునేది కాదు. స్వంత అక్క, అన్నల పిల్లలని కూడా ఆమడదూరంలో పెట్టేది.

          ఇక ముసలివాళ్ళ సంగతి అడగనే అక్కరలేదు. ముసలికంపు కొడుతుందని వాళ్ళకి ఇరుపంచలా పోయేదికాదు. వాళ్ల సణుగుడు, చాదస్తం… ‘అక్కడనొప్పి , ఇక్కడనొప్పి’
అంటూ వాళ్ళు మూలిగే వైనం ఆమెకు సుతరామూ నచ్చేదికాదు.

          ఎప్పుడైనా కుటుంబసభ్యులు అత్యవసరమైన పనిమీద బయటకి వెళ్తూ ఇంట్లోనే ఉండే దీప్తి నాయనమ్మకి ఆమెని సహాయంగా పెట్టేవారు.

          అప్పుడు చూడాలి ఆమె చిందులు… ‘తాను ఆ ముసలిమేళానికి కాపలా కాయలేనని, ఆవిడకి కావలసినవి ఆరారా అమర్చలేనని… ఏ పనీ చేసుకోనీయకుండా ఆమెపెట్టే
నస తట్టుకోలేనని…’ ఇలా నానా గలాభా చేసేది. నిజానికి ముసలామెకి కావలసినవన్నీ సమకూర్చేందుకు ఒక మనిషి ఉండేది. ఊరకే… ఆవిడ పిలిస్తే పలికేందుకు తనవారంటూ ఒకరు ఉండాలని పెద్దలు భావించి, దీప్తిని ఉంచితే అదామెకి నచ్చేది కాదు. బయటకెళ్ళినవాళ్లు ఇంటికి వచ్చేలోపు ఆ ముసలామెకి నరకం అంటే ఏమిటో
చవిచూపించేది.

          “ఒసేయ్ పిల్లకానా… నీ వయసు చూసుకుని మిడిసిపడుతూ…పిల్లలని, ముసిలాళ్లని
అసహ్యించుకుటావే… నువ్వు కూడా పుట్టినప్పుడు ఇంతే ఉన్నావే… ఇలాగే తెలియ కుండా అశుద్ధంలో పారాడేదానివి. మీ అమ్మ అవన్నీ చేయకుండా ఉంటే నువ్వు పెద్దయ్యేదానివా? ఎల్లకాలమూ ఇలాగే యవ్వనంగా ఉండి పోతావనుకుంటున్నావా! నీకూ
ముసిలితనం వస్తుంది. ఆప్పుడు తెలిసొస్తుంది నీకు…’’ దీప్తి ఆగడాలు సహించలేని పెద్దామె నిస్సహాయతతో శాపనార్ధాలు పెట్టేది.

          “పోవే ముసిలీ… అంతదాకా వస్తే నేను బతకనే బతకను… అయినా…నేనేమన్నా నీలా ముక్కుతూ-మూలుగుతూ ఉంటాననుకున్నావా? ఎప్పటికీ యంగ్ అండ్ ఎనర్జిటిక్
గానే ఉంటా…’’ ఎద్దేవా చేసేది దీప్తి.

          తనకి సుద్దులు చెప్పిందన్న అక్కసుతో… ‘ఈ రాక్షసిని నాకు సాయంగా ఉంచకండి బాబూ…’ అని ఆ పెద్దామె మొరపెట్టుకుని విలపించేంతగా ఆమెని వేధించింది దీప్తి.

          ఆమె విపరీత ప్రవర్తన చూసి ఇంట్లోని వాళ్లు బెంగ పెట్టుకునేవారు.

          అలాంటప్పుడు ఆ పెద్దామే వాళ్లని ఊరడించేది “ కట్టెవంపు పొయ్యే తీరుస్తుంది. ఎవరికి ఎవరో ఆ భగవంతుడు నిర్ణయించే ఉంటాడు…మీరు అనవసరంగా బాధపడకండి.’’

          ఇంత హంగామా చేసే దీప్తీ కూడా…పెళ్ళి అనగానే సిగ్గులమొగ్గలా మారిపోయి, డిగ్రీ పూర్తవ్వగానే తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిచేత మెడలో మూడుముళ్ళూ వేయించుకుంది.

          పెళ్ళంటే చేసుకుంది గాని, ఆమె అత్తవారి నుంచి ఏ ఫిర్యాదులు వినాల్సి వస్తుందోనన్న ఉద్విగ్నతతో ప్రాణాలు పిడికిట్లో పెట్టుకుని ఎదురుచూశారు ఆమె
తల్లిదండ్రులు. పెళ్ళైన తొలి ఏడాదిలోనే ఒక బిడ్ద తల్లైన దీప్తిని చూసి ‘ హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లే లోకంగా బతికే దీప్తిని చూసి ‘ ఫరవాలేదు… బండి ఒక గాడిలో పడింది.’ అని సంతోషంగా నిట్టూర్చారు.

          వెనువెంటనే కవలలు పుట్టడంతో, దీప్తి పుట్టింట్లోనే కొన్నాళ్ళుండిపోయింది. ఆ సమయంలోనే సహజ- ప్రణవ్ ల వివాహం జరగడంతో ఆమె ఆ పెళ్ళికి రాలేకపోయింది. ఆ తరువాత మంచిరోజు చూసి ఆమెను అత్తవారింట దిగబెట్టారు. ఏడాదిలోగా పురుటి మంచం చూడాలని పుట్టింటివారు కబురుపెడితే…ఇదుగో…మళ్ళీ ఇలా వచ్చింది.

          స్వభావం గురించి విని కొంతా, చూసి కొంతా దీప్తిని గురించి తెలుసుకున్న ప్రణవ్ ఆమెలో వచ్చిన మార్పు గమనించి విస్తుపోతున్నాడు.

          కామాక్షమ్మకి చేరువగా కూర్చుని, ఆమెతో ఆదరంగా మాట్లాడుతున్న దీప్తిని ఎనిమిదో వింతను చూసినట్లుగా చూస్తున్నాడు ప్రణవ్.

          మధ్యాహ్నం భోజనాలైనాక కామాక్షమ్మ పడుకోవడానికని తనగదిలోకి వెళ్ల్ళి పోయాక అప్పుడు అడిగేశాడు తన ధర్మ సందేహాన్ని.

          “ నీకే కాదురా అన్నాయ్… ఈ సందేహం మనవాళ్ళలో చాలా మందికి వచ్చింది. అంతెందుకు నాయనమ్మే నన్ను నమ్మలేక అనుమానంగా చూస్తోంది. గతంలో ఆవిడ నా వలన అనుభవించిన టార్చరే అందుకు కారణం అనుకో…’’ నవ్వింది దీప్తి.

          “ అందుకే కదా…ఇప్పుడీ సందేహం కలిగిందీ! నీలో ఈ మార్పుకి కారణమేమిటో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకోవే బాబూ…’’ ప్రాధేయంగా అన్నాడు ప్రణవ్.

          “ చెబుతానురా… తొందరెందుకు? నీకు తెలుసు కదా…మాది ఉమ్మడి కుటుంబమని. మా మామగారు, చిన మామగారు కూడా రిటైర్ అయ్యారు . మా చిన్నత్తయ్య బి.ఎస్. ఎన్. ఎల్. లో పెద్ద ఉద్యోగి. మా అత్తగారు పెద్ద చదువేచదువుకున్నా గృహిణిగా ఉండడమే ఇష్టమని ఇంట్లోనే ఉండిపోయారు.

          ఇంట్లో జనభా అంతా కలిపి దాదాపు ఇరవై మందిలాగా ఉంటాము. మా మామగారి తల్లే కాదు, ఆవిడ తల్లి అంటే మా మామగారి అమ్మమ్మ కూడా ఇంకా బతికే ఉన్నారు.
ఇంట్లో అందరు ముసిలాళ్ళని చూసి మొదట్లో చికాకు పడినమాట వాస్తవమే.  పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా భావించేదాన్ని. అంతమందున్న ఇంట్లో ఉండాల్సి వచ్చినందుకు ఉక్కిరిబిక్కిరిగా ఊపిరాడనట్లుగా అనిపించేది.

          నా సంగతి తెలిసి కూడా అమ్మనాన్నలు నాకీ సంబంధం ఎందుకు తెచ్చారా అని ఒకటే బాధపడిపోయేదాన్ని.

          ఇంట్లో నలుగురు పసిపిల్లలు, ఇద్దరు ముసలాళ్ళు… నాకెంత మాత్రం  నచ్చని వాళ్ళు ఉన్న ఇంట్లో శాశ్వతంగా నేనుండాలా… అని ఒకటే భయం పట్టుకుంది.

          నన్నా సంతలో తెచ్చిపడేసిన అమ్మ- నాన్నలంటే విపరీతమైన కోపం ముంచుకొచ్చేది.

          ఇంట్లోని వాళ్ళు ఆఫీసులకి, కాలేజ్ లకి, స్కూళ్ళకి వెళ్ళీపోయాక నాకేమీ తోచేది కాదు. ప్రీ స్కూల్లో కూడా చేర్చేందుకు వీల్లేని వయసున్న పిల్లలు, ఇద్దరు ముసిలివాళ్ళు…వీళ్ళ బాధ్యత మా అత్తగారి పైనే ఉండేది. తాను చేస్తున్న పనిపట్ల ఆవిడకి భక్తి ఉండేది. విసుగు-విరామం ఉండేది కాదు. అసహనం అసలే ఉండేది కాదు.
ఆవిడని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది.

          ఇంటి పనులెన్ని చేసినా సరే…నేను పిల్లలు-పెద్దల జోలికి పోకపోవడం చూసి ఓ రోజు నన్ను అడిగేశారావిడ.

          ఏం చెప్పాలో తెలియలేదు. ఏదైతే అదయ్యిందని వారి పట్ల నా అభిప్రాయం చెప్పేశాను.

          “ నీ ఆలోచనా విధానంలో ఎక్కడో లోపముంది దీప్తీ. పిల్లలపట్ల చిరాకంటావా… అది కలకాలమూ ఉండదు. ఎందుకంటే..రేపు నీ కడుపున కూడా పిల్లో పిల్లాడో పుడితే…ఆ అసహ్యాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కాని, వయసుమళ్ళిన వారిపట్ల నీ వైఖరే ఆమోద యోగ్యం కాదు. జవసత్వాలుడిగి, ఒకరిపైన ఆధారపడిన వారిని చులకనగా చూడడం తగదు.

అలా… ఇంకొకరి పైన ఆధారపడడానికి వారెంత బాధపడతారో నువ్వూహించ లేవు. రేపు ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేము.

          ముసిలితనాన్ని జయించి బతికే శక్తి మానవుడుకి లేదు. నిత్యం యవ్వనంగా ఉండడం ఏ మనిషికీ సాధ్యం కాదు.

          ఈరోజు నేను ఈ పెద్దలని ఆదరణగా చూడడం వెనక నా స్వార్ధం కూడా ఉంది. కనీసం నన్ను చూసైనా నా కోడళ్ళకి ఆ గుణం అబ్బుతుందేమోనన్న చిన్ని ఆశ. పెద్ద వాళ్ళ అడుగుజాడలు…పిల్లలకి కర్తవ్యాన్ని బోధిస్తాయి.

          నీ మేలుకోరే పెద్దదానిగా నీకో మంచిమాట చెబుతున్నా. పెద్దవాళ్ళకి సేవలుచేయక పోయినా ఫరవాలేదు. కాని, వారి ఉనికిని అసహ్యించుకోకు. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగడానికి అది ఆటంకం అవుతుంది.’’ చెప్పడం ముగించింది దీప్తి.

          ప్రణవ్ ముఖం పాలిపోయింది. సహజ మౌనంగా వింటోంది ఆమె చెప్పినది.

          “ఎంతో సుదీర్ఘంగా మా అత్తగారు చెప్పిన జీవిత సత్యం నా కళ్ళు తెరిపించింది. ఆమె అడుగుజాడలు నాకు అనుసరణీయమైనాయి. పిల్లలు- పెద్దల పట్ల నాదృక్పథంలో మార్పు వచ్చింది.’’ దీప్తి మాటలు ప్రణవ్ మెదడులో మూసుకుపోయిన ఆలోచనా ద్వారాలను తెరుస్తున్నాయి.

          తనకన్నా చిన్నపిల్ల అయిన ఆమె మానసికంగా అంతటి పరిణితిని సాధించడం అతడికి వింత గొలిపింది.

          “సంతోషం దీప్తీ… పెద్దల పట్ల నీ వైఖరి మారడం చాలా బాగుంది. మీ అత్తగారి అడుగుజాడలలో నడవాలన్న నీ సంకల్పం చాలా గొప్పది. నీలా అందరూ ఆలోచించ గలిగితే భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరమే ఉండదు. కీప్ ఇట్ అప్…’’ మనస్ఫూర్తిగా
ఆమెను అభినందించింది సహజ.

          ఎందుకో ఆ మాటలు వాడిములుకులై తన మదిని నాటినట్లుగా అనుభూతి చెందాడు ప్రణవ్.

          మరునాటి ఉదయమే దీప్తి వెళ్ళిపోయింది.

          ప్రణవ్ దీప్తి మాటలు విని మారతాడా లేదా అన్నఆలోచనే కలగలేదు సహజకి. తన అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ తన ప్రవర్తన మార్చుకున్న దీప్తి అనుభవం ఆమెకో సందేశాన్నిచ్చింది. కామాక్షమ్మ విషయంలో ఏం చేయాలోనని మల్లగుల్లాలు పడుతున్న సహజకి తానేం చేయాలోనన్న స్పష్టత ఏర్పడింది.

          ‘ఎన్ని అవాంతరాలెదురైనా సరే… నాయనమ్మని మాత్రం విడిచిపెట్టేదిలేదు… ఆమె కోసం తాను ఏ పోరాటానికైనా సిద్ధం’ అనుకుంది నిబ్బరంగా.

          ఏ క్షణానైనా ప్రణవ్ తన దగ్గరకొచ్చి… “మనం అమ్మమ్మగారిని ఏ వృద్దాశ్రమానికీ
పంపద్దు ఇక్కడే ఉంచేసుకుందాంలే…’’ అని అంటాడేమోనన్న ఆశ మాత్రం ఆమెను వీడలేదు.

మనిషి ఆశాజీవి కదా!

***

కె.కె.భాగ్యశ్రీ గారి పరిచయం :

పేరు – కె.కె.భాగ్యశ్రీ.

పుట్టిన ఊరు – విజయనగరం, ప్రస్తుత నివాసం కూడా విజయనగరంలోనే. తల్లిదండ్రులు-శ్రీయుతులు గొడవర్తి పరాంకుశదాసు – శ్రీమతి విజయలక్ష్మి.

భర్త – ప్రముఖ రచయిత- శ్రీ కె.కె.రఘు నందన. పిల్లలు – చి. సందీప్, చి. దిలీప్

విద్యార్హతలు – బి.ఎ. (హిందీ), హిందీ ప్రవీణ, సంగీతంలో కొద్దిపాటి ప్రవేశం.

          అభిరుచులు – మంచి సంగీతం వినడం, పు స్తకాలు చదవడం, సినిమాలు చూడడం, అప్పుడప్పుడు పాడు కోవడం.

          ఇప్పటిదాకా దగ్గరదగ్గర మూడువందల కథలు, ఇరవై ఒక్క నవలలు, కొన్ని కవితలు, అన్ని ప్రముఖ పత్రికలలో ప్రచురితమైనాయి.. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ఒక ఆరు కథలు ప్రసారం అయినాయి.

          నా సాహితీ ప్రస్థానం 1998 లో ప్రారంభమైంది. స్వాతి, ఆంధ్రభూమి, విపుల, చతుర, నవ్య, తెలుగు వెలుగు, నది, ఆంధ్రప్రదేశ్, ఈ వారం, స్థానికపాలన, జాగృతి, సుప్రభాతం, గోతెలుగు అంతర్జాల పత్రిక, కెనడా డే తెలుగుతల్లి అంతర్జాల పత్రిక, మొదలైన ప్రముఖ దిన, వార, మాస పత్రికలన్నీ నా రచనలను ప్రచు రించి ఎంతగానో ప్రోత్సహించాయి.

          గతంలో స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన పదహారు వారాల సీరియల్స్ పోటీలో వరుసగా రెండుసార్లు ‘సాహిత్య ’ , ‘తీయని తలపులు ’ సీరియల్స్ కి పాతికవేల రూపాయల చొప్పున నగదు బహుమతి లభించింది. ఇటీవల స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన అపరాధ పరిశోధన సీరియల్స్ పోటీలో ‘ఉచ్చు ’ నవలకి లక్ష రూపాయల బహుమతి, అదే పత్రిక నిర్వహించిన ప్రేమ నవలల పోటీలో ‘ఒక జాబిలి- ఒక తారక’ సీరియల్ కి లక్ష రూపాయల బహుమతి లభించాయి.

          మరపు రానిది…నేను విద్య నభ్యసించిన మా విజయనగరం మహిళా కళాశాల పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో నా సహాధ్యాయులు, నాకు విద్య నేర్పిన గురువుల సమక్షంలో పొందిన ఆత్మీయ సత్కారం.

          ఇప్పటి వరకు ప్రచురించబడిన నా నవలలు , సీరియల్స్ – నిత్యవసంతం, గుండె గదిలో, ఒకే గూటిపక్షులు, మనోజ్ఞం, నేస్తమా, నివాళి, సాహిత్య , తీయని తలపులు , తీయని మోసం, జీవన మాధుర్యం, జీవన కలశం, తరుణీ చిత్రం, వలపు వెన్నెల, అవంతి, పగనీడలో, అంకురార్పణ, ఉచ్చు , ఒక జాబిలి ఒక తారక, నీ పేరు తలచినా చాలు, ఓ మనసా తొందరపడకే, కేవలపు సమీరం, మొదలైనవి.

          ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నో కథలు. నేను రాసిన కొన్నికథలు సమాజంలో కొందరు వ్యక్తుల జీవితంలో మంచి మార్పు కలుగజేశాయి అన్నది వాస్తవం. ఒక రచయిత్రిగా నా జన్మ ధన్యం అనే అనుకుంటాను. నా చుట్టూ ఉన్న సమాజంలో జరిగే సంఘటనలకు స్పందించి, వాటి ప్రేరణతో నా కథా వస్తువులను ఎంపిక చేసుకుంటాను. ఎక్కువగా మానవ సంబంధాల మీద రచనలు చేస్తూ ఉంటాను.

          నేను రచయిత్రిగా ఎదగడం వెనక మా శ్రీవారు ప్రముఖ రచయిత శ్రీ కె.కె.రఘు నందన గారి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. ఆయన సహకారం వల్లనే నా సాహితీ ప్రస్థానం నిరాటంకంగా సాగిపోతోంది.

          భగవంతుడు అవకాశమిస్తే సాహితీ సేవతో పాటుగా …నాకు వీలైన విధంగా సమాజ సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.