
చిత్రలిపి
-మన్నెం శారద
ఒక ఉషస్సు కోసం ….. నిద్రపట్టని ప్రతీ జామూ నేను నీ కై పదే పదే నింగి వైపు చూపులు నిగిడిస్తూనే వుంటాను చీకటి ఎంత కఠినమైనది …..!కరుగక దట్టమై పరిహసిస్తుంది ఎదురు చూసినంత మాత్రాన ఎలావస్తావు …. భూమికి ఆవల నీ పనిలో నీ వున్నావో ….లేక దట్టమైన మబ్బుల దుప్పటిలో దాగి కలలే కంటున్నావో …. ఎదురుచూపులో క్షణాలు సాగి సాగి కలవరపెట్టి కనులు మూతపడుతున్న సమయంలో నా కిటికీ పై పడివక్రీభవిస్తున్న ఓ వెలుగు రేఖ !పరవశించి పరుగెత్తుతానా … కొన్నే కొన్ని క్షణాలు మురిపించి దిక్కుమార్చుకుంటావు మరో దిక్కులో ఏ గవాక్షమూ లేదు నాకు …మరలా నా గదిలో చీకటి …కోపమేమీ లేదు నాకు నీపై … అంతులేని భక్తితో నీకు చేతులు జోడించి ఎదురు చూస్తూనే వుంటాను ….మరో ఉదయం కోసం !
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
