జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం!

-ఎడిటర్ 

       
          29-11-2022 నాడు సాయంత్రం ముంబై, నారిమన్ పాయింట్ లో గల నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్ ప్రాంగణంలోని టాటా థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో, తన కథా సాహిత్యానికి లాడ్లీ మీడియా జాతీయ పురస్కారాన్ని రచయిత్రి జూపాక సుభద్ర అందుకున్నారు. 23 కథలు కలిగిన ఇంగ్లీష్ కథా సంపుటి How are you Veg? ఈ పురస్కారానికి ఎంపికయ్యింది. ప్రముఖ నటి, డైరెక్టర్ నందితాదాస్ ఈ పురస్కారాన్ని సుభద్రకు అందజేశారు. కథా సాహిత్యం ద్వారా, దళిత మహిళలు, ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పై సమాజాన్ని చైతన్యపరుస్తున్నందుకుగాను సుభద్ర ఈ పురస్కారానికి ఎంపికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. United Nations fund for population సహకారంతో Population First ( WWW.Population First.org) అనే సంస్థ ఈ అవార్డులను నిర్వహిస్తున్నది.
 
          ఈ కథా సంపుటి లోని 23 కథలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వాచార్యులు అల్లాడి ఉమ గారు, ఎం. శ్రీధర్ గారు ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశారు. ఢిల్లీకి చెందిన స్త్రీ సమయ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
 
***

          జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచ పల్లెలో 18/6/1961 న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, హైదరాబాద్ లో అదనపు కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఈమె రచనలు ‘పంచాయితీరాజ్ లో దళిత మహిళల పాలన”, “అయ్యయ్యో దమ్మక్కా” కవితా సంకలనం –2009.  “రాయక్క మాన్యం” కథాసంకలనం-2014. ఇంకా కథలు, కవితలు, సాహిత్య, సామాజిక, రాజకీయ వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇంటర్వ్యూలు, నివేదికలు, పాటలు, దిన, వార, మాస, పత్రికల్లో అచ్చయినాయి. “భూమిక” స్త్రీవాద మాస పత్రికలో 2007 నుంచి ‘మాక్క ముక్కు పుల్ల గీన్నే పొయింది’ శీర్షికన అణగారిన సామాజిక వర్గాల స్త్రీల సమస్యల పై కాలిక వ్యాసాలు రాస్తున్నారు. 

          “చంద్రశ్రీ యాదిలో”(2013). రచనల సంకలనానికి సంపాదకత్వం వహించారు. “నల్ల రేగడి సాల్లు” మాదిగ, ఉపకులాల స్త్రీల కథల సంపుటి – 2006, 2. “కైతునకల దండెం” మాదిగ కవిత్వ సంకలనం – 2008. 3. “కమ్యూనిజమా కోస్తా వాదమా?” – 2008, వ్యాస సంకలనాలకు సహ సంపాదకత్వం వహించారు. ఉద్యోగ క్రాంతి, దళిత్ వాయిస్ మాస పత్రికల్లో సంపాదకవర్గ సభ్యురాలిగా పనిచేశారు. తమిళ రచయిత్రి బామ నవల “సంగది” ని ఇంగ్లీషు నుంచి తెలుగులోకి “సంగతి” గా అనువదించారు. 2006లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. పత్ర సమర్పణ : విశ్వ విద్యాలయాల యు.జి.సి. జాతీయ సెమినార్లలో సాహిత్య, సామాజిక అంశాలపై అనేక పరిశోధక పత్రాలు సమర్పించారు. ఈమె అందుకున్న పురస్కారాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సాహిత్య పురస్కారం – 2017. తెలుగు యూనివర్సిటీ సాహిత్య ప్రతిభా పురస్కారం – 2016, లాడ్లీ మీడియా స్పెషల్ అవార్డు – 2016. డాక్టర్ కవిత స్మారక పురస్కారం, కడప – 2015. తెలంగాణ మహిళా శక్తి పురస్కారం – 2015, అమృతలత – అపురూప అవార్డు – 2015, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం – 2015.  సామాన్య కిరణ్ ట్రస్ట్ వారి డాక్టర్ బోయ జంగయ్య చేతనా పురస్కారం –2014 9. సోమనాథ కళా పీఠం వారి సామాజిక శోధనా పురస్కారం – 2014, నందివాడ శ్యామల సహృదయ సాహితీ పురస్కారం – 2014, సమాజ్ భూషణ్ పురస్కారం (మహారాష్ట్ర) – 2013, దామోదరం సంజీవయ్య సాహితీ పురస్కారం-2013. నోముల కథా పురస్కారం – 2013. తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ కవయిత్రి పురస్కారం – 2011, డా.సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు అవార్డు – 2009,  వంశీ+ఆంధ్రప్రభ కవితల పోటీ ప్రథమ బహుమతి-2007. జి.వి.ఆర్. కల్చరల్ ఫౌండేషన్ కథ అవార్డు – 2007,  ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పురస్కారం – 2007,  రంజని కుందుర్తి వారి ఉత్తమ వక్త అవార్డ్, మైత్రేయ కళా సమితి, కథ అవార్డు, సంగారెడ్డి 2006., వి.ఆర్.సాహిత్య ట్రస్టు కథ అవార్డు., సచివాలయ చేతన కవితల పోటీ ప్రథమ బహుమతి మొత్తం 22 అవార్డులు అందుకున్నారు.  

          సచివాలయ మహిళా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు (1991) తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు “మట్టిపూలు” (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) రచయిత్రుల వేదిక (2008) వ్యవస్థాపక నాయకురాలుగా వున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సభలకు. ప్రతినిధిగా, పత్ర సమర్పకురాలిగా  ఆహ్వానించ బడ్డారు.

          నెచ్చెలిలో దళితులపై అన్యాయాల్ని ప్రశ్నిస్తున్న బలమైన గొంతుక “ఒక్కొక్క పువ్వేసి” అనే శీర్షికను నిర్వహిస్తున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.