విజ్ఞానశాస్త్రంలో వనితలు-1

ఉపోద్ఘాతం & ఎమ్మీ నెదర్

– బ్రిస్బేన్ శారద

       నడిచొచ్చిన బాట ఎప్పుడూ మరవకూడదన్నారు పెద్దలు. గతాన్ని తవ్వుకోవడమంత వృథాప్రయాస ఇంకోటుండదు, అని అనిపిస్తుంది మనకి. కానీ అలా గతాన్ని పునరావృతం చేసుకున్నప్పుడే మన ముందు తరాలు మన బాటని సుగమం చేయడాని కెంత శ్రమ పడ్డారో, ఎన్ని కష్ట నష్టాలకోర్చారో, దానికై ఎంత పాటు పడ్డారో మనకి అవగత మవుతుంది. అప్పుడే మనం అనుభవిస్తున్న స్వేఛ్ఛాస్వాతంత్రయాలనీ, జీవన విధానంలో లభిస్తున్న సౌకర్యాలనీ గౌరవించగలం.

       అన్ని రంగాల్లో స్త్రీలు సాధించిన సాధికారకతా, వికాసమూ ఒక ఎత్తైతే, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి ఒక ఎత్తు. పురుషులకే పరిమితమైన ఈ రంగాల్లో విద్యనభ్యసించడానికీ, దాన్ని సద్వినియోగం చేయడానికీ స్త్రీలు ఎంతో పోరాడాల్సి వచ్చిందన్న విషయం నిర్వివాదాంశం.

       దాదాపు ఇరవయ్యో శతాబ్దం వరకూ, ఆడవాళ్ళు కుట్లూ, అల్లికలూ, వంటలూ వార్పులూ, ముగ్గులూ, ఇంటిపనులూ నేర్చుకుని, కుటుంబాన్ని నడుపుకునే సామర్థ్యం వుంటేచాలని అనుకుంది సమాజం. ఇవే కాక ఇంకా చాలా విశాలమైన ప్రపంచం వుందనీ, దాన్లో నేర్చుకోతగ్గవి లేక్కలేనన్ని వున్నాయనీ, అవి నేర్చుకోవడానికి కావలసిన ప్రతిభా, మేధోసంపత్తి తమకూ వున్నాయనీ ఆడవాళ్ళు తమని తాము నమ్ముకోవడానికే ఎన్నో యేళ్లు పట్టిందనడంలో అతిశయోక్తి లేదు.

       ఇప్పుడు మరీ అంత కాకపోయినా, ఇంకా వైజ్ఞానిక శాస్త్ర రంగాల్లో, సాంకేతిక రంగాల్లో స్త్రీలు నిలదొక్కుకొని, ఎదిగి రావడం కొంచెం కష్టమే. నోబెల్ బహుమతి గణాంకాలు చూసినా, పరిశోధనాలయాల్లో గణాంకాలు చూసినా – సాంకేతిక వృత్తి విభాగాల్లో స్త్రీలకి పెద్ద ప్రోత్సాహం లభించడం లేదన్నది విశదమవుతుంది. గత ఇరవై యేళ్ళుగా ఆడవాళ్ళు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎక్కువగానే చదువుకుంటున్నా, కార్యాలయాలల్లో వీళ్ళ ఎదుగుదల మగవాళ్ళ ఎదుగుదల అంత వేగంగా వుండదు. చాలా చిత్రంగా, స్త్రీ పురుష సమానత్వాన్ని ఇల్లెక్కి ప్రబోధించే పాశ్చాత్య దేశాల్లో సైన్సూ, లెక్కలూ చదివే ఆడపిల్లల శాతం తక్కువ.

       ఈ ఇరవైఒకటో శతాబ్దంలో కూడా నాకు భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ వుందని, వృత్తిరీత్యా నేను వైజ్ఞానిక రంగంలో పని చేస్తాననీ చెప్పగానే “I have not seen a woman scientist so far”, అనే వాక్యం వినకూడనంత తరచుగానే వింటూ వుంటాను. బహుశా ఆ అనుభవమే నన్నీ వ్యాస పరంపర వ్రాయమని ప్రేరేపించింది కాబోలు.

        ఏ మాత్రం సహకరించని సాంఘిక, వృత్తిగత వ్యవస్థల్లో మన ముందు తరాలకి చెందిన స్త్రీలు వైజ్ఞానిక రంగాల్లో సాధించిన ప్రగతీ, వారి కృషి ఫలితాలూ తెలుసుకొని, ముందు తరాల ఆడపిల్లలని ఉత్సాహపరిచే ప్రయత్నమే ఈ వ్యాసాల ప్రయత్నం.

       మన తరం వాళ్ళు ఆ స్త్రీల మేధస్సునీ, వృత్తి పట్ల వారికుండే అంకితభావాన్నీ, అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యాన్నీ గుర్తించడానికీ-

       ముందు ముందు తరాల్లో లెక్కలూ, సైన్సూ చదవడంలో ఆడపిల్లలకి ప్రోత్సాహాన్నిచ్చేందుకూ ఈ వ్యాస పరంపర ఉపయోగపడుతుందని నా ఆశ.

       నేను ఎమ్మెస్సీ ఫిజిక్సు, రెండో సంవత్సరం చదువుతూ వుండగా నన్ను ముగ్ధురాలిని చేసిన సమీకరణం- ఎమ్మీనెదర్ ప్రవచించిన సమీకరణం (Noether’s theorem). ప్రకృతిలోని భౌతిక వ్యవస్థల స్వరూపాలని ఒకే ఒక సిధ్ధాంతంలో పొందుపరచిన శాస్త్రవేత్త ఎమ్మీనెదర్ గురించిన వ్యాసంతో ఈ పరంపర మొదలుపెడదాం.

***

గణిత, భౌతిక శాస్త్రాల వారధి- ఎమ్మీ నెదర్(1882- 1935)

       స్థూలంగా చూస్తే, మన చుట్టూవున్న ప్రపంచాన్నీ, చూడలేని అంతరిక్షాన్నీ, పరమాణు రూపాన్నీ భౌతికంగా అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేసేది భౌతికశాస్త్రం (ఫిజిక్స్). వైజ్ఞానిక శాస్త్రాలన్నిటిలోనూ కొంచెం కఠినమైనదని ఫిజిక్స్‌కి అపఖ్యాతి.

       భౌతికశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినవి రెండు విషయాలు. మొదటిది సునిశితమైన ఊహాశక్తి. పరమాణు రూపంలో దాక్కొని వున్న శక్తిని అర్థం చేసుకోవాలన్నా, గ్రహాల కక్ష్యలు తెలుసుకోవాలన్నా, కాంతి వేగం అంచనా వేయాలన్నా వుండాల్సింది మంచి ఊహాశక్తి. రెండోది, గణిత శాస్త్రం మీద మంచి పట్టు. భౌతిక శాస్త్రానిక్కావాల్సిన సూత్రాలన్నీ సమీకరణాల్లోనే వుంటాయి. మేథమటికల్ ఫిజిక్స్ అనే సబ్జక్టుని యూనివర్సిటీ విద్యలో కనీసం ఒకటి రెండు సెమిస్టర్లు నేర్చుకోక తప్పదందుకే.

       చాలా సార్లు లెక్కల్లో, ఆల్జీబ్రాలో కనుగొన్న సూత్రాలూ, సమీకరణాలూ ఏదో ఒక పరిమితమైన విషయానికి కాక సార్వజనీనకంగా వుంటాయి (Abstract Algebra). ఆకాశంలో తిరిగే దేవతను భూమ్మీదికి తీసుకొచ్చి మనుషుల లక్షణాలు అంటగట్టినట్తు, ఈ అబ్స్త్రాక్ట్ ఆల్జీబ్రా సిధ్ధాంతాలనూ, సమీకరణలాని భౌతిక ప్రపంచంలోని వ్యవస్థలకు (Physical Systems) అన్వయించినప్పుడు ఎంత క్లిష్టమైన భౌతిక వ్యవస్థ అయినా ఇట్టే అర్థమయిపోతుంది. అందుకే భౌతికశాస్త్రాన్ని అర్థం చేసుకొవడానికి గణితశాస్త్రం ఒక పనిముట్టు. భౌతికశాస్త్రం తనని తాను వ్యక్తీకరించుకునే భాష గణితశాస్త్రమని కూడా అనుకోవచ్చు. అటువంటి ఒకానొక గణిత సూత్రమే నెదర్స్ థియరం.

       ఒక భౌతిక వ్యవస్థ కొన్నిసార్లు పరివర్తన చెందినా మారనిదై వుంటుంది. దీనికి సిమెట్రీ అని పేరు. ఎక్కడైతే సిమెట్రీ వుంటుందో అక్కడ పరిరక్షితమైన (conserved) ఒక భౌతిక గుణం వుంటుంది. భౌతిక వ్యవస్థ (Physics system)పరివర్తనలో వున్న సౌష్టవానికీ (Symmetry), ఆ వ్యవస్థ పరిరక్షించుకునే భౌతిక గుణాలకీ (conserved quantities) గల సంబంధాన్ని వివరించే సూత్రమే నెదర్స్ థియరం. నెదర్స్ థియరం వల్ల భౌతిక వ్యవస్థల అధ్యయనం సులువైంది. భౌతిక వ్యవస్థలను అధ్యయనం చేయడంలో నెదర్స్ థియరం ప్రాముఖ్యత తెలియాలంటే ఒక చిన్న ఉదాహరణ చాలు.

       కాలి దెబ్బతిన్న బంతి ప్రయాణించే దారి(ట్రెజక్టరీ)ని లెక్క కట్టాలన్నా, తుపాకి నుండి వెలువడ్డ బులెట్ ప్రయాణం అర్థం చేసుకోవలన్నా, రాకెట్ నుంచి విడివడ్డ మిసైల్ని లక్ష్యం వైపు మళ్ళించాలన్నా, అన్నిటికీ వాడేది ఒకటే- న్యూటన్ గతి సూత్రాలు. న్యూటన్ గతి సూత్రాలు లేకపోయుంటే మనమంతా ఎక్కడో పురాతన కాలంలోనే చతికిల పడిపోయేవాళ్ళం. అలాగే, భౌతిక వ్యవస్థల సౌష్టవాలా, పరిరక్షిత గుణాలా అధ్యయనం నెదర్స్ సిద్ధాంతం లేకుండా చేయడం ఇంచుమించు అసాధ్యం.

       ఇంకా చెప్పాలంటే, భౌతిక వ్యవస్థలను ఒక వైపు న్యూటన్ గతిసూత్రాలూ, ఇంకోవైపు ఐన్‌స్టీన్ సాపేక్ష సిధ్ధాంత సమీకారణలూ అయితే, వాటిని సర్వత్రా నిర్వచించేది నెదర్స్ థియరం.

      నెదర్స్ థియరం నిజానికి రెండు సూత్రాల సమాహారం. ఆవిడ గణిత శాస్త్రానికి సమకూర్చిన ఆభరణాల్లో ఇదొక మచ్చు తునక మాత్రమే. ఇవే కాక మేథమెటికల్ రింగ్స్, నాన్ కమ్యుటేటివ్ అల్జీబ్రాల్లో ఆవిడ లెక్కలేనన్ని నిర్వచనాలని సూత్రీకరించారు.

      మార్చి 23 1882లో, జర్మనీలో యూదుల కుటుంబంలో జన్మించిన ఎమ్మీ నెదర్ గణిత శాస్త్రానికీ, తద్వారా భౌతిక శాస్త్రానికీ చేసిన సేవ ఇంతింత అనరానిది. ఆవిడ కృషి చేసిన గణితశాస్త్ర విభాగానికి “మేథమెటికల్ ఫిజిక్స్” అని పేరు.

      ఆవిడ తండ్రి మేక్స్ నెదర్ కూడా గణితశాస్త్ర బోధకుడు. అయినా ఆ రోజుల్లో ఎమ్మీకి గణిత శాస్త్రం అభ్యసించడానికి ఎటువంటి ప్రోత్సాహమూ లభించలేదు. పైగా తండ్రి పని చేసే యూనివర్సిటీలో ఆమెకి గణిత శాస్త్రం చదవడానికి దరఖాస్తు కూడా చేయనీయ లేదు. అయితే పట్టుదలతో ఎమ్మీ అక్కడ చదవడమే కాదు, 1907 లో లెక్కల్లో పీహెచ్‌డీ పట్టా కూడా పొందారు. అక్కడే ఎటువంటి వేతనమూ లేకుండా ఏడేళ్ళపాటూ విద్యార్థు లకి గణితం బోధించారు కూడా. ఆ బోధన చాలా వరకూ తండ్రి ఏదైనా కారణం వల్ల సెలవు తీసుకోవాల్సివస్తే, ఆయనకి సబ్-స్టిట్యూట్ లెక్చరర్ గా మాత్రమే అవకాశం వుండేది. అలా జీతమూభత్యామూ, గుర్తింపూ ఏదీలేని ఉద్యోగం చేస్తూనే ఆవిడ ఎన్నో పేపర్లు ప్రచురించారు. ఆ పేపర్లు ఆ కాలపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల దృష్టిలో పడ్డాయి.

      1915లో ఇంకో ప్రముఖ గణిత, భౌతిక శాస్త్రవేత్త డేవిడ్ హిల్బర్ట్ ఆమెని తాను పనిచేసే గాటింజెన్యూనివర్సిటీకి వచ్చి బోధించమని ఆహ్వానించాడు. అయితే స్త్రీలను అకడెమిక్ స్థాయిల్లో నియమించడానికి వీల్లేని రోజులు కావడంతో దాదాపు 1919 వరకూ ఆవిడ హిల్బర్ట్ పేరుతోనే బోధించేవారు. మొదటి ప్రపంచ యుధ్ధం ముగిసిన తరవాత ఆవిడకి గాటింగ్జెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పదవి నియామకం పొందారు. అయితే ఇంకా జీత భత్యాలు మాత్రం లేవు.

      ఆవిడ తరగతి గదుల్లో జరిగిన చర్చల నుంచి ఎంతో మంది భావి గణిత శాస్త్రవేత్తలు ఉద్భవించారు. యూనివర్సిటీ తరగతి గదులు రాత్రి వేళ మూసే సమయం వస్తే, ఆవిడ శిష్య బృందంతో సహా పార్కులో పచార్లు కొడుతూ చర్చలు సాగించేవారు.

      1928లో ఆవిడ మాస్కో యూనివర్సిటీ ఆహ్వానాన్ని మన్నించి, ఆల్జీబ్రా మరియూ జామెట్రీ బోధించారు. 1933లో తన తోటి యూదు శాస్త్రవేత్తల్లాగే అమెరికా వెళ్ళారు. అక్కడ ప్రిన్స్‌టన్ విశ్వ విద్యాలయంలో బోధనా, పరిశొధనలూ కొనసాగించారు.

      ఎప్రిల్ 14, 1935 న, తన యాభై మూడేళ్ళ వయసులో నెదర్ అనారోగ్య కారణాల వల్ల కన్నుమూసారు. ఆవిడ పేరు మీద ప్రపంచమంతటా ఎన్నెన్నో గ్రంథాలయాలూ, అవార్డులూ, విద్యా కార్యక్రమాలూ వున్నాయి. ఎమ్మీ నెదర్ కౌన్సిల్ ప్రపంచమంతటా ఆడపిల్లల్ని గణితమూ, భౌతిక శాస్త్రమూ చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ రకరకాల కార్యక్రమాలు చేపడుతూంది.

      తన బ్రతుకంతా ఎమ్మీ యూదు జన్మవల్లా, స్త్రీ కావడం వల్లా ఎంతో వివక్ష ఎదుర్కొన్నారు. దాదాపు గ్రాడ్యుయేషన్ వరకూ ఆవిడ తరగతి పాఠాలు కూర్చొని వినడానికే తప్ప, పరీక్షలు వ్రాసి పట్టాలు పొందటానికి వీలయేది కాదు. అటువంటి  పరిస్థితులలో నిరుత్సాహానికీ, నిర్వేదానికీ లోబడకుండా పరిశోధనపైనే ధ్యాస వుంచడం తపస్సు లాటిదే. అందుకే తన సమకాలీన శాస్త్రజ్ఞుల గౌరవాలనీ, అభిమానాన్నీ చూరగొన్నారు ఎమ్మీ నెదర్.

      ఆమె మేధస్సునే కాదు, నాజీల నరమేధం సాగుతున్న వేళ ఆమె ప్రశాంతతనూ, మొక్కవోని ధైర్యాన్నీ, హాస్య చతురతనూ ఆమె సమకాలీకులు చాలా మంది ఆరాధించారు.

      ఎమ్మీనెదర్ మనసులో గణిత శాస్త్రానికి తప్ప ఇంకె విషయానికీ చోటు ఇవ్వనట్టు కనిపిస్తుంది మనకి, ఆవిడ జీవితాన్ని చూస్తే. తాను ఎదుర్కొన్న రకరకాల వివక్షల గురించి ఆవిడ ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. అలంకరణా, వంటా, మిగతా ఏ విషయాల గురించీ ఆవిడ శ్రద్ధ చూపేది కాదు. జుట్టు విపరీతంగా పెరిగిపోయినా, క్లాసు రూము చర్చల్లో జుట్టు విడిపోయి మొహం మీదా భుజాల మీదా పడుతున్నా పెద్దగా లెక్కచెసేది కాదట ఆవిడ.

      ఆవిడకి గాటింజెన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ పదవి ఇప్పించడానికి డెవిడ్హిల్బర్ట్ పెద్ద యుధ్ధమే చేసారట.

      “ఉద్యోగ నియామకాల్లో, జీతాలివ్వడంలో ఆడా మగా తేడా యేమిటి? ఇది యూనివర్సిటీనా లేక పబ్ల్లిక్ స్విమ్మింగ్ పూలా?” అనిప్రశ్నించారట ఆగ్రహంగా. అయితే యూనివర్సిటీ అధికారులు ఆయన విన్నపాన్ని కొట్టిపారేసారు. ఆవిడని నియమించడానికి ఒప్పుకోలేదు. ఆవిడ హిల్బర్ట్ కోరిక మీద అక్కడ గణితం బోధించినా, అక్కడ వున్నన్నాళ్ళూ మగవాళ్ళ స్విమ్మింగ్ పూల్ లోనే ఈదేవారట. 

నెదర్గురించి వ్రాస్తూ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

      “నెదర్ వంటి సృజనాత్మక మేధావి స్త్రీ విద్య ప్రారంభమైన ఇన్నేళ్ళలో ఇంకొకరు లేరనడంలో అతిశయోక్తి లేదు,” అన్నారు. నిజానికి ఎప్పణ్ణుంచి లెక్క వేసినా ఆమె వంటి సృజనాత్మకమైన మేధావి ఇంతవరకూ లేరనడం అంతకన్నా పెద్ద నిజం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.