చిత్రం-45

-గణేశ్వరరావు 

‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో కుంభకర్ణుడిని నిద్రలోంచి భటులు లేపే దృశ్యానికి సహజ చిత్రకారుడు బాపు అద్భుతమైన రూప కల్పన చేశారు. ట్రిక్ ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ రవికాంత్ నగాయిచ్ కు ‘గలివర్స్ ట్రావెల్స్’ సినిమా స్ఫూర్తి కలిగించే ఉండవచ్చు. ఆ చిత్రీకరణ రహస్యాలను ఎవరైనా చెప్పాలనుకున్నా చెప్పలేరు, చేసి చూపించమంటే మాత్రం చూపించగలరు.          ఇక పోతే ఇది ఫోటో యే, తైల వర్ణ చిత్రం కాదు. ఫోటోగ్రఫీ లో అనూహ్యమైన సాంకేతిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీన్ని తీసింది స్పానిష్ ఫోటోగ్రాఫర్ వాన్ సాంచెజ్ కస్టేలో. కస్టేలో తన ఫోటోగ్రఫీ గురించి ఎంతో చెప్పారు, అయితే అది అతని విజయం వెనక వున్న రహస్యం గురించి చెప్పింది మాత్రం కొంతే..          ప్రతీ పురుషుడి విజయం వెనుక స్త్రీ అండదండలు ఉంటాయని అన్నట్లు, తన భార్యకు చిన్న బొమ్మల పట్ల ఉన్న అభిరుచి కస్టేలో కి పనికి వచ్చింది. ఆమె తన ఇంటిని బొమ్మల కొలువుతో నింపింది, కస్టేలో ఏమో beauty & fashion ఫోటోగ్రాఫర్. ఇకనేం, మొగుడూ పెళ్ళాల అభిరుచులే ఇలాటి ఆకర్షణీయమైన ఛాయా చిత్రాలకు దారి తీసాయి. landscapes లను ‘facescapes’ గా మార్చాయి.          కస్టేలో ముందు తన మోడల్ చేత తనకు కావలసిన హావ భావాలు ఆమె ప్రదర్శించే లా శిక్షణ ఇస్తారు, ఆమె మొహానికి క్లోజ్ అప్ లు కొన్ని తీస్తాడు. కొందరి వ్యక్తులకు పనివాళ్ళ దుస్తులు వేసి వాళ్ళ action shots తీసుకుంటాడు, తమ పనిలో నిమగ్నమైన పెయింటర్ ల ను మన కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ఆ అందాల రాశి మొహాన్ని వాళ్ళు రంగులలో తీర్చి దిద్దే పనిలో ఉన్నట్టు తను తీసిన ఫోటోలలో mix చేసి, ఎడిట్ చేసి చూపిస్తాడు ‘లిల్లిపుట్ పెయింటర్ లు’ జైంట్ అమ్మాయి ముఖ చిత్రాన్ని గీస్తున్న దృశ్యానుకరణను సృష్టిస్తాడు. ఒక బుల్లి చిత్రకారుడు ఆమె తల వెంట్రుకను పట్టుకొని ‘తోట రాముడు రాకుమారి అంత:పురానికి తాడు సాయంతో వెళ్తునట్టు’ పైకి ఎక్కుతూంటాడు. పర్వతారోహణలో ఒకరికొకరు సాయపడ్డట్టు మరొకడు ఆమె గోటి పై నిల్చుని పైకి చూస్తుంటాడు. మూడో వాడు ఆమె నాసికాగ్రం పై చేరాలనే పనిలో పడతాడు.          ఇలా body art తో miniatures ను జోడించి, అనూహ్యమైన విచిత్ర రూపాల కలయికకు కస్టేలో నాంది పలికాడు. ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంతవారలైనా… ‘ఈ సొగసు చూడ తరమా’ అని ఆశ్చర్యపోక తప్పదు.*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.