విజ్ఞానశాస్త్రంలో వనితలు-3

మొట్ట మొదటి మహిళా ప్రోగ్రామర్- ఆడా లవ్‌లేస్ (1815-1852)

– బ్రిస్బేన్ శారద

         విజ్ఞాన శాస్త్రం అంటే సాధారణంగా, భౌతిక శాస్త్రం, రసాయణ శాస్త్రం, జీవ శాస్త్రాలు అని అనిపిస్తాయి. ఎందుకంటే, ఈ శాస్త్రాలు మన చుట్టూ వున్న, అనుభవంలోకి తెచ్చుకో గలిగే జీవితాన్నీ, జీవరాసుల్నీ అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి కనక. ఈ అర్థం చేసుకోవాల్సిన ప్రపంచం కంటికి కనిపించే జగత్తయినా కావొచ్చు, కంటికి కనిపించని పరమాణు శక్తులైనా కావొచ్చు, గ్రహరాశుల కూటమి అమరిక అయినా కావొచ్చు.

         అయితే, నిజానికి మనిషికి ప్రకృతినీ, ప్రపంచాన్నీ అర్థం చేసుకోవడం ఒక్కటే లక్ష్యం కాదు. ఆ అర్థం చేసుకున్న ప్రకృతినీ, ప్రపంచాన్నీ తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనీ, తద్వారా తన బ్రతుకునూ, జీవన శైలినీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్న ఆశ కూడా మెండు. అందుకే విజ్ఞాన శాస్త్రాలతో (Science) పాటు యంత్ర పరిజ్ఞానం (Technology) కూడా పెంచుకున్నాడు మనిషి.

         సైన్సూ, టెక్నాలజీ స్నేహితుల్లాచేయీ పట్టుకొని, ఒకదాన్నిఇంకొకటి ప్రభావితం చెస్తూ మానవ జీవిత పరిణంలో పెద్ద పాత్ర వహిస్తాయి. టెక్నాలజీ మన జీవితాల్లో తెచ్చిన మార్పులు చూడటానికి పెద్ద కష్టపడక్కర్లేదు. మన చుట్టూ అవే. అయితే, అన్నిటికంటే పెను తుఫానులా మానవజీవితాన్ని చుట్టుముట్టి అనుకోని తీరాలకి విసిరేసింది మాత్రం కంప్యూటర్ టెక్నాలజీయే. అందుకే భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలతోపాటు కంప్యూటర్ సైన్స్ కూడా విజ్ఞాన శాస్త్రాల్లో ఒకటిగా పరిగణించబడుతూంది. అన్ని శాస్త్రాల్లాగే, కంప్యూటర్ సైన్సూ, కంప్యూటర్ టెక్నాలజీ పరస్పర ఆశ్రితాలు. 

         కంప్యూటర్ ని కనుక్కొన్న శాస్త్రజ్ఞుడు ఛార్లేస్ బేజ్ పక్కనే పనిచేస్తూ, కంప్యూటర్ ఉపయోగాన్ని లెక్కలు కట్టడంలోనే కాక ఇంకా ఎన్నో పనులకి వినియోగించొచ్చని ప్రతిపాదిస్తూ ప్రపంచంలో మొట్టమొదటి ప్రొగ్రామర్‌గా ప్రఖ్యాతి పొందారు ఆడా లవ్‌లేస్ (Ada Lovelace).

         పంతొమ్మిదో శతాబ్ది ఇంగ్లండులో స్త్రీలు లెక్కలూ, సైన్సూ చదువుకునే వీలే వుండేది కాదు. అలాటి రోజుల్లో, లెక్కల్లో మేధావిగా గుర్తింపు పొంది, ప్రపంచపు మొట్ట మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఎదగడమంటే మాటలు కాదు. ఆమె పేరుని ఒక కంప్యూటర్ భాషకే పెట్టుకొని ఆదరించింది తరవాతి సమాజం.

         డిసెంబర్ 1815 లో, ఇంగ్లండులో జన్మించిన ఆడా తల్లి తండ్రులు ఆనాటి బ్రిటిష్ సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులున్నవారు. ఆమె తండ్రి ప్రముఖ ఆంగ్లకవి , లార్డ్ బైరన్. లార్డ్ బైరన్ కీ, ఆతని భార్య లేడీ బైరన్‌కీ ఆడా ఒక్కతే సంతానం. ఆడా పుట్టిన కొద్ది వారాలకే బైరన్ భార్యనీ, బిడ్డనీ వదిలేసి, ఇంగ్లండుకి దూరంగా వెళ్ళిపోయాడు. అతనికీ, అతని బంధువులకీ వున్న కొంచెం మానసిక చాంచల్యం వంటి లక్షణాలు తన కూతురికి రావొద్దని బైరన్ భార్య (ఏన్నోయెల్ బైరన్) కూతురికి చిన్నప్పటినించీ శ్రద్ధగా ట్యూటర్‌ల తో చదువు చెప్పించారు. దాంతో చిన్నప్పటినించే ఆడా లెక్కల్లో ముందుండేది. ఆడా చిన్నతనంలో చాలా అనారోగ్యాల పాలయ్యేది.

         బైరన్ కూతురికి ఎనిమిదేళ్ళ వయసులో మరణించాడు. బైరన్ మీద కోపంతో అతని భార్య బిడ్డని తండ్రికి దూరంగా వుంచాలని ప్రయత్నించింది. కానీ ఆడా తండ్రి పైన చాలా ప్రేమను పెంచుకుంది. పెరిగి పెద్దై తన కొడుక్కి బైరన్ అని పేరు పెట్టుకుంది కూడా.

         ట్యూటర్ల సాయంతో చక్కగా చదువుకుంటున్న ఆడాకి ఆ రోజుల్లోని ప్రముఖ రచయితలతో పాటు గణిత మేధావులూ, శాస్త్రజ్ఞులతోటి పరిచయాలేర్పడ్డాయి. చార్ల్స్ డికెన్స్‌తో పాటు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞులు మైఖెల్ఫారాడే, డేవిడ్ బ్రూస్టర్ వంటి వారు ఆమెకి పరిచయమయ్యారు.

         ఆమె జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆమెకి గణితవేత్త మేరీ సోమర్‌విల్‌తో (Mary Somerville) పరిచయం. (ఈ మేరీ సోమర్‌విల్ గురించి చెప్పుకోవడానికెంతైనా వుంది. లెక్కలూ, ఆస్ట్రానమీలతో పాటు, ఆమె ఆడవాళ్ళకివోటు హక్కుకోసం పోరాడింది. ఆమె గురించి తప్పక ఒకసారి మాట్లాడుకుందాం.)

         మేర్సోమర్‌విల్ఆడాని ఛార్ల్స్బాబేజ్‌కి పరిచయం చేసింది. చార్ల్స్ అప్పటికే కంప్యూటర్ ని తయారు చేసే పన్లో వున్నాడు. అప్పుడు దానికి “డిఫరెన్స్ ఎంజిన్”, “ఎనాలిటికల్ఎంజిన్” అని పేర్లు. పదిహేడేళ్ళ వయసులో అద్భుతమైన తెలివితేటలు న్న ఆడా అతన్ని చాలా ఆకర్షించింది.

         ఇరవై యేళ్ళ వయసులో 1835 లో ఆడా విలియం కింగ్ అనే అతన్ని పెళ్ళి చేసుకుంది. కాలక్రమేణా అతనికి బ్రిటిష్ రాచరికం “ఎర్ల్ ఆఫ్ లవ్‌లేస్” గా ప్రకటించింది. అప్పుడూ ఆడా పేరు ఆడా లవ్‌లేస్‌గా మారింది. ఆ దంపతులకి ఇద్దరు పిల్లలు.

         పెళ్ళయిన తరవాత కూడా ఆడా చార్ల్స్‌కి డిఫెరెన్స్ఎంజిన్ పనిలో సహాయపడ సాగింది. ఆ రోజుల్లో (1843) తన దగ్గరికి ఒక ఫ్రెంచి దస్తావేజు వచ్చింది. దాన్ని ఆంగ్లం లోకి అనువదించి పెట్టమని ఆడాని అడిగాడు చార్ల్స్. ఆ దస్తావేజు అనువదించేటప్పుడు, కేవలం దస్తావేజు అనువాదమే కాకుండా తన ఆలోచనలూ, అభిప్రాయాలూ కూడా వ్రాసింది ఆడా. వాటిల్లో ఆ ఎంజిన్‌ని ఇంకా అభివృద్ధి పరచడానికి చాలా సూచనలు చేసింది.

         ఆ సూచనలన్నీ నేతకి ఉపయోగించే మర మగ్గాల నిర్మాణం ఆధారంగా ప్రతిపాదించబడ్డవి. ఆ నిర్మాణంతో ఎనాలిటికల్ఎంజిన్ కేవలం లెక్కలు కట్టడమే కాకుండా, వాక్య నిర్మాణమూ, అక్షరాల ముద్రణా చేయగలవి. అంటే ఒకరకంగా ఇదే మొదటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని చెప్పొచ్చు. అయితే దురదృష్టవశాత్తూ, చార్ల్స్‌కి ఎనాలిటికల్ఎంజిన్ పైన పనిచేయడానికి ఆర్ధిక వనరులు లభించలేదు. దాంతో తాత్కాలికంగా ఆ పనీ, ఆమె రాసిన ఆ నోట్సూ మూల పడ్డాయి.

         ఈ విషయాలేవీ వెలుగులోకి రాకుండానే, 1852లో ఆడా మరణించారు. ఆ తరవాత, దాదాపు వంద సంవత్సరాలకు 1953లో ఆడా వ్రాసిన నోట్సులన్నీ పుస్తకంగా ప్రచురించ బడ్డాయి. అప్పటికి కానీ అర్థం కాలేదు, పూర్తి కంప్యూటర్ కనుక్కోకముందే ఆడా, కంప్యూటర్ భాషల గురించి ఆలోచించ గలిగారు.         

         అందుకే తరవాతి తరాలు ఆమెని ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా కీర్తించాయి. అమెరికన్ రక్షణ రంగం ఒక కంప్యూటర్ లాంగ్వేజీకి ఆమె పేరు పెట్టి గౌరవించింది.

(ఆడా లవ్‌లేస్ చిత్రం. మూలం : ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.