మనకి తెలియని అడవి – ధరణీరుహ 

-వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

          ధరణీరుహ అనే ఈ పుస్తకం గురించి కొన్ని నెలల క్రితం చిన వీరభద్రుడు రాసిన వ్యాసం ద్వారా తెలుసుకుని ఆ పుస్తకం సంపాదించడానికి తహ తహ లాడాను.

          మనం గట్టిగా కోరుకుంటే దొరకనిది ఉండదు కదా. రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు కాపీలు నన్ను చేరేయి.

          ధరణీరుహ అంటే చెట్టు అనే కదా. బహుశా అరణ్యపు అందాల గురించి సౌందర్యాత్మకమైన దృష్టితో ఈమె రాసి ఉంటారని అనుకున్నాను. నిజానికి వీరభద్రుడు అందులో ఏముందో సవివరంగా చెప్పినా నేను ఎందుకో అరణ్య సౌందర్యం ఉంటుం దన్నట్టుగా మొదలుపెట్టాను.

          కానీ ఈ పుస్తకంలో ఉన్న ఒక్కొక్క వ్యాసమూ చదువుతూ ఉంటే అడవి గురించి మనకి ఏమీ తెలియదు అనిపించింది. మనకి అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మన లాంటి సాహిత్య పాఠకులంతా ఈ పుస్తకం చదివేక అదే మాట అంటారు.

          నిజానికి పుట్టాక పదేళ్ల వయస్సు వచ్చే దాకా నేను గిరిజన ప్రాంతంలో, అడవుల మధ్య ఉన్న గ్రామంలోనే ఉన్నాను. ఊరికే రకరకాల చెట్లు, కాలిబాటలు, ఏర్లు, వెన్నెల లు, గిరిజన పాటలు తప్ప ఇంక వేటి మీదకి దృష్టి పోలేదు. ఇప్పటికీ ఈ పుస్తక చదివే దాకా కూడా ఇంతే.

          దేవనపల్లి వీణా వాణి గారు తెలంగాణా రాష్ట్ర అటవీశాఖలో వన్య సంరక్షక సంబంధిత అధికారి. అడవితో తన కాలాన్ని పెనవేసుకుని ప్రతి చిన్న విషయాన్ని కుతూహలంతో, ఆసక్తితో గమనిస్తూ దాని తాలూకు మూలాలను ప్రాక్, పశ్చిమ శాస్త్రాల నుంచి, ఆయా శాస్త్రజ్ఞుల నుంచి తెలుసుకుంటూ వచ్చారు. వాటి వివరాల కోసం చరిత్ర ను ఆసరాగా చేసుకుంటూ తవ్వుకుంటూ వచ్చారు.

          ఇందులో ఉన్న 15 పెద్ద వ్యాసాలు చదువుకుంటూ వెళుతున్నప్పుడు అడవి గురించి మనకు ఎవరికీ కూడా ఏమీ తెలీదు అని మరొకసారి గట్టిగా అనిపించింది.

          అడివేకాదు అసలు పర్యావరణం అనే మాటను ఎంత విరివిగా వాడుతున్నామూ, కానీ దాని గురించి ఎంత తక్కువ తెలుసు అని కూడా అనిపించింది. బహుశా వీణావాణి గారు ఈ లోటు పూరించడం కోసమూ, నా వంటి వారికి సంపూర్ణమైన పర్యావరణ జ్ఞానాన్ని అందించడం కోసం ఈ పుస్తకాన్ని రాసి ఉంటారు. అందుకే ముందుమాటలో ఇలా రాశారు.

          “నేటి పరుగుల యుగంలో తనకూ ప్రకృతికి, ప్రకృతికి సంస్కృతికి, సంస్కృతికి నాగరికతకు ఉన్న సంబంధం, వాటి మధ్య ఉన్న అవినాభావపు లంకెలు గుర్తించగలిగే తీరుబడి లేకపోవడం ఒక కారణమైతే, ఒక అవగాహన కలిగించే రచనలు లేకపోవడం మరొక కారణం. సాహిత్యకారులు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ, పరిశోధకులు రహస్యా లు అన్వేషిస్తూ విడివిడిగా ప్రకృతి గురించి రాస్తూ వచ్చారు. కానీ వాటి మధ్య ఒక వారధి నిర్మించటం, తెగిన సున్నితపు లంకెలను కలుపుకోవటం, జీవ నైతిక నియమాలు పాటించటం చెప్పనవసరం లేని లక్ష్యాలు. వాటి కోసమే ఈ రచన చేస్తున్నాను ” అని చెప్పారు.

          “ఇంకా ఈ అడవిలో వచ్చే వ్యాసాలు అడవిని, వృక్ష, జంతు, జాలాలని వాటితో మానవునికి గల సంబంధాలను, పరిశోధనలను, చరిత్రను, వికాసాన్ని, వారసత్వాన్ని కలగలుపుతూ ఆయా అంశాలను ఆవిష్కరిస్తూ ఒక సామాన్యునికి అడవి పట్ల, తమ ప్రాకృతిక బాధ్యతల పట్ల, జీవన నైతిక నియమాల పట్ల కనీస అవగాహన కలిగించటమే బాధ్యతగా పెట్టుకుని రాసినవి”

          ఇవి ఆమె మాటలు. మనం ఈ 15 వ్యాసాలు చదువుతున్నప్పుడు అక్షరాక్షరంలోనూ ఆమె తీసుకున్న ఈ బాధ్యత నూటికి రెట్టింపు శాతం సాధించినట్లుగా మనకు అనుభవం అవుతుంది. నేను ఈ వ్యాసాలన్నీ చదువుతూ చెప్పలేని విభ్రాంతికి  లోనవుతూ, ఒకింత సిగ్గుపడుతూ వచ్చాను.

 
          ఇవి 15 వ్యాసాలు. వీటి గురించి టూకీగా నాలుగు మాటలు చెప్పటం ఇష్టం లేదు. అందువల్ల నాకు తోచిన ఒక్కొక్క వ్యాసం గురించి ఇక్కడ రాయాలన్నది నా ప్రయత్నం.
ప్రతీ వ్యాసం వెనుకా ఆమె పరిశోధన, క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు ఆమె ఆవేదన నన్ను బాగా కదిలించింది.
 
          ఒకరకంగా ఆమె అడవి లో భాగమైపోయారని అనిపించింది. అడవి అంటే అక్కడ మనం గమనించని ప్రతీదీ ఆమె కళ్లముందుకు వచ్చి నిలబడింది.
 

          అవి కప్పలు, పుట్టగొడుగులు, శిధిలాలయాలు, గడ్డిపరకలు ఇలా అన్నీ మనకికొత్తవి కానివి, కానీ నిర్లక్ష్యం చేయబడినవి. పర్యావరణ రక్షణకు మిక్కిలి అవసరమైనవి. ఆమె ఇందులో వాటినే సర్వ సమగ్రంగా మనకి చూపెట్టారు.

          వాణి గారు మొదటి వ్యాసం శీర్షికే ప్రతి చోటూ పూలవనమే అంటూ మొదలుపెట్టారు. చెప్పొద్దూ!! నేను పూల పిచ్చిదాన్ని కదా. ఏదో ఊహిస్తూ మొదలు పెట్టాను. కానీ ఆమె నేను ఊహించిన దానికన్నా భిన్నంగా, విస్తృతంగా, అద్భుతంగా ఆ వ్యాసం నిర్వహిం చారు. ఇందులో ప్రతి వ్యాసమూ ఆమె ఉద్యోగ నిర్వహణలో భాగంగా రోజులో మొదటి భాగం అంతా అడవిలో తిరుగుతూ చేసిన ఆలోచనల సారం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతం.

 

          అలా ఆగష్టు మాసంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా పొద్దున్నే అడవికి బయలుదేరడంతో వ్యాసం మొదలవుతుంది.

          ఇందులో అడవిలో చెరువులు వాటి కట్ట చుట్టూ పెరిగే పేరు తెలియని పువ్వులు ఎన్నో సున్నితమైన మొక్కలు గురించి రాస్తూ రాస్తూ ఇలా అంటారు.

        “వర్షాలు సకాలంలో కురవకుండా ఉన్నందున సాగు చేయకుండా వదిలేసిన వ్యవసాయ క్షేత్రాల్లో కొద్దిసేపు పూసే పూల అందాలు చెప్పతరం కాదు. ఒక చెరువు కట్ట వద్ద తుమ్మ చెట్టు పొదల మీద తెల్లని రంగు పూల పై వంగరంగు గీతలు కలిసిన తీగ. చెట్టే తానేమో అన్నంతగా పెరిగిపోయింది. ఆ పూలకాడ ఎంత సున్నితంగా ఉందంటే గాలి బరువు కూడా మోయలేనంత. వాటి పూలు రూపాయి బిళ్ళ పరిమాణంలో ఉన్నాయి దూరం నుంచి చూసే వాళ్లకు అది తీగ కాదు చెట్టే అలా ఉందేమో అని భ్రమ కలిగిస్తుం ది. ఆ తీగ ఎక్కడ ఉన్నా కూడా ఎండిన పొదల మీదే ఉంటుంది కానీ విడిగా ఉండదు. దీన్ని దూదిపాల మొక్క అంటారు.

 
          ఇక మరికొంత దూరం వెళ్తే మూడు హెక్టార్ల పైననే రోడ్డు మీద నుంచి చెరువు వరకు గులాబీ వనం. కనుచూపుమేర పూలతో చెరువు అంచును కలిసేదాకా ఉన్నాయి ఈ పూలు. దీనిని ఎవరూ గమనించినట్టు లేదు. నాలుగు రెక్కలు కలిగిన పువ్వు. నేనే ఇలాంటి గులాబీ రంగు పూలవనాన్ని మొదటిసారిగా ఈ ప్రాంతంలో చూశాను ఈ మొక్కలు అర మీటర్ పొడవు వరకే పెరుగుతాయి కానీ లేత గులాబీ వన్నె పూలు.
 
          ఇలా ఋతువు ఋతువుకూ వికసించే అందమైన మొక్కలన్నీ ఎక్కడ పోయాయో కానీ ఇక్కడ మాత్రం విరగబూసాయి. అంటూ మనకు తెలియని అడవి పూలను పరిచయం చేస్తారు. ఇలా ఎక్కడికి వెళ్లినా ఈ కాలమంతా రంగురంగుల పూలతో వానకు కొట్టుకుపోని రంగవల్లికలు వేసి ఉన్నట్టు అనిపిస్తుంది. మనం కలుపు మొక్కలుగా పెరికి వేసే మొక్కలు అవకాశం దొరికితే నేలకు రంగులద్దడానికి సర్వదా సిద్ధంగా ఉంటాయని నిరూపించినట్టు అనిపించింది.”
 
          ఇంతవరకు ఆమె అడవిలో మన దృష్టి పడని పూలను వర్ణించిన సౌందర్య దృష్టి కనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి ఆమె ఈ నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన అజ్ఞాత పుష్ప జాతులను గుర్తుపట్టడానికి తీసుకున్న శిక్షణల గురించి, దాని ద్వారా ఆమెకు లభించిన జ్ఞానం గురించి వివరంగా చెప్పుకొస్తారు.
 

          భారతదేశం అంతటా ఎక్కడ ఏ ఏ పర్వత ప్రాంతాల్లో, కనుమల్లో, ఏ ఏ రుతువుల్లో ఏ పూలు పూస్తూ వచ్చాయో వాటిని ఏ విధంగా చరిత్రకు ఎక్కించడానికి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయో వివరంగా రాసుకొస్తారు.

          నందా దేవి పర్వతం కనుమలో ఉన్న పూల లోయ యోగులను కూడా ఆకర్షించిన పుష్పవతి లోయ. దాని గురించి చెబుతూ దీని గురించి 1931 వరకు బయట ప్రపంచానికి తెలియదని రాస్తూ ఫ్రాంక్ స్మిత్ అనే బ్రిటిష్ పర్వతారోహకుడు ఎరిక్స్ సిప్టన్, హోల్డ్ వర్త్ తో కూడిన బృందం తమ పర్యటనలో భాగంగా దీనిని కనుగొన్నాడని చెప్తారు. ఆయన తను చూసిన ఈ అపూర్వ దృశ్యం మీద ది వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ పేరుతో ఒక పుస్తకం రాశాడు ఇది 1938లో ప్రచురణ అయింది. నిజానికి దీని పేరు బ్యుందర్ లోయ కానీ ఆయన రాసిన పుస్తకం పేరుతో ఫ్లవర్ లోయగా మారిపోయింది.

          భారతదేశమంతటా ఆయా ప్రాంతాలలో పుష్పవనాల అధ్యయనం తగినంతగా జరగక పోయినా కొన్ని ఔత్సాహికుల పరిశోధనల గురించి, పరిశీలనల గురించి కూడా చెప్తారు.

          ఎరిక్ ఫ్రాంక్ పర్వతారోహుడై 23 పుస్తకాలు రాస్తే అందులో మనదేశంలోని అనుభవా లు మీద మూడు పుస్తకాలు రాశారట. ఇక్కడ ఆమె ఒక చిన్న లేదా పెద్ద సంగతి చెప్తారు.

          ఫ్రాంక్ పుస్తకం ద్వారా పూల లోయ గురించి తెలుసుకున్న రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్ వారు 1939లో మార్గరెట్ లెగ్గి అనే పరిశోధకురాలిని పరిశోధన కోసం పంపారు. ఆమె ఆ పూల లోయలో పరిశోధన చేస్తూ కొండలోయలో జారిపడిమరణించింది. ఆమె మరణానంతరం ఆమె చెల్లెలు అక్కను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి అక్క దొరకక పోయినా చివరిదాకా ఆ పూల సౌందర్యానికి ముగ్దురాలై అక్కడే ఉండిపోయింది. అక్క జ్ఞాపకార్థం అక్కడే ఒక సమాధి నిర్మించింది. ఇప్పటికీ ఆ పూల లోయకు మార్గరెట్ లెగ్గి జ్ఞాపకార్థం ఇంపేశన్స్ లెగ్గి అన్న పేరుతో పలుకుతారు.

          ఇలా పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు శివాలయాలు, నాగాలాండ్, మణిపూర్, రాష్ట్రాల సరిహద్దు లోయలు, మధ్యభారతంలోని సహ్యాద్రి పర్వతాల మధ్యనున్న పీఠ భూమి ఇలా ఎక్కడెక్కడున్న పూల వనాల గురించి ఆమె వివరంగా రాసుకొచ్చారు.

          అయితే ఇవి కొన్నిచోట్ల ప్రభుత్వాల దృష్టికి వచ్చి రక్షణకు నోచుకున్నా, కొన్నిచోట్ల ఆ రక్షణ దొరకని పరిస్థితి ఇంకా ఉంది. చివరిగా ఇలా అంటారు.

 

          “ఈ రోజు ఇక్కడ మొలిచినట్టే ఈ వర్ష ఋతువులో అంతటా ఈ చిన్ని చిన్ని పూల వనాలు నిద్ర లేచి ఉంటాయి. మళ్ళీ ఏడాది దాకా ఆ మట్టిలోనే తమ విత్తనాలను దాచి పెట్టి మళ్ళీ ఏడాది కోసం ఎదురుచూస్తాయి. వాటి భాగ్యం కొద్దీ ఆ మట్టి నిర్లక్ష్యంగా విసిరి వేసిన అగ్గికి అర్పితం కాకపోతేనో, సాగు చేయబడకపోతేనో, చేసిన గట్ల మీద మొలకలు శిరసు మీద కలుపు మందు చల్లకపోతేనో, మొగ్గ పట్టక ముందే గడ్డి కోసం కోత కోయక పోతేనో తప్ప మళ్ళీ ఈ రోజు నా ముందు కనిపించినట్టుగా కనిపించి నవ్వలేవు. వాటి సంతతిని కొనసాగించలేవు.”అని దిగులు పడతారు.

          చివరిగా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయి వెనక్కి వెళ్తూ వెళ్తూండగా,  పొద్దున్నే విచ్చుకున్న పూలు రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తున్నట్టుగానే సన్నగా గొణుకు తున్నాయి అంటారు. ఆ గొణుగుడు బహుశా ఇదేమోనని పూర్తి చేస్తారు. ” మీరు లేని ప్రతి చోటూ పూలవనమే”

          ఈ వ్యాసంలో ఆమె భారతదేశం అంతటా ఉన్న అనేక పూల జాతులు ప్రభుత్వాల సంరక్షణలో ఉన్నవి చెప్తూనే, ఎవరి సంరక్షణకు నోచుకోని పొలాల గట్ల మీద పూసిన అడవి పూల ప్రస్తావనను మన ముందుకు ప్రధానంగా తేవడం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తూ నా చూపులు విశాలం చేసి మరింత సౌందర్యానికి సన్నద్ధం చేసింది. అయితే ఇలాంటిది మరికొంత మంది ప్రకృతి ఉపాసకులు రాయవచ్చేమో గానీ తర్వాతి వ్యాసం పురస్థాపనం మాత్రం ఎవరూ రాయలేరేమో??

          దీనికి పూర్తి విరుద్ధమైన వ్యాసం అది. స్థానిక జాతులను, పర్యావరణాన్ని, నేలను, నేలలో దాగిన విత్తనాలను నాశనం చేస్తున్న పలు జాతుల మొక్కలు, పూలు, వాటి దురాక్రమణ విదేశీ దండయాత్రలుగా పోలుస్తూ రాశారు.

 

ధరణీరుహ- రెండో వ్యాసం-పురస్థాపనం

ఇప్పుడు మన నేలకు పనికిరాని, సంబంధంలేని, పైగా మన పర్యావరణాన్ని, ఇక్కడి వృక్షజాలాన్ని బతకనివ్వకుండా చేసి, జంతుజాలానికి హాని చేసే అనేక వృక్షజాతుల గురించి ఈ రెండో వ్యాసంలో రాసుకొచ్చారు.

          దీనికి ఆమె పురస్థాపనం అని పేరు పెట్టారు ఒకచోట నుంచి మరొక చోటికి జీవుల సహజ ప్రయాణం వ్యాప్తి అయితే, మానవుల ద్వారా ప్రవేశ పెట్టబడడం పురస్థాపనం అవుతుందట. పురస్థాపనం చెందిన జాతులు కొన్ని అత్యంత ప్రమాదకర విస్తరణ చెందడం ఇప్పుడు అడవులకు ఉన్న అతిపెద్ద సమస్య. గత కొంతకాలంగా ఈ సమస్య విస్తృతమైంది.

          చెప్పొద్దూ!! ఈ మాటలు నిజంగానే నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసాయి.మనుషు ల వలసలు గురించి తెలుసు కానీ మనుషుల ద్వారా జరుగుతున్న ఈ పురస్థాపనల గురించి ఇదే మొదటిసారి చదువుతూ ఉన్నాను.

          4 ఏళ్ల క్రితం లంబసింగి నుంచి రాజవొమ్మంగి వస్తూ ఉండగా దారంతా విరగబూసిన మొక్కలు చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగా, ఒక రకంగా చెప్పాలంటే ఆ పూలు చూసి సరదా పడుతుంటే మా మిత్రుడు పంచాయతీ సెక్రటరీ రవి “ఇవి మంచి మొక్కలు కాదండి వయ్యారిభామ మొక్కలని చాలా చెడ్డ జాతి చుట్టుపక్కల వాటిని ఇది పైకి రానివ్వదు” అన్నాడు.

          ఓహో ఇలా కూడా ఉంటుందా అనుకున్నా.

          ఇప్పుడు ఈ వ్యాసంలో లక్షల హెక్టార్లలో వ్యాపించిన అనేకానేక విదేశీ జాతులు మన నేలకు చేస్తున్న అన్యాయాన్ని గురించి, పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి వీణవాణి గారు రాసింది చదువుతుంటే వెయ్యిరెట్లు ఆశ్చర్యమే కాక నా అజ్ఞానం కొంత కొంతగా అరగదియ్యబడుతూ వచ్చింది.

          ఆ జాతుల గురించి నాలుగు మాటలు  చెప్పాలని ఉంది కానీ, ఇది చాలదు వివరంగా తెలుసుకోవాలంటే ధరణిరుహ పుస్తకం చదవాల్సిందే.

          వర్షాకాలం మొదలవగానే అటవీ శాఖ వారు అడవుల్లో స్థానిక జాతుల యొక్క విత్తనా లు ఎంత శాతం మొలుస్తున్నాయి అన్న విషయాన్ని అధ్యయనం చేస్తారట.

          దానివల్ల ఆయా అడవుల్లోని ఆవరణ వ్యవస్థలోని మార్పుని అంచనా వేస్తారు. కొత్త మొక్కలను నాటేటప్పుడు ఆ అడవిలో ఉండే జంతువుల మనుగడకు అవసరమయ్యే వాటినే ప్రధానంగా నాటుతారట. ఈ నేపథ్యంలో వీణావాణి గారు పురస్థాపనం గురించి రాశారు.

 
          వయ్యారిభామ మొక్కలు గాని, పులికంప గాని, మహావీర గాని ఇవి చర్చల వల్ల అందరికీ తెలిసేయి. ఇవి మన దేశానికి ఎక్కడెక్కడ దేశాల నుంచి వలసలు వచ్చేయో ఆమె వివరంగా రాశారు.
 

          వయ్యారిభామ మొక్క గురించి ఇలా చెప్తారు. 1956లో భారత ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫుడ్ ఫర్ పీస్ కార్యక్రమాల్లో భాగంగా మనకు గోధుమలు దిగుమతి అయ్యేవి. దీనికే పి. ఎల్ 480 అని పేరుట. ఇలా వయ్యారిభామ విత్తనం మన దేశం చేరిందిట.

          ఇక ఈ మధ్యకాలంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లతో పాటు దేశవ్యాప్తంగా అడవు లకు సమస్యగా మారిన మహావీర మొక్కను అరికట్టడం చాలా కష్టమైన పని. ఇది ట్రాఫికల్ అమెరికా నుంచి దిగుమతి అయింది. ఇది ఇక్కడి మొక్కలు హానిచేసే జాతి అని 19 శతాబ్ది లోనే శాస్త్రవేత్త లు గుర్తించారు. ఆ పరిశోధన వివరాలన్నీ రచయిత్రి రాస్తారు.

          ఈ మొక్కల చిన్న చిన్న పూలు చూస్తే ఓడల నిండా కొత్త కొత్త ప్రాంతాలలో దిగి, ఖండాంతరాలు దాటి, అమాయక దేశాలను ఆక్రమించుకున్న తెల్లవారే కనిపిస్తారు. అంటారు.

          కారణం ఈ మొక్కలు మొలిచిన చోట స్థానిక జాతుల మనుగడ దాదాపు యుద్ధమే. చాలా సందర్భాల్లో స్థానిక వృక్ష  జాతులైన మొక్కలన్నీ ఓడిపోతాయి. అక్కడ ఆవరణ వ్యవస్థ కూడా అస్తవ్యస్తమైపోతుంది.

          నిజానికి మొక్కజొన్న, టమాటో, మిరపకాయలు, ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, అమెరికన్ పత్తి అనేక రకాల అలంకరణ మొక్కలు ఇలా భారతదేశానికి వలస వచ్చినవే. ఇది మన అవసరాలలో ఏర్పడిన ఖాళీలను పూరించ డానికి చేసే ఒక ప్రక్రియ. ఇది సహజంగాను, అత్యంత నెమ్మదిగాను జరగాలి. అలా జరగకపోతే బాధ్యత ప్రకృతే తీసుకుని సమతుల్యత కాపాడుతుంది. మానవుల వల్ల బలవంతంగా జరిగితే మాత్రం నియంత్రణ ఉండదు. ప్రకృతి అదుపులోకి రావు. జీవుల మధ్య ఉండే సున్నితమైన సంబంధం తెగిపోయి అంతా అస్తవ్యస్తమవుతుంది.
ఇదంతా చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలగదా!!

 
          ఇంకా మరికొన్ని విషయాలు భయం కలిగిస్తాయి. పురస్థాపన చెందిన కొన్నిజాతులు అత్యంత ప్రమాదకర విస్తరణ చెందటం ఇప్పుడు అడవులకు ఉన్న అతిపెద్ద సమస్య. మన దేశంలో విస్తరిస్తున్న జాతుల సంఖ్య 173 అని ఒక నివేదికలో చెప్పారట. అందులో ఒక్క పులికంప జాతి ఆక్రమించుకున్న స్థలం దాదాపు 13 మిలియన్ల హెక్టార్లు. ఈ పులికంపను పూర్వం బ్రిటిష్ వారు ఉద్యానవనాల్లో పూల మొక్కలుగా పరిచయం చేశారు. అంటే పులి కంప వల్ల 13 మిలియన్ హెక్టార్ల నేల సహజమైన మొక్కలకు స్థానంలేకుండా చేసింది.
 
          ఇక మనకు తెలిసిన యూకులిప్టస్ పేరుతో ఉన్న నీలగిరి చెట్లు వేల ఎకరాల నేలలు ఆక్రమించుకుని ఇక్కడి మొక్కలకు జీవితం లేకుండా చేస్తున్నాయి అంటారు. అప్పటి మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాను  ఆస్ట్రేలియా నుంచి తెప్పించి బెంగళూరు దగ్గర ఉన్న నంది హిల్స్ మీద తన ఉద్యానవనంలో ఈ యూకలిప్టస్ మొక్కలు నాటించేరుట.
 
          అలా 1960 దాకా వీటిని విస్తృతంగా అభివృద్ధి చేశారు. కొన్నిఅతి తక్కువ ఉపయోగాలు ఉండుగాక. వీటి వ్యాప్తి వల్ల ఎంత ప్రమాదం అంటే ఈ నీలగిరి వనాల్లో ఒక కలుపు మొక్క కూడా ఉండదు. అయితే ఈ నీలగిరి  మొక్కల స్రావాలలోని రసాయనా లను కూడా ఎదిరించ గలిగినవి మహావీర మొక్కలు. ఈ మహావీర మొక్కలు నీలగిరి వనాల్లో బీభత్సంగా విస్తరించటం ఆమె  గమనించాను అంటారు.
 

          ఇలా ప్రవేశపెట్టబడిన అనేక జాతుల మొక్కలను గొర్రెలు గానీ మేకలు గాని తినవు. వీటిలో ఉండే ఒక రకమైన వాసన, దానికి కారణమైన రసాయనాలు అందుకు కారణం.

          ఇలా వీటి గురించి చెప్తూ వీణావాణి గారు ఏమంటారూ అంటే ఇటు వంటి విధ్వంసా న్ని కలిగించే మొక్కలు స్థానిక జాతులను అడ్డుకుంటాయి. జంతువుల బారి నుంచి తప్పించుకుంటాయి. ఆహార మైదానాలను ఆక్రమిస్తాయి. ఈ నేలకు సహజమైన మొక్కలు తమ ఆవాసాలు కోల్పోతాయి. చివరికి అంతరిస్తున్నాయి. ఇది పర్యావరణానికి సంబంధించిన పెనుముప్పు అని ఈ వ్యాసం అంతటా పదేపదే హెచ్చరిస్తూ వచ్చారు.
పైగా దీన్ని మధ్యయుగాల్లో రాజ్య విస్తరణ కాంక్షకు, దానికి మానవజాతులు బలైపోవ టానికి సమానంగా పోల్చుతూ వచ్చారు.

          మరికొన్ని విషయాలు ఇలా హెచ్చరించారు.

          ఇప్పటిదాకా వచ్చిన విదేశీ జాతుల మొక్కలు యాదృచ్ఛికంగానూ లేదా వాటి విస్తరణ విధానాన్ని తక్కువగా అంచనా వేయటం వలన జీవన విధానం లయ తప్పింది గాని, మన అలవాట్లు తెచ్చిన ముప్పు ప్రకృతికి ఇంకా చెడ్డది.

          మనం అమృతాలుగా భావించి తాగే కాఫీ, టీల గురించి చెబుతూ అవి మనకు కలుగజేసిన ప్రాకృతిక నష్టం సామాన్యమైనది కాదు అంటారు. అవి ఆహారాలు కూడా కాదు. నిత్య జీవితంలో అంతగా ఆధారపడవలసినవీ కావు. అని ఆమె అంటే ఎందరికో నచ్చకపోవచ్చు.

          18వ శతాబ్ది నుంచి మొదలైన కాఫీ తోటల విస్తరణ ఈనాటికి 3, 90, 000 హెక్టార్లకు చేరుకుంది. కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే ఈ కాఫీ పంట వల్ల నరికి వేసిన అడవులు తక్కువ కాదు. కేరళ, తమిళనాడుకు చెందిన పశ్చిమ కనుమల్లో కాఫీ తోటల కోసం ప్రభుత్వానుమతితో నరికిన అడవులు చాలా విలువైనవి.

 

          పశ్చిమ కనుమలు ప్రపంచంలో  అత్యంత విలువైన జీవవైవిధ్యం గల ప్రాంతాల్లో ఒకటి. కాఫీ తోటల వల్ల ఇక్కడ ఉండే వృక్ష జంతుజాలాలు, వాటి మీద ఆధారపడిన పక్షి కీటక జాతులు కూడా ప్రత్యేకమైనవి. అవన్నీ ప్రమాదంలో పడ్డాయి.

          ఆమె టీ పరిశ్రమ గురించి కూడా రాసుకుంటూ వచ్చారు. ఆమె సేకరించిన వివరా లు గానీ, ఇందు కోసం ఆమె చదివిన పుస్తకాలు గానీ, చేసిన పరిశోధన కానీ ప్రతి విషయాని కి సాక్ష్యంగా నిలుస్తుంది. ఎక్కడ ఏ చిన్న సాక్ష్యమూ లేకుండా ఆమె ఏ ప్రతిపాదన చేయరు. ఈనాడు తేయాకు తోటల విస్తీర్ణం 2013 నాటి లెక్కల ప్రకారం 5, 63, 980 హెక్టార్లు. పెరిగే డిమాండ్ మరింత అడవిని కరిగించేస్తుంది అని చెప్తూ ఇక్కడ  అరణ్యం తరఫున తన ఆవేదనను ప్రజలకు విన్నవిస్తారు.

          “కుంచించుకు పోయే తమ పరిధిని తలుచుకొని ఇక్కడి చెట్లూ, మన నిలువ నీడ పోతున్నదని, ఆహారం కనుమరుగవుతుందని జంతువులూ దుఃఖిస్తున్నాయేమో? ఎవరు వాటి హృదయ ఘోష విన్నారని అడుగుతారు.

 
          మనం తాగే ఒక్కో కప్పు కాఫీ, టీ ల్లో రోదిస్తున్న పక్షుల, పశువుల అస్రువులు కూడా ఉండవచ్చునేమో కదా!! కుచించుకుపోయిన వాటి స్వస్థలాల మీద మానవుని దాడిని అవి అంగీకరిస్తాయా? మనల్ని క్షమిస్తాయా? మనతో పోరాడి గెలవాలని అనుకుంటే అవి ఏం చేయబోతున్నాయి? తమను తాము ఆత్మార్పణ చేసుకుంటూ ఆహారపు బృహత్ వలయంలో మనల్ని ఒంటరి కమ్మని శపించనున్నాయా? అని ఆవేదన చెందుతారు. ఇది మనందరమూ పొందవలసిన ఆవేదన అని నాకు ఈ పుస్తకం బోధించింది.
చివరిగా ఇలా అంటారు. ఖండాంతరాలు దాటి వచ్చిన జీవులు స్థానిక జీవుల మనుగడ మీద చేసిన దాడిని ఎవరు చరిత్రగా రాయాలి.
 

          ఒకనాడు వైభవాన్ని పొంది నేడు ఉనికిలోనే లేని జాతుల గురించి విలపించే వారెవరు? అసలు అది జరిగిందని గుర్తించే వారెవరు? అడవుల్లోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ కనిపించే మొక్క మీద పురుగు మీద దృష్టి పడినప్పుడు నాకు ఇలాగే అనిపిస్తుంది. అంటారు. అందుకే వాటి చరిత్ర రాసే బాధ్యత తీసుకున్నారు. ఇది కూడా ఆమె ఆవేదనలో భాగమే.

          తీరిక దొరికినప్పుడల్లా చరిత్రను, సామాజిక పరిణామాన్ని అన్వేషించే ఆమె తన అరణ్య పర్యవేక్షణలో కలిగే అనుభవాలతో వాటిని పోల్చి చూసుకుంటూ అర్థం చేసు కుంటూ అవసరమైన చోట శాస్త్రవేత్తలతో కలిసి మరింత విశ్లేషించుకుంటూ ఉంటారు. లేదా కవులను ఆసరాగా తెచ్చుకుని సాంత్వన పొందుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆమె రెడ్ నెపోలియన్ గా పేరు పడ్డ నెస్పెర్స్ తెగ నాయకుడు చీఫ్ జోసెఫ్ చెప్పిన వాక్యాలు గుర్తు చేశారు.

          “మనం  జన్మిస్తుంటాం, మనం మరణిస్తుంటాం. సమాధి మీద మృదు మృత్తికా తలం నుంచి ఉద్భవించే గడ్డి లాగాను, వృక్షాలుగాను పునరుద్దానమవుతుంటాం. శిలలు విరిగి క్షయిస్తాయి. విశ్వాసాలు పాతవి స్మృతి తప్పుతాయి. కానీ కొత్త నమ్మకాలు మొలకెత్తు తాయి. గ్రామాల విశ్వాసాలు ఇప్పుడు ధూళిగా మారాయి, కానీ అవి వృక్షాలుగా తప్పక తిరిగి వృద్ధి చెందుతాయి. “అని ఆమె నమ్మకం సంపాదించుకుంటూ ఉంటారు.

          చీఫ్ జోసెఫే అన్నట్టు అంతం  నుంచి ప్రకృతి తనదైన రీతిలో మరోసారి పునరుత్థానమవుతుంది. అయితే ఈసారి అది మానవజాతి సమాధి ధూళి మీదుగా కొత్తగా మొలకెత్తుతుంది, అని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తారు.
          ఈ వ్యాసంలో నిజానికి నా మాటలు చాలా తక్కువ. అనవసరం కూడా. అన్నీ ఇంచు మించుగా వ్యాసంలో ఉన్న ఆమె మాటలే రాశాను. కానీ పుస్తకంలో ఈ వ్యాసం చదువుకునే వారికి ఇంకా ఎంతో విజ్ఞానమూ, వికాసమూ, కలిగి తీరుతాయని చెప్పటం నా విధి.వయ్యారి భామ, పులికంప,, మహావీర మొక్కలు ఇంచుమించు మనకి తెలిసినవే. దూరం నుంచి చూసి మన శత్రువులని తెలియక వీటి అందానికి మురుస్తాం.
పర్యావరణ వినాశనం, దాని రక్షణ గురించి ఈ వ్యాసం నాకెంతో జ్ఞానాన్ని ఇచ్చింది. ఆమెకు ధన్యవాదాలు చెప్పి తీరాలి.
          ధరణీరుహ పుస్తకాలుఅన్ని పుస్తకాల దుకాణాల్లోనూఉన్నాయి. వెల 250. ముఖ్యంగా హైదరాబాద్ నవోదయ వారు ఆన్లైన్ఆర్డర్ చేస్తే పంపుతారు. విజయవాడ పల్లవి పబ్లికేషన్స్ లోనూ ఉన్నాయి. 
*****
Please follow and like us:

One thought on “మనకి తెలియని అడవి – ధరణీరుహ”

Leave a Reply

Your email address will not be published.