జీవ సమతుల్యత

-కందేపి రాణి ప్రసాద్

          రెండు కుందేళ్ళు బొరియలో నుంచి మెల్లగా బయటకు వచ్చాయి. ఆ రెండింటి పేర్లు చిన్ని, విన్ని. చిన్ని, విన్ని ఆహారం కోసం అడవి లోపలికి బయలుదేరాయి. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాయి. “ఎక్కడ ఆకుకూరలు దొరుకుతాయా” అని చూస్తూ ముందుకు వెళుతున్నాయి. చుట్టూ ఉన్న చెట్లను చూసుకుంటూ వెళుతున్నాయి.
అమ్మానాన్నలు చిన్నీ, విన్నీలకు చాలా జాగ్రత్తలు చెప్పాయి. ఎగురుకుంటూ గెంతు కుంటూ దారి పక్కనున్న చెట్ల తీగల్ని తుంపుతూ సరదాగా నడుస్తున్నాయి.
 
          అలా ఇద్దరూ వెళుతుండగా చిన్నీ కాలుకు ఎదో తగిలింది. చిన్నీ వంగి చూసింది తన కాలు కింద ఒక విత్తనం కనిపించింది. ఆ విత్తనాన్ని చేతిలోకి తీసుకున్నది. అది ఏమి విత్తనమో అర్థం కాలేదు. విన్నికి చూపించి “ఇదేమి విత్తనమో తెలుసా అని అడిగింది. విన్నీ చేతిలోకి తీసుకుంది. అటూ ఇటూ చూసింది. “ ఏమో నాకు తెలియదని “ చెప్పింది. చిన్నీ జాగ్రత్తగా చేతిలో పెట్టుకుని దాచుకున్నది.
 
          సాయంత్రం ఇంటికి వెళ్ళాక తను దాచుకున్న విత్తనాన్ని అమ్మకు చూపించింది. ఇదేమిటమ్మా అని అడిగింది. అమ్మ చిన్ని చేతిలోకి విత్తనాన్ని చూసి “ ఇది గుమ్మడి విత్తనమమ్మా “ అని చెప్పింది.
 
          “ అమ్మా ! మరి నేలలో నాటుదామా? అని అడిగింది చిన్ని ఉత్సహంగా. “సరేనమ్మా అంటూ అమ్మ పెరట్లోకి వెళ్ళింది. చిన్ని సంతోషంగా అమ్మ వెనుకే వెళ్ళింది. ఒక చదునైన స్థలం చూసి బాగుందని చెప్పింది అమ్మ. గునపం తెమ్మని అక్కడ నేలను తవ్వింది. చిన్న గుంటను చేసి చిన్ని చేత విత్తనాన్ని పెట్టించింది. కొన భాగం పైకిఉంటే మొలక త్వరగా వస్తుందని చెప్పింది. చిన్ని అలాగే పెట్టింది. విత్తనం వేశాక మట్టిని వేయించింది. పాదులాగా చేసి నీళ్ళు పోయటానికి చుట్టూ మట్టిని ఎత్తుగా పెట్టింది. చిన్నీ తో నీళ్ళు పోయించింది. అమ్మ చిన్నిని రోజూనీళ్ళు పోయామని చెప్పింది.
 
          చిన్ని సంతోషానికి అవధుల్లేవు. నేను కాయలు కాసే చెట్టును నాటాను. ఇక బోలెడు కాయలు కాస్తాయి అని తెగ ఆనంద పడింది. పాయకు చక్కగా నీళ్ళు పోసింది. ఆ రాత్రికి కలలు కంటూ నిద్ర పోయింది. చెట్టు నిండా విరగకాసిన కాయలతో కలలో కనువిందు చేసింది.
 
          ఉదయాన్నే చిన్ని నిద్రలేచి గుమ్మడి విత్తనం నాటిన పాదుకు నీళ్ళు పోసింది. ఆ రోజంతా ఏ పని చేస్తున్నా మధ్య మధ్యలో పాదు దగ్గరకు వెళ్ళి చూస్తున్నది ‘ఇంకా మొలక రాలేదు’ అని చూసి నిరుత్సాహ పడుతున్నది. అమ్మ దగ్గర కెళ్ళి మాటిమాటికి అడుగుతున్నది “చెట్టు ఇంకా మొలవలేదని “.
 
          చిన్ని ఆతృత చూసి అమ్మ నవుకున్నది. దాని అమాయకత్వానికి మనసులో ముద్దు గా విసుక్కున్నది. “దీనికన్నీ తొందరే, అనుకున్న వెంటనే అన్ని జరిగిపోవాలి” అని కూడా అనుకున్నది అమ్మ.
 
          చిన్ని పాదు దగ్గరే కాలం గడుపుతున్నది. దాని మనసులో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఈ మొక్క మొలిచి పెద్దదయ్యాక ఎన్ని కాయలు కాస్తాయి అని అడిగింది అమ్మనొకసారి. “చాలా కాయలు కాస్తాయి” అని చెప్పింది అమ్మ “మళ్ళి అది చెట్లు కావాలంటే ఎలా” అని చిన్ని అమ్మ నడిగింది. “ఆ కాయల్లో విత్తనాలుంటాయి. వాటిని నేలలో నాటితో మళ్ళి చెట్లు వస్తాయి” చిన్నికి సమాధానం చెప్పింది అమ్మ.
“ఒక్కోక్క విత్తనానికి ఒక్కొక్క చెట్టు వస్తుందా అమ్మా” అని అడిగింది చిన్ని. “అవునమ్మా అంటూ అమ్మ సమాధానం చెపుతూ “నా చిన్నికి ఎన్ని తెలివి తేటలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నది” అని అమ్మ మురిసి పోయింది.
 
          ఇవన్నీ విన్ని చిన్ని ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తున్నది. ఇప్పుడీ చెట్టుకు గుమ్మడి కాయలు కాస్తే పులుసు తినవచ్చు, హల్వా తినవచ్చు అంటూ అనుకున్నది. ఈ 3 నెలలూ వస్తూనే ఉంటాయి తింటూనే ఉండవచ్చు. ఆ తర్వాత మళ్ళీ విత్తనాలను నాటుకోవచ్చు. ఆ విత్తనాలకు బోలెడు చెట్లు వస్తాయి. ఆ చేట్లన్నిటికి కాయలు కశాయ నుకో అమ్మో మనిల్లు చాలదేమో. ఏం కాదులే ఎదురింటి బన్నీ వాళ్ళింట్లో. పక్కింటి సన్నీ వాళ్ళింట్లో పెట్టుకుందాం. మళ్ళీ ఆ కాయలన్నీ తీసి విత్తనాలు నాటితే ఈ సారి ఇంకా ఎక్కువ చెట్లు వస్తాయి. ఆ చెట్లకు ఇంకా బోలెడు కాయలు కాస్తాయి. మళ్ళీ ఆ కాయలన్నీ నాటితే అడవి అంత గుమ్మడి కాయలే కాస్తాయి. అప్పుడు కాయల్ని ఏం చేయలబ్బా అని ఆలోచించింది.
 
          ‘ఆ! వాటిని అంగట్లో అమ్మేస్తే సరి చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తెచ్చి మరిన్ని గుమ్మడి విత్తనాలు తెచ్చి మళ్ళీ చెట్లు నాటుదాం. మళ్ళీ మళ్ళీ కాస్తూనే ఉంటాయి’. ఇలా ఆలోచనలు సాగిపోతూనే ఉన్నాయి. అమ్మ “చిన్ని! చిన్ని!” అని పిలుస్తున్నా వినబడలేదు. అమ్మ చెయ్యి పట్టుకొని కుదిపే సరికి ఈ లోకంలోకి వచ్చింది.
ఏమీ ఆలోచిస్తున్నావు అని అమ్మ అడగ్గానే ఈ విషయాలన్నీ చెప్పింది చిన్ని. అమ్మ నవ్వింది చిన్ని తల నిమిరి నవ్వుతూ ఇలా చెప్పింది.
 
          చిన్నీ! అడవి మొత్తమంతా గుమ్మడి కాయలే కాస్తే మిగతా కాయలు ఎలా వస్తాయి. మనక్కూడా రోజూ గుమ్మడి కాయలే తింటే విసుగొస్తుంది. అన్ని కాయలూ తినాలి. ప్రతి కాయలో ఒక్కొక్క రకమైన పోషకాలుంటాయి వైవిధ్యమైన జాతుల కాయల్ని తినటం వాల్ల  వివిధ రకాలైన పోషకాలు మనకు లభిస్తాయి అనారోగ్యం రాకుండా కాపాడతాయి.
 
          అంతే కాకుండా సృష్టిలో అన్ని రకాల చెట్లు ఉండాలి. ప్రతి వాటికీ జీవించేందుకు సమాన హక్కు ఉన్నది. ఈ అడవి ఏ ఒక్కరిదో సొంతం కాదు అన్ని జీవరాసులదీ.
 
          ఇప్పుడు మానవుడు చేస్తున్న తప్పిదం ఇదే. ప్రపంచమంతా కేవలం వారి కోసమే సృష్టించబడిందని అనుకుంటున్నాడు. మిగతా జీవరాసుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అది చాలా తప్పు అందుకే జీవ సమ తుల్యత అవసరం.
 
          మనం కూడా ఒకే రకపు చెట్లను నాటడం వల్ల జీవ వైవిధ్యాన్ని కోల్పోతాము. అన్ని   రకాల జంతువులూ, చెట్లు కలిసిమెలిసి బతికితేనే జీవ వైవిధ్యం ఉంటుంది.కొన్ని రకాల మొక్కలు, జంతువులు ఇప్పటికే అంతర్థానమయ్యాయి. ఇంకొన్ని అంతరించి పోయే దశలో ఉన్నాయి. ఇలాంటి విపరీతాలు జరక్కుండా ఉండాలంటే అన్ని ప్రాణులకూ సమానంగా అవకాశం ఉండాలి’ అంటూ అమ్మ సుదీర్ఘంగా చెప్పింది. చిన్ని కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా వింటూ ఉన్నది.   

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.