దుబాయ్ విశేషాలు-7

-చెంగల్వల కామేశ్వరి

          దుబాయ్ లో బహుళ అంతస్తుల బిల్డింగ్స్ విభిన్నమయిన రంగులతో ఉంటాయి. అని చెప్పాను కదా! ప్రతి బిల్డింగ్ లో కనీసం పద్దెనిమిది ఫ్లోర్లయినా ఉంటాయి. అందులో కొన్ని ఫ్లోర్లు కేవలం పార్కింగ్ కోసమే! లిఫ్ట్ ఉంటుంది. ఆ పార్కింగ్ ఫ్లోర్స్ దాటాకే, రెసిడెన్షి యల్ ఫ్లాట్స్ ఉన్న ఫ్లోర్లు మొదలవుతాయి ఆ.పార్కింగ్ లో ఉన్న కార్లను కింద నుండి పైకి పై నుండి క్రిందకు తీసుకురావాలంటే చాలా నైపుణ్యం కావాలి. 
 
          ఆ పార్కింగ్ లో పెట్టలేకపోతే బిల్డింగ్ ఆవరణలో పార్క్ చేసుకుంటారు. అక్కడ పార్కింగ్ దొరకకుంటే దగ్గరలోని విశాలమైన మైదానాలలో పెయిడ్ పార్కింగ్ లో పెడతారు.
 
          అపార్టమెంట్స్ లో గార్బేజ్ షూట్స్ ఉంటాయి. మనం గార్బేజ్ మూటల్ని అందులోంచి పాడేయాలి. అవన్ని ఒక పెద్ద గార్బేజ్ కంటేయినర్స్ లో పడతాయి.
 
          మున్సిపాలిటి ట్రక్ పొద్దున వచ్చే టైంకి వాచ్మెన్ ఆ కంటేయినర్ని రోడ్ మీద నిర్దిష్టమైన స్థానంలో రెడిగా పెట్టాలి. ఆ గార్బేజ్ ట్రక్ కి ఈ కంటేయినర్స్ ని ఎత్తి ఆ మూటలన్ని డంప్ చేసుకునే మెకానిజం ఉంది. అలా ఆ ఏరియాలో ఉన్న గార్బేజంతా ప్రతిరోజు పొద్దున 4-6 గం లోపు ఎత్తేసి ఆ ట్రక్కులు వెళ్ళిపోతాయి. జనాలు లేచి తిరిగే టైంలో కనపడవు, ఎక్కడ గార్బేజ్ కంపు ఉండదు.
 
          అదే మన దగ్గర అయితే గార్బేజ్ పట్టుకెళ్ళే బండి వస్తే ఆ పరిసరాలలో నిలవ లేము.
 
          ప్రతి బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో సూపర్ మార్కెట్, బ్యూటీ పార్లర్, లాండ్రీ ఫర్నిచర్ షాప్ లు ఉంటాయి. ప్రతి కూడలిలో మసీదులు ఉంటాయి. సమయానుసారంగా మసీదు స్పీకర్స్ లో నమాజ్ సమయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. 
 
          రమ్జాన్ సమయంలో ఆ  అలారం రాగానే ముస్లిం సోదరులు ఎక్కడున్నవారక్కడే తమతో తెచ్చుకున్న ఆసనం పరుచుకుని నమాజ్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. మతంపట్ల వారికున్న గౌరవానికి మనం ముగ్ధులమవుతాము.
 
          ఇంక నిశి రాత్రిళ్ళు కూడా పట్టపగలు లా వెలిగే ఈ మహానగరంలో భయమన్నది ఉండదు. కాకపోతే అక్కడక్కడ ఆవారాగా తిరిగే నైజీరియన్స్ చేతుల్లో ఉన్నవి లాక్కుని పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
 
          ఇక్కడ ఈవ్ టీజింగ్ అన్నది లేదు. అలాగే ఎవరూ ఎవరినీ కనీసం ముద్దుగా ఉన్నారని ఎవరి పిల్లలని తాకడం. తేరిపారా చూడటం, నిషిధ్దం !
 
          ఆరులైన్ల విశాలమయిన అందమైన రోడ్ ల మీద గంటకి ఎనభైమైళ్ళ నుండి నూటిరవై కన్నా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తే ఆ వెహికిల్స్ ఆటోమాటిక్ గా ఫొటో తీయబడే నియంత్రణ ఉంటుంది.
 
లాస్ట్ ఎగ్జిట్ 
దుబాయ్ దాటి ఇతర దేశాలు ( మనం ముందు చెప్పుకున్నాము కదా ఏడు చిన్నదేశాలు కలిసి ఎమిరేట్స్ అని) ఎమిరేట్స్ రాజధాని అబుదాబీ హైవే కూడలి నానుకుని ఉన్న లాస్ట్ ఎగ్జిట్ వరకు లాంగ్ డ్రైవ్ లో వెళ్ళాము. అక్కడ ఉన్న ఫుడ్ ట్రక్స్ ( మన ఈట్ స్ట్రీట్ లాగా) లో దొరికే స్టార్ బక్స్ కాఫీ, మసాలాఛాయ్ రకరకాల ఐస్క్రీమ్ లతో పాటు దేశీ, స్వదేశీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి.
 
          పనికి రాని ట్రక్ మెటీరియల్స్, వాడేసిన పెద్ద పెద్ద బండిల్స్ టేబుల్స్, చిన్మ చిన్నవి కూర్చోవడానికి పెద్ద టైర్ లో లోపల ఫిక్స్ చేసిన వాష్ బేసిన్స్ లతో తమాషాగా ఉంది. ఇలా ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి దుబాయ్‌లోని కొన్ని రుచికరమైన వీధి ఆహారాన్ని అందించే మొదటి రకమైన థీమ్ ఫుడ్ ట్రక్ కాన్సెప్ట్, చల్లని మరియు అనుకూలమైన వాతావరణంలో. అహ్లాదకరంగా ఉంటుంది.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.