రచయిత్రి దర్భా వెంకట రమణికి నివాళి!

‘ నీ స్మృతి నా చిరస్మరణీయం రమణీ!

– ఆర్.దమయంతి

 (బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి డి.వి.రమణి కి అక్షర నివాళి..)

          నాకు డి.వి. రమణి ఎలా పరిచయం అంటే – ఫేస్బుక్ ద్వారానే! నా పోస్ట్ లన్నిటికీ లైక్ కొట్టటడమే కాదు, అందమైన వ్యాఖ్యలతో స్పందించేవారు. నాకు ప్రత్యేకంగా అనిపించేవి ఆమె కామెంట్స్.

          ఆరంభంలో –  చాట్ చేసేవారు. మెస్సెంజెర్లో అన్నీ సాహిత్య సంబంధిత విషయాలే వుండేవి.

‘సాహిత్యం’ అనే గ్రూప్ లో  కలిసేవాళ్ళం.
మరో గ్రూప్ -సంగీతం.
అలాగే వుమెన్ లిటెరేచర్ ..ఇలా చాలా చోట్ల కలుసుకునేవాళ్ళం.

          రమణికి హిందీ పాటలంటే చాలా ఇష్టం. హిందీ, ఉర్దూ భాషలతో తనకున్న ప్రవేశాన్ని, అనుబంధాన్ని పంచుకునేవారు. ‘మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మాట్లాడాలని వుంది.’ అని అడగంగానే ఇచ్చాను. వెంటనే కాల్ చేసారు. ఎంత ఆనందాన్ని వ్యక్త పరిచారో. వారి వాక్ప్రవాహానికి అబ్బురమైంది చాలా.  స్వచ్చమైన నది అలలు అలలుగా కళ్ళ ముందు కదులుతున్నట్టు తోచేది.

          అలా.. అలా రమ్యమైన సంభాషణలతో రమణి నా మనసుకి దగ్గరయ్యారు. ఎంతలా అంటే..’ మనం ఒక సారి పర్సనల్ గా కలిసి మాట్లాడుకోవాలి. ఎప్పుడు వీలౌతుంది మీకు .” అని అడిగేవారు.  

          కానీ,  నేను హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఆమె యూకేలో వుంటున్న వాళ్ళబ్బాయి దగ్గరకి వెళ్ళేవారు. ఆమె తిరిగి వచ్చే సమయానికి నేను అమెరికాలో వుండేదాన్ని. ఇలా అయితే మనం ఈ యుగంలో కలవడం కుదరదేమో అని నవ్వేవారు.

          కానీ, రాదనుకున్న అవకాశం రానే వచ్చింది.

          దరిదాపు పదేళ్ళ క్రితం..రమణిని మా ఇంటికి రావాలంటూఆహ్వానించాను. వారి చిన్నమ్మాయి మాధవి, మనవడితో కలిసి వచ్చారు. వ్యక్తిగతంగా కలవడం అదే మొదటి సారి. అయినా, నేను తనకి ఎన్నో యేళ్ళుగా తెలుసన్నంత చనువుగా, కలిసిపోతూ కబుర్లాడారు. నా చేయి విడవకుండా..నా పక్కనే కుర్చుని మాట్లాడుతూ చాలా ఆనందిం చారు.

          మాధవికి యాక్టింగ్ అంటే ఇష్టమని, టివీ సీరియల్స్ లో, సినిమాలలో నటిస్తోందనీ చెప్పారు. మాధవి కూడా “ఆంటీ’ అని పిలుస్తూ, ఏ మాత్రం కొత్త లేకుండా మాట్లాడారు.
అప్పుడు మా అమ్మ గారు కాన్సర్ తో బాధ పడుతూ, బెడ్ మీదున్నారు. రమణి పలకరిం పులతో ఆమె కూడా పరవశించారు. పెద్దవాళ్ళకి పలకరింపులు, కుశల ప్రశ్నలే గొప్ప ఔషధాలుగా పనిచేస్తాయి.

          వాళ్ళున్నంత సేపు ఇల్లు సందడితో నిండిపోయింది. వెళ్తూ వెళ్తూ నా చేతిని అందుకుని, ‘దమయంతీ! మనం తరచు కలవాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీకు..” అన్నారు. ఆమె నాతో కలబోసుకోవాలనుకున్న సంగతులన్నీ కూడా కేవలం తన రచనల గురించి మాత్రమే.

          ఆ మర్నాడే ఫోన్ చేసి, నా ఆతిధ్యానికి థాంక్స్ చెబుతూ, మా ఇంట్లో గడిపిన ఆ కాసింత సమయం మరువరానిదంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే.. ఎంత మంచి మనసున్న మనిషి రమణీ అని మనసులోనే అభినందించుకున్నా.  

          నేను ప్రత్యేకించి ఆమె కోసం చేసిందేమీ లేదు కానీ, తనకి తన ఫ్రెండ్స్ చూపే ఏపాటి చిన్న ఆదరణ కానీ, స్వల్పమైన ప్రేమ కానీ ఆమెకి అది ఎంతో అపురూపమని అర్ధమైంది.

          చాలా మందికి తాము ఇచ్చిందే గుర్తుంటుంది. తీసుకున్నదేదీ గుర్తుండదు.
అందుకు పూర్తి వ్యతిరేకం రమణి మనస్తత్వం. రమణి మనసు పసిపాపలాంటిది. పలకరిస్తే పొంగిపోతుంది. ఫోన్ చేస్తే సంబరంగా మాట్లాడుతుంది. ఏం రాస్తున్నావ్ అని అడిగితే పెద్ద లిస్ట్ చదివేస్తుంది. పాటలు పాడి వినిపిస్తుంది. ముఖ్యంగా హిందీ పాటలంటే ఆమెకి చాలా ఇష్టం.

          ఒక సారి ఆశాభోస్లే పాటలోని ఉర్దూ పదాల అర్ధం కోసం ఫోన్ చేసినప్పుడు ఎంతో చక్కగా వివరించి చెప్పింది. 

          ఆమె ఏం మాట్లాడినా స్వచ్చంగా వుంటుంది. అద్దంలా స్పష్టంగా వుంటుంది. భేషజం లేదు. నకరాలు అస్సలే తెలీదు. కల్మషాలెరుగని స్వభావం. పర్సనల్ గా కలిసాక, మా మధ్య స్నేహం పెరిగిందని చెప్పాలి.  తరచూ తన రచనల గురించిన విశేషాలను నాతో పంచుకునే వారు.

          భగవద్గీతని కంప్లీట్ చేస్తున్నానని..ఆ తర్వాత అది పబ్లిషింగ్ కి ఇచ్చానని చెప్పారు. అది రమణి డ్రీం ప్రాజెక్ట్ అని అర్ధమైంది.

          ఆమె రాసిన తెలుగు, ఇంగ్లీషకవితల పుస్తకాలను, నేను నిర్వహించే సభలకు విచ్చేసే అతిథులకి, రైటర్స్ కి గిఫ్ట్ గా అందచేసేదాన్ని. 

          రమణి ఒక సారి  ఫోన్ చేసి, తానొక గొప్ప చారిత్రాత్మక నవలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అది గనక క్లిక్ అయితే సాహితీ ప్రపంచంలో ఒక సంచలనాన్ని సృష్టిస్తుందనే చెబుతుందేది.

          నేను కూడా ఆమె చెప్పే ప్రతి మాటనీ శ్రద్ధ గా వినేదాన్ని. అందుకే ప్రశ్నించేదాన్ని. తాను జావాబుగా ఆ సన్నివేశాన్నో, ఆ పాత్రనో వివరించేవారు. అలా మా మాటలన్నీ సాహిత్యంతో పెనవేసుకునుండేవి. అంతలోనే పోటీల వివరాలు అడిగి తెలుసుకునేది. చివరి తేదీ చెప్పేదాన్ని. అడ్రస్ పంపమనేది. పంపేదాన్ని.

          మా ఇద్దరికీ మెయిల్ ద్వారా పంపే కథలకి అప్పట్లో ఎక్కువ అవకాశం వుండేది.
అలా మేము పోటీలలో కూడా పోటీగానే పాల్గొనడం జరిగేది.

          నాకు బహుమతి వస్తే ఎంతో ఆనందంగా ఫోన్ చేసి అభినందించేదో! నేనూ అంతే.
కథల పుస్తకం వస్తోందని చెప్పింది. తాను అందుకోబోతున్న  ప్రతిష్టాత్మక అవార్డ్ గురించి చెబుతూ,  తప్పక రావాలని ఆహ్వానించింది. తన సాహితీ ప్రయాణంలో అందుకున్న విజయాలన్నీ నాతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకునేది. ‘మన కథలు..’ గ్రూప్ గురించి చెప్పినప్పుడు ఆసక్తి చూపారు. అందులో చేరాక, అక్కడ తన రచనలు పోస్ట్ చేస్తుండే వారు. మంచి రెస్పాన్స్ వచ్చేది. ఆ సంబరాన్ని కూడా  నాతో పంచుకునేది.
‘థాంక్సోయ్. నేనిక్కడ బిజీ అయిపోయాను.’ అనేది. అప్పటికి మేము క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ‘ నువ్వు’ అని పిలుచుకునేంత చనువు ఏర్పడింది. నాకు చాలా బిడియం కానీ, రమణి ఆత్మీయత, చొరవ వల్లే నువ్వు అనేదాన్ని. లేకపోతే ఊరుకునేది కాదు.

          రమణికి బుక్ నాలెడ్జ్ అమోఘంగా వుండేది. అదీ కాకుండా కథ చెప్పడంలో చాలా ఆరితేరిన పరిజ్ఞానం వుందనిపించింది.

          చాలా మంది రైటర్స్, కథలు రాస్తారు కానీ చెప్పడంలో వెనకబడి వుంటారు. షార్ప్ గా, అసలౌ పాయింట్ ని తేల్చి చెప్పడం, కథాంశానికి ఆకర్షణీయకరమైన భాష్యాన్ని వ్వడం తెలీదు.

          తను కొన్నాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ లో వున్నానని చెబుతుండేది రమణి. తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పేది. ఆయన వల్లే తను ఎదిగానని, తన అభివృద్ధి వెనక ఆయన ప్రోత్సాహం ఎంతైనా వుందని ప్రశంసిస్తూ..గంతంలోకి జారిపోయేది. ‘మణిషి పోతె మాత్రమేమి మనసు వుంటది..’అన్నట్టు..భర్త జ్ఞాపకాలని ఆమె చివరి క్షణం వరకు పదిలంగా దాచుకున్నట్టు తోస్తుంది.

          మా చివరి ఫోన్ సంభాషణలో కూడా ఆమె తన భర్తని గుర్తు చేసుకోవడం నాకు బాగా గుర్తు. ఇంత ప్రేమమయిని భార్యగా పొందిన ఆయన ఎంతైనా అదృష్టవంతులు అనిపిం చేది నాకు.

***

     నెచ్చెలిలో నే రాస్తున్న ‘కథా మధురాలు ‘ ఫీచర్ కోసం ఓ మంచి కథ కై వేటాడుతున్నా. సరిగ్గా అప్పుడు  ఫోన్ చేసింది రమణి. ‘ఏం చేస్తున్నావోయ్..’ అంటూ. సంగతి చెబుతూనే, ” నువ్ రాసిన కథల్లో నీకు బాగా నచ్చిన కథలు రెండు పంపగలవా?” అని అడిగా. సరే అంటూనే, నెచ్చెలి పేరు బావుందని వివరాలడిగి తెలుసుకుఉంది.

          “నువ్వు కూడా నెచ్చెలి కి రాయకూడదూ ఏమైనా?”  అన్నాను.

          “అవునా? రాయనా?” అంది ఉత్సాహంగా. రచన అంటే ఆమెకి ప్రాణం. కథ కానీ, కవిత కానీ, సీరియల్ కానీ లేదా ఓ మంచి రచన గురించి ప్రసక్తి కానీ వస్తే చాలు. తాను ఉప్పెనైపోతుంది. ఆ ఉత్సాహాన్ని గమనించే చెప్పాను. ” నెచ్చెలిని పరిచయం చేస్తాను. ఏమైనా వ్రాయి.” అని.

          “తప్పకుండా రాస్తానోయ్. ఎప్పట్నించో అనుకుంటున్నా ఓ ఫీచర్ గురించి. “

          “అందుకే అంటున్నా. నెచ్చెలికి వ్రాయి. ఎడిటర్ గారిని పరిచయం చేస్తా..” అని అన్నాను. సరే అంది.  

          వెంటనే గీత గారికి మెసేజ్ ఇచ్చి, వారి సెల్ నెంబర్ ని రమణికిచ్చాను. ఆ తర్వాత నా పనుల్లో పడి నేనా సంగతే మర్చిపోయా. రెండు నెల్ల తర్వాత ఎందుకో గుర్తొచ్చి అడిగాను. “మాట్లాడావా?” అని.

          “అయ్యో అలా అడుగుతావేమిటీ.. నా ఫీచర్ ‘ఓ సారి ఆలోచిస్తే ‘కూడా మొదలై పోతేనూ! చూళ్ళేదా?” అంటూ నవ్వింది గలగలా.

          అంత వేగంగా కదులుతుంది రమణి కలం. రచనలపట్ల ఆమెకున్న తపనని ఒక సముద్రంతో పోల్చవచ్చనిపిస్తుంది.

          “ఓ . అవునా !  కంగ్రాట్స్ రా.” అన్నాను.

***

          రమణి  మంచి చిత్రకారిణి. అందమైన పెయింటింగ్స్ కూడా వేస్తుంది. వాళ్ళ అబ్బాయి దగ్గరికెళ్ళినప్పుడు తనకు ఎక్కువ తీరిక దొరుకుతుందని చెప్పేది.  రకరకాల తైలవర్ణ చిత్రాలను ఫోటో తీసి పంపిస్తుండేది. వాట్ని ఒక ఎగ్జిబిషన్  కూడా ఏర్పాటు చేసింది. రమ్మని ఎంతగానో ఆహ్వానించింది

***

          కిందటి సంవత్సరం – అమెరికా నించి ఇండియాకి ప్రయాణిస్తుంటే.. ఫ్లైట్ లోనే మోకాలు పట్టుకుపోయింది. అది కొన్ని గంటల్లోనే ఎంత తీవ్రమైపోయిందీ అంటే.. హైదరాబాద్ లో దిగాక నేల మీద కాలు మోపలేనంతగా పట్టుకుపోయింది. ‘ స్ట్రెచింగ్ చేస్తే పోతుందిలే అనుకున్నా కానీ..అలా తగ్గే నొప్పి కాదని ఆరోజు కారోజుకి అర్ధమై పోయింది..నొప్పి అంతకంతకీ పెరిగిపోవడంతో.. స్పెషలిస్ట్ ని కలిసాను. అన్నిపరీక్షలు చేసి, వెంటనే మోకాలికి ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. సెకండ్ ఒపీనియన్ కూడా అదే! ఓ పక్కన దిగులుపడుతూనే కావల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నా. సరిగ్గా అప్పుడు ఫోన్ చేసింది రమణి.

          “ఎప్పుడొచ్చ్హావ్?” అంటూ కుశలమడిగాక, తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పింది. ఆమె మాటల్లో మునపటంత హుషారుతనం కనిపించలేదు. తను వాళ్ళ పెద్దమ్మాయి దగ్గర వుంటున్నానని, (ఎల్ బి నగర్ వైపు అనుకుంటా. గుర్తులేదు.) నన్ను రమ్మని మరీ మరీ కోరింది.

          “కాలు నొప్పిరా. అడుగేయలేకపోతున్నా” అంటూ అసలు విషయం చెప్పగానే..” అయ్యో. మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు? ఆపరేషన్ ఏమీ అక్కర్లేదు. నాకు తెలిసిన హోమియో డాక్టర్ గారున్నారు. నేను తీసుకెళ్తా మా ఇంటికొచ్చేయ్. నాకు ఆయనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు! నేను అంత పెద్ద అనారోగ్యం నించి కోలుకున్నానంటే ఈయన ఇచ్చే మందులే కారణం.” అంటూ నాకు ధైర్యం చెప్పింది.

          ఆ తర్వాత మా సంభాషణంతా – ‘మన ఆరోగ్యము – తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీదే సాగింది. ఫోన్ పెట్టేసే ముందు మళ్ళీ గుర్తు చేసింది. “నేను డాక్టర్ దగ్గరకి – రేపు వెళ్తున్నా. వెళ్ళినప్పుడు నీ గురించి చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నా మాట విని ఒక్క నెల మందులు వాడు. తప్పకుండా మార్పు కనిపిస్తుంది.” అంటూ మరో సారి ధైర్యం చెప్పి, బై చెప్పింది.

          కానీ అప్పుడు నేనున్న పరిస్థితిలో నాకు ఇమ్మిడియట్ రిలీఫ్ కావాలి. లేకపోతే కనీసం డాక్టర్ దగ్గరకి కూడా వెళ్ళలేను. అందుకే మందులు అప్పటికే మొదలుపెట్టాను.
మర్నాడు రమణి మర్చిపోకుండా ఫోన్ చేసి, నా ప్రాబ్లం అంతా డాక్టర్ కి వివరించినట్టు, ఆయన తనకి ఎంత భరోసా ఇచ్చిందీ చెప్పి, ఫలాన రోజున అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చెప్పింది.

          ఆ వెళ్ళే రోజున నన్ను  ముందస్తుగానే వాళ్ళింటికి రమ్మని చెప్పింది. తీరికగా మాట్లాడుకున్నట్టు వుంటుంది లంచ్ కి వచ్చేయ్ మంది. రమణి ఎప్పుడూ లంచ్ కి రమ్మనేది. తన కోరిక మేర, మలక్ పేటలో వుంటున్న మాధవి ఇంటికి కూడా వెళ్ళాను. అంతలా పట్టు విడవని ప్రేమ చూపేది. ఎందుకో తెలీదు. రమణికి నేనంటే ఒక ప్రత్యేక మైన ప్రేమాభిమానాలు వుండేవి. ఏ జన్మానుబంధమో తెలీదు.

          కానీ..తను పిలిచిన రోజున..సరిగ్గా అదే రోజు రామాంతపూర్ లో ఒక స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది నా చిన్ననాటి ఫ్రెండ్. ముందు అటు వెళ్ళి తర్వాత ఇటు వస్తా అన్నాను. సరే అంది.  కానీ నేనిక్కడే స్టక్ అయిపోవడంతో వెళ్ళలేకపోయా. నా కాలు సెట్ అవడానికి రెండు నెలలు పట్టింది. ఇండియాలో వుండే నా అర్నెల్ల గడువు  అయి పోయింది. రమణిని కలవనే లేదు. తను అప్పటికే అనారోగ్యంతో కుస్తీ పడుతున్నట్టు గమనించా.

          గతేడాది అమెరికాకు వచ్చే ముందు ఫోన్ చేసా. తను వాకింగ్ కి వెళ్తున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మళ్ళీ చెబుతూ..ప్రస్తుతం తను పెద్ద కూతురి దగ్గరే వుంటున్నట్టు చెప్పింది. ఆమెతో మాట్లాడించింది కూడా. వాళ్ళ పెద్దమ్మాయి కూడా చక్కగా పలకరించారు. ఒక నిమిషం తర్వాత రమణికి ఫోన్ ఇచ్చారు.  

          “సరే రా. మాధవిని కూడా అడిగానని చెప్పు” అన్నాను. వాళ్ళు అబ్రాడ్ లో వున్నట్టు చెప్పింది..పదేళ్ళ క్రితం మా ఇంటికొచ్చిన రమణి మనవడు ప్రయోజకుడయ్యాడని మంచి జాబ్ లో సెటిల్ అయ్యడన్న వార్తని ఎంతో సంతోషంగా పంచుకుంది. తన కొడుక్కి తను అంటే ప్రాణమని..చెప్పుకుని నిండుగా నవ్వింది. కూతుళ్ళు తనని కనిపెట్టుకునుంటారని చెబుతుండేది.

          పదేళ్ళ కిందట చాలా యంగ్ గా కనిపించిన రమణి నా స్మృతిలో మెదిలింది. ఈ ప్రపంచాన్ని సైతం తన చిటికెన వేలిన జయించేయగల్ను అన్నంత గొప్ప కా కాన్ ఫిడెన్స్ తో, నిండు ఆత్మ విశ్వాసంతో, గొప్ప ఆశా దృక్పథంతో ఉరకలెత్తిన గోదారిలా వుండేది. “మనం ఎప్పుడూ యంగ్ గా వుండాలోయ్. నువ్వు నాకంటే యవ్వనవతివి తెలుసా?” అనేది. అలా అంటుంటే నవ్వుకునేదాన్ని. మన వయసు మనకు తెలీనిది కాదు. కానీ మనం యంగ్ అనుకోకపోతే వయసు రెండింతలుగా మీదపడి, మనల్ని మరీ ముసలివాళ్ళను చేసేస్తుంది. ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఊ అంటే ఆ అంటే వచ్చే చిన్న చిన్న నొప్పులకి బెంబేలెత్తిపోగలం. పెద్దవాళ్ళమైపోతున్నాం అన్న ఆలోచన వల్ల ఎక్కువ నిరాశ, డిప్రెషన్స్ చుట్టుకుంటాయి. ఆ విషవలయంలో ఒకసారి చిక్కామో..అది ఎంతవరకైనా ఈడ్చుకుపోవచ్చు. అలాటి దారుణ పరిస్థితి ఎదురుకాకుండా తప్పించు కోవాలంటే..మనల్ని మనం రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా వుంచుకోవాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించేది రమణి.

          ఆమె చేతిలో మూడు భాషలున్నాయి. కథ, కవిత్వం, సీరియల్స్, అనువాదాలు, ఆధ్యాతిమిక తత్వాలు, శ్లోకాలు వాటికి అర్ధం చెప్పగల భాషా పటిమలు ఇవి కాకుండా సంగీతం, చిత్రలేఖనం, ట్రావెలింగ్ ఇన్ని వ్యాపకాల మధ్య కాలం కూడా ఊపిరిసలపక ఉక్కిరిబిక్కిరి అయ్యేదేమో కానీ ఆమె మాత్రం హుష్ అనుకున్న క్షణమే లేదు.

          పోటెత్తిన ఉత్సాహానికి నిర్వచనంలా వున్న రమణి..ఇప్పుడు మెల్లగా సాగే నది నడక లా కనిపించి నన్ను సందిగ్ధంలో పడేసింది.

***

          నా స్వభావం ఏమిటంటే స్లో అండ్ స్టడీ లా వుంటాను. గభాల్న అందరితో క్లోజ్ గా వుండలేను. ఇలా  నాలాగా ఎంతోమంది వుంటారు. కానీ అలాంటి వాళ్ళందరిని కూడా తన మాటలతో, ఆత్మీయతతో, స్నేహపూరిత సంభాషణలతో..తనతో కలుపుకుని స్నేహాన్ని కొనసాగిస్తుంది రమణి.

          తాను ఎప్పెడెప్పుడు, ఎవరెవరిని కలిసిందీ, ఎవరెవరితో మాట్లాడిందీ..ఆ సంగతులన్నీ కూడా నాతో కలబోసుకునేది. ఎక్కడా, ఎవ్వరి మీదా చీమంత విమర్శగా కానీ, హాస్యానికైనా మరో పొల్లు మాట కానీ మాట్లాడేది కాదు. మంచి వాళ్ళకి అందరూ మంచివాళ్ళే అన్న చందాన..రమణి పాజిటివ్ దృక్పధంతోనె ముందుకు సాగేది.

          ఒక సారి ఆమె – మాధవితో పాటు షూటింగ్ కి వెళ్ళినప్పుడు తను రాసిన పుస్తకాన్ని, భగవద్గీత కాపీని  సినీ నటుడు రంగనాథ్ గారికి అందించిందట. ఆయన కూడా సాహితీ పిపాసకులే కదా! చదివిన వెంటనే ఫోన్ చేసి రమణిని ప్రశంసిస్తూ మాట్లాడరట. ఆ క్షణాలని తాను మరచిపోలేనని గుర్తుచేసుకున్నది.  

          అలా చాలా మంది ప్రముఖులు, సాహితీవేత్తల నించి రమణి ఎన్నో కితాబుల నందుకుంది. బహుమతులనందుకుంది. నెచ్చెలిలో తన రచనలు పబ్లిష్ అవుతున్నం దుకు చాలా సంతోషపడేది.

          కిందటి సంవత్సరమే మాటల్లో చెప్పింది. తనకి రాసే ఓపిక తగ్గిపోతోందనీ, ఎక్కువ సేపు కుర్చుని టైప్ చేయలేకపోతున్ననంటూ చెప్పి బాధపడింది. ఆ వెనకే, కోలుకున్నాక మళ్ళా విజృభిస్తానని కూడా ప్రకటించింది!

          “ముందు ఆరోగ్యం చూసుకో. కోలుకున్నాక రాద్దువుగాన్లే.” అన్నాను.

          “అవునోయ్. అందుకే ఆలోచనలన్నీ చిత్తు ప్రతిలోకెక్కిస్తున్నా..” అంది.

          “అలా చేయ్..” అని చెప్పి, శలవు తీసుకున్నా.

***

          ఆ తర్వాత ఈ యేడాది జనవరిలో అనుకుంటా రమణి నా మీద అలిగింది. చాలా నెలల తర్వాత ఫేస్బుక్ లోకి వెళ్ళినప్పుడు ఆమె రెస్పాన్స్ చూసి నవ్వుకున్నా. వెంటనే కాల్ చేసి, ‘ఎలా వున్నావు రా’ అని అడిగాక, ‘ఏమిటి అలా జవాబిచ్చావ్?’ అన్నాను నవ్వుతూ.

          “లేకపోతే ఏమిటి మరి? ఏమైపోయావ్? అసలు నేను నీకు గుర్తున్నానా?” అంది. అలా చిన్నపిల్లలా..అంటుంటే..ఆ ఆత్మీయతకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్.

          “ఇంతకీ నీ కాలు ఎలా వుంది? మా హోమియోడాక్టర్ గారు నిన్ను అడిగారు. మీ ఫ్రెండ్ ని తీసుకొస్తానన్నారు. రాలేదు? అని.”

          రమణి తన స్నేహితుల గురించీ, తన వారి గురించీ, ఒక్కసారి పరిచయం వున్న వారి గురించైనా సరే వారి వ్యక్తిత్వాన్ని ఎంతో ఉన్నతంగా చేసి చెప్పే గొప్ప స్వభావం ఈ స్నేహమయికి మాత్రమే సొంతం!

          అందుకే డాక్టర్ గారు అడిగివుంటారని చెప్పి నవ్వించాను. తనూ నవ్వుతూనే మాట్లాడింది కానీ, మొత్తానికి డల్ గానే వినిపించింది వాయిస్. ఆరోజు కూడా ఎక్కువ సేపు మాట్లాడుకోలేదు.  కానీ, మరో సారి నాకు జాగ్రత్తలు చెబుతూనే..”నువ్వీసారి ఇండియాకి వస్తే ఖచ్చితంగా కథల పుస్తకం పబ్లిష్ చేయించాల్సిందే. నేను జ్యోతితో చెప్పాను. సరే అన్నారు.” అంటూ ఒక సోదరిలా చనువుగా అంటుంటే మురిపెమనిపించింది.

          నిజానికి జ్యోతి గారితో ఈ విషయం గురించి చాలా యేళ్ళ కిందటే మాట్లాడాను. మధ్యలో కూడా ఒకసారి! కథల సంపుటిని ముద్రించడంలో – పర్సనల్ గా ఎందుకో అంత ఆసక్తి వుండదు. కానీ నా బహుమతి కథలు చదివిన రమణి పట్టుపట్టి వేయిస్తా అంది. సరే అన్నాను. సంతోషంగానే.

***

          జస్ట్..ఈ మూడు నాలుగు నెలల నించే కాల్స్ లేవు. ఇండియా కాలమాన ప్రకారం చేయడం కుదరక ఒక కారణంగా, ఆమె ఆరోగ్య రీత్యా కూడా ఎక్కువ మాట్లాడింఛి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేని మరో కారణంగా కాల్స్ తగ్గించాను. తనూ అంతే. విరామం తీసుకుంది.

          ఇండియాకెళ్తున్నా కదా..ఈ సారి తప్పకుండా కలవాలి అని గట్టిగా అనుకున్నా.
ఇంతలో..పిడుగులాంటి ఈ వార్త వినంగానే స్టనైపోయాను.  

          ‘అయ్యో! రమణీ…వెళ్ళిపోయావా! కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా.. వెళ్ళి పోయావా ” అనుకుంటూ కుర్చీలో కూలబడిపోయాను. తలొంచుకుని కళ్ళు మూసు కున్నాను. అంతే..నాకు తెలీకుండానే కన్నీళ్ళు పొంగుకుంటూ వచ్చాయి..

          ఇవే..ఈ భాస్పాంజులులే నా స్నేహమయి రమణికి నేను అర్పించగల నివాళులు.
సమర్పించగల పుష్పాంజలులు.

          ఆమె ఆత్మకు శాంతి కలగాలని.. కృష్ణ సాన్నిధ్యం లభించాలని
ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా.

(గొప్ప రచయిత్రి, మంచి స్నేహితురాలు అయిన డి.వి.రమణి కి అక్షర ఘన నివాళులిడే అవకాశాన్ని కలగచేసిన నా ‘నెచ్చెలి’ కి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
నమస్సులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.