
ఆదర్శ శాస్త్రవేత్త పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ(1922-1985)
-పి. యస్. ప్రకాశరావు
పుట్టుకతో రైతుబిడ్డని.వృత్తిరీత్యా అంటరానివాణ్ణి అని గర్వంగా పరిచయం చేసుకున్న ఆదర్శ శాస్త్రవేత్త పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ 1922 సెప్టెంబర్ 10 న గుంటూరు జిల్లా యలవర్రులో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
చర్మకారులను అంటరానివాళ్లుగా చూసే రోజుల్లో అంటే సుమారు 8 దశాబ్దాల తోళ్ల పరిశ్రమ పట్ల చిన్నచూపు ఉండటం సహజమే. శాస్త్రవేత్తలయితే తోళ్ళపరిశ్రమకు సైన్స్ అనవసరం అనేవారు. తోళ్ళని చదును చేసే ప్రక్రియ అన్నా, దానిపై పరిశోధన అన్నా వారికి ఏవగింపు. అలాంటి రోజుల్లో లెదర్ టెక్నాలజీలో పీ హెచ్ డీ పొంది, అమెరికాలో పనిచేసి 1951లో ఇండియాకి తిరిగొచ్చి CLRI ( సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) లో డిప్యూటీ డైరెక్టర్ గా చేరారు నాయుడమ్మ. లెదర్ టెక్నాలజీలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని చర్మకారులకు అందించి వాళ్ళ వృత్తికి గౌరవం కలిగించాలని కలలుగని విధినిర్వహణలోనే 1985 జూన్ 23న కనిష్క విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
శాస్త్రవేత్తలకు ఆదర్శంగా : తోలుచదునుచేసే పని పట్ల నిరాదరణకు దుర్వాసన, ఖర్చు, వాతావరణ కాలుష్యం కారణాలని గ్రహించారు. వీటిని తగ్గించి చర్మకారుల ఆదాయం పెంచితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని భావించారు. కానీ తనపరిశోధన ఫలితాలు పల్లెల్లో ఉన్నవారికి అర్ధం కావు. అందుకే వారి విశ్వాసాన్ని చూరగొనడానికి ఎసిడిటీ, ఆల్కలీనీటీల రసాయనాలను పచ్చరంగు, తెల్లరంగు పాకెట్లుగా చేసి శుక్రవారం పచ్చనిదీ ఆదివారం తెల్లనిదీ వాడి మార్పును గమనించమని చెప్పారు. దీని ఫలితాలు చవిచూశాక మిగతా టెక్నాలజీలను అనుసరించారు.
హేతువాదం: ఒకసారి పుట్టపర్తి వెళ్లి సాయిబాబా గాల్లోంచి విభూతి సృష్టించడం చూశారు. వెంటనే నాయుడమ్మ లేచి నిలబడి రెండుచేతులూ జోడించి “విభూతి బదులు మీ అరచేతిలో ఓ గడ్డిపరకని మొలిపించండి”అన్నారు. బాబా అనుచరులు నాయుడమ్మను బయటికి పంపించేశారు. నాయుడమ్మ హేతువాది. భవిష్యత్తు చెబుతా మని కొందరూ, భవిష్యత్తులో జరగబోయే అనర్ధాలను నివారించగలమని కొందరూ చెప్పడం చూస్తే నాకు బాధగా ఉంది అన్నారు “శాస్త్రం- మూఢనమ్మకాలు” అనే వ్యాసంలో ‘. అద్భుతాలూ సైన్సూ ఒక ఒరలో ఇమడవని గుర్తించడంతోబాటు కాలం చెల్లిన విలువలనూ మూఢనమ్మకాలనూ భారతీయ శాస్త్రవేత్తలు తీవ్రంగా నిరసిం చాలి’అన్నారు.
కులం గురించి: తమిళనాడు గవర్నర్ శ్రీ ప్రకాశంకి నాయుడమ్మ కులం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి తో ఫోన్ లో అడిగారు. నాయుడమ్మ కోపాన్ని అదుపుచేసుకుని ” నేను వృత్తిరీత్యా అంటరానివాడిని” అన్నారు. ఆ గొంతులో ఆక్రోశం విన్న గవర్నర్ తరువాత ఫోన్ చేసి తప్పయిందని అంగీకరించారు.
మతాతీత ధోరణి: తమిళనాడులో IT లో డైరెక్టర్ పదవి ఖాళీ అయ్యింది. నాయుడమ్మ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎమ్.జి రామచంద్రన్ ఓ బ్రాహ్మణ అభ్యర్థిని ఎంపికచేయమని సిఫార్స్ చేస్తే ” మా కమిటీని రద్దు చేసి కొత్త కమిటీతో మీ అభ్యర్థిని ఎంపిక చేయించుకోండి” అన్నారు నాయుడమ్మ నిర్మొహమాటంగా. రామ చంద్రన్ మారు పలక్కుండా నాయుడమ్మ ఎంపికచేసిన మహమ్మద్ సాదిక్ అనే వ్యక్తినే నియమిస్తూ ఆర్డర్ వేశారు.
అర్ధాంగి సాహసోపేత మరణం: నాయుడమ్మ భార్య పవనాబాయి వృత్తిరీత్యా డాక్టరు. 1985 జూన్ 23 న భర్త ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేకపోయింది. విమానప్రమాద మంటల్లో ఆహుతైన భర్తలాగే తానూ మంటల్లోనే జీవితాన్ని చాలించాలనుకుంది. పొట్టకోసుకుని, అందులో స్పిరిట్ నింపుకుని అగ్గిపుల్ల వెలిగించింది. అగ్నిజ్వాలల్లో ఆహుతైపోయింది.
ఐక్య రాజ్య సమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ తెలుగుజాతికి ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. నాయుడమ్మ జీవితం లోని ఎన్నో మలుపులనూ ఆసక్తికరమైన ఘట్టాలనూ పొందుపరచిన పుస్తకం “ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ.
జూన్ 23 నాయుడమ్మగారి వర్ధంతి
*****

పి యస్ ప్రకాశరావు రిటైర్డ్ టీచర్, కాకినాడ.
M. phil : దాశరధి రంగాచారయ నవల ‘ మోదుగు పూలు – ఒక పరిశీలన ’.
P.hd : ‘నూరేళ్ళ పంట’ (వందమంది రచయిత్రుల కథా సంకలనం)
రచనలు :
1. లేడీ డాక్టర్ (కవితారావు గారి ఇంగ్లీష్ పుస్తకానికి పరిచయం) డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం ప్రచురణ
2. గురజాడమాట – ప్రగతికి బాట JVV కాకినాడ ప్రచురణ
3. తొలి పార్లమెంట్ లో డా. చెలికాని రామారావు ( వేరొకరితో కలిసి ఇంగ్లిష్ నుంచి అనువాదం)
4. డా. చెలికాని రామరావు జీవన రేఖలు ( వేరొకరితో కలిసి రచన )
ప్రజాసాహితి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, తెలుగు వెలుగు (మాసపత్రిక), దారిదీపం పత్రికలలో వ్యాసాలు,
సోషల్ మీడియాలో :
మక్సిం గోర్కీ, ఎంగెల్స్, ఆర్వీయార్, రంగనాయకమ్మ, రావిశాస్త్రి, ఆవంత్స సోమసుందర్, వీరేశ లింగం ఆరుద్ర, రాంభట్ల, శ్రీ శ్రీ రావు కృష్ణారావు, రారా, తిరుమల రామచంద్ర, మహీధర నళినీ మోహన్, కొ. కు, గిడుగు, శ్రీపాద, దర్శి చెంచయ్య అబ్రహం కోవూర్, తాపీ ధర్మారావు, సుందరయ్య, ఆలూరి భుజంగరావు, జవహర్లాల్
నెహ్రూ, పెరుమాళ్ మురుగన్, గాంధీ, అప్పలనాయుడు , డి. ఆర్ ఇంద్ర, అబే దుబాయ్ ‘ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్’ (పుస్తకం నుండి కొన్ని వ్యాసాల అనువాదం) టాల్ స్టాయ్ మొదలైన రచయిత్ల పుస్తకాల పై సమీక్షలు.
