
నీతో పడవ ప్రయాణం
-గవిడి శ్రీనివాస్
నేనిప్పుడు
నీ జ్ఞాపకాలతో పడవ ప్రయాణం చేస్తున్నాను.
ఏటు ఒడ్డున ఆగి
ఇసుక గూళ్లలో దాగి
నీ పరిమళ సుగంధాన్ని పీల్చుకుంటున్నాను.
నీ వొడిలో వాలి
నక్షత్రాల్ని లెక్కపెట్టడం
నీ కౌగిలిలో
క్షణాలు ఆగిపోవడం.
అలా
ఊపిరి సలపని
జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను.
నేను నిశ్చలంగా ఉండలేను
కొలమానాల కారణంగా
దూరం గా సాగిపోయావు.
చిన్ని జీవితానికి
వెన్నెల జ్ఞాపకాలు
వేదన రోదనలు తప్పా
మాటల స్పర్శే లేని
ఒంటరి జీవితాలకి
జ్ఞాపకాలు
చెరో దిక్కున సాగుతాయి.
కలలు కనే వయసులో
ఆత్మీయ లోకంలో జీవించాను.
క్షణాల్ని పోగుచేసి
నీ కోసం ప్రేమ వారధి నిర్మించాను.
నా గుండె గుడిలో
దీపాలు వెలిగిస్తావనీ….
ఇప్పుడు చెప్పు
గాయపరిచిన గొంతు కాలానిదా
ఆర్థిక బంధాలదా….
నాకు తెలీదు కానీ
నిన్ను కళ్ళల్లో వెలిగించు కోవటం తప్పా.
నీతో సాగిన పడవ ప్రయాణాల్ని
కళ్ళలో నడిపించుకోవటం తప్పా
నాకింకేమీ తెలీదు…!
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.

జ్ఞాపకాలతో ప్రాణం కొనసాగిస్తూ జీవనంలో కష్టసుఖాలని ఆటుపోట్లుగా తీసుకుంటూ వెళ్ళే దారంతా కూడా సుఖం కావాలని ఏది ఏమైనా ఆర్గనైజేషన్ చేసేది దిక్సూచే కదా అలాగే సాగిపోవాలని… మనిషి అంతరంగా చెప్పకనే చెప్పారు… బంధాలు అనేవి నిలుపుకుంటే నే లేనిచో అవన్నీ కూడా వీడని చిక్కుముడులే… చాలా అద్భుతంగా ఉందండి మీ కవిత అభినందనలు శ్రీనివాస్ గారు 👏
“కొలమానాల కారణంగా దూరంగా సాగిపోయావు” గొప్ప పదప్రయోగం..కవితాత్మకత ఉప్పొంగిన కవిత. కాని ఏదో అసంపూర్తిగా కవితను వదిలేశారన్న భావన కలిగింది. గవిడి గారి కవిత్వంలో ఎంతో లోతైన భావనలు ఉంటాయి. అభినందనలు సర్..