
అడవి వేకువలో.. అరుదైన కలయిక
-శాంతి ప్రబోధ
చలితో గడ్డకట్టే వేకువలో, నల్లని శిఖరాలు ఆకాశాన్ని చుంబించాలన్నట్లు నిలిచాయి. వాటి నడుమ దట్టమైన అడవి తన నిశ్శబ్ద శ్వాసను బిగబట్టినట్లు నిశ్చలంగా ఉంది.
సెలయేటి గుసగుసలు, రాళ్లను ముద్దాడే చల్లని స్పర్శ… ఆ ప్రదేశం ఒక విధమైన ప్రశాంతత నింపుకుంది. ఆ ప్రశాంతతకు భిన్నంగా, మండుతున్న నెగడు చుట్టూ నలుగురు స్త్రీలు చేరారు- గాలిలో ఉదయపు చల్లదనం, తడిసిన ఆకుల సుగంధం, అడవి మల్లెల పరిమళం కలిసి ఒక అపురూపమైన క్షణాన్ని సృష్టించాయి. ప్రకృతి కి, మనిషికి ఉన్న అనుబంధం ఇదేనా?!
అక్కడ చేరిన మంగతాయారు, రాజేశ్వరి, వాసంతి, భానుమతి. వారితోపాటు వచ్చిన మరికొందరికి ఈ ట్రెక్కింగ్ కేవలం అడవిలో సాహసం కాదు. ఇది వారి హృదయంలోని అన్వేషణ, ఒక ఆత్మీయ యాత్ర!
నిన్నటి వరకు ఒకరికొకరు తెలియని ఈ స్త్రీల మధ్య ఆ మంటల వెచ్చదనం లో లోపల దాగిన బాధల బరువు దిగి ఒక కొత్త బంధం చిగురించింది.
వారి మధ్య మతాల ముద్రలు, కులాల కయ్యాలు, ప్రాంతాల గీతలు అదృశ్య మయ్యాయి. మాటలు వేరైనా, మనసులో ఒకే స్పందన. ఆ అడవితల్లి ఒడిలో ఒకరికొకరు ఆత్మీయులయ్యారు. ఆ రాత్రి నక్షత్రాలు మిణుకు మంటూ, నెలవంక సన్నని వెలుగును పరిచింది. వారు చెప్పబోయే సత్యాలకు సాక్ష్యంగా నిలిచాయి.
ఉండీలేనట్లున్న ఓపెన్ టెంటులో, రాతి నేలపై ఆ రాత్రి వారికి నిద్ర పట్టలేదు. కొత్త ప్రదేశం, నేల రాలిన ఆకులు మాగి ఘాటైన వింత వాసన… ఎక్కడి నుంచో వినిపించే నక్క ఊళలు, మరేవో అపరిచిత శబ్దాలకు తోడు ఈడ్చి కొట్టే చలిగాలి వారిని మేల్కొలిపాయి. ఇక కంటిపై కునుకు రానివ్వలేదు. మొబైల్ వెలుగులో, వారు నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. నక్షత్రాలు మిణుక్కుమనే ఆకాశం కింద, నెగడు మంటలు ఎర్రగా రగులుతున్నాయి. నిప్పుల నెగడు చిటపటల వెచ్చదనం రారమ్మని ఆహ్వానించింది. ముందుకు చేతులు చాపి, చుట్టూ ఉన్న కొండల నడుమ నెలవంక నక్షత్రాలు చూస్తూ కూర్చున్నారు.
ఈ అడవి ఏదో మాయ మంత్రం వేసినట్లుంది. అడవి మల్లెల సువాసన గాలిలో తేలి వస్తుంటే, అడవి గుసగుసలు చెవులకు వినిపిస్తుంటే, వారి మధ్య మాటలు సెలయేటిలా ప్రవహించాయి. ప్రయాణాల గురించీ, ప్రపంచం గురించీ, బాల్య జ్ఞాపకాల గురించీ ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల లోతుల్లోకి ప్రవేశించిన వారి సంభాషణ హృదయాలను తడిమింది.
బహుశా అమ్మ ఒడంత ఆత్మీయత, భద్రత వారు ఆ క్షణంలో అనుభవించా రేమో! ఎన్నో ఏళ్లుగా గుండెలో దాచుకున్న బాధలు, సంతోషాలు ఒకరితో ఒకరు తమ జీవితాలను విప్పి ధైర్యంగా పంచుకున్నారు. రాతి బుగ్గల్లో నీరు ఊరుతున్నట్లే, వారి మాటల్లో నిజాయితీ తొణికిసలాడింది.
రాజేశ్వరి తన కూతురి పెళ్లి గురించి ఆందోళన చెందుతూ చెప్పుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నిస్సహాయత చూశారు. ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోనని చెప్పే కూతురు విషయంలో ఆ ఇంట్లో అలజడి, ఆందోళన రేపుతున్నాయని చెప్పినప్పుడు
“కారణం అడగలేదా?” భానుమతి ఆసక్తిగా.
రాజేశ్వరి నిట్టూర్చింది. “అడిగాను. పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావ్?’ రేపు నేనేం సుఖపడతాను? అని ఎదురు ప్రశ్నిస్తే ఏం చెప్పను? అందరి జీవితాలూ ఒకేలా ఉండవంటే వినదు. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తోంది. చదువును, ఉద్యోగాన్ని వదిలి కుటుంబం కోసం ఎలా కరిగి పోయానో దానికి తెలుసు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా నా కష్టాన్ని గుర్తించారా అంటే లేదు. పైగా నాకేం తెలియదని చిన్నచూపు చూస్తారు.” లోపలి బాధ ఆమె గొంతు దాటి బయటికొస్తూ.
వాసంతి కలుగ జేసుకుంది, “నిజమే ఆంటీ. చాలామంది అమ్మల పరిస్థితి అదే. బహుశా మా అమ్మకూడా మీలాగే బాధ పడుతున్నదేమో!
ఇంతకీ మీ అమ్మాయి ఏం చేస్తుందో .. ?” ఆసక్తిగా
గొంతులో గర్వం తొణికిసలాడుతుండగా “గురుగావ్‌లో ఐటీ కంపెనీలో టీమ్ లీడ్. త్వరలో మేనేజర్ అవుతుంది.” రాజేశ్వరి కూతురి ఉద్యోగం గురించి చెప్పింది.
వాసంతి ఆలోచనలో మునిగిపోయింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత “కెరీర్‌పై దృష్టి పెట్టిన చాలామంది అమ్మాయిలు పెళ్లికి అంత ఆసక్తి చూపడం లేదు.” ఆమె కళ్ళల్లో ఒక విధమైన ప్రశ్నార్థకం.
మండుతున్న కర్రను లోపలికి తోస్తూ భానుమతి నెమ్మదిగా “పెళ్లంటే కట్నాలు, ఆస్తులు చూస్తారు కానీ, వారి మనసులు కలుస్తాయా అని చూడరు. వారి మానసిక ఆరోగ్యం పట్టించుకోరు. పిల్లల సొంత ఎంపికను హర్షించరు. విలువ ఇవ్వరు. అందుకే సమస్యలు.” లోతైన ఆవేదనతో అంది.
మంగతాయారు మౌనంగా మంటల్లోకి చూస్తోంది. ఆమె మనసులో ఒక సంఘర్షణ జరుగుతోంది. అతను గెలిచాడా? లేక నేను అతన్ని గెలిపించానా? నేను ఓడానా? ఆమె పెదవులు బిగుసుకున్నాయి. “పెళ్లి చేసుకోకపోవడం సరైందేమో” నెమ్మదిగా అంది.
రాజేశ్వరి ఉలిక్కిపడింది. భానుమతి ఆశ్చర్యంగా “ఎందుకలా అంటున్నారు?” నెగడు మంటతో పోటీపడుతూ ఎరుపెక్కిన మంగ మొహం చూస్తూ అడిగింది.
మంగతాయారు క్షణం పాటు అందరినీ చూసింది. ఆమె కళ్ళల్లో ఎన్నో ఏళ్ల నాటి గాయం తాలూకు బాధ “నా అనుభవం నేర్పిన పాఠం. నేను మీలా చదువుకోలేదు. ఇంటర్లో ఉండగా బావతో పెళ్లి జరిగింది. నా ఇష్టం లేకుండా. అతను చేసుకోవాలను కున్నాడు, జరిగింది అంతే”. ఆ స్వరంలో నిరాశ నిస్పృహ .
“అసలు పెళ్లికి చేసుకోకపోవడం సరైందని ఎందుకన్నారు? ఆ విషయంలోకి రండి ” విషయం తెలుసుకోవాలన్న ఆతృత వాసంతికి
“ఆ విషయమే చెప్తున్నా.
బావ మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఎలా ప్రవర్తించాడో నాకు తెలుసు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా అని ఎవరూ అడగలేదు. నా అంగీకారం లేకుండా అంతా జరిగిపోయింది. నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. పెళ్లంటే నాకు భయమేసింది. అదొక నరకం. ఎందుకు నాకే ఇలా జరిగిందని రోజూ ప్రశ్నించుకునే దాన్ని. చావాలని కూడా అనిపించేది.” దాచలేని బాధ. బహుశా ఆనాటి సంఘటన గుర్తొచ్చిందేమో ఆమె గొంతు పూడుకుపోయింది.
వాసంతి కోపంగా “అతను అమ్మాయిని వేధిస్తాడు, కానీ పెళ్లి చేసుకునే అమ్మాయి మాత్రం పవిత్రంగా ఉండాలంటాడు. ఆడపిల్లలంటే ఏమీ తెలియని వాళ్లనుకుంటారు కావచ్చు. ఇడియట్స్ “అన్నది.
మంగతాయారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. “అలాంటి మనిషి కోసం మా అమ్మమ్మ, నాన్నమ్మ, అమ్మ అందరూ వ్రతాలు చేశారు. అతని కాళ్ళు మొక్కించారు. కానీ అతను నా కోసం ఒక్కసారైనా అలా చేయలేదు. భార్యను గౌరవించమని అతనికి ఎవరూ చెప్పలేదు. చివరికి జీవితంతో రాజీపడ్డాను.”ఆమె నిట్టూర్చింది.
“భార్యను అవమానించడం, అనుమానించడం అతని హక్కు అనుకుంటాడు. మనిషి నిండా అహంకారం, ఆధిపత్యం ఉంటుంది.
అప్పటికే ఇద్దరు పిల్లలు. ఆయనకు ఉత్తరాదిన ఉద్యోగం వచ్చింది. ఒంటరిగా పిల్లలను, ఇంటిని చూసుకున్నా. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. బావ తిరిగి రావడంతో నా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
అతను దూరంగా ఉండి సంపాదించడం వల్లే పిల్లలు బాగున్నారని అందరూ అంటారు. కానీ వారి కోసం నేను పడిన కష్టం ఎవరికీ కనిపించదు. రాత్రింబగళ్లు వారి కోసం మేలుకోవడం, ఇంటి పనులు, అత్తమామలు – పిల్లల పనులు, వ్యవసాయం, బంధువుల సేవలు… మా అత్త ఉండీ లేనట్టే. ఏ పనీ చేయదు. పైగా నన్ను ఎప్పుడూ తిడుతుంది.” మంగతాయారు గొంతులో తన త్యాగాలు వృధా అయ్యాయన్న బాధ, అలసట స్పష్టంగా వినిపించింది.
“అయినా నేను బాధపడలేదు. చదువుకోకపోయినా నన్ను నేను తీర్చిదిద్దు కున్నాను. పిల్లలతో పాటు చదువుకున్నాను. వారిని క్లాసులకు తీసుకెళ్లడం, తీసుకు రావడం అన్నీ ఒక యజ్ఞంలా చేశాను. నా చిన్నతనంలో నాకు లేని అవకాశాలు నా పిల్లలకు ఉండాలని కోరుకున్నాను. అందుకే వాళ్ళు ఏది అడిగినా కాదనలేదు. ఎంత కష్టమైనా సంతోషంగా చేశాను. కానీ ఇప్పుడు… నా కష్టానికి విలువ లేదని తెలిసి నప్పుడు బాధగా ఉంది. అతని అహంకారం నన్ను చంపుతోంది.” ఆమె మండుతున్న నిప్పుల్లో తన బాధను వేసినట్లుంది.
“హలో మేడం. కరివేపాకు కూడా చాలా విలువైనది.” నవ్వి, మళ్ళీ తానే “నీవు కరివేపాకు కాదు, మంగా. నీవు గుండెలో రగులుతున్న నెగడువి. ‘కొండ నక్క వాసన కొమ్ము చెట్టుకైనా తెలుస్తుందంటారు. నీ బలం నువ్వు తెలుసుకోకపోతే ఎలా. నీకే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్లందరికీ నువ్వేంటో కనిపిస్తుంది” అనునయంగా వాసంతి.
“అమ్మాయ్.. నీ పేరేంటో.., నీకింకా పెళ్లి కాలేదు. నీకు ఇప్పుడర్థం కాదు. పెళ్లయ్యాక తెలుస్తుంది. ఏ ఇంట్లోనైనా అంతే. ఆడవాళ్లు ఎంత చేసినా కరివేపాకుల్లా తీసి పడేస్తారు. ఎంత దిగి వచ్చినా ఇంకా దిగమంటారు. ఎక్కడి వరకు పోతామో?” నడివయసు దాటుతున్న రాజేశ్వరి నిట్టూర్చింది,
“నా పేరు ఏదైతే ఏం లే.. ఆంటీ..
అరే, ఈ సిగ్నల్ లేని అడవిలో కనెక్షన్ ఫుల్ గా ఉంది. ఆంటీ.. మనసులు కలిస్తే సిగ్నల్ బారులు ఎగిరిపోతాయి కదూ .. ” కళ్ళెగరేస్తూ. ఇరవైల చివర్లో ఉన్న వాసంతి హాస్యం అందరినీ నవ్వించింది.
మంగతాయారు పురుషుల టెంటు వైపు చూస్తూ “కాలికి బలపం కట్టుకుని తిరిగిన నేను ఇప్పుడు రోగిష్టిగా మారడానికి కారణం మా ఆయనే.” నలభైలలో ఉన్న ఆమె గొంతులో నిశ్శబ్దమైన ఆవేదన.
అంతా ఆశ్చర్యపోయారు. “జోక్ చేస్తున్నారా?” వస్తూ మంగ మాటలు విన్న ఆనంది కూర్చుంటూ.
“చాలా మంది మొగుళ్ళు బయటికి చాలా మంచివాళ్లలా కనిపిస్తారు. కానీ అసలు రంగు పెళ్ళానికే తెలుస్తుంది.” నెమ్మదిగా రాజేశ్వరి.
మంగతాయారు కళ్ళల్లో నీళ్లు మెరిసాయి. “ఆకాశాన్ని వెలిగిస్తావని పొగిడి వెళ్ళిన మనిషి, ఇప్పుడు నన్ను ముట్టుకుంటే కలుషితం అయిపోతానంటున్నాడు. అంటరాని దానిలా చూస్తున్నాడు. గుండెలో గునపం గుచ్చినంత బాధగా ఉంది. ఏం చేయను? నేను సీతమ్మలా పరీక్ష ఎదుర్కోవాలా? అతను నా భర్తలా కనిపించడం లేదు. ఒక విష సర్పంలా కనిపిస్తున్నాడు. అతని ప్రవర్తన నాకు కొత్తగా ఉంది.” మళ్ళీ తెరిచిన గాయాలతో ఆమె గొంతు భారమైంది.
అందరి హృదయాలు బరువెక్కాయి. వారి మధ్య రాజ్యమేలుతున్న నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ “నా కూతురే నన్ను ట్రెక్ కి వెళ్ళమని బలవంతం చేసింది. ‘ఎప్పుడూ నువ్వే వెళ్తావా? అమ్మను కూడా తీసుకెళ్ల’మని. మీ అమ్మనా అంటూ బావ ఎగతాళి చేశాడు. కానీ దాని పట్టుదల వల్ల నేను బయలుదేరాను. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చూస్తుంటే నాలో ఒక కొత్త శక్తి వచ్చింది. ముఖ్యంగా ఆ మేడమ్‌ని చూశాక.” దూరంగా వేపపుల్లతో వస్తున్న 65 ఏళ్ల అన్నపూర్ణాదేవిని చూపుతూ తనను తాను కనుగొనే యత్నంలో ఉన్న మంగతాయారు అన్నది.
ఆ అడవిలో అందరి మధ్య ఒక అరుదైన సోదరీభావం ఏర్పడింది. వారి వారి జీవన సమరంలో కథలకు స్వస్థత ఇచ్చే స్థలంగా ఆ నెగడు మారింది. ఎవరు ఎవరినీ జడ్జ్ చేయకుండా సానుభూతితో విన్నారు.
ఆ సమయంలో వారి మధ్య చేరిన అన్నపూర్ణాదేవి ఈ నెగడు ముందు ఎప్పుడు చేరారని అడిగింది.
“అహ్హహ్హా .. ఇది నెగడు కాదు. హృదయాలను తెరిచే స్థలం. అరుదైన బహుమతి ” కళ్ళెగరేస్తూ చెప్పింది వాసంతి. అవునన్నట్లు తలూపారు మిగతావాళ్ళు.
ఎలా? అని అడిగిన అన్నపూర్ణాదేవికి తెరుచు
అన్నపూర్ణాదేవి కూడా తన కథ చెప్పింది. భర్త దూరంగా ఉండటం వల్ల ఆమె ఎలా బాధ పడిందో, తన యవ్వనంలో ఆమెను వాడుకోవాలని చూసిన వారిని ఎలా ఎదుర్కొన్నదో చెప్పింది. “నా అందం నా తప్పా? నాలా ఉండటానికి నేను ఎంత పోరాడానో నాకే తెలుసు. అతని అహంకారం, గౌరవం గురించి మాట్లాడతారు కానీ నా గౌరవం సంగతేంటి? నేను నా కుటుంబాన్ని వదిలి రాలేదు. అది నా బాధ్యత అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను వచ్చి నిందిస్తుంటే భరించలేకపోతున్నాను. ఈ బంధాన్ని తెంచుకుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. కానీ పిల్లల గురించి భయంగా ఉంది.”
వాసంతి ఆవేశంగా “మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి మీరేమైనా వస్తువా? మౌనంగా ఉండకండి. ఆడవాళ్లంటే అవసరమైన వాళ్ళని గుర్తించేలా చేయండి. ” తన అభిప్రాయం చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న పెళ్లి మీద వాసంతికి నమ్మకం లేదు.
మంగతాయారు వాసంతిని, ఆనందిని చూస్తూ “బాగా చదువుకున్న మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది.” అంటున్నప్పుడు ఆమె కళ్ళలో సన్నని మెరుపు.
“చిన్నప్పుడు చదవమంటారు, ఫస్ట్ వస్తే సంతోషిస్తారు. కానీ పెళ్లయ్యాక ఉద్యోగం చేయమంటే చేయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి. ఆకాడికి ఇంత కష్టపడి ఎందుకు చదవాలి?” ఆనంది నిట్టూర్చింది.
“ఈ పెద్దవాళ్లకు ఏమీ అర్థం కాదు. పెళ్లయ్యాక చదువుకుంటే తానే చదివించా నంటాడు మొగుడు. స్వేచ్ఛ ఇస్తామంటారు అత్తింటివారు. అసలు ఆమెకు నచ్చిన పని చేయాలి కానీ వాళ్ళు నిర్ణయించడం ఏంటి? స్వేచ్ఛ ఇవ్వడం ఏంటి?” వాసంతి తీవ్రంగా
ఆనంది గట్టిగా నవ్వింది, “పెళ్ళామంటే భూమ్మీద పనులన్నీ చేసే పనిమనిషి అనుకుంటారేమో. పిల్లల్ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వారి పెంపకం బాధ్యత నా భర్త తీసుకుంటానంటే పెళ్లి చేసుకుంటాను. లేదంటే సోలో లైఫ్ సో బెటర్.”
“పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మీ అమ్మ వాళ్లకో, అత్తింటి వాళ్లకో అప్పగించ వచ్చు.” రాజేశ్వరి సూచనగా అంది.
“ఆహా.. ఏం చెబుతున్నారండీ? నేను పిల్లల్ని కని వాళ్ళ మొహాన పడెయ్యడం.. ఎంత అన్యాయం. నా పిల్లల బాధ్యత నాదే. నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. వాళ్ళ పిల్లల బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. బాధ్యతలు తీరిన వాళ్ల నెత్తిపై బరువేసి చాకిరీ చేయించుకోవాలా? నో.. ” ఆనంది స్పష్టంగా చెప్పింది.
అన్నపూర్ణాదేవి నిట్టూర్చింది, “నాకెన్నో ఆసక్తులు.. కానీ మనవళ్లు, మనవరాళ్ల ఆలనపాలనలో సమయం గడిచిపోయింది. ఇప్పుడు కాస్త సమయం దొరికినా వయసు మీద పడుతోంది. అనుకున్నవన్నీ చేయగలనో లేదో.. “
“చూశారా పెద్దవాళ్ళ ఆసక్తులు.. ” రాజేశ్వరి కేసి చూస్తూ అర్ధోక్తిలో ఆగింది ఆనంది.
“కొత్తిమీరలా కనిపించి, కరివేపాకులా తీసి పడేసే జీవితం కోరుకోవడం లేదు. ఆ జీవితంలో అంతులేని శ్రమ, గుర్తింపు లేని త్యాగాలు, స్వేచ్ఛ లేని బతుకు.. నేనైతే పెళ్లి చేసుకుని నా జీవితాన్ని తాకట్టు పెట్టలేను యార్. అది నా జీవన విధానం.” వాసంతి ప్రకటించింది.
కొండపై సన్నని శశి కాంతి, మెరిసే నక్షత్రాలు, అరుణోదయం కోసం ఎదురు చూస్తున్న అడవి… చల్లని గాలి వీస్తోంది. కానీ మండుతున్న నిప్పుల కంటే వేడిగా వారి చర్చ సాగుతోంది. నిగూఢమైన ఆ ప్రదేశం, ఉమ్మడి అనుభవం ఆ స్త్రీల లోపలి గాయాలు స్వస్థపరచే శక్తినిస్తుం
“ఉద్యోగమే జీవితమా?” భానుమతి ప్రశ్న.
“కంప్యూటర్లు, ఫోన్లతో పనిచేసే కాలం ఇది. ఇంట్లో, బయట ఒత్తిడి. పెళ్లైన వాళ్లకి శారీరక సాన్నిహిత్యం తగ్గిపోయింది. ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్ వస్తువులతోనే గడుపుతున్నారు. ఇక మాటలు, ముచ్చట్లు ఎక్కడివి? ఏదో మొక్కుబడిగా మాట్లాడతారు. అలాంటి సంబంధంలో ఉండటం ఎందుకు?” వాసంతికి మద్దతుగా అన్నది ఆనంది.
వాసంతి సూటిగా ప్రశ్నించింది, “పెళ్లి, పిల్లలు, భర్త, అత్తమామలు, బంధువులు… తెల్లారి లేచిన దగ్గర్నుంచి చాకిరీ, గుర్తింపు లేని చాకిరీ, విలువ లేని చాకిరీ, అవమానాలు, ఆరళ్లు భరిస్తూ చాకిరీ… ఇదేనా జీవితం? గౌరవం లేని జీవితం, వ్యక్తిత్వం లేని జీవితం, నూన్యతలోకి తోసేసే జీవితం ఇదేనా కావాల్సింది?”
రాజేశ్వరి ఏమి చెప్పాలో తెలియక అందరి వైపు చూసింది. వాసంతిని చూస్తుంటే, ఎప్పుడు పెళ్లి గోల తప్ప ఇక మాట్లాడానికి ఏమీ లేదా.. నేను నా కెరీర్ పై దృష్టి పెడుతున్నా అనే కూతురే కన్పిస్తున్నది.
కాలిపోతున్న కర్రను పట్టుకుని “బందీనై బతకలేను. చిలక పలుకులు పలకలేను. అందుకే పెళ్లి గిళ్లి జాన్తా నై.” స్వంత గుర్తింపును, స్వేచ్ఛను కోరుకునే వాసంతి కూనిరాగం తీసింది.
సంప్రదాయ గొలుసులను తెంచుకొంటున్న వాసంతి సమాజపు అంచనాలకు నాలాగా లొంగదు. తన స్వేచ్ఛను బానిసత్వంగా మార్చుకోదు. వాసంతిని ఆరాధనగా చూస్తూ మంగతాయారు ఆలోచనలో పడింది.
నేనేమైనా బొమ్మనా? రాజీపడి జీవితాంతం బతకాలా? సుడిగుండంలోంచి బయటికొచ్చి నచ్చినట్టు స్వేచ్ఛగా బతకాలా? మంగ మనసులో ఒక దృఢమైన సంకల్పం మెరిసింది. ఆ వెంటనే నేను నా స్వంత మార్గాన్ని, నా స్వంత బలాన్ని కనుగొంటాను అనుకుంది.
“మేమిద్దరం ఉద్యోగస్తులం. మొదట్లో ఇంటి పనులు, పిల్లల పెంపకం విషయం లో చాలా గొడవ పడ్డాం. కానీ తర్వాత మాట్లాడుకున్నాం. పరిష్కారం మా చేతుల్లోనే ఉందని తెలుసుకున్నాం. ఇప్పుడు మా మధ్య తేడా లేదు. అన్ని పనులు కలిసి చేసుకుంటాం. స్నేహితుల్లా ఉంటాం.” అని భానుమతి తన అనుభవాన్ని పంచు కుంది,
“అదృష్టవంతులు. పెళ్ళాన్ని తనతో సమానంగా చూసే మొగుళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారేమో .. “మంగతాయారు వెంటనే అంది,
రాజేశ్వరి ఆలోచనలో పడింది. నేనెప్పుడైనా అలా ఆలోచించానా? నేను ఏకపక్షంగా ఉన్నానా? ‘గుర్రం గుడ్డిదైతే గుడ్డి గుర్రం అని, ఆడది గుడ్డిదైతే గుడ్డి మొగుడు’ అందుకే అంటారా.. భానుమతి గారిది అదృష్టం కాదు ఆమె కృషికి ఫలితం. తనలోకి తాను తొంగి చూస్తూ అనుకుంది రాజేశ్వరి.
“ఒక జంట మధ్య దూరం పెరగడానికి చాలా కారణాలుంటాయి. సరైన సంభాషణ లేకపోవడం, అపోహలు, ఆర్థిక సమస్యలు, వేరే సంబంధాలు, ఎక్కువ అంచనాలు, ఆధిపత్యం, చిన్నచూపు… ఇలా ఎన్నో. అలవాట్లు, అభిరుచులు, విలువల్లో తేడాలు విడాకులకు దారితీస్తాయి. తల్లిదండ్రుల అతి జోక్యం కూడా సమస్యలు సృష్టిస్తుంది. ఎక్కువ పని గంటలు, ఒత్తిడి కూడా ప్రభావం చూపుతాయి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తీసుకోవడం కష్టం. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.” అన్నపూర్ణాదేవి అనుభవంతో చెప్పింది.
అంతా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు . కొద్ది క్షణాల మౌనం తర్వాత “ఎక్కడైనా పెళ్లి ఎంత సహజమో, విడాకులు అంతే సహజం.” తమిళ తెలుగులో అన్నది ఆనంది.
“అవును నిజమే. కనిపించని దేవుళ్ల సాక్షిగా జీవితాంతం చేసే వాగ్దానంలా పెళ్లి కనిపిస్తుంది. కానీ విడాకుల గురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకో .. ” ఆలోచనగా భానుమతి.
“విడిపోతూ కలుస్తున్నాం. కలుస్తూ విడిపోతున్నాం. కలిసినట్టే ఉంటాం, ఎవరికి వారుగా… విడిపోయినట్టే ఉంటాం, ఒకటైపోతూ…” రాజేశ్వరి గొణిగినట్లుగా.
వాతావరణాన్ని తేలిక పరుస్తూ “నిన్నటి రోజు మీకెలా అనిపించింది?” అన్నపూర్ణాదేవి అడిగింది.
“ఆకులో ఆకునై, కొండలో కొండనై, లోయలో లోయనై, వాగులో వాగునై…” నవ్వుతూ ఆనంది.
“ఎగుడుదిగుడు లోయల్లో, కొండ అంచుల్లో… ముళ్ళు గుచ్చుకుంటూ, రాళ్ళపై నుంచి దాటుతూ, ఎక్కుతూ దిగుతూ, అక్కడక్కడ జారుతూ… ఆ రాతి నేల ఎన్ని వంపులు తిరిగిందో, ఆ వాగు వంకా అన్ని వంపులు తిరుగుతూ… నీటి ఒరవడికి జారే గులకరాళ్లు దాటుతూ, రాళ్ల మధ్య పలికే రాగాలు వింటూ… జాగ్రత్తగా అడుగులేస్తూ… పడుతూ లేస్తూ… కంటికి కనిపించని ఉర్రూతలూగే జలపాత గీతం వింటూ… అంతు తెలియని జలపాతపు లోతు అంచనా వేస్తూ… హడావిడి చేస్తున్న జలపాతంలో మునకలేస్తూ… చూస్తూ… నడక… ఎడతెరిపిలేని నడక… చురుక్కుమనే ఎండా… జీవితం సవాళ్లతో కూడిన నిరంతర యాత్ర అనిపించింది” భావోద్వేగంతో చెప్పిన వాసంతి కళ్ళల్లో ఆనాటి అనుభూతి మెరిసింది.
“సామాజిక హోదా మరచి, ఈ అడవిలో మధ్యలో అంతా మనుషులుగా… మనిషితనంతో ఉన్నామనిపించింది” ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న భానుమతి.
“ఎవరో చెక్కినట్లున్న ఎత్తైన ఎర్రని రాతి కొండల్లో… వాటి కిందుగా ఏపుగా ఎదిగిన పచ్చని చెట్లలో… పారే వాగు… ఎంత అందంగా ఉందో… అవి నిర్మలంగా ఉన్నట్లు కనిపిస్తాయి కానీ వాటికీ మనలాగే లోపలి సంఘర్షణలు ఉంటాయేమో అనిపించింది “రాజేశ్వరి కళ్ళల్లో ఒక విధమైన శాంతి కనిపించింది.
పొయ్యి ముట్టించిన పొగలు కమ్ముకున్నాయి, పలచని వెలుతురు పొరలు అలుముకుంటుండగా గిన్నెల చప్పుడు వినిపించింది వంటలు మొదలైనట్టున్నాయి అనుకున్నారు.
పక్షుల కిలకిల రావాలు ఆహ్లాదంగా వినపడుతున్న ఆ మసక చీకటిలో ఒకరొకరు లేచి వాగు వైపు నడవసాగారు. తిరిగి వస్తూ పొగలు కక్కే వేడి వేడి టీ కప్పులతో చలిమంట దగ్గరకు వస్తున్నారు.
వారిలో కనిపిస్తున్న భర్తను చూస్తూ “రాత్రి పడుకున్నప్పుడు, నేనేనా ఇంత దూరం ఈ కొండ రాళ్ళు, బండరాళ్లపై, నాచు పట్టిన జారుడు రాళ్లపై శక్తినంతా కూడగట్టుకుని నడిచి కొండలు దాటి ఈ కోనలో చేరింది అని ఆశ్చర్యం. నాకైతే ఈ అడవి పాటలు, జల స్వరాలు, ఒంపులు తిరిగే వాగులు… గోడలు లేని, తలుపులు లేని, ఇరుకుదనం లేని ఈ స్వర్గం ముంగిట్లోకి మళ్ళీ రావాలని ఉంది.” ఉత్సాహంగా మంగతాయారు.
అన్నపూర్ణాదేవి నెమ్మదిగా అంది, “కదా! జీవితం కూడా అంతే. నిన్నటి మన నడకలో ఎన్ని ఎగుడు దిగుళ్లు, ముంచెత్తే ప్రవాహాలు, చుట్టుముట్టిన తేనెటీగలు… ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎవరూ వెనుదిరగలేదు. నిన్న నడిచిన దారి కఠినమైనదిగా మన జ్ఞాపకాల్లో ఉంటుంది. అలాగే జీవితంలోని కష్టాలు వెంటాడు తాయి. మనని వదలనంటాయి. ఇబ్బంది పెడతాయి. కానీ మన వాళ్లపై మన గుండెల్లో గూడుకట్టుకున్న మమకారం ఎక్కడికి పోతుంది? మనం ఉన్నంత కాలం జీవన పోరు తప్పదు.” ప్రకృతి లాగే పాఠాలు నేర్పుతున్నట్లు ఆమె మాటలు సాగాయి.
ఉదయం వెలుగులు అడవిపై పడుతుండగా, ఏదో జీవిత సత్యం అర్థమైనట్టు, తన సొంత కథను తానే రాసుకునే వ్యక్తిలా నిటారుగా లేచి నిలబడింది మంగతాయా రు. ఆ కళ్ళలో ఏళ్లుగా దాచిన బాధ కరిగి, ఒక కొత్త సంకల్పం మెరిసింది. ఆ అడవి ఆమెకు కేవలం చెట్ల సమూహం కాదు. ఆమె గుండెలోని గాయాలు స్వస్థపరచిన స్థలం.
ఆ వెనకే లేచింది రాజేశ్వరి. తన కూతురి స్వేచ్ఛను గౌరవించాలనే నిర్ణయంతో. ఆమె కళ్ళల్లో ఒక కొత్త కాంతి మెరిసింది.
ఆ అడవిలో గడిపిన అరుదైన క్షణాలు వారికి కొత్త ఊపిరినిచ్చాయి. తమ అంతర్గత పోరాటాలకు సమాధానం దొరికినట్లు, ఒకరికొకరు అండగా నిలబడాలనే భావన వారిని బలంగా కలిపింది.
ఆ నెగడు కేవలం కట్టెలు మండించే చోటు, లేదా చలి కాచుకునే చోటు కాదు. వారి హృదయాల్లో రగులుతున్న ఆశల స్థలం. ఆ అడవి వారి జీవితాల్లోని అడ్డంకు లను, అవమానాలను దాటుకుని వెళ్లే మార్గం.
ఆ రాత్రి ఆ అడవి ఆ వేకువ వారికి కేవలం ఒక ప్రదేశం, ఒక సమయం కాదు. అది వారి హృదయాలను తెరిచిన స్థలం. ఆ సమయం ఒక అద్భుతమైన అనుభవం.
*****

నేను వి. శాంతి ప్రబోధ . చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. శ్రీమతి హేమలతలవణం, శ్రీ లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచాను. ఆ నడకలోనిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతమయ్యాయి. ఆ అనుభవాల్లోంచి రాసినవే భావవీచికలు , జోగిని , గడ్డిపువ్వు గుండె సందుక , ఆలోచనలో …ఆమె . భావవీచికలు బాలలహక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం . ILO , ఆంధ్రమహిళాసభ , బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల ‘జోగిని ” . వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది . 2015లో విహంగ ధారావాహికగా వేసింది . ప్రజాశక్తి 2004లో ప్రచురించింది . గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో …ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటిలు . అమర్ సాహసయాత్ర బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ. ఆడపిల్లను కావడం వల్లనే శీర్షికతో వ్యాసాలు ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వచ్చాయి . కవితలు ,వ్యాసాలు ,రేడియో ప్రసంగాలు వగైరా వగైరా ..