ఆరాధన-12 (ధారావాహిక నవల)
(ఆఖరి భాగం)
-కోసూరి ఉమాభారతి
‘కెరటం నాకు ఆదర్శం .. పడినా కూడా లేస్తున్నందుకు!’ -స్వామి వివేకానంద
మరో నాలుగు రోజులు అమ్మానాన్నలతో హాయిగా గడిపాను. ఓ రోజు పొద్దుటే, అందరం కలిసి టిఫిన్ చేస్తుండగా.. నన్ను ఉద్దేశించి “చూడమ్మా ఉమా, నృత్యంలో నీవు ఇన్నాళ్లగా కృషి చేసి, ఎంతో సాధించావు. ఇప్పుడు వీలు చేసుకుని, సాహిత్య రంగం కృషి చేయడం మొదలుపెట్టు.” అనడంతో నేను, అమ్మ కూడా ఒకింత ఆశ్చర్య పోయాము.
మా నాన్నగారి మాటలు .. నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అమ్మావాళ్ళతో షిరిడీ వెళ్ళి వచ్చాక.. హూస్టన్ కి తిరుగుప్రయాణమయ్యాను. నృత్యేతర రచనలు చేయాలన్న తపన మొదలయ్యింది.
***
మరో ఆరు నెలలు గడిచాయి. మేము ఊహించని విధంగా కామిని విషయం మమ్మల్ని ఒకింత ఆలోచనలో పడేసింది. ఓ పక్క వివాహానికి తేదీ ఖరారు చేస్తూనే సందీప్ తో అతిగా వాదనలు పెట్టుకుని.. మా అందరి ఎదుటే పోట్లాడసాగింది. ఆ అమ్మాయికి ఏమయిందో అర్ధంకాలేదు.
కామిని ప్రవర్తన సమంజసంగా లేకపోవడం.. నన్ను బాగా కలవరపెట్టింది. సందీప్ తో మాట్లాడుదామంటే వాడసలు దేనికీ నోరు విప్పడు.
ఎలాగోలా సమయం గడిపేస్తున్నాను. ఆ మధ్య నా స్నేహితురాలి కొడుకు కూడా ఇలాగే నిశ్చితార్ధం చేసుకున్నాక అమ్మాయితో గొడవలు పడి విడిపోయాడని జ్ఞాపకం వచ్చి .. ఆమెతో మాట్లాడాను. ఆ విషయం కూడా ఇంచుమించు కామిని లాగానే అని నాకు అనిపించింది. అసలు ఈ జంటల నడుమ ఎటువంటి విబేధాలు తలెత్తుతున్నా యో అర్ధం కాక, మిన్నకుండిపోయాను.
సాహిత్యంతో మనసుకి ప్రశాంతత వస్తుందని … నా ఆలోచనలని అక్షరీకరిస్తూ.. మనసు మళ్లించుకోగలిగాను. కథానికలు, కవితలు రాయసాగాను. నిజంగానే దిగుళ్ళన్నీ దూదిపింజల్లా తొలిగిపోయి హాయిగా అనిపించేది. ‘సందీప్, కామిని.. వారి సమస్యలను పరిష్కరించుకుంటే పెళ్లి చేసుకుంటారు. లేకుంటే.. ప్రపంచం ఆగి పోదుగా! ఏది జరిగినా మన మంచికే.’ అనుకున్నాను.
నా స్టూడియోల పని, నా రచనలు నిరాటకంగా కొనసాగుతున్నాయి.
***
మళ్ళీ నాలుగు నెలలకి సందీప్, కామిని నడుమ అభిప్రాయబేధాల వల్ల వివాహ విషయంలో వెనుకడుగు వేశారు. అదీ మంచికే అని అందరం కుదుటపడ్డాము.
***
సందీప్ కార్డియాలజీలో చేరాడు. శిల్ప మెడిసిన్ లో చేరింది.
నేను రాసిన మొట్టమొదటి కథ ‘ముళ్ళ గులాబి’ కి 2012 లో వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచన పురస్కారం అందుకున్నాను. చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది. నా రెండవ కథ ‘కాఫీ – టిఫిన్ – తయ్యార్’ ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్ లో ప్రచురించబడినది. ప్రచురింపబడిన ‘త్రిశంకు స్వర్గం’ అనే మరో కథకి మంచి స్పందన వచ్చింది.
నాన్న ఆశ్చర్యపోయారు. అమ్మ మురిసిపోయింది. అభినందించింది. అలా నేను రచనా వ్యాసంగంలో పూర్తిగా నిమగ్నమయ్యాను.
***
అమ్మానాన్నలిద్దరూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడసాగారు. వారికి బాధ్యతలు తగ్గే బదులు ఎక్కువవ్వసాగడంతో వారికి మానసిక వొత్తిడి పెరిగింది.
తరుచుగా ఇండియా వెళ్ళి రావడం చేస్తున్నాను. నేనక్కడ ఉన్నన్నాళ్ళు బాగానే ఉంటున్నారు. ఆ తరువాత మళ్ళీ షరామామూలేగా ఉండేది. ఎన్నో కారణాలు.
సాధారణంగా తల్లితండ్రుల పట్ల ఉదాసీనంగా, ఆంటీముట్టనట్టుగా, బాధ్యతా రహితంగా ఉన్న యువతని నేను గమనిస్తూ ఉంటాను. అదే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథలు, వ్యాసాలు రాశాను. ప్రసంగించాను. నా మొదటి కథాసంపుటి ‘విదేశీ కోడలు’. అందులోని పది కథానికలు కూడా ఇంచుమించు వృద్దులయిన తల్లి తండ్రుల పట్ల వారి పిల్లల బాధ్యతారాహిత్యం గురించి రాసినవే. 2013 లో వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణగా 13 వ తానా తెలుగు సభలో ‘విదేశీ కోడలు’ ఆవిష్కరించ బడింది.
***
మరో నాలుగేళ్ళు గడిచాయి. మా అమ్మ పరమపదించడం నన్ను విపరీతంగా క్రుంగదీసింది. నాన్న ఒంటరి అయ్యారన్న దిగలు కూడా నాలో అధికమయింది. అక్కడి స్నేహితుల సాయంతో.. నేను ఆయన్ని సుఖంగా, సంతోషంగా ఉంచాలని నా చేతనయినవన్నీ చేసేదాన్ని. ఎంతచేసినా అమ్మతోడు లేక ఆయన పరిస్థితి దిగజా రింది.
ఒక్కోమారు నాన్నని చూసేందుకు.. ఉన్నట్టుండి హైదరాబాదుకి ప్రయాణ మయిపోయేదాన్ని. ఆయనకి అన్ని వైద్యపరీక్షలు చేయించేదాన్ని. నాన్నని నా వద్దకి వచ్చేయండని అడిగినా… ఒప్పుకునేవారు కాదు.
***
తాను శారీరకంగా బాలహీనపడినా.. నాకు కొండంత స్పూర్తినిస్తారు నాన్నగారు. కొత్త ఆశయాలని పరిచయం చేస్తారు. మేరుపర్వతమంత నమ్మకాన్ని కలిగిస్తారు. ఆశయ సాధన కోసం ఎంతలా శ్రమించాలో కూడా నేర్పుతారు. ఆయన వద్ద నేను నిత్య విద్యార్ధినే.
2017 లో నేను వెళ్ళినప్పుడు, నాకు నాన్న చాలా బలహీనంగా అగుపించారు. మా నాన్న గురించి, అమ్మ గురించి ‘వేదిక’ అనే నవల దాదాపు పూర్తయ్యింది. నా ఐదేళ్ల వయసు నుండి వారి ప్రాపకంలో నా ఎదుగుదల, వారి క్రమశిక్షణలో నా పురోగతి, వారి త్యాగాలలో నా అభివృద్ది గురించి రాశాను. వారికి సంబంధించిన ప్రతి సంఘటన నిజంగా జరిగినవే రాశాను. వారి ఆశలని, ఆశయాలని నావిగా భావించడంలో ఎంత ఆనందం ఉందో తెలియజేశాను.
పుస్తకం తయారవుతుండగా నాన్నకి చూపించాను. చాలా ఆనందపడ్డారు. నాన్నగారి చేతుల మీదగా పుస్తకావిష్కరణ జరగాలని ప్లాన్ చేశాను. నాన్న కూడా ఉత్సాహంగా సలహాలిచ్చారు.
300 పేజీల ఆ గ్రంధం వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణగా విడుదలయేం దుకు చక్కగా ముస్తాబయింది. కానైతే, పుస్తకావిష్కరణకి వారం రోజులు ముందు నాన్న ఆరోగ్యం క్షీణించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా నాన్నగారు కోలుకోలేదు. మమ్మల్ని విడిచి పరలోకానికి వెళ్లిపోయారు.
నాన్నగారి అంత్యక్రియలు పూర్తయ్యాక దుఃఖభారంతో హ్యూస్టన్ తిరుగు ప్రయాణమయ్యాను
***
సందీప్ కార్డియాలజీ పూర్తి చేసి తనతో పాటు రెసిడెన్సీ చేసిన మిలానాని వివాహమాడి కాలఫోర్నియాలో స్థిరపడ్డాడు, శిల్ప రెసిడెన్సీ చేసి ప్రాక్టీస్ లో చేరింది. నేను నా డాన్స్ స్టూడియోలు, రచనలు కొనసాగించాను.
***
కాలగమనంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా మొదటి పుస్తకం ‘విదేశీ కోడలు’ నుండి.. ఇప్పటి వరకు ఎగిరే పావురమా-నవల (2015), సరికొత్త వేకువ – కథాసంపుటి (2017), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాససంపుటి (2018)… ఇప్పటివరకు పుస్తకరూపంగా వంగూరి పొండేషన్ వారి ప్రచురణలుగా వెలువడిన గ్రంథాలు, నాట్యభారతి ఉమాభారతి కథలు – కథాసంపుటి 2023లో వెలువడింది. మూడు మార్లు కథలకి ఉత్తమ రచన పురస్కారాలని అందుకున్నాను.
వేదిక (నవల), నాట్యభారతీయం (వ్యాససంపుటి) ధారావాహికలుగా ‘గో-తెలుగు’ సాహిత్య వారపత్రికలోను, ‘ఎగిరే పావురమా’ (సాంఘికనవల) సారంగా సాహిత్య పత్రికలోనూ ధారావాహికగా వెలువడి… పాఠకుల ఆదరణతో పాటు ప్రశంసలు పొందాయి.
తాజా నవల ‘హృదయగానం నేడే విడుదల’ (2024) లో సిరికోన సాహిత్య అకాడమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం ‘సిరిమల్లె’ తెలుగుభాషా సౌరభంలో సీరియల్‌గా వెలువడుతున్నది.
ఈ మధ్యనే గేయరచన చేస్తున్నాను. పాటలుగా తయారయ్యాక ఎడిటింగ్ కూడా నేనే చేసి మా అకాడెమీ యూట్యూబ్ లో ప్రచురిస్తున్నాను.
ఏ రూపంలోనైనా… ఏ కళనైనా ఆస్వాదించగలిగినా, అభ్యసించగలిగినా, ఆరాధించగలిగినా .. జన్మ సార్ధకమయినట్టే అన్నది నా నమ్మిక.
“ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.”, “కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు” అన్న స్వామివివేకానంద సూత్రాలు గుర్తు చేసుకుంటుంటాను. దైవం ప్రసాదించిన జీవితాన్ని భక్తితో స్వీకరించగలిగితే వొడుదొడుకులని తట్టుకుని సాగిపోవచ్చునన్న అమ్మమ్మ మాటలని కూడా నమ్ముతాను.
*****
(సమాప్తం)