
గతించిన జ్ఞాపకాల చిరునామా (“ద అడ్రెస్” – డచ్ కథకు అనువాదం)
-పద్మావతి నీలంరాజు
అవి నాజీ ఉద్యమం జరుగుతున్న రోజులు. ఆ ఉద్యమాన్ని ఆపాలని మిగిలిన ప్రపంచ దేశాలు ఏకమై హిట్లర్ కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి రెండో ప్రపంచ యుద్ధం చేశారు. ఆ యుద్ధం వలన ఎవరు లాభం పొందారు? ఎవరు పొందలేదు? ఎవరు చెప్పలేని విషయం. కానీ సామాన్యులు చాలా నష్టపోయారు. దేశం విడిచి వలస పోయారు. తమకున్న సంపదలు వదులుకొని వేరే దేశంలో మురికివాడల్లో ఉంటూ తమకంటూ ఏ గుర్తింపు లేకుండా జీవనం సాగిస్తున్నారు ఈ రోజు వరకు. హాలండ్ నుండి వలస పోయిన అనేక జ్యూల కుటుంబాలలో మాది ఒక కుటుంబము. నాకంతగా గుర్తులేదు నేను చాలా చిన్న పిల్లని. అప్పటి పరిస్థితులు నాకు ఏమీ అర్థం కాలేదు. మా అమ్మ నాన్న హాలండ్ లోని బ్రెడానగరం నుండి వలస పోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అప్పట్లో మాలాంటి జ్యూలను పోలీసుల ద్వారా పట్టుకుని నాజీల కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపేవారు. మమ్మల్ని పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలిసేది కాదు. అలా తీసుకువెళ్లబడిన వ్యక్తుల వివరాలు బయటకు వచ్చేవి కాదు. వాళ్లు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలిసేది కాదు. ప్రతి ఒక్కరూ అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని బతుకు తుండేవారు. ఇంట్లో టెలిఫోన్ మోగితే, ఆ కాల్ ని తప్పక తీసుకొవలసి వచ్చేది. అలా వచ్చిన ఫోన్ కాల్ లో ఇంట్లో సభ్యుల ఎవరో ఒకరి పేరు చెప్పేవారు. ఆ వ్యక్తి తనకు తానుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంది అవ్వాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో పోలీసులే ఆ వ్యక్తిని పట్టుకుని పోతారు. అలాంటి అరాచకం నడుస్తున్న సమయం అది.
అందుకే కాన్సన్ట్రేషన్ క్యాంపు నుండి కాల్ రాకముందే మా నాన్నగారు నన్ను మా అమ్మని సురక్షితమైన చోటికి పంపించాలనుకున్నారు. అలా మొదలైంది నా వలస జీవితం. మమ్మల్ని పంపించడానికి ఏదైనా బండి దొరుకుతుందేమోనని వెళ్లిన మా నాన్నగారు తిరిగి రాలేదు. మేము చాలా రోజులు ఎదురు చూసాం. చివరికి మా అమ్మకి పరిస్థితి అర్థమయి నన్ను అక్కున చేర్చుకొని ఏడ్చింది. నన్ను ఎలాగైనా కాపాడు కోవాలని స్థిర నిశ్చయంతో తన ప్రయత్నం కొనసాగించింది. అలాంటి ప్రయత్నంలో మా అమ్మ ఒక బట్టలమూట, మాత్రమే తీసుకొని నన్ను పట్టుకొని రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ ఒక డచ్ వ్యక్తి కడుపుతో ఉన్న తన భార్యతోటి రైలుపెట్టె ఎక్క పోతుంటే ఆ తోపుడులో ఆమె పడబొయింది. మా అమ్మ నా చెయ్యి వదిలి ఆమెను పట్టుకుని జాగ్రత్తగా రైలు పెట్టెలోకి ఎక్కించింది. ఆ తరువాత నేను మా అమ్మ కూడా ఎక్కాము. ఆ దంపతుల సీటు దగ్గరే కింద కూర్చున్నాము. మాకు సీటు మీద కూర్చునే హక్కు లేదని అమ్మ నాకు సర్ది చెప్పింది. తన ఒడిలో కూర్చోపెట్టుకుంది. టిక్కెట్ చెకింగ్ కోసం వచ్చిన కలెక్టరు మా అమ్మని చూస్తూ బూటు కాలుతో తంతు, తోస్తూ “లే లే పెట్టే దిగు. ఇది మీరు ఎక్కే రైలు కాదు,”అంటూ అరవసాగాడు. మా అమ్మ ఆయన కాళ్లు పట్టుకొని “బాబు దయ చూపించండి, నన్ను నా బిడ్డను కూర్చొనివ్వండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టము,” అంటూ బ్రతిమలాడ సాగింది.
డచ్ ఆయన మమ్మల్ని ధీర్ఘంగా చూస్తు ” కలెక్టర్ సార్! ఈమె నా భార్యకు సాయం చేయడానికి నేను పెట్టుకున్న పనిమనిషి ఈమెను ఇక్కడే కూర్చొనివ్వండి, దానికి కావాల్సిన డబ్బులు నేను కడతాను,” అన్నాడు. మా అమ్మ,”మీకు రుణపడి ఉంటాను దొర,” అంటూ ఆయన కాళ్లకు మొక్కింది. అదంతా చూస్తున్న నాకు అయోమయంగా ఉంది. నాకు అర్థమైనంత వరకు మేము సంపన్నులం. పది మంది పని వాళ్ళను పెట్టుకొని పని చేయించుకునే మా అమ్మను ఈ రోజు పనిమనిషి అన్న ఆయన ఎవరు? అలా చెప్పగానే మా అమ్మ ఎందుకు ఆయన కాళ్లకు మొక్కింది? మా నాన్న ఏమయ్యారు? ఎవరో ఒక ఆమె వచ్చి మా ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ తీసు కెళ్ళింది. ఎవరామె? ఎందుకు తీసుకెళ్లింది మా వస్తువులన్నీ? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు నా చిన్న బుర్రలో తిరుగుతుండేవి చాలా కాలం వరకు.
రైలు ఆమస్టర్ డ్యామ్ చేరగానే మా అమ్మ ఆ డచ్ వాళ్ళ సామాన్లు నెత్తి మీద పెట్టుకొని బయట వరకు నడిచి ఆయన పిల్చుకున్న టాక్సిలో పెట్టి వచ్చింది. నేను అమ్మ పక్కనే నడుస్తున్నాను. ఆ డచ్ ఆయన భార్య నాకు ఒక డెం (డచ్ కరెన్సీ) ఇచ్చింది. మా అమ్మ ఆయనకి, ఆయన భార్యకి నా చేత కాళ్లు మొక్కించింది. వాళ్ళ టాక్సీ వెళ్ళిపోగానే, నేను మా అమ్మ నడుస్తూ నడుస్తూ చాలా దూరం తిరిగాము, ఎక్కడైనా ఉండటానికి చోటు దొరుకుతుందేమోనని. మాలాగే చాలా మంది అలా రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాల ముందు కూర్చుని కనిపించారు. మా అమ్మ నన్ను ఎత్తుకుని నడవటంతో చాలా అలసిపోయింది. అందుకే మేము కూడా దగ్గర్లో ఉన్న ఒక చిన్న దుకాణం దగ్గర కూర్చున్నాము. మా దగ్గర ఉన్న కొద్ది డబ్బులు దాచుకోవాలన్న ప్రయత్నంలో మా అమ్మ ఒక్క బన్ను మాత్రమే కొని నాకు ఇచ్చింది. ఆమె నీళ్లు తాగి కూర్చుంది. ఇంతలోకి పోలీసులు వచ్చి అక్కడ కూర్చుని ఉన్న వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఒక ట్రక్కులో ఎక్కించుకొని ఊరవతల దూరంగా ఉన్న మైదానం దగ్గర వదిలిపెట్టారు. అక్కడ అప్పటికే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక స్వచ్ఛంద సంస్థ టెంటులు వేసుకోవడానికి సాయం చేస్తున్నది. కొద్ది దూరంలో అదే సంస్థ వారు బన్నులు, నీళ్లు ఇస్తున్నారు అలా వచ్చిన వారందరికీ. మా అమ్మ ఈసారి నాకోసం తనకోసం కూడా బన్నులు తీసుకొచ్చింది. అది తిన్న తర్వాత ఆ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త దగ్గరికి వెళ్లి తనకి ఒక నివాసం కావాలని అడిగింది. అక్కడ ఉన్న కార్యకర్తల్లో ఒక పెద్దాయన మా అమ్మని చూస్తూ, “మీరు బ్రెడా నగరం నుండి వచ్చారా? మీరు సిస్ మింకో కదు? మీ భర్త ఏమయ్యారు? మీరు నాకు తెలుసు. కానీ నేనే మీకు తెలియదు. హాలండ్ ని వదిలి రావటానికి నాకు మీ భర్త ఎంతో సాయం చేశారు. కొంత డబ్బు కూడా ఇచ్చారు,” చెప్పాడాయన.
” నా భర్తకు ఏమైందో తెలియదు. మేము బ్రేడా నగరం వదిలి ఇక్కడికి వచ్చే సాము” చెప్పింది. “దయచేసి మాకు ఒక నివాసం ఏర్పరచగలరా?” అడిగింది అమ్మ. అమ్మని జాలిగా చూస్తూ “ఇక్కడే సాయంత్రం వరకు కూర్చోండి. నేను మీకు ఏదో ఒక బస ఏర్పాటు చేస్తాను,” చెప్పాడు. అమ్మ ఆయన కాళ్ళకి మొక్కి ఆయనకు కనపడే విధంగా కొద్ది దూరంలో కూర్చుంది నన్ను ఒడిలో పెట్టుకొని. నేను ఆమె ఒడిలోనే నిద్రపోయాను.
సాయంత్రం దాకా అమ్మ అక్కడే ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంత్రం అవుతుండగా ఆ పెద్దాయన మా దగ్గరికి వచ్చి, “పదండి” అంటూ తన కారులో కూర్చోపెట్టుకొని ఆమస్టర్ డ్యామ్ లో మరొక మురికివాడుకు తీసుకెళ్లాడు. ఒక గుడిసె ముందర నుంచుని “బిజిలి, బిజిలి” అంటూ ఒక అతన్ని పిలిచాడు. కాస్త సన్నగా పొడవుగా ఉన్న వ్యక్తి ఆ గుడిసె నుండి బయటకు వచ్చి ,”ఆషెన్ సార్, నమస్తే! ఇక్కడకు మీరు రావడం నా భాగ్యం. నేనే విధంగా మీకు సేవ చేయగలను, “అన్నాడు ఎంతో వినయంగా. అప్పుడే నాకు మా అమ్మకు తెలిసింది ఆయన పేరు ‘ఆషెన్’ అని.
ఆషెన్ అన్నాడు, “బిజిలి ఈమె పేరు సిస్ మింకో. ఆ పాప ఆమె కూతురు మార్గ. వీళ్ళు బ్రేడా నగరం వదిలి రావడంతో నిర్వాసితులయ్యారు. నాకు బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళని నీ సంరక్షణలో ఉంచుకొని ఆమెకు ఏదైనా పని ఇప్పించు. బాగా బతికిన కుటుంబం” అన్నాడు.”తప్పకుండా సార్. మీరు చెప్పడం నేను చేయక పోవడమా,”అంటూ ఆమె వంక ఎంతో సాదరంగా చూస్తూ “జస్టర్ (సోదరి)! నువ్వేమీ భయపడకు. ఈ రోజు నుండి నువ్వు నా సోదరివి. నీ కూతురు నాకు బిడ్డ లాంటిది.” అంటూ స్వాంతన పలికాడు. ఆషెన్ వెళ్లిపోయాడు.
బిజిలి తన గుడిసెకి కొద్ది దూరంలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్న మరొక ఖాళీ గుడిసెను చూపించి, “సోదరి ఈ రోజు రాత్రికి అక్కడ ఉండు. భోజనం నేను పెడతాను. రేపు నేను నీ గుడిసెను బాగు చేస్తాను,” అన్నాడు. అమ్మ బిజిలీ కాళ్లకు మొక్కబోయిం ది,”వద్దు సోదరి. నేనూ నీలాంటి వాడినే, “అంటూ గుడిసె దాకా తీసుకెళ్లి దిగబెట్టాడు. ఆ వాతావరణం చాలా దయనీయంగా ఉంది. మాలాంటి వాళ్ళు చాలా మంది చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉంటున్నారు. ఆ రాత్రి అమ్మ తెచ్చిన బట్టలు మూట నుండి ఒక కంబళి తీసి నాకు కప్పి తను కూడా నా పక్కనే కటిక నేల మీద పడుకుంది. అలసట ఆవేదన ముప్పిరిగొనగా సిస్ మింకో గాడ నిద్రలోకి జారిపోయింది.
ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు బిజిలి అప్పటికే గుడిసె కప్పు మీదకు ఎక్కి టార్పాలీన్ ని కప్పుతున్నాడు. బయటికి వచ్చింది సిస్ “బ్రతర్ (అన్న) శుభోదయం!” అంటూ “నేను సాయం చేయనా?”అడిగింది. “అవసరం లేదు జస్టర్. నేను చేస్తాను. నీవు నా గుడిసెలోకి వెళ్లి టీ తీసుకొని రా. పక్కనే బన్నులు కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకుని రా కలిసి తిందాం.” అన్నాడు. సిస్ వెళ్లి తీసుకొచ్చింది. కప్పు దిగివచ్చి చాయ్ తాగుతూ “దాతర్ ఎలా ఉంది?” అడిగాడు. “నిద్రపోతున్నది. దాని భవిష్యత్తు ఏమిటో తెలియదు,” అన్నది ఆవేదనగా.
“భయపడకు తల్లి. ఇది చాలా గడ్డు కాలం. ఆ ప్రభువు మీద విశ్వాసముంచు. అన్ని సర్దుకుంటాయి,” అన్నాడు. “నాకేదైనా పని ఇప్పించు, బ్రాతర్, నీకు కష్టం కలిగించదల్చుకోలేదు,” అన్నది.
“అలాగే సోదరి, తప్పకుండా చూస్తాను,” అన్నాడు.
రెండు రోజులు గడిచాక బిజిలి సిస్ మింకోతో అన్నాడు, ” జస్టర్! ఒక డచ్ కుటుంబానికి రోజంతా పనిచేయటానికి ఒక పనిమనిషి కావాలి. నువ్వు ఆ పని చేయగలుగుతావా? మాట్లాడుతాను.”
“దయవుంచి మాట్లాడు, అన్న. నేను తప్పకుండా ఆ పనికి సిద్ధమే” అన్నది.
ఆ మరునాడు ఉదయమే అమ్మ నన్ను కూడా వెంటపెట్టుకొని బిజిలి వెనకాతలే ఆమస్టర్ డ్యామ్ నగరంలోకి వెళ్ళింది. ఆ డచ్ కుటుంబం వారికి అమ్మని పరిచయం చేశాడు బిజిలి.
“బిజిలి, ఈమె అన్ని పనులు చేయగలుగుతుందా,”అంటూ, “నమ్మకమేనా ,” అనుమానంగా అడిగింది.
” మిసటెరస్ ! నేను మీ దుకాణంలో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా మీద నమ్మకముంచండి. ఈమె నా సోదరి, ఆ బిడ్డ ఆమె కూతురు. దయవుంచి పనిలో పెట్టుకోండి. మీకు అన్ని విధాలా సేవ చేసుకుంటుంది,” అన్నాడు.
“అయితే నెలకి వంద డచ్ గిల్టర్స్(డచ్ కరెన్సీ) మాత్రమే ఇస్తాను. ఉదయం 9 గంటలకల్లా పనిలోకి రావాలి. రాత్రి 8 గంటలకు వెళ్ళిపోవచ్చు. భోజనం మేమే పెడతాము, ఆమె బిడ్డకు కూడా,” అన్నది. సీస్ మింకో ఆ యజమానురాలి కాలికి మొక్కింది,”ధన్యవాదములు మిస్టేరస్ ! నేను ఈ క్షణం నుంచే పనికి కుదురుతాను, కొంచెం డబ్బు ఇప్పించండి,” అని వేడుకోంది.“అలాగే వెళ్లేటప్పుడు తీసుకెళ్ళు,” అన్నది యజమానురాలు.
బిజిలి వెళ్ళిపోయాడు. సిస్ మింకో, మార్గాని ఒక దగ్గర కూర్చోబెట్టి పనిలోకి దిగింది. ముందుగా బట్టలన్నీ మెషిన్ లో వేసి వచ్చింది. పెద్దపెద్ద గదులున్నాయి. అందమైన ఫర్నిచర్, చక్కటి అలంకరణలతో ఉన్న ఆ ఇల్లు చూస్తే ఆమెకి తన్నిల్లే గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ ఇంటిని తన ఇంటిలా భావించి మొత్తం అణువణువు శుభ్రం చేసి, బట్టలుతికి, యజమానురాలికి కావాల్సిన వంటలో సాయం చేసి, కుటుంబంలోని అందరి బట్టలు కొన్ని ఇస్త్రీ చేసిపెట్టింది. ఇలా రోజంతా పనిచేస్తూనే ఉంది. మధ్యలో మార్గాకు భోజనం తినిపించి నిద్ర పుచ్చింది. అలా రాత్రి 8 గంటలకు పని పూర్తి చేసుకొని బయటికి వెళ్లి బిజిలి కోసం వేచి చూడ సాగింది. బిజిలి వచ్చాడు. మార్గాని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళుండే గుడిసెల వైపుకు నడిచారు.
“బ్రతర్,మార్గాని దిసికోలో (బడి) చేర్చాలి. దానికి కావాల్సిన ఏర్పాటు చేయగలవా?”
“తప్పకుండా జస్టర్, రేపే తెలుసుకుంటాను. నీ యజమానురాలిని కూడా అడుగు,” అన్నాడు.
ఉదయాన్నే మార్గాని తీసుకొని పనికి వెళ్ళింది. వాళ్లు వెళ్లే దారిలోనే దీసికో ఉండటంతో, మధ్యలో వచ్చి అడగాలని అనుకుంది. పని కొంత ముగించిన తర్వాత, “మిస్టరస్, దయ ఉంచి నాకు బయటకు పోవటానికి అనుమతినిస్తారా?” అడిగింది సిస్.
“ఎందుకు?”
“నా బిడ్డని దిసికోలో చేర్చాలని అనుకుంటున్నాను.”
“అలాగా ఇక్కడికి దగ్గరలోనే ప్రభుత్వ దీసికో ఉంది త్వరగా వెళ్లేసిరా,” అంది.
“ధన్యవాదములు మిస్టరస్,” అంటూ ఆమె కాలికి మొక్కుతు మార్గాని తీసుకొని బయటకు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక దీసికో ప్రాంగణం కనిపించింది. అక్కడికి వెళ్లి గేట్ వాచ్ మాన్ ని చూస్తూ,
“బ్రతర్, నా బిడ్డను దీసికోలో చేర్చాలని వచ్చాను. ఎవరి దగ్గరికి పోవాలో దయవుంచి చెప్పు,” అడిగింది.
“నువ్వు నీ కుటుంబంతో వలస వచ్చావా? ఎప్పుడు వచ్చావు? ఎక్కడ పనికి కుదిరావు? ఎక్కడ ఉంటున్నావు? ఆ వివరాలు ఇక్కడ రాసిపెట్టి లోపలికి వెళ్ళు,” అన్నాడు. అక్కడి సమాచారం పుస్తకంలో తన వివరాలు రాసి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక గుమాస్తా కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఒక పెద్ద రిజిస్టర్ పెట్టి ఉంది. ఆయన దగ్గరికి వెళ్లి, “అయ్యా నా బిడ్డను దీసికోలో చేర్చడానికి వచ్చాను. దయచేసి అవకాశం ఇవ్వగలరా?” అడిగింది.
ఆ గుమాస్తా సిస్ మింకోని దీర్ఘంగా పరిశీలించి “నువ్వు వలస వచ్చావా? ఎక్కడి నుంచి?”
” హాలండ్ లోని బ్రెడానగరం నుంచి,”
“పోలీసులకు దొరికి పోలేదా.”
“నా భర్త దొరికిపోయాడు. నేను నా బిడ్డతో ఆ భగవంతుడి దయ వల్ల తప్పించు కున్నాము.”
“అలాగా! ఇప్పుడేం చేస్తున్నావు? ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి?”
“కొద్ది దినాలే అయ్యాయి. నన్ను ఆషేన్ సోదరుడు ఆదరించి బిజిలి అనే వ్యక్తికి అప్పగించాడు. బిజిలీ సోదరుడు తనుండే వలస జనుల సెటిల్మెంటులో నాకు కూడా ఒక గుడిసె ఇప్పించి, ఇక్కడికి దగ్గరలోనే మిస్టర్ యాప్లర్ దొర ఇంట్లో నాకు పని కుదిరించాడు . బాగా డబ్బున్న దొరలు. ఆపిల్ తోటలు ఉన్నాయి వారికి. ఆయన విదేశాలకు ఆపిల్ పండ్లను ఎగుమతి చేస్తూ ఉంటారు. నేను వాళ్ళింట్లో పనికి కుదిరాను. నా యజమానురాలు నా బిడ్డని ఇక్కడ దీసికోలో చేర్చడం కోసం పంపిం చింది.”
“అయితే సరే ! నీ బిడ్డను వలస జాతి వారి పిల్లల తరగతిలో చేరుస్తాను, ఈ ఫారంలో అన్ని వివరాలు రాయండి.”
సిస్ మింకో తన వివరాలన్నీ ఆ ఫారంలో రాయటం ద్వారా ఆమె మింకో కుటుంబానికి చెందినదని తెలుసుకున్నాడు ఆ గుమాస్తా ,”మింకో నా మీ కుటుంబం! మంచి స్థితి పరులని విన్నానే. ఎంత దుస్థితి వచ్చింది,” అంటూ జాలీగా మార్గాని తీసుకొని వలస జాతి పిల్లల తరగతి గది వైపుకు వెళ్ళాడు అతను.
నేను అమ్మని చూస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆ వ్యక్తి వెనకాల వలస జాతి తరగతి గదిలోకి వెళ్ళాను. అక్కడ తరగతి గది చూస్తే చాలా దయనీయంగా ఉన్నది. పిల్లలందరూ నేల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కువమంది హాలండ్ నుండే వచ్చిన జ్యూల పిల్లలు. వాళ్ళందరి నీ ఒక అమెరికన్ టీచర్ చూసుకుంటున్నది. నేను వెళ్లి ఒక మూలన కొద్ది స్థలంలో ముడుచుకొని కూర్చున్నాను. భయభయంగా చూడసాగాను. ఆ రోజంతా ఎవరూ మాట్లాడలేదు నాతోటి. మూడు గంటల వేళ పిల్లలందరికీ ఒక గ్లాసుడు పాలు, బన్ను తినడానికి ఇవ్వబడ్డాయి. అవన్నీ అయిన తర్వాత పిల్లలందరినీ బయటకు తీసుకొచ్చారు. ఈసారి బిజిలి సైకిల్ మీద వచ్చి అక్కడ నా కోసం కాచుకొని కూర్చున్నాడు. బిజిలీని చూస్తూనే, ఆయన దగ్గరికి పరిగెట్టాను. వాచ్ మాన్ బిజిలి వివరాలు తెలుసుకొని నన్ను అప్పగించాడు. బిజిలి నన్ను యాపలర్స్ భవనం దగ్గర దింపి, దుకాణానికి వెళ్లిపోయాడు. యజమానురాలు నన్ను చూసి, “వెళ్ళు మీ అమ్మ కింద బేస్మెంట్ లో ఉన్నది,” అని ప్రేమగా చెప్పింది.
నేను బేస్మెంట్ కి వెళ్ళాను. చిన్నపిల్లనే అయినా చాలా విషయాలు అర్థమవు తున్నాయి. నెమ్మదిగా మెట్లు దిగుతూ బేస్మెంట్ చేరుకున్నాను. ఒక మూల వెలుగుతున్నబల్బు బేస్మెంట్ మొత్తాన్ని కాంతితో నింపలేకపోతోంది. దూరంగా ఒక మూలన కాళ్లు ముడుచుకొని పడుకొని ఉన్న అమ్మని చూస్తే చాలా దయనీయంగా ఉంది. అందమైన భవనం. అందులో అతి ఖరీదైన సామానులు, పడకగదులు అతిపెద్ద మంచం. దాని మీద అతి మెత్తటి సాటిన్ పరుపు అందమైన రజాయి ఉండి పడుకోగానే సుఖంగా అనిపించే స్థితి నుంచి అతి దీనావస్థలో కటిక నేల మీద ఒక చింకి కంబళి కప్పుకొని పడుకుని ఉన్న అమ్మని చూస్తే నాకు ఏదో తెలియని బాధ వచ్చింది. అమ్మ దగ్గరికి వెళ్లి ఆమె దుప్పటిలో దూరి నేను కూడా పడుకుండి పోయాను. నన్ను దగ్గరికి తీసుకొని నిద్దరలోకి ఒరిగిపోయింది అమ్మ. నా కళ్ళ నుండి ధారాపాతంగా కళ్ళనీళ్ళు, అలసి పోయిన అమ్మకి గాఢనిద్ర.
***
సిస్ వలస జీవితంతో పోరాడుతూనే ఉన్నది. మార్గ తల్లి పడుతున్న బాధని కష్టాన్ని చూస్తూ తను ఒక సంపన్నుల బిడ్డను అన్న విషయం ఎప్పుడో మర్చిపోయి పేదరికానికి అలవాటు పడింది. కాల గమనంలో తమ స్థితి మరింత దయనీయంగా మారిందే తప్ప మెరుగవలేదు. బిజిలికి ఏదో తెలియని అంటువ్యాధి సోకడంతో అతన్ని ఆ వలస క్యాంప్ నుండి చాలా దూరం తీసుకెళ్లిపోయి వదిలిపెట్టారు. ఆ తర్వాత బిజిలి ఎప్పుడు వెనక్కి రాలేదు. అతను అలా వెళ్ళిపోతూ తన గుడిసెని మాకు అప్పగించి వెళ్ళిపోయాడు. వేరేది ఏర్పాటు చేసుకునే శక్తి లేక మేము అక్కడే ఉండిపోయాము . నేను ఆ చిన్న గుడిసెలోనే పెరిగి పెద్దదాననయ్యాను. నాజీల దురాగతాలు ఆగలేదు. ఆమస్టర్ డ్యామ్ లో కూడా వలస వచ్చి ఉంటున్న జ్యూల మీద నాజీ పోలీసుల దృష్టి ఎక్కువయింది. దానికి తార్కాణం మాతోటి వారు మాయం అవడమే.
సరైన నివాసం, ఆహారం లేక, శారీరక శ్రమతోటి సిస్ మింకో మంచం పట్టింది. ఆమెకి తన కూతురు భవిష్యత్తు గురించిన బెంగ పట్టి పీడించ సాగింది. ఆ దశలో అమ్మ నాకు ఒక చిరునామా చెప్పి అక్కడికి వెళ్ళే అవకాశం వస్తే ఎప్పటికైనా తన వస్తువులన్నీ తెచ్చుకోమని చెప్పింది. కొద్దిరోజులకే అమ్మ చనిపోయింది. కొంతకాలం కూడా గడవకుండానే నా గుడిసె మీద నాజీ సైనికుల చూపు పడింది. అప్పటికే నేను పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోకి అడుగు పెట్టాను. అరెస్టు చేయడానికి వస్తున్నారు అని తెలిసి అక్కడి నుండి పారిపోయాను. నన్ను ఎవరు గుర్తుపట్టని విధంగా నా జుట్టు రంగు మార్చుకొని దాక్కొని బతికాను రెండు సంవత్సరాలు. ప్రపంచ యుద్ధం ముగిశాక జ్యులు కొంత రక్షణ పొందారు. కానీ ఆర్థిక స్థితి మాత్రం మెరుగు పడలేదు. అలా నేను ఒక చిన్న కంపెనీలో టైపిస్ట్ గా పని చేస్తూ జీవితం గడప సాగాను. నేను జ్యూ అని తెలుసుకున్న ప్రతిసారీ నన్ను పని లోంచి తొలిగించేవారు. అలా నన్ను నేను కొంచం స్థిర పరుచుకోవటానికి చాలా కాలమే పట్టింది. చనిపోయే ముందు మా అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి నా పెట్టెలో వెతికాను. అమ్మ చెప్పిన చిరునామా దొరికింది. నాకు ఎలాగైనా నా తల్లి సమకూర్చుకున్న సామగ్రిని చూడాలన్న బలమైన కోర్కెతో ఆమె ఇచ్చిన చిరునామా మరోసారి చూసాను “ఇంటి నంబరు 46, మార్కోని వీధి, బ్రేడా నగరం”.
వెళ్లాలని ఉంది. వెళ్ళ కూడదని ఉంది. అక్కడికి వెళ్ళాక చనిపోయిన నా తల్లి జ్ఞాపకాలు నన్ను చుట్టుముడతాయేమో? నేను తట్టుకోగలనా ? ఇలాంటి ఆలోచనలతో అక్కడికి వెళ్లాలన్న ఆలోచననే దాటేస్తూ వచ్చాను . ఇప్పుడు హాలండ్ లో పరిస్థితులు చక్కబడ్డాయి.
ఒక్కసారైనా వెళ్లి తన తల్లి వస్తువులను చూడాలి అన్న బలమైన కోరిక తోటి బయలుదేరింది మార్గ మింకొ.
***
బ్రెడా నగరవీధులని చూస్తూ నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మార్కొని వీధికి చేరుకున్నాను. #46 ఇంటి ముందు నిలుచుని పక్కనే ఉన్న కాలింగ్ బెల్లు నొక్కాను. ఇంచుమించు నా తల్లి వయసున్న ఒక స్త్రీ తలుపు తెరిచి, “ఎవరు నువ్వు?” అడిగింది అనుమానంగా.
“మీరు మిస్సెస్ డార్లింగ్ కదా? మా అమ్మ మిస్సెస్ సిస్ మింకో. నేను ఆమస్టర్ డామ్ నుండి వచ్చాను.”
“నువ్వు మిసెస్ సీస్ మింకో కూతురివా? ఇంకా బతికే ఉన్నావా?” అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ‘అవును’ అంటూ తలూపాను కాస్త బాధగా. కొంచెం తలుపు చార వేసి బయటికి వచ్చి నిలుచుంది మిసెస్ డార్లింగ్. ఆమె వేసుకొన్న వెండి తీగలు ఎంబ్రాయిడరీ ఆకుపచ్చ రంగు కారడిగాన్ అమ్మదేనని నేను గుర్తుపట్టాను . సరైన ఇంటికి చేరుకున్నానని అర్థంమయింది నాకు . “ఏంటలా చూస్తున్నావు? నాకు పని ఉంది. నేను బయటికి వెళ్ళాలి. నువ్వు ఇక బయలుదేరు. ఇంట్లో ఎవరూ లేరు. నేను కూడా రేపటి దాకా రాను,” అంటూ చక చకా తలుపు వేసేసి మార్గాని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది మిసెస్ డార్లింగ్. చేసేదేమీ లేక ఆమె వెనకాలే నేను స్టేషన్ చేరుకున్నాను. ఆగి ఉన్న రైలు బండిలోని ఒక బొగిలోకి ఎక్కి కూర్చుంది మిసెస్ డార్లింగ్. నేను ఆ వెనక భోగిలో అదే రైలు బండిలో కూర్చున్నాను.
‘అమ్మయ్యా! ఇది వెళ్లిపోతుంది’ అనుకుంది డార్లింగ్. కానీ రైలు బయలుదేరే రెండు నిమిషాల్లోనే మనసు ఉండబట్టలేక ఎలాగైనా ఒక్కసారైనా మా వస్తువు లన్నిటిని చూసుకోవాల్సిందే అన్న బలమైన కోరికతో నేను వేగంగా రైలు దిగేసాను. రైలు వేగం అందుకుంది. మిసెస్ డార్లింగ్ వెళ్లిపోయింది. నేను తిరిగి మార్కోని వీధికి బయలుదేరాను .
మరోసారి బ్రెడా నగర వీధులని చూసుకుంటూ, మార్కోని వీధికి చేరుకున్నాను. ఈసారి బెల్ కొట్టకుండా పక్కనే ఉన్న కిటికీ కుండా లోపలికి చూసాను. లోపల ఎవరో ఉన్నట్లు అనిపించి, బెల్ కొట్టాను. ఆశ్చర్యం పదహారేళ్ల అమ్మాయి వచ్చి తలుపు తెరిచింది, మిసెస్ డార్లింగ్ కూతురనుకుంటా. నన్ను చూస్తూ, “మీరు మా అమ్మ కోసం వచ్చారా? వచ్చి లోపల కూర్చోండి? మా అమ్మ ఇప్పుడే బయటకు వెళ్ళింది. కొద్ది సేపట్లో వచ్చేస్తుంది,” అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది.
మనసంతా ఉద్వేగంగా మారిపోయింది నాకు. ఆ అమ్మాయి వెనకాతలే లోపలికి వెళ్ళాను. చాలా చిన్నఇల్లు, ఉన్నవి మూడు గదులే, వాటిల్లో ఒకటి వంట గది ఒకటి పడక గది. మధ్య గదిలో చాలా సామానులన్నీ పేర్చ బడి ఉన్నాయి. గదిలో గోడం బడిగా పాత సామాన్లు లాగా చాలా వస్తువులు దుమ్ము కొట్టుకుపోయున్నాయి. ఆ గదిలోనే మరో గోడంబడిగా అమర్చిన డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలాగి కూర్చోమని చెప్పింది ఆ అమ్మాయి. అక్కడ కూర్చుని నేను ఆ గదంతా పరికించి చూసాను. ప్రతి వస్తువు అవి ఉండాల్సిన తీరులో లేవు. చాలా వస్తువులు కుప్పగా ఒకవైపు పెట్టి ఉన్నాయి. వాటి మధ్యలో పొడవుగా ఎంతో నగిషీ ఉన్న వెండి క్యాండిల్ స్టాండ్ చూసి, ‘ఆ క్యాండిల్ స్టాండ్ ని క్రిస్మస్ కి అమ్మ ఎంత అందంగా అలంకరిం చేది,’ అనుకుంటూ దగ్గరికి వెళ్లి పట్టుకొని చూసాను. ‘చిన్నప్పుడలా వెలుగుతున్న క్యాండిల్ స్టాండ్ చూస్తూ ఆనందంతో చప్పట్లు చరుస్తూ క్రిస్మస్ క్యారోల్స్ పాడిన నాకు, అది ముట్టుకుంటే ఏ భావన కలగటం లేదు.’ అప్పుడే డార్లింగ్ కూతురు టీ పెట్టి తీసుకొచ్చింది. అది నాక్కూడా ఇష్టమే! కానీ మా అమ్మ ఎప్పుడు దాన్ని వెలిగించదు,” అంది కాస్త నిష్టూరంగా. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వెండి స్పూన్లని, ఫోర్కులున్న డ్రాయర్ ని ముందుకు లాగి ఒక వెండి పళ్ళల్లో కొన్ని కుకీస్ పెట్టి నా ముందు పెట్టింది తినమని. వాటిని చూస్తున్న నాకు చిన్నప్పుడు వాటితో ఆడుకున్నది గుర్తొచ్చి, ఒక ఫోర్క్ ని మరొక ఫోర్క్ లోకి దూర్చి, వాటి మధ్యలో చెంచాని పెట్టి వాటిని అలా చూస్తూ ఉండిపోయాను.
“మీరు టీ తీసుకోండి,” అని ఆ అమ్మాయి చెప్పే వరకు నేను నా చిన్న నాటి ఆలోచనల నుండి బయటపడలేకపోయాను. టీ తాగేసి “నేనిక వెళతాను,” అని చెప్పి అక్కడ నేను కూర్చోలేక వడివడిగా బయటకు వచ్చేసాను.
చెక చెకా నడుస్తున్నాను బ్రెడా నగర వీధులలో. అంతకంటే వేగంగా కల్లోల మయిన నా మనస్సు పరుగులు పెడుతున్నది ఆ జ్ఞాపకాల నుండి పారిపోవడానికి. మనసంతా భారంగా మారింది.“ఆ వస్తువులను చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చిన, ఇప్పుడు అవి పేర్చిన పద్ధతి చూస్తే కళావిహీనంగా ఉంది. వాటి తాలూకు అనుభూతి నా మనస్సుని స్పృశించలేకపోయింది. ఇప్పుడు అవి కేవలం నా దృష్టిలో ప్రాణంలేని వస్తువులు మాత్రమే. వాటికి ఏ రకమైన విలువ లేదు. అలాటి వస్తువులను నేనుండే చిన్న గుడిసెలో ఉంచుకోలేను. ఎందుకంటే అలాంటివి దగ్గర పెట్టుకోలేనంత పేదరికం నాది. నా తల్లి తోటి నేను అనుభవించిన వలస జీవితం, పేదరికం ముందు ఈ చిన్ననాటి జ్ఞాపకాలు, వస్తువులు కేవలం గతించిన కాలానికి గుర్తులు మాత్రమే. అలాంటి జ్ఞాపకాలు, అలాంటి వస్తువులు నా కిప్పుడు అవసరం లేదు. ఈ గతించిన జ్ఞాపకాల చిరునామా నాకిక అవసరంలేదు.”
***
అలా నిర్ణయించుకోగానే ఆమె మనస్సు తేలికపడింది. పర్సులో దాచుకున్న చిరునామా “ఇంటి నెంబర్ 46, మార్కోని వీధి” కాగితాన్ని తీసి ఒకసారి నిస్తేజంగా చూసి చిన్న చిన్న ముక్కలుగా చింపేసి, గతాన్ని అక్కడే వదిలిపెట్టి భవిష్యత్తులోకి ప్రస్థాన మైంది కొత్త చిరునామాని వెతుక్కుంటూ, మార్గ మింకో, ప్రముఖ రచయిత.
*****

Padmavathi Neelamraju is a retired teacher with more than 35 years of experience in teaching English, based in Chandigarh. She completed her education at Nagarjuna University, AP and CIEFL, Hyderabad, and went on to receive an MPhil in Indian Writings in English with a focus on Feminist literature. With an interest in Telugu and English literature, she pens her experiences through blogs and newspapers. Her writings often reflect her enthusiastic and experiential outlook towards life and society. She actively volunteers for the cause of education.