సరికొత్త గ్రంథం
– శింగరాజు శ్రీనివాసరావు
అవును..ఆమె ఒక దేవత
ప్రాణంతో కదులుతున్న సాలభంజిక
“దేవత” అనబడే కిరీటం కోసం
తనకు తానే శిలువ వేసుకుని
చిరునవ్వులు చిందిస్తూ సాగే
ఓ అపర కరుణామయి
తలంబ్రాలు పోసినవాడు జులుంచేసినా
కడుపున పుట్టినవాడు హఠం వేసుకున్నా
అమ్మ మేకప్ లోని అత్త అసహ్యించుకున్నా
మామ పేరున్న మగాడు హూంకరించినా
వానకు తడుస్తున్నా కదలని గేదెలా
మౌనంగా భరిస్తూ సాగిపోవాలి
గాలి కొట్టిన బెలూన్ లా భర్త ఊరంతా తిరుగుతున్నా
గానుగ చుట్టూ తిరిగే ఎద్దులా కొంపలో చాకిరి చేయాలి
జులాయిలా తిరిగి అలసి వచ్చిన పతిదేవుడి కోసం
కాళ్ళు పీకుతున్నా కాముని పూజకు సిద్ధమవ్వాలి
పురుషపుంగవులు సృష్టించిన పురాణ పాత్రలలోని
పతివ్రతలకు ‘బ్రాండ్ అంబాసిడర్’ గా మార్క్ వేయించుకోవాలి
“దేవత” బిరుదు మాటున సాగే వంచన ఇది..
ఆడపిల్లగా పుట్టిన నేరానికి సమాజం వేస్తున్న శిక్ష ఇది..
రక్తసంబంధాల పేరుతో బందీని చేసి బంధించడం కాదు
తన రెక్కలతో తను ఎగిరేలా స్వేచ్ఛను ఇవ్వాలి
ఆమె కూడ మనిషేనని, హృదయం ఉంటుందని గుర్తించాలి
మనసులోని ఊసులకు మద్దతును ఇవ్వాలి
“ఆమె” లోని అంతర్లీనశక్తిని బహిర్గతం చేసుకునే
అవకాశం ఇచ్చినపుడే సమానత్వం సిద్ధిస్తుంది
ఎందరో సోఫియాఖురేషిలను, వ్యోమికాసింగ్ లను
దేశానికి అందించే అవకాశం కలుగుతుంది
చెదలుపట్టిన పుస్తకంలోని పాత పేజీలను తిరగరాయకండి
కొత్త ఆలోచనల అక్షరాలతో సరికొత్త గ్రంథాన్ని ఆవిష్కరించండి…
*****