మరియొకపరి

-దాసరాజు రామారావు

గుప్పెడు మట్టి పరిమళాన్ని, ముక్కు పుటాల్లో నింపుకొని, కాక్ పిట్ బాహుబలి రెక్కల్లో ఒదిగి కూర్చున్న. బతుకు సంచిలో కొన్ని తప్పని సరి ప్రయాణాలకు జాగా వుంచుకో వల్సిందే. కొలతలు వేసి, లెక్కలు గీసి ప్రేమల్ని కొనసాగిస్తామా? కాదు గద! పరాయి రుచుల మర్యాదల్లో తడిసిన్నో, ఆ పిల్ల ఆగని ఏడుపుల్లో తడిసిన్నో, అందరు చుట్టువున్నా , ఒంటరి మూగగా, మాగన్నుగా.

ఆత్మలు తలుపులు తెరచుకొన్నయి. ఆలింగనాలు ఆనంద భాష్పాలైనయి. నాలుగేళ్ళ చిన్నది “ తాతా! నేను happy గ వున్న, because నువ్వొచ్చినవ్” అన్న మాటల వెనకకు మళ్ళటానికి భయమయ్యింది.

రువ్వడి రాజకీయాలు, ఆకస్మిక వాతావరణాలు, వీకెండ్ విహారాలు, పేర్లు పలకని ఆహారాలు, అయినవారితో అచ్చట్లు, ముచ్చట్లు, అనువు గాని వేళల స్వీయ గృహ నిర్బంధాలు, మనం తప్ప జనం వున్నా మిగిలిన మౌనతనాలు. చూడాలి ఏవి కవిత్వ మౌతయో, వొట్టి కాగితాలౌతయో!

ఎక్కడెక్కడ నవనాడులు ఉరకలెత్తుతయో,

ఎక్కడెక్కడ కూలబడతయో తెలియదులే

పఠన మందిరాల్లో కాలు పెడితే, కళ్ళు తిరుగు దారి చూడవు. కమ్ముకున్న ఆంగ్ల భాషలో మునగడమే అయినా, నా చేతికి అందని నా ఒక్క తెలుగక్షరానికి, నిజంగా మూర్ఛపోయిన.

పగలు రాత్రిగా, రాత్రి పగలుగా తలకిందుల మార్పయితే జీర్ణమయిందిగని, ఆపాత హృదయానికి తూట్లైతే పొడవలే. గగన దర్పణంలో కోడి కూసే తొలిజాము నాటి నా వూరుని సందర్శిస్తూనే వున్న.

అనుబంధాలు తీవెలు సాగాలని, ఇంటి వెనుక తోట నాటుతున్న. అప్పుడప్పుడు కుందేళ్ళ పిల్లలు అతిథుల్లా వచ్చి పోతుంటయి. తోటను అల్లరి పట్టిస్తూ, నాకు సహనాన్ని నేర్పిస్తుంటయి.

సాయం సమయంలో చిన్నారుల రాక కోసం పార్కులు, ప్లే ఏరియాలు మెత్తటి పచ్చిక పరుస్తయి. ఆటల వైవిధ్యంలో నేనొక ప్రేక్షక చప్పట్ల నౌతా. వ్యత్యాసాల వయసు వాళ్ళలో వ్యత్యాసాలు లేని చిలిపితనం మరో ఆనంద సన్నివేశం.

కాలమెప్పుడు అయిపోతుందా అని ఎదురుచూడటం, అయిపోతుందా కాలం అని బెంగపడటం, మనస్సాడే వింత క్రీడలో నిమిత్త మాత్రపు బంతినే.

ఈ శీతల వాయువుల్లోంచే ప్రాణవాయువును శ్వాసిస్తున్నందుకు ఈ నేలకు నుదురాన్చి, కృతజ్ఞత చెల్లించుకోవాలని వున్నది.

*****

Please follow and like us:

One thought on “మరియొకపరి (కవిత)”

Leave a Reply to Udayagiri Dastagiri Cancel reply

Your email address will not be published.