విల్లక్షణుడు
-ఎరుకలపూడి గోపీనాథ రావు
పోగు బడుతున్న చీకటి పొరలను
ఓర్పుగా ఒలుచుకుంటూ
దారిలో
దేదీప్యమానంగా ఊరేగుతున్న దేవునికి
ఆత్మ నమస్కారాలనర్పిస్తూ
అతడు పయనిస్తున్నాడు!
పొగలూ, సెగలూ తాకే తావుల్లో
మంటలుంటాయనీ
నడక తడబడే బాటల్లో
ఎత్తు పల్లాలుంటాయనీ
ఎదుటి వారి కంఠ స్వరాలలోని వైవిధ్యాలూ
స్పర్శలలోని వ్యత్యాసాలూ
వారి ఆంతర్యాన్ని వ్యక్తీకరిస్తాయనీ
బాల్యంలోనే బ్రతుకు నేర్పిన
అనుభవాలను మననం చేసుకుంటూ
అతడు ప్రయాణిస్తున్నాడు!
ఉన్న మనో నేత్రాలతోనే తాను
చర్మ చక్షు ధారులకన్నా
ఉన్నంతంగా జీవిస్తున్నందుకు
మానసికంగా సంతృప్తి చెందుతూ
చేర వలసిన సభా వేదికను చేరి
అతడాసీనుడైనాడు!
తన గంధర్వ గానంతో
సభా సరస్వతిని
సంతోష తరంగాల ఓలలాడించి
ప్రశంసాధ్వానాలనూ
ఘన సన్మానాలనూ
వినమ్రంగా స్వికరించి
తన దివ్య దృష్టితో
తమో మార్గాలపై ప్రభలను పరచుకుంటూ
చేతి కర్ర సాయంతో
అతడు నిష్క్రమించసాగాడు!
*****