నా అంతరంగ తరంగాలు-31

-మన్నెం శారద

          5వ శతాబ్దానికి చెందిన మహా పండితుడయిన విష్ణు శర్మను మూర్ఖులయిన తన ముగ్గురు కొడుకులకు విద్యదానం చేయమని , అందుకు తగిన పారితోషకం ఇస్తానని ఒక రాజు ప్రాధేయ పడతాడు.

          తనకెటువంటి పారితోషకాలు వద్దని, విద్యను తాను అమ్ముకోనని వారిని తీర్చి దిద్దుతానని మాట ఇచ్చి వారిని తనతో తీసుకు వెళ్తాడు విష్ణుశర్మ.

          వారు మూర్ఖులు కనుక వారికి అర్ధమయ్యే రీతిలో జంతువుల పాత్రలను  ఆకర్షణీయంగా పంచతంత్రం పేరిట నాలుగు భాగాలుగా కథలు సృష్టించి వారికి చెబుతాడు.

          అవి మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం.

          జంతువులు వాటి వాటి స్వభావాలు ఎన్నడూ కోల్పోవు కాబట్టి,  చదువరులు ఆఁ యా కథల్ని సులువుగా అర్ధం చేసుకునే వెసులుబాటు ఉంటుందని గురువుగారి ఆలోచన.

          ఇవి ఆనాటి సంస్కృత భాషలో ఆయన రచించారు.

          ఇవి అన్ని రకాల భాషలలోకి అనువదింపబడ్డాయి.

          తెలుగులో మొదటి రెండు భాగాలని ప్రముఖ తెలుగు పండితుడు, వ్యాకరణకర్త  శ్రీ పరవస్తు చిన్నయసూరి గారు తెనిగించారు.

          మద్రాసు రాష్ట్రం చెంగల్పట్టు దగ్గర పెరంబదూర్ లో పుట్టిన చిన్నయసూరి గారు చాలా కాలం మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో తెలుగు బోధకుడుగా పనిచేశారు.

          ‘పద్యం రాస్తే నన్నయ గద్యం రాస్తే చిన్నయసూరి  ‘అనే లోకోక్తి కూడా ఉండేదట .(వికీపీడియా సేకరణ )

          మిగతా రెండు భాగాలయిన సంధి, విగ్రహాలను శ్రీ కందుకూరి వీరేశలింగంగారు అనువదించారు.

          ఇవి ఆఁ రోజుల్లో మన పాఠ్య గ్రంధాలుగా ఉండడం మన భాగ్యమే అని చెప్పాలి.

          ఎలుక, కాకి, లేడి, తాబేలు, సింహం, నక్క… ఇత్యాది జంతువుల స్వభావాలు మనకు తెలుసు కాబట్టి మనం ఎంతో సరదాగా ఈ బాగాల్ని మన తెలుగు మాస్టర్లు చెబుతుంటే ఆసక్తిగా విన్నాం.

          అందులో పరవస్తు చిన్నయసూరిగారి వాక్యాలు మరింత బాగుండేవి.

          ఉదాహరణ కు “పోగాలం దాపురించినవారు ,అరుంధతిని, మిత్రవాక్యంని దీపనిర్వాణ గంధంని , కనరు, వినరు,మూర్కొనరు.”

          ఈ మాటని ఆరోజుల్లో మేం అందరి మీద ప్రయోగించి నవ్వుకునేవారం.

          అది అనుప్రాసాలంకారం అని మనం వరుసగా అరుంధతిని(నక్షత్రం )కనరు, మిత్రవాక్యం (స్నేహితుని సలహా ) వినరు దీపనిర్వాణగంధం (దీపం ఆరిపోయినప్పుడు వచ్చే వాసన ) మూర్కొనరు. (పీల్చలేరు ) ఇలా వరుసగా ఆయా పదాల పక్కకు పెట్టి  అర్ధం చేసుకోవాలి.

          ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు… చూడ చూడ రుచుల జాడవేరు ‘అనే వాక్యం కూడా ఈ అలంకారానికి చెందినదే!

          ఈ విధంగా రాయడాన్ని అనుప్రాస అలంకారం అంటారు. ఆనాటి అయ్యవార్లు  తెలుగు పాఠం చెబుతుంటే మైమరచి వినేవాళ్ళం.

          దర్శి  (ప్రకాశం జిల్లా )లో వున్నప్పుడు ఒక మాస్టారయితే నలదమయంతుల  కళ్యాణం సినిమా చూసినట్లు చెప్పేవారు. ఒక్కో పద్యం విడమరచి, అభినయించి మూడు క్లాసులు తీసుకుని మరీ చెప్పేవారు.

          చందస్సు నేర్చుకొన్న క్రొత్త లో అందరం ఉత్సాహంగా పద్యాలు  కూడా రాసేసాం .

          Bed టీచర్స్ వచ్చాక వాళ్ళు చెబుతున్న తీరు మాకు తెలుగు పాఠం మీద ఆసక్తిని పూర్తిగా చంపేసింది. ఏదో కట్టె, కొట్టె, తెచ్చె రీతిలో సాగేది.

          సంధి, విగ్రహంలో భాష నాకు కొంత క్లిష్టంగా అని పించేది. వీరేశలింగం పంతులు గారు బాగా తెనిగించినప్పటికి కొంత జటిలమైన గ్రాంధికం వాడేరని నాకు అనిపించింది.

          ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే!

          ఏది ఏమయినా మంచి స్నేహితులవల్ల ఎంత లాభమో, ఎలా ఆపదల నుండి సులువుగా గట్టెక్కవచ్చో  మిత్రలాభం చెబుతుంది.

          మంచి స్నేహితులని కూడా ఎలా విడదీసి చిచ్చు పెట్టి వారిని నాశనం చేయవచ్చో  సింహానికి దగ్గర జేరిన దమనకుడి అనే నక్క వల్ల గ్రహించవచ్చు.

          ఈ కథలు వూరికే కాలక్షేపానికి చదువుకుని వదిలేసేవి ఎంతమాత్రమూ కావు. జీవితకాలం గుర్తుంచుకుని జాగారూకతతో ఉండడానికి రాసిన నీతి దాయకమైన  రచనలు. పిల్లలకు వీటిని ఓపికగా చెప్పవలసిన గురుతర బాధ్యత మనందరిదీ!

          ఈ రోజున కూడా అవన్నీ మనుషుల రూపంలోనే చొక్కాలేసుకుని మనమధ్యనే తిరగడం మనం గమనిస్తూనే వున్నాం.

          ఎన్నడో చదువుకున్న పాఠాలు ఇవి! తప్పులుంటే మన్నించగలరు.

          ఏదో నాకు గుర్తొచ్చినంతవరకు ఈ విషయాలు మీతో ఇలా సరదాగా పంచుకున్నాను. మీకు తెలియవని కాదు.

          నేను వేసిన బొమ్మ మిత్రలాభంలో పక్షులు వలలో చిక్కుకున్న తమ తోటి పక్షిని రక్షిస్తున్న దృశ్యం!

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.