
నా అంతరంగ తరంగాలు-36
-మన్నెం శారద



1986లో ఒకరోజు ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చింది.అప్పట్లో అన్ని సెక్షన్స్ లో ఫోన్ ఉండేది కాదు. చీఫ్ ఇంజినీర్ పేషీకే అన్ని కాల్స్ వస్తుండేవి. అటెండర్ వచ్చి చెబితే ఎర్రం మంజిల్ ఆఫీస్ బిల్డింగ్ లోని ఆ పొడవాటి కారిడార్ లో పడుతూ లేస్తూ అతని వెంట పరిగెత్తాలి.
వెళ్ళగానే CE గారి PA మాట్లాడుకోమని చెప్పి బయటకు వెళ్లారు.
నేను ‘హలో ‘అనగానే ఆమె “నమస్తే శారద గారూ నేను విజయనిర్మల ఫిల్మ్ ఆర్టిస్ట్ ని ” అని చెప్పారు నవ్వుతూ.
నేను వెంటనే విష్ చేసి “మేడమ్!” అన్నాను.
“నేను మీ పిలుపు నీ కోసమే నవల చదివాను చాలా బాగుంది నాకు చాలా నచ్చింది. సినిమా తీయాలనుకుంటున్నాను. మీరు మద్రాస్ రాగలరా? అగ్రిమెంట్ చేసుకుందాము’ అన్నారు.
“ఎప్పుడు బయలుదేరుతారు? ” అని అడిగారామె తిరిగి.
నాది చాలా హెవీవర్కింగ్ లోడ్ షీట్.స్టేట్‌లో టెండర్స్ అన్ని మా సెక్షన్ లోనే పూల్ అవుతాయి. సెలవు దొరకడం చాలా కష్టం. అప్పటికే ఒక వర్గానికి నేను ఆఫీసులోనే రాసేస్తున్నానని అనుమానం, అసూయ ఉండేది. ఆఫీస్ పని ఇంటికి కూడా తీసుకెళ్లి చేయాల్సినంత హెవీ లోడ్ ఉండేది వర్క్! ఇక సినిమా తీస్తున్నారంటే అసలు భరించలేరు. (ఈ వర్గం ఎక్కువగా నా లేడీ కోలీగ్స్ కావడం నాకు లభించిన అదృష్టం అని చెప్పుకోవాలి) అందుకే మెల్లిగా నసుగుతూ చెప్పాను” మేడం మీరు తరచు హైదరాబాద్ వస్తారు కదా, పద్మాలయ స్టూడియోలో మిమ్మల్ని కలుస్తాను అని.
“ఓకే అలానే కలుద్దాం నేను వచ్చేక మీకు ఫోన్ చేస్తాను.” అని చెప్పారు.
పిలుపు నవల నేనురాసిన మూడవ నవల. 1986లో ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి సస్పెన్స్ థ్రిల్లర్ నవలల పోటీలో వారు ప్రకటించిన ఒకే ఒక బహుమతిని గెలుచుకుంది. ఆ నవల రాసేటప్పుడు నేను పడిన కష్టం కూడా నాకు బాగా గుర్తొచ్చింది.
నా కింద పోర్షన్ లో ఉన్న దంపతులకు నలుగురు ఆడపిల్లలు. అందరూ ఐదు సంవత్సరాలు లోపు వారే. అందరికన్నా చిన్న పాపకు సివియర్ డయారియా వచ్చి నీలోఫర్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
వాళ్ళ వాళ్ళు ఎవరూ రాకపోవడంతో ఆపై ముగ్గురి బాధ్యత నా మీద పడింది. ఆ ముగ్గురికి స్నానపానాదులు చేయించి కంటికి రెప్పలా కాపాడటం నా వంతయితే ఆస్పత్రికి భోజనం పట్టుకుని వెళ్లడం మా వారు చేసేవారు.
ఒకపక్క నవల పోటీకి ఇచ్చిన గడువు అయిపోతున్నది. నాకు ఒకటే టెన్షన్! తీరా ఇంత కష్టపడినా పాపం పాప బ్రతకలేదు. అదో దుఃఖం చివరికి ఇలా కాదని నాలుగు రోజులు సెలవు పెట్టి అక్కడే ఉన్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లోమంచం మీద కూర్చుని వళ్ళో కాఫీ ట్రే పేడ్ లా పెట్టుకుని రాశాను. పాపం వేద, రాధా నా సదుపాయాలన్నీ చూసేవారు. వాళ్లిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. కాఫీ, టీ భోజనం… అన్నీ వాళ్ళే చూసుకునేవారు. సాయంత్రం ఇంటికి వచ్చేసే దాన్ని.
250 పేజీల నవల. రఫ్ రాసే అలవాటు లేదు కాబట్టి చకచకా లాగించేసాను. తీరా చూస్తే రచయితల కోరేరని గడువు తేదీ పెంచారు. ఆ మాట నేనంటే పురాణం గారు” కావాలంటే పట్టుకెళ్ళి మళ్ళీ సరి చేసుకోండి శారద గారు!” అన్నారు. నాకు ఎప్పుడూ మొదటి రాసిందే బాగా వస్తుంది కాబట్టి ఇంక నేను తిరిగి తీసుకోలేదు.
ఇదీ…ఆ నవల నేను వెనుక పడిన బాధ… గాధ!
ఎట్టకేలకు దానికి బహుమతి రావడం… ఇప్పుడు సినిమా కాబోవడం కూడా సంతోషించాల్సిన విషయం కదా!
ఆమె హైదరాబాదు వచ్చాక సిన్సియర్‌గా ఫోన్ చేసి రమ్మని కారు పంపించారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. నవల ఎందుకు నచ్చిందో చెప్పారు. అందులో డ్యూయల్ రోల్ ఉంది. ఆ రెండు నేను వేయాలని “అన్నారు.
నేను మౌనంగా వింటున్నాను
రేపు మా బ్రదర్ వస్తాడు వచ్చాక అగ్రిమెంట్ రాసుకుందాం శారద గారు! కాసేపు కొన్ని ముచ్చట్లు అయ్యాక నేను ఇంటికి తిరిగి వచ్చేసాను.
ఆమె వైపు నుండి మళ్ళీ నాకు ఏ కబురు అందలేదు. నేను అంతటితో ఆ సంగతి వదిలేసాను. నెల రోజులు గడిచిపోయాయి . చిత్రభూమి సినిమా పత్రిక వారు నన్ను విజయనిర్మలని ఇంటర్వ్యూ చేయమని కోరారు. అలా మళ్లీ కలిసాము.
నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కృష్ణ గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఇంటర్వ్యూ అయిపోయి తిరిగి నేను బయలుదేరబోతుండగా “సారీ శారదాగారూ, మీ నవల విషయంలో మా తమ్ముడు కొన్ని అభ్యంతరాలు చెప్పాడు, అందుకే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది.”అన్నారు. ఆమె తమ్ముడు అంటే ప్రముఖనటి జయసుధ గారి తండ్రి రమేష్ గారు. “నిర్మాణం లో చాలా సాధకబాధకాలు ఉంటాయి. అన్నీ ఆలోచించాలి కదా!” అని నేనూ నవ్వాను. అలా ఆ విషయం ముగిసింది.
అప్పటికి నేను వ్రాసినవి రెండే నవలలు. 1) గౌతమి : ఆంధ్ర జ్యోతి డైలీ పేపర్ నిర్వహించిన దీపావళి నవలల పోటీలో ప్రధమ బహుమతి పొందిన నవల. సంపాదకులు శ్రీ నండూరి రామ్మోహన రావు గారు.
2) చంద్రోదయం : ఆంధ్ర జ్యోతి వారపత్రిక వారు నిర్వహించిన దసరా పండుగ నవలల పోటీలో రెండవ బహుమతి పొందిన నవల : సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు.
తర్వాత అనుకోకుండా నేను నర్సుల సామాజిక, ఉద్యోగ సాధక బాధకాలు మీద వ్రాసిన నవలకు మంచి గుర్తింపు రావడంతో నర్సుల కాలేజీ క్యాపింగ్ సెర్మనీలకీ నన్ను పిలిచి ఆనర్ చేయడం జరిగింది. అలా ఒక ఫంక్షన్ లో గౌరవఅధ్యక్షురాలుగా విజయనిర్మల గారు రావడం జరిగింది. ఆలా తిరిగి మేం కలిసాం.
ఆమె ఎందుకు నన్ను అభిమానించేవారో తెలియదుకానీ ఆ తర్వాత నుండి తనకు ఏ సన్మానం జరిగినా నేను మాట్లాడాలని పట్టుబట్టేవారు. అలాగే ఆమెకు కన్నంబ అవార్డు వచ్చినప్పుడు నేనే ముఖ్యోపన్యాసం చేసాను. నేను పెద్ద ఆరేటర్ని కూడా కాదు.. ఆవిడకి అలా నచ్చేసింది మరి!
అలాగే కృష్ణ గారు తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి నటించిన పచ్చని సంసారం సినిమా యేమో సరిగ్గా గుర్తు లేదు… ఆ సినిమా ఫంక్షన్ లో నన్ను మాట్లాడమని బలవంతం చేశారు.
దేవుడా… ఆ ఫంక్షన్ లో మాత్రం నేను చాలా ఇబ్బంది పడ్డాను. కారణం… కృష్ణ గారి ఫాన్స్ అన్ని వూళ్ళనుండి నేల ఈది నట్లుగా వచ్చేసారు. నేను ఏది మాట్లాడిన ఆ సినిమా పేరు చెప్పండి మేడం… ఈసినిమా పేరు చెప్పండి మేడం అని ఒకటే గోల!
నేను ఓపిగ్గా నవ్వుతూ వారి కోపానికి గురికాకుండా మాట్లాడి బయట పడ్డాను. కృష్ణ గారు నాకు సభాముఖంగానే నాకు కృతజ్ఞతలు చెప్పి శాలువ కప్పి గౌరవించారు. ఆతర్వాత కూడా విజయనిర్మల గారు నన్ను రమ్మని ఆహ్వానిస్తుండేవారు కానీ నేనే వెళ్లడం తగ్గించాను. వారితో కలిసి ఏదయినా వర్క్ చేస్తే వేరుకానీ ఊరికే వెళ్లి కూర్చోవడం ఏం బాగుంటుందని నా ఉద్దేశ్యం. అదీ కాక నాకు ఆఫీస్ లో చాలా వర్క్… ఇల్లు సరేసరి. పైగా అలా వెళ్లడం కూడా నాకంతగా నచ్చదు. అలా విజనిర్మల గారితో నా స్నేహం ముగిసింది.
*****
(సశేషం)

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
