నారిసారించిన నవల-22

                      -కాత్యాయనీ విద్మహే

లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో ఇది తులసి వనం 1971 లో వచ్చిన నవల. గోపీచంద్ గారితో సంభాషణ ఈ నవల రచనకు ప్రేరణ అని చెప్పుకొన్నది లత. మాతృమూర్తి నిభానపూడి విశాలాక్షి గారికి,  జీవన  సహచరుడు అచ్యుత రామయ్య గారి మాతృమూర్తి తెన్నేటి సీతారావమ్మ గారికి పాదపద్మాలకు ప్రణామాలు చేస్తూ అంకితమిచ్చింది. స్త్రీ పురుషుల మధ్య యవ్వన సహజమైన ఆకర్షణలు, వాంఛలు , సమాజ నీతికి భిన్నంగా రహస్య సంబంధాలు, ఒక్కొక్కసారి సమాజనీతిని ధిక్కరించే బహిరంగ వ్యక్తీకరణలు  లత  నవలలో సర్వ సాధారణంగా కనిపించే అంశం. చిత్రంగా ప్రతి నవలలో సామాజిక లైంగిక నీతికి తలవొగ్గి జీవించే స్త్రీలకు ఆ పవిత్రతే  సాధికార శక్తిని కలిగిస్తుందన్న సూచన కూడా సమాంతరంగా ఉంటూనే ఉంటుంది. స్త్రీ పురుష సంబంధ వ్యవస్థలో వ్యక్తి స్వేచ్చకు పట్టం కడుతున్నట్లు కనబడుతూనే మరొక వైపు హైందవ స్త్రీధర్మం అనే దానిని ఆదర్శవంతమైన విలువగా నిరూపించటం  లత నవలల సారం. అందుకు నిదర్శనం  ‘ఇది తులసి వనం’ నవల.

నవలకు “ఒకమాట” అనేశీర్షికతో వ్రాసిన ముందుమాటలో  లత ‘ఇది తులసి తోటల దివ్య భూమి’ అని ప్రతిపాదించి తులసి జలంధరుల గురించిన పౌరాణిక కథను ప్రస్తావిస్తుంది.లోక కంటకుడైన జలంధరుడిని  సంహరించటానికి అతని భార్య తులసి పాతివ్రత్యం అవరోధంగా ఉందని విష్ణువు ఆమెభర్త రూపంలో వచ్చి ఆమెను తాకి అపవిత్రురాలిని చేసి జలంధరుడి చావుకు మార్గం సుగమం చేసాడు. మళ్ళీ ఆ భగవంతుడే ఆమెను పవిత్ర మూర్తిని చేసి ఇంటింటా పూజింపబడేట్లు అనుగ్రహించాడు అని కథను మూడుముక్కలలో చెప్పి దానికి లత చేసిన వ్యాఖ్యానం గమనించ దగినది. తప్పుచేయటంలో కూడా పూజనీయత పొందగలరు భారత స్త్రీలు అంటుంది. భర్తవల్ల కావచ్చు, మరొకడి వల్ల కావచ్చు, తనంతట తానే కావచ్చు, తప్పటడుగులు వేసిన స్త్రీ కంటి నుంచి పశ్చాత్త్తాపంతో , దుఃఖంతో , ఒక్క కన్నీటి బొట్టు రాలితే .. ఆ కన్నీరువల్లనే  తులసి మొక్కలు పెరుగుతాయి అంటుంది. ఈ భావనను  అంతః సూత్రంగా చేసి అల్లిన  నవల ఇది తులసి వనం.

అహల్య వినాయకరావు భార్యాభర్తలు. ఇద్దరూ వైవాహికేతర లైంగిక సంబంధాలు కలవాళ్లే . వాళ్ళ ఆసక్తులు అనేకుల పట్ల. ఒకరినొకరు ఆక్షేపించుకోకుండా ఎవరి అనుభవాలు వాళ్ళవిగా జీవిస్తుంటారు. అయితే  వినాయక రావు కోరుకొన్న స్త్రీలను స్నేహం చేసి ,  మచ్చిక చేసుకొని అతని  అనుభవానికి అందుబాటులోకి తెచ్చే  ఒత్తిడి అహల్య మీద ఉంటుంది. ఆ క్రమంలో ఆమె హింసను  కూడా భరించవలసి వస్తుంటుంది.. విజయవాడకు బదిలీ అయి వస్తున్న రామకృష్ణ ఇల్లు సర్దుకొనటానికి  భార్యను ముందుగా పంపించవలసి వచ్చి మిత్రులు అహల్యా వినాయకరావు ల ఇంట్లో దిగమని  పంపటంతో ఈ నవలలో కథ మొదలవుతుంది. ఆమె పేరు హైమావతి. తెలంగాణలో పుట్టి పెరిగిన  ఆమె అమాయకత్వం , స్నిగ్ధత్వం రామకృష్ణ వల్ల  విని ఉన్న వినాయకరావు ఆమె పట్ల కోరిక పెంచుకున్నాడు . తమ ఇంట్లో ఉన్న కాలంలో తమ నాగరికతను ఆమెకు నేర్పి తనకు అనుకూలంగా   తయారుచేసే పని భార్యకు అప్పచెప్పాడు. అందాన్ని పొగడటం , అలంకరించటం , ఆప్యాయతను కనబరచడం , సినిమాలకు తీసుకువెళ్లడం, వినాయకరావు పక్కన కూర్చునేటట్లు చూడటం , వినాయక రావు మీద చేతులు వేస్తూ చనువు ప్రదర్శించటం వీటన్నిటి మధ్యా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆందోళనకు లోనవుతుంది హైమావతి. వినాయకరావు ఆమెను లొంగ దీసుకొనటానికి వీలుగా కాఫీలో మత్తు మాత్రలు కలిపి ఇస్తుంది అహల్య.  ఆ మత్తులో ఆమె ఇల్లు వదిలి మానార్ పుస్తకాల షాప్ కువెళ్ళటం, అతను ఆమెను ఇంటికి తీసుకువెళ్లి భార్యకు అప్పచెప్పటం, వినాయకరావు నుండి హైమావతిని ఆమే రక్షించటం ఇదీ నవలకు ముగింపు.

ఈనవలలో, మనార్ భార్య అరుంధతి, హైమావతి తులసి మొక్కలు. వాళ్ళు పుట్టి పెరిగిన కుటుంబాల ఆర్ధిక  స్థితిగతులు, అవి నేర్పిన సంస్కారాలు వాళ్ళనట్లా తయారుచేశాయి. తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్లిళ్లలో వాళ్ళు ఇష్టంగా ఒదిగి పోయారు. భర్తను ప్రేమించి, ఒద్దికగా సంసారం చేసుకొనటం వాళ్లకు ఒక పవిత్రతను , శక్తిని ఇచ్చాయి. అయితే వాళ్ళిద్దరిమధ్య వున్న తేడా ఒక్కటే. అరుంధతి నిలకడగా నిశ్చలంగా నిలబడగలిగిన  మనిషి. ఎదుటివాళ్లది తప్పు అనుకున్నపుడు నిక్కచ్చిగా నిలదీయగలిగిన మనిషి. అదంతా ఆమె తన నిజస్థానమైన ఇంట్లో ఉండి చేయగలిగింది.హైమావతి అలా  కాదు. ఆమె ఒంటరిగా కొత్త ప్రదేశంలో కొత్త మనుషులమధ్య  ఇంద్రియాలను రెచ్చగొట్టే సంస్కారాలను,  సంభాషణలను ఎదుర్కొనవలసి రావటం వల్ల పడిన సంఘర్షణ, తొట్రుపాటు కనిపిస్తాయి. వివేకం వాళ్ళ మధ్య ఎక్కువ సేపు ఉండవద్దని హెచ్చరించింది. తాను అద్దెకు తీసుకొన్న ఇంటికి వెళ్లిపోవాలని కూడా అనుకొన్నది. మొహమాటం , మెత్తదనం ఆమె చర్యను నియంత్రిస్తాయి. అయినా మత్తుమాత్రలు వేసిన కాఫీ తాగిన తరువాత కూడా ఆమె వినాయకరావు ఇల్లు తనకు క్షేమకరం కాదని మనార్ సినిమాహాల్లో  చూపిన స్నేహాన్ని , సానుభూతిని గుర్తుంచుకొని అతని పుస్తకాల షాప్ కు వెళ్ళ గలిగింది. అనుకూల పరిస్థితులను సృష్టించుకున్న వ్యక్తిత్వం అరుంధతి అయితే వ్యతిరేక పరిస్థితులతో పోరాడగలిగిన వ్యక్తిత్వం హైమావతి. వాళ్లిద్దరూ ఒకే నాణానికి రెండు ముఖాలు. పవిత్ర భారత స్త్రీలు . ఇలాంటి స్త్రీలతోనే తులసివనాలు విస్తరిస్తాయి. ఇదీ లత చెప్ప దలచుకొన్నది.

అహల్య వంటి స్త్రీలు ఈ తులసివనంలో గంజాయి మొక్కలు. గంజాయి మత్తు కలిగించే ద్రవ్యం . వ్యాపార సరుకు . అదెంత హానికరం, అనైతికం అయినా డబ్బు సంపాదన అందులో  కీలకం. అహల్య కు అరుంధతికి , హైమావతికి ఉన్నట్లు భద్రతాయుతమైన కుటుంబ జీవితం లేదు. పేదరికం చదువుల కాలంలోనే తనను తాను పోషించుకోవలసిన అవసరాన్ని సృష్టించింది. తన శరీరమే అందుకు సాధనమైంది. ఆ ప్రయాణంలో ఆమె వినాయక రావు భార్య అయింది. డబ్బు, హోదా , స్వేచ్ఛ ఈ మూడూ ఇచ్చిన మత్తులో వినాయకరావు పెట్టె హింసను కూడా భరించగలిగిన దశకు ఆమె చేరింది. అహల్యలు పుట్టరు.. తయారవుతారు .. తయారుచేయబడతారు అని లత తాత్పర్యం.

ఈ నవలలో ముగ్గురు స్త్రీలు ఉన్నట్లుగానే ముగ్గురు పురుషులు ఉన్నారు. అరుంధతి భర్త మనార్. భార్యను అతను ఇష్టపడతాడు, గౌరవిస్తాడు కానీ అహల్యతో సంబంధం ఏర్పరచుకొనటానికి అవేవీ అడ్డు కాలేదు. తనకు అహల్య తో సంబంధం ఉన్నదని భార్యకు తెలిసిన తరువాత కూడా దానిని వదులుకొనటానికి అతనేమీ ప్రయత్నం చేయలేదు. అతనే చెప్పుకున్నట్లు ‘అపవిత్రతలో అఘోరిస్తున్నా పవిత్రత అంటే పూజించే వాళ్లలో’ అతనూ ఒకడు. అందువల్లనే వినాయక రావు వల్ల ఆపదను ఊహించి అవసరమైతే తన షాపుకు రమ్మని చెప్పి అవసరమైన సమయంలో హైమావతికి అండగా నిలబడగలిగాడు.

హైమావతి భర్త రామకృష్ణ ప్రస్తావించబడే వ్యక్తే కానీ ఇతివృత్తంలోకి ప్రత్యక్ష ప్రవేశం లేదతనికి. అహల్య మాట్లాడిన మాటలను బట్టి ఆమెకు అతనికి సంబంధం ఉంది. రామకృష్ణ భార్య గురించి అతని నోట విన్న మాటలతోనే ఆమె మీద కోరిక పెంచుకున్న వినాయకరావు అహల్యను అతనితో సంబంధానికి ప్రోత్సహించాడు. అహల్యతో స్నేహం తరువాత రామకృష్ణ కోస్తా సంస్కృతి గొప్పదనానికి దాసుడై పోయాడు.  తెలంగాణ వెనుకబాటుతనాన్నిఏవగించుకొన్నాడు. అయితే భర్తకు అహల్యతో ఉన్న సంబంధం గురించి హైమావతికి ఏమీ తెలిసినట్లు లేదు.

వినాయకరావు సరేసరి ..భార్యకు తెలిసీ అనేకమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకొన్న వ్యక్తి . తనకు కావలసిన స్త్రీలను సాధించి పెట్టె సాధనంగా కూడా భార్యను వాడుకోగలిగిన తెంపరి తనం అతనిది. ముగ్గురు పురుషులకూ వైవాహికేతర సంబంధాలు ఉన్నాయి. ముగ్గురు స్త్రీలలో ఇద్దరికి అటువంటి సంబంధాలు లేవు. తులసివనాలు పెరగటానికి  స్త్రీల పవిత్రత ఒక్కటి సరిపోతుందా ? పురుషులు వైవాహిక బంధాలకు నిబద్ధులు కాకపోయినా  , జీవితాన్ని నైతికంగా గడపకపోయినా తేడా ఏమీ రాదా? సామాజిక లైంగిక నైతికతకు లత కూడా స్త్రీలను ఒక్కళ్లనే  బాధ్యులుగా చేసి చూపటం ఆమె సాంప్రదాయక చట్రాన్ని దాటి రాలేకపోయిందని సూచిస్తుంది.

ఓనీలిమకథ, మిసెస్ కోకిల నవలల పేర్లే  ఆనవలల ఇతివృత్తాలుకు   స్త్రీ  కేంద్ర బిందువు  అని చెప్తున్నాయి. ఇవి 1978 లో వచ్చాయి.  దుర్భరమైన దారిద్య్రం , తండ్రి హింస  భరించలేక  సుఖాన్ని వెతుక్కొంటూ ఎవరితోనో వెళ్లి  పోయిన  తల్లి కి  కూతురు నీలిమ . తండ్రి చనిపోయి అతని మేనత్త కావమ్మ పెంపకంలో పెరిగి అవసరాలు , అప్పులు వేధిస్తున్న జీవితం నుండి పారిపోవటానికి ఎప్పుడూ ఏదో ప్రయత్నం చేస్తుంటుంది.   ఏ మార్గాన డబ్బుకు కొదవలేని జీవితం లభిస్తుందా అని ఆలోచనలు చేస్తూ వుండే నీలిమ శాస్త్రి పట్ల తనకు ఎంత ప్రేమ ఉన్నా , శాస్త్రి తనను ప్రేమిస్తున్న విషయం తెలుస్తున్నా అతన్ని పెళ్ళాడితే  మళ్ళీ డబ్బుకు ఇబ్బంది పడే జీవితమే లభిస్తుందని బెంగపడుతుంది . డబ్బున్న విఠల్ రావు ప్రేమను అంగీకరించి పెళ్ళాడి సుఖపడదామని అనుకొని కూడా మనసు కోరేదానికి , బుద్ధితో ఎంచుకొన్న దానికి   పొంతన కుదరక నీలిమ పడిన ఘర్షణ, నడిచిన నడక  ఈ నవలకు  ఇతివృత్తం. చివరకు శాస్త్రి తోటి జీవితంలో ప్రేమ , ఆనందం , రక్షణ తనకు లభిస్తాయని తెలుసుకొనటం నవలకు ముగింపు.

శాస్త్రిని పెళ్లాడాలనుకొన్న క్షణాన కూడా మరి డబ్బు ఎట్లా అని ఆమె అడగక మానలేదు నీలిమ. అయితే డబ్బు మనిషి అని ఆమెను హీనంగా చూపించ లేదు రచయిత్రి. జీవితంలో డబ్బు అవసరం  , డబ్బు ఇచ్చే భద్రత ఎవరూ కాదనలేనివే. డబ్బు దృష్టే మంచిది కాదు. నీలిమలో డబ్బు యావ అవసరం నుండి , అభద్రత నుండి ఏర్పడిందని శాస్త్రి గ్రహించగలిగాడు కనుకనే ఆమెను అనుక్షణం హెచ్చరిస్తూ వచ్చాడు. ఆమె ఆంతర్యంలో ప్రేమదే పైచేయి అని గుర్తించగలిగాడు కనుకనే విఠల్ రావును పెళ్లాడుతాను అన్నా ఆమె ఆ పెళ్లి చేసుకోలేదు అన్న నమ్మకంతోనే ఉన్నాడు. ముందే ఆమెతో అన్నాడు కూడా. విఠల్ రావుతో పెళ్లి నిర్ణయం కలిగించిన అలజడిలోనే పాత స్నేహితుడు శేషగిరి తో హోటళ్లకు తిరిగింది. నీలిమ ఆంతర్యపు అలజడి అర్ధం చేసుకున్నవాడు కనుకనే  ఆ తొందరలో ఆమె ఏతప్పు, అఘాయిత్యమూ చేయకుండా  శాస్త్రి వెన్నంటి ఉన్నాడు.  ఆ రకంగా నీలిమ కథ సుఖాంతం అయింది.

మిసెస్ కోకిల నవలలో కథలో  భాగంగా దేశానికి  స్వాతంత్య్రం వచ్చి ముప్ఫయి ఏళ్లయినా అన్న కాలసూచన  కనబడుతుంది. అంటే ఈ నవలలో కథ 1977 ప్రాంతాలదన్న మాట. 1970- 80 విప్లవోద్యమదశకం. నక్సల్ బరి శ్రీకాకుళం మీదుగా ఉత్తర తెలంగాణకు విస్తరించిన కాలం. విద్యార్థులలో విప్లవోద్యమ భావాలు పాదుకొన్న కాలం. తరువాతి కాలపు విప్లవ  నాయకత్వం  ఈ విద్యార్థుల నుండే అభివృద్ధి చెందింది. తెలంగాణాలో ఆకాలపు ఈ సామాజిక పరివర్తనకు చెరబండరాజు నవలలు అద్దం పట్టాయి. కానీ లత   మిసెస్ కోకిల అనే ఏ  నవలలో   విద్యాలయాలలో విప్లవోద్యమాలకు ప్రాతినిధ్యం వహించే అధ్యాపకులను జ్ఞానరహితులుగా,  చిలకపలుకులు పలకటమే తప్ప అధ్యయనం , అవగాహన అసలే లేనివాళ్లుగా , కులాంతర  వివాహాలు చేసుకొనటం , సాయుధ విప్లవాన్ని కోరే  సంఘాలలో చేరటం ఆదర్శాలుగా ప్రబోధించి విద్యార్థుల జీవితాలను పక్కదారులు పట్టించేవాళ్లుగా, మీరు మిక్కిలి బాధ్యతా రహితులుగా చూపించి సమకాలపు ఉజ్వల చరిత్రను వక్రీకరించి చూపింది.

ఆ నేపథ్యంలోనే ఆదర్శానికి పోయి హరిజన యువకుడిని పెళ్ళాడిన కోకిల జీవిత పరిణామాలు ఈ నవలకు ఇతివృత్తం అయినాయి. స్కాలర్ షిప్పులు తీసుకొంటూ చదువుల మీద శ్రద్ధ పెట్టని వాళ్ళుగా , ప్రభుత్వం ఇచ్చే రాయితీలవల్ల తమకు ఉద్యోగాలు, ఉన్నతోద్యాగాలు వస్తాయని ధీమాగా గడిపేసే వాళ్ళుగా హరిజన విద్యార్థులను చూపించింది లత. చదువుకొంటున్నా వాళ్ళ భాష , యాస మారటం లేదన్న వెక్కిరింపు, వాళ్ళ మాంసాహార అలవాట్ల పట్ల ఏవగింపు ఈ రచనలో కనబడతాయి. కోకిల కోణం నుండి  అయితే అది ఆ పాత్రకు ఉన్న చైతన్య పరిమితి అనుకోవచ్చు. కానీ అది రచయిత్రి దృక్పథం కూడా. అది కానీ పక్షంలో  కోకిల ప్రవర్తన పైన , కోకిల అవగాహన పైన విమర్శ ఎక్కడో ఒకచోట భాగం అయి ఉండేది. కోకిలను పెళ్లిచేసుకొన్న జీవరత్నం చివరకు విలన్ గా తేలాడు. అసలు ఏ రకమైన పరిచయం , స్నేహం,  ఒకరిగురించి ఒకళ్ళు కాస్తయినా తెలుసుకొనటం అనేవి ఏవీ లేకుండా కులాంతర వివాహాలు జరిపిస్తారని అభ్యుదయవాదుల మీద బురద చల్లటానికి , పనిలో పనిగా జీవరత్నం ప్రవర్తనతో మగజాతిని ద్వేషించటం మొదలు పెట్టిన కోకిల పేరు చెప్పి అప్పుడే ఆంధ్రదేశంలో విస్తరిస్తున్న స్త్రీవాద భావజాలం పై వ్యతిరేకతను ప్రకటించటానికి ఈ నవల వ్రాసినట్లున్నది లత.

రాజభవనం నవల కూడా 1978 లోవచ్చినదే.చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మేనత్త పోషణలోకి వచ్చిన రెండేళ్ల వయసు తేడాలో ఉన్నముగ్గురు అక్కచెల్లెళ్లు మామయ్య దురాశను , దౌర్జన్యాలను ఐదేళ్లు భరించి ఇక భరించలేక గుంటూరు నుండి హైదరాబాద్ కు పారిపోయి స్వతంత్రంగా, గౌరవంగా బతకటానికి చేసిన ప్రయత్నాలు , సాధించిన విజయాలు ఈ నవలకు ఇతివృత్తం. ముగ్గురు అక్కచెల్లెళ్లలో పెద్దక్క గంగకు మైనారిటీ తీరి వారసత్వ ఆస్తుల పై హక్కును అమలుచేసుకోగలిగిన పరిస్థితి ఏర్పడటం, ముగ్గురు అక్కా చెల్లెళ్లు కోరుకున్నవాళ్ళను పెళ్ళి చేసుకొనటం తో సుఖాంతం అయిన సాధారణ నవల ఇది.

ఏది నిత్యం 1980 లో వచ్చిన నవల . రచయిత్రి అయిన రాధమ్మ కు ఆమె ఇంటి పని చేసే రాజమ్మ కు మధ్య సంబంధం సంభాషణల సారం ఈ నవల. పనిమనుషులు ఆలస్యంగా రావటం, తరచు పనికి రాకపోవటం, ఇలాగైతే పని మానెయ్యి అని తరచు యజమానురాలు విసుక్కొనటం  అవసరాల పేరు చెప్పి ముందస్తు డబ్బు అడిగి తీసుకొనటం,  జీతం  కోతలో అది ఇంకా తీరకముందే మళ్ళీ ఏదో అవసరానికి మళ్ళీ డబ్బులు ఇమ్మని బతిమిలాడుకొనటం,   యజమానురాలు  లేదంటున్నా  వదలకపోవటం, కష్టాలు ఏకరువు పెట్టటం ఇవి రాధమ్మ రాజమ్మల సంబంధంలో నిత్యం. రాజమ్మ ఆలస్యాలకు, రాకపోవటానికి, డబ్బులు అడగటానికి కారణాలు అడిగే రాధమ్మకు రాజమ్మ శకలాలు శకలాలుగా చెప్పే జవాబులు కలిసి ఆమె  జీవితానుభవాల కథనం అవుతుంది. అదే ఈ నవల ఇతివృత్తం.

రాజమ్మ ఒకరితరువాత ఒకరుగా ముగ్గురు పురుషులతో జీవితాన్ని పంచుకొని పిల్లలను కన్నది. మొదటి సంబంధం ఇష్టపడి చేసుకొన్న పెళ్లి . అతను మరణించాక బిడ్డను తనను పోషించుకొనటానికో , తల్లి దండ్రుల ఒత్తిడో , శరీర అవసరాలకో  మరొకడ్ని చేసుకొన్నది. అతనివల్ల పిల్లలను కన్నది. అతను మరణించాక మరొక సంబంధంలోకి వెళ్ళింది. రాజమ్మ క్రైస్తవురాలు, మొదట పెళ్లాడింది హిందూ హరిజన యువకుడిని. రెండవ సారి తల్లి తండ్రుల ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొన్నది క్రైస్తవుడిని. మూడవ పెళ్లి భార్యా పిల్లలూ సంసారం ఉన్న  ముస్లిం తో. ఆమె పని చేసిన ఇళ్లల్లో మగవాళ్ళు కోరినప్పుడు వాళ్లకు లొంగిపోవటం,  వాళ్ళతో సంబంధాలు కొనసాగించటం అది వేరే సంగతి.ఇదంతా రాజమ్మ దిగజారుడు తనంగా అనిపించవచ్చు . అయితే లత దృష్టిలో దిగజారడం గురించి కాదు దిగులుపడవలసినది, అందుకు దారి తీసిన  వింత పరిస్థితుల గురించి. అది చాంచల్యమా అంటే కావచ్చు . ఒంటరిగా తన పొట్టా ,పిల్లలపొట్టా గడిచే మార్గం చూసుకొనటం  కావచ్చు.

ఏ మతంలో ఉన్నా , ఏ వర్గానికి చెందిన వాళ్లయినా   స్త్రీల జీవితాలన్నీ విషాద మయమేనని లత అవగాహన. రాజమ్మ జీవితంలో ఎంత లోటు ఉందో , ఎంత హింస ఉందో రచయిత్రి అయిన రాధమ్మ జీవితంలోనూ , ఉద్యోగిని అయిన విక్టోరియా జీవితంలోనూ అంత లోటు, హింస ఉన్నాయి. రాధమ్మ భర్త కొట్టాడు కానీ పనీ పాటా లేకుండా తిరుగుతాడు. అబద్హాలు ఆడుతాడు. అప్పులు చేస్తాడు. రాజమ్మ తో సహా ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకొంటాడు. ఇల్లు దోచి పెడతాడు. అన్నీ తెలిసి భరిస్తుంటుంది రాధమ్మ. విక్టోరియా భర్త  అనుమానపు మనిషి. భార్యను చావగొడుతుంటాడు. అతనూ రాజమ్మ తో సంబంధం పెట్టుకొన్నవాడే. ఈ ముగ్గురి జీవితాల ద్వారా రచయిత్రి మగవాడి (మొగుడి) రక్షణ అన్న భ్రమలో స్త్రీలు ఎంతటి అఘాయిత్యాలనైనా ఎలా భరిస్తుంటారో చెప్పదలచుకొన్నట్లు కనబడుతుంది. ఆడదాని అవ్యక్తత , ఆడదాని ఆకలి తప్ప ఈ ప్రపంచం లో నిత్యం అయింది ఏదీ లేదు అన్న  రాధమ్మ మాటతో ఈ నవల ముగుస్తుంది.

లత వ్రాసిన పౌరాణిక నవలలు గురించి చెప్పుకోవాలి ఇక ..

*****

( ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.