
నా అంతరంగ తరంగాలు-14
-మన్నెం శారద
నేడు మాతృభాషా దినోత్సవం.. అందరికీ శుభాకాంక్షలు!
మా తెలుగుతల్లికి మల్లెపూదండ…
దేశ భాషలందు తెలుగు లెస్స…
మధురాతి మధురమైనది మన తెలుగు భాష…
ఇలా ఈ రోజు గత వైభవమో లేక మన భాష మీద ప్రేమను చాటుకుంటే సరిపోతుందా?
మన భాష మీద మనకే గౌరవం లేదు.
మనం మనలాగ కాక మరోలా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాం.
మనలా ఉండడం అగౌరవం అని భావిస్తాం.
ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో మన భాషని పొగిడి హమ్మయ్య అని చేతులు దులుపేసుకుంటాం. తర్వాత ఏ ఒకరిద్దరో మాత్రమే పోరాటాలు చేస్తుంటారు. మన భాషని ప్రేమించడమంటే ఇతర భాషలని ద్వేషించడం, వెక్కిరించడం కాదు.
ఎన్టీఆర్ చీఫ్ మినిష్టర్ గా పని చేసిన రోజుల్లో డ్రాఫ్టింగ్ (ఇక్కడ కూడా నాకు సరయిన తెలుగు పదం తోచలేదు.) తెలుగులోనే చెయ్యాలని జి ఓ. విడుదల చేశారు. అందుకోసం సి. నారాయణ రెడ్డి గారు ఒక నిఘంటువు తయారు చేశారు. ఇక అక్కడ నుండి పని ఆగిపోయింది. మేం చేసే సాంకేతిక ఉద్యోగాలకు తగిన తెలుగు పదాలు మాకు దొరికేవి కావు.
ఆఁ అర్ధాలు చదివి ఆఫీసంతా నవ్వులు కురిసేవి. పని ముందుకు సాగక వర్క్ పెండింగ్ లో పడిపోవడం బాధ కలిగించేది.
ఇంతలో దేనిలో నుండి ఆయినా నవ్వులు పూయించే మా కొలీగ్ విజయకుమారి వచ్చి “మేడం మేడం, రైలుబండిని పొగబండి అనాలట. ప్లాట్ ఫామ్ ని పొగబండి ఆఁగు అరుగు అనాలాట..”. ఏ అరుగు మీద పొగబండి ఆగును .. అని అడిగేలోపున రైలు వుడాయించదా?” అని పడీ పడీ నవ్వేది.
ఇది చూడండి మేడం ” టాయిలెట్ కు బహిర్భూమి అట, వుండండి మేడం అదెక్కడుందో చూసొస్తాను . ” పరిగెత్తేవాడు మరొక కొలీగ్ పుల్లారావు. ఇలా సరయిన పదాలు దొరక్క చాలా ఇబ్బంది పడిపోయాం.
ఇదిలా వుంటే దస్తరు పట్టిక (అటెండెన్స్ రిజిస్టర్ )లో పొడి సంతకాలు పెట్టడం మరో భాగోతం! ఆఁ పొడి అక్షరాలు విపరీతార్ధాలు చూపిస్తుంటే మళ్ళీ నవ్వులు! దీనిమీద మల్లిక్ గారు ఒక కథ కూడా రాశారు.
అసలు కారణం ఏమిటంటే మనకు మన భాషలోనే తగిన పేర్లు లేక పరాయి భాషా పదాల్ని అనువదించడం వలన వచ్చిన తిప్పలు. చివరకు అది పూర్తిగా ఫెయిల్ అయ్యి G.O క్యాన్సిల్ అయ్యింది.
ఇక ఏ నాటినుండో మనకు లైబ్రరీలకు మన పుస్తకాలని తీసుకోవడం మానేశారు. అలా ఎందుకు తీసేసారో అర్ధమే కాదు. చాలా మంది చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఒకసారి టీడీపీ హయాంలో మచిలీపట్నంలోని ఆంధ్రసారస్వత పరిషత్తులోమూడు రోజులు భారీ ఎత్తున సభలు జరిగేయి. మొదటి రోజు ఆ నాటి స్పీకర్ యనమల రామ కృష్ణుడు అధ్యక్షతన నాకు సన్మానం జరిగింది. రెండవ రోజు సి. నారాయణ రెడ్డిగారు అధ్యక్షత వహించారు. నేను యనమలగారికి ప్రత్యేకంగా లైబ్రరీల గురించి చెప్పి బుక్స్ తీసుకునే విధంగా చూడమని రిక్వెస్ట్ చేసాను.
అందుకాయన తన ప్రసంగంలో శారద గారు ఏదో అడిగారు, నాకు అర్ధం కాలేదన్న మాట చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను తెలుగులోనే మాట్లాడాను. వారిదీ తుని పక్క ఊరేకదా… ఏంటోమరి…. అదీ సంగతి… అదేమరి కొసమెరుపు
*****
(సశేషం)

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
