నా అంతరంగ తరంగాలు-19

-మన్నెం శారద

 నాకు  తెలిసిన వీరాజీ గారు!

ఆయన వర్ధంతి సందర్బంగా…


సినీనటుడు సుమన్ గారు జైలునుండి విడుదలయ్యాకా తనజీవితంలో జరిగిన వాస్తవాలు రాసేందుకు ఒక రచయిత కానీ రచయిత్రి కానీ కావాలని అడిగినప్పుడు ఎవరో నా పేరు సూచించారు.

ఆయన నన్ను ఒకసారి తీసుకుని రమ్మని  ఆయనకీ చెప్పారు.

నేను నిజానికి అలా వెళ్ళి రాయడానికి ఇష్టపడలేదు.

నిజానికి నేను ఏ సినిమా నటుల్ని వెర్రిగా అభిమానించి వారి భజన చెయ్యను.

సినిమా బాగుంటే చూస్తాను. అంతవరకే! అందరూ అన్నీ బాగా చెయ్యలేరన్న వాస్తవం నాకు బాగా తెలుసు!

ఆఁ టైం లో నేను అటు ఆఫీస్ లోనూ, ఇటు రచయిత్రి గానూ చాలా బిజీగావున్నాను. ఇక ఇంటి బాధ్యతలు ఉండనే వున్నాయి.

“అలా కలిసి నేను రాయలేనండి, నాకు కుదరదు ” అని సున్నితం గానే చెప్పాను.

తర్వాత సుమన్ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక వెళ్ళాను.

ఆయన రెండుమూడు షూటింగ్ విరామాల్లో తన కథ వివరించి అది ఫిక్షన్ గా రాయమని, వీలయితే సీరియల్ గా ఏ పత్రికలోనయినా వచ్చేట్లు చూడమని రిక్వెస్ట్ చేశారు.

నేను దాన్ని నవలగా రాసి ధైర్యం చేసి మా వారితో కలిసి వీరాజీ గారిని కలిసాను.

అప్పుడు వారు ఆంధ్రపత్రిక వీక్లీకి, డైలీ పేపర్ కు కూడా సంపాదకులు.

అంత ప్రముఖుల్ని కలిసి అది వెంటనే సీరియలైజ్  చేయాలని కోరడం పెద్ద సాహసమే కదా!

ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు.

కొంత ధైర్యం వచ్చింది.

అసలాయాన్ని చూస్తేనే భయం పోయింది. అంత సరదాగా ఉన్నారాయన.

మెల్లిగా విషయం చెప్పాను.

“సర్, ఇది సినీనటుడు సుమన్ గారి జీవితచరిత్ర. ఫిక్షన్ గా రాయమంటే రాసాను. ఆయన పుట్టినరోజున  దీన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చి ఆవిష్కరించాలని కోరుకుంటు న్నారు.”అని చెప్పాను మెల్లిగా.

ముందు ఆఁ నవల్ని ఆయన చదివి ప్రచురణ యోగ్యమో కాదో నిర్ణయించాలి, ఆ పై పత్రికలో ఖాళీని బట్టి ప్రచురించాలి:

ఈ విషయాలు ఒక రచయిత్రిగా నాకు తెలియనివి కావు.

అయినప్పటికి ఒక చిన్నపిల్లలా నేను అడిగేసాను.

అయితే నా ముందు కూర్చున్న ఆఁ సాహితీవుద్ధండుడు నా కన్నా చిన్న పిల్లాడని నా కెంత మాత్రం తెలియదు.

ఆయన భళ్ళున నవ్వి “ఓ శారదగారూ, దాందేముంది, వేసేద్దాం!”అన్నారు.

ఆఁ మాట నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన మాట నిజమే కానీ  ‘అదంత తేలిగ్గా జరుగుతుందా ‘అనే అనుమానంతోనే ఆయనకీ నమస్కరించి బయటకి వచ్చాను.

కానీ చాలా ఆశ్చర్యంగా ఆఁ మరుసటి వారమే ఆఁ నవల అనౌన్స్మెంట్  రావడం, ఆపై వారం సీరియల్ గా మొదలువ్వడం చకచకా జరిగి పోయింది.

అంతటితో ఆగకుండా ఆయన సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసి పంపించమని  కోరారు.

వెంటనే నేను ఆదరాబాదరా సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసి పంపించాను.

దాన్ని యధావిధిగా ఎటువంటి ఎడిటింగ్ లేకుండా సెంటర్ స్ప్రెడ్ గా ప్రచురిం చారు వీరాజీ గారు.

తర్వాత అది పుస్తకరూపంలో రావడం, చెన్నై లోని పామ్ గ్రూవ్  హోటల్లో ఆవిష్కరింపబడటం, దాని వెనుక నా శ్రమ… మరో ప్రహసనం.

తిరిగి థాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వీరాజీ గారు ఒక పసి పిల్లాడిలానే నవ్వారు.

అంతిమ శ్వాస వరకూ ఆయన fb లో నా పోస్టులు చూస్తూ నన్ను పలుకరిస్తూనే  ఉండేవారు.

వారు మరిక లేరని, ఎప్పుడూ నా గురించి చెబుతుండేవారని  శ్రీమతి మంగళా కందూర్ గారు చెప్పినప్పడు నా కళ్ళు అవిరామంగా వర్షించాయి. నల్లిలా కుట్టి నంగిగా నటించే ప్రబుద్ధులు ఎక్కువగా వున్న ఈ సమాజంలో ఈయన లాంటి వారిని ఊహించ డమే బహుకష్టం!

నిజంగా ఆఁ కొండంత మనీషి పసిపాపడే..

ఈ సందర్భంలో భారత కోకిలగా కీర్తింపబడ్డ ప్రముఖ కవయిత్రి సరోజినీ నాయుడి సోదరుడు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ  అన్న ఒకమాట గుర్తొస్తుంది “Be childlike but not childish!”

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.