నడక దారిలో-53

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:-
       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,కొంత అనారోగ్యం. నేను విజయవంతంగా ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, ప్రమోషన్ ప్రహసనం. పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం జరిగాయి. తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి వచ్చేసింది. అజయ్ కి ఇంతకు ముందు ఆపరేషన్, పదేళ్ళే బతుకుతాడని చెప్పకుండా మోసం చేసారు. ఒంటరితల్లిగా తిరిగి వచ్చిన పల్లవి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ గా అనుభవాలు, పదవీ విరమణ, పెద్దక్క మరణం తర్వాత—)

***

          మా ఇంటికి దగ్గరలోనే ఆస్మాన్ ఘడ్ మీద సాయికృప అపార్ట్ మెంట్స్ లో కొంత కాలంగా కె.రామలక్ష్మిగారూ, వారి అక్క వుంటున్నారని తెలిసింది. వారి క్రింద అపార్ట్మెంట్ లోనే వారి అక్క కూతురు నివాసం వుంటుంది. అందుకని ఆరుద్ర మరణానంతరం మద్రాసు నుంచి వచ్చేసారు. వాసా ప్రభావతిగారితో మొదటి సారి వెళ్ళాను. ఆ తర్వాత తరుచూ వెళ్ళేదాన్ని. రామలక్ష్మిగారితో కబుర్లకు కూచుంటే సమయం తెలియదు. ఒక ప్రవాహంలా అనర్గళంగా ఎప్పడెప్పటి అనుభవాలనో చెప్పుకొంటూ పోతారు. మొదట్లో మాట్లాడుతోన్నప్పుడు ‘అలా అనేవారు మీ నాన్న’ అని చెప్తుంటే అర్థం అయ్యేది కాదు తర్వాత ఆరుద్రగారని తెలిసింది. చాలా సన్నిహితంగా నాతో మాట్లాడేవారు. నడవటానికి కాళ్ళు సహకరించక పోయినా వుప్పొంగే వుత్సాహంతో వుండటాన ఆమెతో మాట్లాడు తుంటే మనకీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయనిపించేది.
 
          ఒక సారి వాళ్ళింటికి ఒక పదిహేను మంది రచయిత్రులను ఆహ్వానించి రామలక్ష్మి గారు ఆరుద్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. వరూధినిగారూ, శాంతసుందరీ, గోవింద రాజుల సీతాదేవి, శారదా అశోక్ వర్థన్, హేమలతా భీమన్న, ముక్తేవి భారతి, కొండవీటి సత్యవతి, కె.బి.లక్ష్మి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన వాళ్ళం హాజరయ్యాము. కొంత సేపు ఆరుద్ర లలితా గీతాలు, సినీగీతాలు ఆలపించాము. పుస్తకం ఆవిష్కరించి ఫొటోలు తీసుకొని తర్వాత రామలక్ష్మిగారి మాటలవిందుతో పాటూ వాళ్ళ అక్క కూతురు ఏర్పాటు చేసిన విందు కూడా ఆస్వాదించాము.
 
          రామలక్ష్మి గారి ఇంటి కింద అపార్ట్మెంట్ లో అబాకస్ నేర్పించే టీచర్ వున్నారు. ఆమె దగ్గర ఆషీని అబాకస్ నేర్చుకోవటానికి చేర్చాను. రోజూ ఆషీని తీసుకు వెళ్ళి వాళ్ళింట్లో దిగబెట్టి ఆ క్లాస్ అయ్యేవరకూ నేను ఒక్కొక్కప్పుడు రామలక్ష్మి గారింట్లో కూర్చొని కబుర్లు చెప్పేదాన్ని. ఆషీకి అబాకస్ చాలా నచ్చింది. ఉత్సాహంగా నేర్చు కునేది.
 
          ఆ సందర్భంలో రామలక్ష్మి గారితో నేను తరుచూ కలిసేదాన్ని. అబాకస్ క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గరకి వెళ్ళటంతో, ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు. ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో! ఆమె అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
 
          ఆమె నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతుగా చెప్తుంటే బాధ కలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
 
          ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ” మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్రగారు అన్నారు. ఒక్క అక్షరం ముక్కా లేదు మీ పొట్టలో రామలక్ష్మిగారూ’ అన్నాడు” అని చెప్తూ నవ్వారు. అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
 
          ఆమెకు పత్రికా రంగంలోనూ, సినిమారంగంలోను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని విమర్శనాత్మకంగా చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. తనని తానే అందరూ గయ్యాళినని అంటారని కూడా నవ్వుతూ చెప్పుకుంటారు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు. నిజానికి వారు రచనలు చేసే ఆ కాలంలో ఆయా రంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ. వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
 
          ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళ రెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు. ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడలోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం, కదలడానికి కాళ్ళు సహకరించకపోవటం వలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం, సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయ త్వం గురించి గానీ, అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచరు. ఆ వయసులో కూడా హాస్యంగా, చమత్కారాలతో సానుకూల దృక్పథంలో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. 
 
          మొత్తంమీద ఆషీ అబాకస్ క్లాసులు రామలక్ష్మి గారితో సాన్నిహిత్యాన్ని పెంచాయి.
 
          ఎందువలనో గుర్తులేదు. కానీ మలకపేట దిల్షుక్ నగర్ ప్రాంతం అంతా కొన్నాళ్ళు కర్ఫ్యూ పెట్టిన తర్వాత సడలింపు ఇచ్చి రాత్రి ఎనిమిది నుండి రాత్రి కర్ఫ్యూ వుంచారు.
 
          ఆ రోజు పల్లవి మధ్యాహ్నం కాలేజీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. సాయంత్రం ఎప్పటి లాగే ఆషీని అబాకస్ క్లాసులో దించి ఏడుగంటలకు వస్తానని ఇంటికి వచ్చేసాను. ఏడుగంటలకు ఇంటి నుండి బయలుదేరి వెళ్తుంటే స్ట్రీట్ లైట్లు ఆరిపోయాయి. నేను ఆ చీకట్లో చిన్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోక తట్టుకుని పడిపోయాను. కుడిచేతి మీద ఆపుకోవాలనుకోవటంలో చెయ్యి మణికట్టు దగ్గర విరిగింది. బేగ్ లోని ఫోన్ తీసి చెయ్యాలన్నా వీలుకాలేదు. ఎడమచేతితో కుడిచేతికి సపోర్ట్ ఇచ్చి బాధ అణచుకొని ఆషీ దగ్గరకు వెళ్ళాను. ఆషీకి ఫోన్ ఇచ్చి మా వారికి రింగ్ చేయమని విషయం చెప్పి మా రెగ్యులర్ ఆటో సలీమ్ కి హాస్పిటల్ కి వెళ్ళటానికి ఫోన్ చేయమన్నాను. పల్లవికీ ఫోన్ చేయించాను.
 
          ఆషీ సాయంతో ఇంటికి వెళ్ళి సలీమ్ ఆటోలో మలక్ పేటలోని సుస్రుతా నర్సింగ్ హోంకు వెళ్ళాము. ఈలోగా పల్లవి డైరెక్ట్ గా అక్కడికే వచ్చింది. 
 
          కర్ఫ్యూ అని డాక్టర్ వెళ్ళిపోయాడట. ఒకనర్సు, మరొకరిద్దరు అటెండర్లు వున్నారు. అక్కడ రాత్రికి జాయినైపోమనీ, ఉదయం డాక్టరు వచ్చాక చూస్తారని  అన్నారు. నాకు నొప్పి అంతకంతకూ పెరిగిపోతోంది.
 
          ఈలోగా ఫోన్ అందుకుని కారు తీసుకుని పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి దిల్షుక్ నగర్ లోని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు వెళ్దామన్నారు. పల్లవినీ ఆషీని ఇంటికి సలీమ్ ఆటోలో వెళ్ళిపోమన్నాము.
 
          ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్స్ రే తీయించాక, మర్నాడు ఆపరేషన్ చేసి వైర్ వేస్తాము. హైబీపీ వుంది కనుక ఇసీజీ తీయించి రిపోర్ట్ తీసుకు రమ్మన్నారు. వెంటనే నొప్పి తగ్గటానికి ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటికే పది దాటింది. కర్ఫ్యూ వలన అంతటా నిర్మానుష్యం. ఏ హాస్పిటల్ లోనూ డాక్టర్లు లేరు. కారులో అలా వెతుక్కుంటూ కనిపించిన ప్రతీ హాస్పిటల్ మెట్టు ఎక్కాము. ఆఖరికి ఒక దగ్గర ఇసీజి చేయించుకోవడానికి కుదిరింది. రిపోర్టు తీసుకుని మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సన్నని వెదురు బద్దలతో తాత్కాలికంగా కట్టు కట్టేరు. అంతవరకూ వేలాడిపోతోన్న కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకునే వున్నాను. ఇవన్ని అయ్యి ఇంటికి వెళ్ళేసరికి సుమారు పన్నెండు అయ్యింది. కాస్త పెరుగన్నం తిని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.
 
          ” పడిపోయానని ఫోన్ చేస్తే తరుచూ కళ్ళు తిరిగి పడిపోతావు కదా అలాగే అను కున్నాను. ఇంత దెబ్బ తగిలిందనుకోలేదు.” అన్నారు బిత్తరపోతూ వీర్రాజుగారు.
 
          మర్నాడు ఉదయమే హాస్పిటల్ కి పల్లవి నేనూ వెళ్ళాము. వీర్రాజుగారు ఆషీని చూసుకోడానికి ఆగిపోయారు. అంతేకాక ఆయనకి హాస్పిటల్ వాతావరణంలో బీపీ పెరిగిపోతుంది. అందుకే ఇంట్లోనే వుండమన్నాం. చేతికి రాడ్ వేసి సిమ్మెంటుకట్టు కట్టి ఆరు వారాల తర్వాత రమ్మన్నారు.
 
          పల్లవి రెండు వారాలు సెలవు పెట్టింది. ఆ తర్వాత కూరా పప్పు చేసేస్తే వీర్రాజు గారు కుక్కర్ పెట్టేవారు. నేను మామూలుగా రాసుకోవటం చెయగలనా అని నాకు కొంచెం దిగులు మొదలైంది. పల్లవి కోప్పడుతున్నా ఎడమ చేత్తోటే కొంచెం పనులు సాయం చేయటానికి ప్రయత్నించే దాన్ని. ఎడమ చేత్తో రాయటానికి చూసేదాన్ని. ఆ ప్రయత్నం లోనే ఒక కవిత కూడా రాసాను.
 
          ఆరు వారాల తర్వాత సిమ్మెంటు కట్టు తీసేసినా క్లాత్ తో కట్టు కట్టుకోమని డాక్టర్ చెప్పి గోరు వెచ్చని వేడినీళ్లలో చేతిని పెట్టి వేళ్ళు కదుపుతూ ఎక్సర్సైజులు చేయమ న్నారు డాక్టర్. నాకు కుడిచేయి ముఖ్యమైనది కదా చాలా శ్రద్ధగా చేసి తొందరగా నొప్పి తగ్గించుకున్నాను. కానీ ఆ చేత్తో కొద్ది బరువు పట్టుకున్నా నొప్పి పెట్టేది.      
 
          2009 అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి. వై ఏస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవం తంగా ముందుకు నడిపించి , అసెంబ్లీలో కాంగ్రెసు 156 సీట్లు గెలుచుకునేలా చేసాడు. వై ఎస్.ఆర్ ముఖ్యమంత్రిగా 20 మే 2009న రెండవసారి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ సారి కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. విద్యార్థు లకు రీయింబర్స్మెంట్ ఇవ్వటంతో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజీలు కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. గ్రామీణ పిల్లలు, బడుగు వర్గాల పిల్లలు వీటి వలన వున్నత విద్యకు చేరువయ్యారు.
 
          ఉద్యోగం చేసినంతకాలమే కాక తర్వాత కూడా మా స్కూల్ విద్యార్థులకు మొదటి రేంక్ వచ్చినవారికి ఆగష్టులో నగదు బహుమతులు ఇవ్వటం నిలిపివేయలేదు‌. కవర్లలో డబ్బుపెట్టి కొన్ని ఏళ్ళ పాటు అందజేస్తూనే వున్నాను. కానీ ఆ డబ్బు సక్రమంగా నేను కోరిన విధంగా వుపయోగించటం లేదని తెలిసింది. దాంతో నేను రిటైర్ అయిన నాలుగేళ్ళ తర్వాత ఇవ్వటం మానేసాను.
 
          నా రెండో దీర్ఘ కవిత బతుకు పాటలో అస్తిత్వ రాగం” పూర్తి చేసాను. జీవితంలోని వివిధ దశలైన శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం , ప్రౌడత్వం, వృద్ధాప్యం, ముగింపు తో ఏడు చాప్టర్ లుగా విభజించి స్త్రీ జీవితాన్ని సంపూర్ణంగా కవిత్వంలో అక్షరీకరించాను. తొలిసారిగా పల్లవి డిజిటల్ పద్ధతిలో తయారు చేసిన ముఖచిత్రంతో ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది.
 
          ఈ పుస్తకం ప్రింటింగ్ సమయంలో వీర్రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది.” ఈ ఏడాది డిసెంబర్ లో నీ అరవై ఏళ్ళు పుట్టినరోజు వస్తుంది కదా ఆ సందర్భంగా ఇప్పటికి వచ్చిన నీ ఎనిమిది కవిత్వం పుస్తకాలూ కలిపి సమగ్ర సంపుటిగా ప్రచురించుతే బాగుంటుంది ” అన్నారు. ఖర్చు ఎక్కువే అవుతుందని నేను ఆలోచించాను.
 
          కానీ వీర్రాజు గారు “ఇంతవరకూ ఇలా ఎవరూ సమగ్ర సంపుటాలుగా వేసుకోలేదు. అందులోనూ ఇంత కవిత్వం రాసిన కవయిత్రులూ తక్కువే. వేస్తేనే బాగుంటుంది.” అని గట్టిగా నిర్ణయించుకోవడమే కాకుండా నాళేశ్వరం శంకరంగారితో కూడా ప్రస్తావించారు. శంకరంగారు కూడా మంచి ఆలోచన అని ప్రశంసించి ప్రత్యేక సందర్భంగా ఎవరి చేతనైనా ముందుమాట కూడా రాయించండి అన్నారు.
 
          1980 లో వచ్చిన తొలి కవితా సంపుటికి శివారెడ్డిగారితో ముందుమాట రాయించాను. తర్వాత ఏ సంపుటికీ ఎవరిచేతా రాయించ లేదు. శంకరంగారి సూచన అనుసరించి ఎవరిచేత రాయించుదామా అని ఆలోచించి కాత్యాయనీ విద్మహేగారితో రాయిస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాము.
 
          కాత్యాయనీ విద్మహేగారికి ఫోన్ చేసి విషయం చెప్పాము. ఇంకా అయిదారు నెలలు పైనే వుంది కనుక సమయం తీసుకోమని చెప్పాను. ఆమె సంతోషంగా అంగీకరించారు. నా విడివిడి సంపుటాలన్నీ ఆమెకు పంపించాము. డిటీపీ చేయించటానికి కూడా ఇచ్చాము. పుస్తకం 500 పేజీలు కన్నా ఎక్కువే వచ్చేలా వుంది.
 
          దేశమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగింది. ఎప్పుడూ కోలాహాలంగా వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు చాలా గంభీరంగా, భయంభయంగా జరిగాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌తో సంబంధాలు తెగిపోయాయనే వార్తలు నాలుగురోజులుగా వస్తున్నాయి. ఒక రెండుమూడు రోజుల పాటూ ఆచూకి తెలియలేదు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత సెప్టెంబర్ 2 వ తేదీ 2009 రోజునాటికి ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని నిర్థారించారు.
 
          ఉగ్రదాడేమోనని ఒక్కసారిగా రాష్ట్రమే కాకుండా దేశమంతా వులికిపడింది. కానీ చాలాకాలం అన్ని కోణాల నుండి శోధించి హెలికాప్టర్ లోని యాంత్రిక లోపంగా ప్రకటిం చారు. రోశయ్యగారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది.
 
          కాంగ్రెస్ లో జరిగిన అనూహ్య పరిణామాలు తెరాసా నాయకులకు కలిసి వచ్చింది. అప్పటికే చాలా కాలంగా ఏకీకృతం అవుతున్న వారికి బలం పుంజుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
 
          తెరాసా అక్టోబరు 21న సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించారు. ఉద్యోగులు , విద్యార్థులు, ప్రజలు ఏకమయ్యారు. జయశంకర్, హరగోపాల్, కోదండరాం, చుక్కా రామయ్య, విద్యాసాగరరావు వంటి మేధావులు సంఘటితం కావటం ఉద్యమం వూపు అందుకుంది.
 
          2009 నవంబర్ 29న సిద్ధిపేట కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపై తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది.
 
          విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావటంతో తెలంగాణ వచ్చే వరకూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమానికి కేంద్రబిందువు అయ్యింది . ప్రభుత్వం కేసీఆర్‌ను దీక్ష చేయకుండా ప్రభుత్వం అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించింది ఆయన జైల్లోనే దీక్ష కొనసాగించారు. తరవాత నిమ్స్ కి తరలించినా దీక్ష కొనసాగింది. ”తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో” అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. తెలంగాణా అంతటా భగ్గుమనడంతో కేంద్రపీఠం కదిలింది.
 
చిదంబరం తెలంగాణ ప్రకటన
డిసెంబరు 9వ తేదీన కేంద్రం తెలంగాణాకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఈ ప్రకటన తరువాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. 
 
          నా సమగ్ర కవిత్వం చదివి ఒకరోజు కాత్యాయనీ విద్మహే నాకు ఫోన్ చేసి ” మీ కవిత స్త్రీ వాద సంకలనం నీలిమేఘాలులో చేరలేదనుకుంటాను. ఎందుచేత ” అని అడిగారు .” బహుశా నేను మితవాద స్త్రీ వాదిగా భావించి చేర్చలేదేమో” అన్నాను. ఆమె సుమారు అరగంటసేపు నాకవిత్వం గురించి నాతో ఫోనులో చర్చించారు. అంతేకాదు సుమారు పదహారు పేజీల సుదీర్ఘ ముందుమాట రాసి అందించటం నాకు చాలా సంతోషం కలిగించింది.
 
          అయితే నా పుట్టిన రోజు నాటికి ప్రచురణ పూర్తికాలేదు. అందుకని ఒక డమ్మీ కాపీ తయారుచేసారు వీర్రాజు గారు.
 
          మా కుటుంబానికి బాగా దగ్గరైన ఆత్మీయ మిత్రులు ఒక పదిహేనుమందిని ఆహ్వానించి మా ఆషీతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మా ఇంటికి దగ్గరలోనే ఒక హొటలులో కలిసి భోజనాలు చేసాము. ఆ రకంగా నా షష్ఠిపూర్తి అయింది.
 
          పుస్తకం ప్రింటింగ్ పూర్తయ్యాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గోపీ గారి అధ్యక్షతన రత్నమాల , నాళేశ్వరం శంకరం నా పుస్తకంపై ప్రసంగించగా ఎనిమిది సంపుటాలతో కూడిన నా సమగ్ర కవిత్వ సంపుటి ఆవిష్కృతం అయ్యింది. ఆ విధంగా నాకు వీర్రాజు గారు గొప్ప బహుమతి అందించారు.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.