జీవితం అంచున -29 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          రెండు వారాల ప్లేస్మెంట్ ఎన్నెన్ని అనుభవాలను ఇచ్చిందో. 

          రూము నంబరు 219 లో ఫ్రాన్సిస్ అనే అందమైన ఆజానుబాహుడైన వృద్ధుడు వేరే ఏ నర్సింగ్ స్టూడెంట్ అతనిని అటెండ్ చేసినా అంగీకరించేవాడు కాడు. జెంసీని పిలవమనేవాడు. నా మాట మాత్రమే వినేవాడు. ప్రతిరోజూ అతని భార్య అతని కోసం వచ్చిందని బయట వేచి వుందని తీసుకు వెళ్ళమని నన్ను అడిగేవాడు. భోజనం గబగబా తినేస్తే తీసుకు వెడతానని, అతను స్నానం చేసి శుభ్రంగా వుంటే వాళ్ళావిడ ఆనందిస్తుందని రకరకాలుగా నచ్చచెప్పి నిత్యకృత్యాలన్నీ చేయించి నిద్ర మాత్రలు ఇచ్చి నిద్ర పుచ్చేదాన్ని. క్రమంగా వృద్దులు పసిపిల్లలేనని కర్మేణా తెలుస్తుండేది నాకు. నన్ను, నా సహనాన్ని మెచ్చు కుంటూ ఫ్రాన్సిస్ తన వాలెట్ నుండి డబ్బు తీసి ఇవ్వబోయాడు రెండుసార్లు. సున్నితంగా తిరస్కరించి మళ్ళీ నొచ్చుకోకుండా సముదాయించేదాన్ని. 

          రూం నంబరు 230లో పీటర్ అని ఒక ఇగోయిస్ట్ వుండేవాడు. అందరికీ చుక్కలు చూపించేవాడు. అతని రూము నుండి బజర్ వినిపించినా ఎవరికి వారే తప్పించుకునే ప్రయత్నం చేసేవారు. మూడు సార్లకన్నా ఎక్కువగా బజర్ నొక్కితే నాలుగోసారి మెయిన్ ఆఫీసులో ఆ రూము సంఖ్య కింద రెడ్ లైట్ వెలిగి పై అధికారుల దృష్టికి వెడుతుంది. నేను ఒకసారి అతని రూముకి అతని లంచ్ మెన్యూ అడగడానికి వెళ్ళాను. నాకు మెన్యూలో కొన్ని ఐటమ్స్ ని అసలు ఎలా ఉచ్చరిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఏవో నాలుగు పేర్లు అచ్చమైన ఆస్ట్రేలియన్ స్లాంగ్లో చెప్పాడతను. అతని ఉచ్ఛారణతోనే నోట్ చేసుకుని నిదానంగా మెన్యూ పరిశీలించి చూద్దాములే అని ఓకే అంటూ తలాడించి బయటకు వెళ్లబోయాను. అతను నన్ను ఆపి ఒకసారి తను ఎంచుకున్న మెన్యూని తిరిగి చెప్పమన్నాడు. నా గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది. ఎంత ఎంబరాసింగా అనిపించిందో. నా తడబాటును చూసి అతను చాలా అవమానకరంగా మాటాడాడు. అతను పెద్ద రేసిస్ట్ అని ఏషియన్స్ అంటే పడదని తరువాత తెలిసింది.

          ఒక్క రోజు మాత్రమే మానసిక రోగుల విభాగంలో వేసారు నన్ను. కాని ఒక్క గంటలోపే నన్ను అంత కాలంగా చేసిన పాత వార్డుకి పిలిపించేసుకున్నారు. ఆ గంటలో జంట బొమ్మలతో ఒక వృద్ధురాలు పరిచయ మయ్యింది. ఆమె రెండు బొమ్మలను ఎంతో ఆప్యాయంగా ఒక ప్రాంలో పెట్టుకుని వార్డు మొత్తం తిరుగుతోంది. ఆవిడకు కవల మనవలు వున్నారట. ఆవిడ వెనుక కథ తెలుసుకోవాలని ఆరాటపడ్డాను. ఎందుకో ఆమెను చూడగానే జీవనజ్యోతి సినిమాలో వాణిశ్రీ గుర్తొచ్చింది.   

          స్టూడెంట్స్ శ్రేయస్సు, అభివృద్ధి కోరేట్లయితే  మొత్తం స్టూడెంట్స్ ని అన్ని విభాగాల్లోకి మార్చి మార్చి వేయాలి. అన్ని రకాల రోగులతోనూ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించాలి. కాని రెండు వారాల కోసం మార్పులు చేర్పులు లేకుండా ఒకే చోట ఉంచేసారు మమ్మల్ని. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పని సుళువు కావడం, స్టాఫ్ లేమి సర్దుబాటు కావడం వరకూ మాత్రమే ఆలోచించారు. కాని ఒకేచోట ఉండటం వలన నాకు అక్కడి ఇన్మేట్స్ తో బాంధవ్యం ఏర్పడింది  కాని ఆల్ రౌండ్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయ్యాననిపించింది. 

          నా రెండు వారాల ప్లేస్మెంట్ అవుతూండగా తోటి విద్యార్థి నర్సుల సలహా మేరకు అక్కడే జాబ్ కి అప్లై చేసాను. ఉద్యోగ నియామకానికి ముగ్గురి పాజిటివ్ అండ్ అకాడమిక్ ఎక్సెలెన్స్ రిపోర్ట్ అవసరం ఉంటుంది. స్టాఫ్ అందరూ తెలిసి ఉండటంతో, అంకితభావంతో నేను పనిచేసిన తీరు చూడటంతో నేను రెండు వారాలు ఏ సీనియర్ నర్సుల అధ్వర్యంలో పని చేసానో ఆ ఇద్దరూ నన్ను రెకమండ్ చేసారు. మూడో వ్యక్తిగా మా కోర్స్ టీచర్ కేట్స్ నా గురించి మంచి రిపోర్ట్ రాసి నన్ను ఉద్యోగానికి రెకమండ్ చేశారు. నా నర్సింగ్ సర్టిఫికేట్ అందిన తరువాత మూడు రికమండేషన్ లెటర్స్ తో దరఖాస్తు సబ్‌మిట్ చేయాలి. ఎంతో ఉత్సుకతతో నా సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నాను. 

          అమ్మకు అప్పుడప్పుడు విపరీతమైన తలపోటు రావడం, ఆ సమయంలో బ్రెయిన్ హామరేజ్  అవుతుందేమో అన్నంత తీవ్రంగా పెనుగులాడటం మొదలయ్యింది. దానికి తోడు ఆయాసం. ఇదివరకటి రోజుల్లో అమ్మకి మూడు సంవత్సరాల వీసా ఇచ్చేవారు. ఈ మధ్య వృద్దాప్యం కారణంగానేమో ఒక్క ఏడాదికే వీసా మంజూరు అయ్యింది. ఈసారి అమ్మ వీసా పూర్తయ్యే లోపు సరయిన వైద్యం చేయించాలని నిర్ణయించు కున్నాము. స్పెషలిస్ట్ల దగ్గర అమ్మ కన్సల్టేషన్లు మొదలయ్యాయి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.