కాదేదీ కథకనర్హం-16

 ఈ దేశంలో ఆడది

-డి.కామేశ్వరి 

          జయంతి బస్సు దిగి గబగబ యింటివైపు అడుగులు వేయడం మొదలు పెట్టింది. ఈరోజు రోజూకంటే గంటాలశ్యం అయిపొయింది. కనుచీకటి పడిపోతుంది. అప్పుడే, పిల్లలు పాపం ఏం చేస్తున్నారో, యింకా రాలేదని బెంగ పడ్తున్నారేమో . మొదటి బస్సు తప్పిపోయింది, రెండో బస్సు వచ్చేసరికి అరగంట పట్టింది. యింటికి తొందరగా చేరాలన్న ఆరాటంతో పరిగెత్తినట్టే నడుస్తుంది జయంతి. పిల్లలు నాలుగున్నరకే రోజూ వస్తారు. ఆమె యిల్లు చేరేసరికి ఐదున్నర ఆరు మధ్య అవుతుంది. స్కూలు వదిలాక రెండు బస్సులు మారి రావాలంటే ముప్పావుగంట తక్కువ పట్టదు. పిల్లల కోసం కటకటాల వరండాలో హార్లిక్స్ సీసాలో పాలుపోసి, రెండు ప్లాస్టిక్ గ్లాసులు , ఒక నీళ్ళ సీసా , యిద్దరికీ చెరో రెండు బిస్కెట్లు గాని, బ్రెడ్ ముక్కలు గాని ఉదయం వెళ్ళేటప్పుడు పెట్టి వేడ్తుంది. పిల్లలు వీధి తాళం తీసుకుని వరండాలో పెట్టినవి తిని చుట్టుప్రక్కల పిల్లలతో ఆడుకుంటూ వుంటారు.

          జయంతి ఇల్లు చేరేసరికి రోజు మాదిరి పిల్లలు ఆడుకోకుండా వరండా ముందున్న మెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎవరో వ్యక్తీ కూర్చున్నారు. కను చీకట్లో దగ్గరికి వచ్చ్రే వరకు గుర్తుపట్టలేక పోయింది జయంతి. గుర్తు పట్టగానే స్థాణువులా నిలబడిపోయింది. ‘అమ్మ వచ్చేసింది నాన్నా అమ్మ వచ్చేసింది . అమ్మా నాన్న వచ్చారు.’ పిల్లలిద్దరూ లేచి నిలబడి తల్లి దగ్గరకు పరుగెత్తి సంతోషంగా చెప్పారు. జయంతి కాళ్ళలో శక్తి పోయినట్టు ఒక్క అడుగూ ముందుకు వేయలేక పోయింది. ఈ మనిషి ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? రెండేళ్ళ క్రితం నిర్ధాక్షిణ్యంగా బాధ్యతారాహిత్యంగా వున్న పాటున చెప్పాపెట్టకుండా తన ఖర్మానికి తనని వదలి వెళ్ళిన యీ మనిషి రెండేళ్ళ తరువాత హటాత్తుగా యిలా ఎందుకు వచ్చాడు? ఆమె శరీరం అంతా కోపంతోనూ, బాధ ఆవేదనతోనూ కంపించింది. “గెటౌట్ , పో బయటకు వెంటనే” అని అరిచిందా అరవలేదు. అరవాలనిపించింది. కానీ నోట్లోంచి మాట రాలేదు. నెమ్మదిగా అతను ముందుకు వచ్చాడు. “జయా నేనే. అలా చూస్తున్నా వేమిటి. వచ్చి అప్పుడే గంట అయింది. నీవింత ఆలశ్యంగా వస్తావనుకోలేదు” అన్నాడు. రోజూ భార్య స్కూలు నుంచి వచ్చినప్పుడు పలకరించినంత మాములుగా , రెండేళ్ళ తరువాత వచ్చిన మనిషి పలకరించాడు. ఏం జరగనట్టు అంత నిర్వికారంగా, మాట్లాడుతున్న అతన్ని చూసి తెల్లబోయింది. నెమ్మదిగా కాలు చేయి కూడదీసుకుని మాట్లాడకుండా బ్యాగు లోంచి తాళం తీసి తలుపు తెరిచింది. లైటు వేసింది. ఆ లైటు వెలుగులో గుమ్మానికి అడ్డుగా నిలబడి “ఎందుకు వచ్చారు!” కఠినాతి కఠినంగా ప్రశ్నించింది. అతని వంక తిరిగి, పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ప్రశ్నకి ఎదురు చూడనట్టు అతను తడబడి “అదేమిటి….. నిన్నూ పిల్లలని చూద్దామని…..’ ఏదో చెప్పబోయాడు.

          “చూశారుగా యింక వెళ్ళండి” మళ్ళీ కఠినంగా అంది.

          “అదికాదు జయా చూడ్డానికి కాదు. చూడ్డానికేమిటి , నా వాళ్ళున్నారని వచ్చాను. ఏం తప్పా. రాకూడదా, యిలా మాట్లాడుతున్నా వేమిటి?’ నవ్వాలని ప్రయత్నించాడు. జయ నవ్వలేదు. తీక్షణంగా అతని వంక చూసింది. “మీవాళ్ళు…..ఎవరూ మీ వాళ్ళు ? మెడలో తాళికట్టి పదేళ్ళు కాపురం చేసిన భార్యని, పసికందులనైనా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా , భాద్యతారహితంగా, పిరికి పందలా చెప్పనైనా చెప్పకుండా వదలి పారిపోయిన నాడే వాళ్ళు మీ వాళ్ళు కాదు. ఇంకా రెండేళ్ళ తరువాత యింకా మీ వాళ్ళుగా మిగులుతారని ఏం మొహం పెట్టుకు ఆశించి వచ్చారు!”

          “జయా! నేను నిన్ను కట్టుకున్న మొగుడిని. వాళ్ళు నా పిల్లలు అని మర్చిపోయి నట్లున్నావు. గుమ్మంలోకి వచ్చిన మనిషితో మాట్లాడవలసిన తీరు యిదేనా, మంచి మర్యాద లేకుండా యిలా నిలబెట్టి ‘ కోపం ధ్వనించింది అతని గొంతులో. “మంచి మర్యాద….అవి మానవత్వం వున్న మనుషులకి. అవి మర్చిన మీలాంటి అధములకి కాదు. భర్త అంటే భరించే వాడు. భరించకుండా భారం భార్య మీద మోపి పారిపోయిన వాడు భర్తేలా అవుతాడు. మీకు నాకు యింక ఏ సంబంధం లేదు. దయచేసి మీరు వెళ్ళొచ్చు. రెండేళ్ళనాడే మీరు నాకు లేనివారితో సమానం, వెళ్ళండి. మా ఖర్మానికి మమ్మల్ని వదలి దయచేసి వెళ్ళండి. మాకు మీకు యింకే సంబంధం మిగలదు “వెళ్ళండి……వెళ్ళిపొండి’ అరిచింది జయ. అతని మొహం ఎర్రబడింది. కళ్ళల్లో అవమానం, క్రోధం, ఆడదాని చేత , కట్టుకున్న పెళ్ళాం చేత అంత అవమానపడటం అతని అహంకారం మీద దెబ్బ తీసింది. “నీవు సంబంధం లేదంటే పోవడానికి యిదెం బొమ్మల పెళ్ళి కాదు! నీవు నేను విడాకులు పుచ్చుకునే వరకు నేను నీ మొగుడినే. వీళ్ళు నా పిల్లలే. నా హక్కుని లేదనేటందుకు నీకు హక్కు లేదు.” గర్వంగాయిప్పుడెం చెపుతావు అన్నట్టు తల ఎగరేశాడు. జయంతి అతని వంక తిరస్కారంగా చూసింది.

          “రవీ, స్వర్ణా మీరిద్దరూ అంటీ యింటికి వెళ్ళి కాసేపు ఆడుకోండి నేను పిలిచే వరకు” అంది పిల్లలిద్దరితో . పిల్లలిద్దరూ బయటికి వెళ్ళాక “మిస్టర్ సూర్యారావు ఒక ఆడదాని మోజులో కట్టుకున్న దాన్ని వదలి పిల్లలని వదలి వెళ్ళిన నీవు ఆ ఆడది తన్ని తగలేస్తేనో లేక ఆ మోజు తీరగానే మళ్ళీ భార్య దగ్గిరకి చేరడానికి సిగ్గు లేదూ నీకు, నీవు ఒక మగవాడివయితే మళ్ళీ నా దగ్గరికి రావు. నన్ను బెదిరించి నీ జులుం సాగించాలనుకోకు. ఎటువంటి పరిస్థితిలోనూ నేను నిన్ను భర్తగా అంగీకరించను, అండర్ స్టాండ్. అంచేత నీ హక్కులు నీవు పొందాలనుకుంటే కోర్టు కెక్కు అంతేగాని, యీ గుమ్మంలో నిలబడి నన్ను బెదిరించాలని మాత్రం చూడకు. నీవు చేసిన పనికి నా హృదయంలో ఓ సున్నితపు పొర చిరిగిపోయింది. ఈ రెండేళ్ళు నేపడిన కష్టాలతో, సమస్యలతో, బాధలతో నా హృదయం బండబారింది. ఇప్పుడు వంటరిగా యీ లోకంలో ఏ యిబ్బందినైనా ఎదుర్కోగల మనస్తైర్యం సంపాదించుకున్నాను. అంచేత యిక నీ బెదిరింపులకి బెదరను . ఒక ఆడది కట్టుకున్న భర్తని, తన పిల్లలు తండ్రిని యింతలా ఎహ్యించుకుని యిలా మాట్లాడిందంటే ఆమెని ఆ భర్త ఎంతలా దెబ్బ తీసాడో, ఎంత మోసం చేసి ఆమెని గాయపరిచాడో ఎవరికన్నా అర్ధం అవుతుంది. నీకు అర్ధం కాక వచ్చావో, అర్ధమయి వేరే దారి లేక వచ్చావో నాకనవసరం. పోయిన మనశ్శాంతి యిప్పుడిప్పుడే పొందుతూ శాంతిగా బతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ రావాలని ప్రయత్నించకు. వెళ్ళు ప్లీజ్ గో ఎవే….” తీవ్రంగా అంది. ఆమె మొహంలో కనపడిన స్థిర నిశ్చయానికి , ధైర్యానికి అతను మనసులో కాస్త జంకాడు.

          ఇది అతనూహించని పరిస్థితి . కాసేపు తిడ్తుంది, ఏడుస్తుంది — “ఎలా వదిలి పోయారు, ఎలా బతుకుతామనుకున్నారు , మమ్మల్నాలా వదిలిపోతే” అని ఏడుస్తుంది తను తప్పయింది క్షమించమని కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతుంది – కౌగిలిలోకి లాక్కుంటే కరిగిపోతుంది. కధ సుఖాంతం అవుతుంది. అని ఆశించి ధైర్యంగా వచ్చాడు. జరిగినదానిలో తన తప్పు స్వల్పం. ఆ మాయలాడి వలలో వేసుకుంది. “నా కళ్ళు పొరలు కమ్మాయి నా మనసు వశం తప్పింది. ఆ మాయలో పడి అదేం చేయమంటే చేశాను. నా కళ్ళు విచ్చుకునేసరికి ఆలస్యం అయిపొయింది” అంటూ తప్పు ఆమె మీద తోసి “నీకు మొహం చూపలేక సిగ్గుతో లజ్జతో నేను చేసిన వెధవ పనికి యిన్నాళ్ళు కుమిలిపోయి నీ దగ్గరికి రాలేకపోయాను. నీతో అంతా చెప్పుకుని నిన్ను క్షమాపణ కోరాలని నీ క్షమాపణ దొరికనిదే యిక్కడ నించి కదల కూడదని వచ్చాను జయా నన్ను క్షమించగలవా” అని దీనంగా ప్రాధేయపడితే కరగని భార్య వుండదన్న విశ్వాసంతో చాలా నమ్మకంగా వచ్చాడు. అతని అంచనాలు అన్నీ తారుమారు అయిపోయాయి. జయంతి యింత నిర్భయంగా, ఇంత ధైర్యంగా యింతలా తనని నిలబెట్టగలదని అతనూహించలేదు. ఇప్పుడెం చెప్పి ఆమెని లొంగదీసుకోవాలో అర్ధం కాలేదు. జయ కళ్ళల్లో తిరస్కారం ఏదన్నా ఎడుర్కొగలనన్న నిబ్బరం చూసి ఆఖరి అస్త్రంగా ‘జయా, నాకేం గతిలేక నీ దగ్గరికి వచ్చానను కుంటున్నావేమో, పోనీ కట్టుకున్నదానివి, నా పిల్లలున్నారని వచ్చాను. నీకు అంత మొగుడు అక్కరలేకపోతే నాకూ పెళ్ళాం అక్కరలేదు, నాకు పెళ్ళాం కావాలంటే యింకా చాలామందే దొరుకుతారు కానీ, నా పిల్లలు నాకు కావాలి , వాళ్ళని మాత్రం వదలను. నా పిల్లలని నా వెంట పంపు యిప్పుడే యీ క్షణమే తీసుకువెడతాను” బింకంగా అన్నాడు. జయ మొహం కళ తప్పడం, ఆమె కళ్ళలో కలవరపాటు చూసి గర్వంగా నవ్వుకున్నాడు.

          “ఇప్పుడెం చేస్తావు’ అన్నట్టు సవాల్ చేశాడు.

          “రెండేళ్ళ పాటు నిర్ధాక్షిణ్యంగా వదలి వెళ్ళినప్పుడు జ్ఞాపకం రాని పిల్లలు యిప్పుడు కావాలసివచ్చారా ఆ పిల్లలు సాకు అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించి లొంగదీసుకోవాలనుకునే మీ నీచబుద్ది నాకర్ధం అయింది. — ఆ పిల్లలకి కన్నతల్లిని తండ్రి వదిలితే కష్టపడి నేను పెంచుకున్నాను. నా హక్కు ఏ కోర్టు లేదంటుందో నేనూ చూస్తాను . కోర్టు కెక్కి కోర్టు చెప్పేవరకూ నేను పిల్లలను వదలను. వెళ్ళండి పిల్లలు కావాలంటే కేసు పెట్టుకోండి ముందు నా యింట్లోంచి వెళ్లి మీకు చాతనయింది చేసుకోండి.” మనసులో భయంగా వున్నా అతని ముందు తగ్గిపోవడం యిష్టం లేక, తగ్గినట్టు కనిపిస్తే తన మీద జులుం చలాయిస్తాడని లేని ధైర్యం తెచ్చుకుని బింకంగా అంది.

          “కేసు పెట్టుకోవాల్సింది నీవు ఏ కేసు లేకుండా పిల్లలు తండ్రికి చెందుతారని అందరికీ తెలుసు. ఆ హక్కు నీవు పొందాలంటే కేసు పెట్టుకోవల్సింది నీవు” నా పిల్లలని నేను తీసుకెళ్ళడానికి నాకే కోర్టు పర్మిషనూ అక్కరలేదన్నది నీవు తెల్సుకో….. ఆడదానివి నీకింత పోగరయితే నాకు ఎంతుండాలి. ఏదో పోనీ పాపం ఏం కష్టపడుతు న్నదో జరిగిందేదో జరిగింది , అంతా మర్చిపోయి మళ్ళీ కలిసి వుందాం అని వస్తే కట్టుకున్న భర్తని వీధి గుమ్మంలో నిలబెట్టి యిలా మాట్లాడే నీ పోగరు ఎలా అణచాలో నాకు తెలుసు. ఏదో డిగ్రీ వుంది, ఉద్యోగం వుందని కదూ యీ మిడిసిపాటు ‘ కసిగా అన్నాడు.

          “పాపం, పోనీ గదా అని వచ్చారా, నేను ఏ గతి లేకుండా ఏ కూలి పనో చేసు కుంటూ వుంటే మీకు సంతోషంగా వుండేది — నేను నా కాళ్ళ మీద నిలబడి పిల్లలని పెంచుకుంటూ వుండడం మీరెదురు చూడని విషయం. నేను హీన స్థితిలో వుంటే వచ్చి చాలా ఉదారంగా నన్ను ఆదుకోవాలని, మీరే దిక్కండి నన్ను వదలకండి అని మీ కాళ్ళ మీద పడి ఏడుస్తానని అనుకుని వచ్చారు. అలా లేకపోయేసరికి ప్లేటు ఫిరాయించారు.’

          “నీతో నాకు మాటల అనవసరం. నా పిల్లలని నా కప్పగించు లేదంటే బలవం తంగా తీసికేడతాను’ బెదిరింపుగా అన్నాడు.

          ఒక్క క్షణం – “తీసికెళ్ళు నీ పిల్లలని తీసికెళ్ళు ఎలా పెంచుకుంటావో పెంచుకో” అనాలనిపించి జయంతి మనసు ఊగిసలాడింది. ఇది వత్తి బెదిరింపు గాని నిజంగా పిల్లలని తీసికెళ్ళి అతను పెంచలేడు అని తెలిసినా ఏమో పంతానికి పోయి వాళ్ళని తీసికేడితే పసిపిల్లలు నిండా పదేళ్ళు లేని ఆ పిల్లలు తనకి దూరమైతే వాళ్ళు ఎలా బతకగలరు. వాళ్ళ మాట ఎలా వున్నా వాళ్ళని వదలుకుని తనెలా బతకగలదు. ఈ కోపంలో మూర్ఖంగా తీసికేడితే తను ఎలా అడ్డుకోగలదు. కోర్టు కెక్కె ఆర్ధిక స్తోమత తనకి లేదు. ఎక్కినా కోర్టు తీర్పు చెప్పేసరికి నెలలు సంవత్సరాలు గడిచిపోతే వాళ్ళని వదలి ఎలా బతకగలదు! భగవంతుడు ఎంత నిర్దయుడు! ఆడదానికి మాతృత్వం అనే వరం శాపంగా కూడా మార్చాడు. ఆమె మనసు నిండా మమత నింపి ఆమె పిల్లలని వాళ్ళకి బంధంగా వేసి పురుషుడికి తల ఒగ్గి బతకమని శాసించాడు. ఆ భగవంతుడూ పురుషుడేగా! ఆ దేముడితో పాటు మన న్యాయ సూత్రాలు, నీతి సూత్రాలు అన్నీ మగవాడికి అనువుగా మార్చి ఆడదానికి ఎంత అన్యాయం చేశారు! ఈ పురుష స్వామ్య ప్రపంచంలో స్త్రీని ఏ విధంగా కట్టడి చేస్తే లొంగి వుంటుందో పురుషులు గ్రహించి ఆ సూత్రాలన్నీ న్యాయ సూత్రాలుగా ఉరితాళ్లుగా ఆమె గొంతుక్కి బిగించారు. నవమాసాలు మోసి, కని రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా శ్రమించి పెంచిన బిడ్డ తల్లికి కాక తండ్రికి చెందడం ఎంత అన్యాయం! యింతకు మించిన అన్యాయం యింకే ముంటుంది. ఒక్క క్షణం ఆమెలో చెలరేగిన సంఘర్షణ అది! ఆమె ఊగిసలాట ఎంత దాచుకున్నా ఆమె మొహం మీద స్పష్టంగా కనిపిస్తుంది —— అది అతను గుర్తించాడు. అతనికి కావాల్సింది తాడు తెగే వరకూ లాగడం కాదు. ఆ తాడు కొస తన చేతిలో వుంది. ఆ తాడు తన చేతికే వస్తుంది. అని అతనికి నిబ్బరంగాతెల్సు.

          అంచేత, “నేను నీకు రెండు రోజులు టైము యిస్తున్నాను – ఈలోగా నీవు అలోచించుకో. నీకు కాపురం కావాలో అక్కరలేదో, అక్కర లేదంటే పిల్లలని అప్పగించడానికి తయారుగా వుండు. నా హక్కుని ఏ విధంగానూ ఆపలేవు. ఆపాలని ప్రయత్నిస్తే నీవే నష్టపోతావు. నేను ఎల్లుండి మళ్ళీ వస్తాను. అప్పటికి నీ జవాబు సిద్దంగా లేకపోతె పర్యవసానానికి నేను బాద్యుడిని కాను. యిది బెదిరింపనుకోకు వస్తాను’ విజయగర్వంతో ఓ విషపు నవ్వు నవ్వి వడివడిగా అక్కడ నించి వెళ్ళి పోయాడు అతను. జయంతి శరీరంలో శక్తి అంతా ఒక్క క్షణంలో పోయినట్టు కింద కూలబడింది.

***

          ఆరోజు కోర్టు కేసు తీర్పు యిచ్చే రోజు! జయంతి శరీరం అంతా చిగురుటాకులా కంపిస్తుంది. ఏ తీర్పు వినాల్సివస్తుందోనని యిరుగుపొరుగు స్కూలులో టీచర్లు మిత్రులు, యిచ్చిన ధైర్యంతో, ప్రోత్సాహంతో అందరూ కల్సి చేసిన ఆర్ధిక సహాయం తో కోర్టు అంటే ఎక్కింది కాని పర్యవసానం ఎలా వుంటుందో నన్న ఆందోళన ఆమెని బాగా కృంగదీసింది. ఎనిమిది నెలల తరవాత కోర్టు తీర్పు యిచ్చే రోజు వచ్చింది.

          తీర్పు విన్నాక జయంతి హృదయం దూది పింజలా తేలికయిపోయింది. పిల్లలు ఆమె దగ్గిరే వుండాలని పిల్లలని ఆమెని భాద్యతారహితంగా రెండేళ్ళు వదలి వెళ్ళిన కారణంగా భార్య మనసు విరిగి ఆ భర్తతో కాపురం చేయననడం సమంజసమేనని కాపురం కావాలనుకునేది వద్దనుకునేది ఆమె యిష్టానికే కోర్టు వదిలిందని , పిల్లలు చిన్నవాళ్ళు అదీకాక అంత బాధ్యత రహితంగా ప్రవర్తించిన ఆ తండ్రి మీద కోర్టుకి నమ్మకం లేదు కనక పిల్లలు తల్లి దగ్గిరే వుండాలని, అయినా అతను తండ్రి కనక పిల్లలని ఎప్పుడు పడితే అప్పుడు చూసే హక్కు అతనికి వుంటుంది. వారానికి ఒకరోజు ప్రతి ఆదివారం అతను పిల్లలతో గడపడానికి అతనితో పిల్లలని పంపాలని, శలవుల్లో అతను కోరినప్పుడల్లా పిల్లలని పంపాలని, యిరువురు పరస్పర అవగాహనతో మళ్ళీ కావాలనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని కోర్టు తీర్పు చెప్పింది.

          అ తీర్పు విని జయంతి నిశ్చింతగా నిట్టూర్చింది . “వారానికి ఒకరోజులో ఏం వుంది కాసేపు తీసికెడతాడు శలవుల్లో నాల్గు రోజులుంచుకుంటాడు కావలిస్తే యింతేగా” అనుకుంది ఆరోజు!

***

          కాని ఆరు నెలలు గడిచేసరికి అప్పుడనుకున్నంత తేలిగ్గా “యింతేగా” అనుకూలేకపోతుంది యీ రోజు!

          ఈ ఆరు నెలల్లో పిల్లలని మానసికంగా తనకి దూరం చేయడంలో అతనెంత విజయం సాధించాడో అర్ధం అయి ఆమెలో ఏదో భయం చోటు చేసుకోసాగింది. పిల్లల లేత మనస్సుల్లో స్లో పాయిజన్ మాదిరి తనంటే విముఖత కలగ చేయడంలో సఫలీకృతుడవుతున్నాడు. తన మీద కసి, కోపం, కక్ష పిల్లలని తనకి దూరం చేయడం ద్వారా సాధించి తృప్తి పడుతున్నాడు. “వారానికి ఒక్కరోజు ఏ శలవుల్లోనో నాల్గు రోజులు యింతేగా” అనుకుంది. కాని పిల్లలు ఆ వారానికి ఒక్క రోజు కోసం అంతలా ఎదురు చూస్తారని వారానికి ఆరు రోజుల్లో తల్లి తమ గురించి ఎంత కష్ట పడుతుందో తమ కోసం యెంత సుఖం త్యాగం చేసి బాధ్యత భుజాన వేసుకుందో వారు గుర్తించడం మానేశారని తెల్సుకునేసరికి ఆమె హృదయం బాధగా మూల్గింది.

          మొదటి ఆదివారం ‘అమ్మా నీవురా నీవు రాకుండా నాన్నగారితో మేం వెళ్ళం బాబూ, మాకు భయం బాబూ” అన్న పిల్లలని బుజ్జగించి నచ్చచెప్పి బలవంతంగా తండ్రి వెంట పంపితే తనని వదలలేక బిక్కం మొఖాలతో తండ్రి వెంట వెళ్ళిన పిల్లలు సాయంత్రం నవ్వు మొహాలతో సంతోషంగా “ఐస్ క్రీం యిప్పించారు నాన్న, హోటల్ కి వెళ్ళి దోసె తిన్నాం. ముగ్గురం కేరమ్స్ ఆడుకున్నాం. మళ్ళీ ఆదివారం “జూ” కి తీసి కేడ్తనన్నారు ‘ అని ఆ రోజు విశేషాలన్నీ సంతోషంగా ఏకరువు పెడ్తుంటే “పోనీ కాస్త అలవాటయ్యారు బెంగ పెట్టుకోకుండా” అని సంతోషించింది. నాల్గు వారాలు గడిచేసరికి తండ్రి కోసం , ఆదివారం కోసం పిల్లలు ఎంతలా ఆరాటంగా ఎదురుచూస్తున్నారో గుర్తుంచేసరికి మనసు చివుక్కుమంది. తండ్రి తీసికెళ్ళిన సినిమాలు, పార్కులు, హోటళ్ళు, చిరుతిళ్ళు, కొనిచ్చిన బంతులు, పెన్నులు చూసుకుంటూ, చెప్పుకుంటూ వారమంతా గడిపి ఆదివారం కోసం చూసేవారు. తల్లి అనేదే వుందని మర్చిపోయినట్లు ఎంతసేపూ తండ్రి గురించిన కబుర్లే. రెండు నెలలు గడిచే సరికి “డాడీ చాలా మంచివారు నీవేప్పుడన్నా యిలాంటి జోళ్ళు, కొన్నావా, మాకసలు ఎప్పుడన్నా ఐస్ క్రీం యిప్పించావా చక్కగా డాడీ వచ్చాక హోటలుకు తీసి కెడుతున్నారు . నీవెప్పుడు తీసి కెళ్ళలేదు, బలే సినిమాలు చూస్తున్నాం.

          అమ్మెప్పుడూ తీసికెళ్ళదురా తమ్ముడూ! “అక్కా, నాన్న మంచివారే అమ్మే మంచిది కాదు, నాన్న రమ్మంటే రానంది. ఆరోజు నాన్నని ఎంత తిట్టింది, పాపం నాన్న ఒక్కరూ వుంటున్నారు గదా అమ్మ ఎందుకు వెళ్ళదు. అందరింట్లో అమ్మ నాన్న చక్కగా వుంటారు ఛా అమ్మనించే మనం ఇలా ఈ ఇంట్లో వుండాల్సి వస్తుంది ” అంటూ పిల్లలు మాట్లాడుకునే మాటలు వింటుంటే గిలగిల కొట్టుకునేది జయంతి మనసు. ఈర్ష్యతో మనసు మండేది. తన శ్రమ, తన కష్టం వాళ్ళ కోసం తను పడే బాధలు ఏమీ గుర్తించకుండా రెండు నెలల్లో తండ్రి పక్షాన చేరిపోయిన పిల్లలని చూస్తె ఏడుపు వచ్చినట్లుండేది జయంతికి. ‘నాన్నగారిల్లు బాగుంది కదరా రవీ చక్కగా ఫాన్లు, టి.వి. సోఫాలు, అవి వున్నాయి. అంత మంచి యింటికి అమ్మ రానంటుంది. అమ్మా నీవు రాకపోతే మానేయ్. మేము అక్కడికే వెళ్ళిపోతాం” ఆరునెలలు గడిచేసరికి పిల్లలు అల్టిమేటమ్ యిచ్చేశారు. ఇంకో ఆరు నెలలు పొతే పిల్లలు తనకెంత దూరం అవుతారో తల్చుకుంటే భయం కల్గింది. ఈ పిల్లల కోసం యింత కష్టపడుతుంటే వాళ్ళు తండ్రిని సమర్దిస్తుంటే యింత ఈ శ్రమ , కష్టం ఎవరి కోసం! ఎవరినుద్దరించడానికి పంతం!

          ‘అమ్మా మేం యీ ఎండాకాలం శలవులు రెండు నెలలు నాన్న దగ్గిరే వుంటాం బాబూ యిక్కడ ఉక్క…..హాయిగా అక్కడయితే ఫేన్లున్నాయి , సినిమాలు చూడడానికి టీ.వి  వుంది. శలవుల్లో డాడీ పార్కులు, సినిమాలు అవి తీసికెడతానన్నారు. మేం యిక్కడుండం బాబూ” అన్న పిల్లలని గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయింది జయంతి.

          “అమ్మా…అమ్మా…..!’ రవి కుదుపుతుంటే తుళ్ళి పడి లేచింది జయంతి. బారెడు పొద్దెక్కిపోయింది. అయోమయంగా పిల్లలని చూసింది. ఇదంతా కలా!తెల్లవారు ఝామున వచ్చిన కలాయిది! ఆరయిపోయింది. ఇంకా పడుకున్నావేమిటి అమ్మా” స్వర్ణ అడుగుతుంటే దిగ్గున లేచి పనుల్లో జొరబడింది జయంతి. పని చేస్తున్నంత సేపూ ఆలోచనలే. ఆ సాయంత్రం ఒక వారపత్రికలో ‘ఆదివారం తండ్రులు” అనే వ్యాసం చదివింది. విదేశాల్లో విడిపోయిన భార్యాభర్తల గురించి వ్యాసం అది! పిల్లలని ఆశువుగా పెట్టుకుని వారి పసి మనసులు దోచుకోడానికి వారికి అన్ని రకాల ఖరీదయిన వస్తువులు కొనిస్తూ పార్కులు, హోటళ్ళు తీసికెళ్ళి మంచి చేసుకుని వాళ్ళని ఆకట్టు కుని తల్లి పట్ల విముఖత కలిగిస్తూ వారిని తమ వైపు తిప్పుకోడానికి ఎంత తాపత్రయ పడ్తారో చెప్పే వ్యాసం అది! అది చదివాక రాత్రి ఆలోచిస్తూ పడుకుంటే అదే కలలోకి వచ్చిందన్న మాట! రేపు మనదేశంలోనూ ఈ ‘ఆదివారం తండ్రులు” ప్రవేశిస్తారా? యిలా విడాకులు పొందితే యిలాంటి తండ్రులు బయలుదేరి పిల్లల మనస్సులో విషం నింపి తల్లి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే . ఉహు….వీలులేదు . బాధ్యతా రాహితంగా పిల్లలని పాడుచేసే తండ్రుల కంటే బాధలు పెట్టె భర్తని భరించడం నయమేమో? కన్నతల్లిగా, వారి క్షేమం కోరే తల్లిగా వారి కోసమన్నా భర్తని భరిస్తుంది ఈ దేశం స్త్రీ! అందుకే భర్తలు ఎంత బాధపెట్టినా పిల్లల కోసం సహిస్తూ పడివుండే భార్యలున్న యీ దేశంలో పిల్లల కింకేం వున్నా లేకపోయినా తల్లిదండ్రుల యిద్దరి ప్రేమ లభిస్తుంది పుష్కలంగా. బాధ్యత తీసుకోకుండా పిల్లలని పాడుచేసే అవకాశం యిచ్చే కంటే తండ్రులకి బాధ్యత అప్పగించితేనే నయం! తనకి భర్త అవసరం లేక పోయినా బిడ్డలకి తండ్రి అవసరం వుంది! బిడ్డలా హక్కుని తమ పంతంతో , కోపంతో , పోగోడితే రేపు పిల్లలే తనకి ఎదురు తిరిగితే యింక యీ పంతానికి అర్ధం ఏముంది! ఇన్నాళ్ళు “యీ ఆడవాళ్ళంతా భర్త లెంత హింసించినా ఎందుకు పడుంటారో” అని వారి మీద జాలి పడేది! యిప్పుడు…..యిప్పుడు తనని చూసి తనే జాలి పడాలేమో!

          మర్నాడు వచ్చే భర్త ముందు తల ఒగ్గడానికి సిద్దపడింది జయంతి….పిల్లల కోసం! యీ దేశంలో ఆడది అంతకంటే ఏం చెయ్యలేని నిస్సహాయురాలు! “మాతృత్వం స్త్రీకి వరమన్న” వాళ్ళని షూట్ చెయ్యాలి” అనుకుంది కసిగా జయంతి –ఆ వరమిచ్చిన వేల్పుని ఏం చెయ్యాలి !

(‘ఆదివారం తండ్రులు” అనే వ్యాసం చదివాక )

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.