వెనుతిరగని వెన్నెల (ఆఖరి భాగం)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించు కోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది.  హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవుతుంది. తన్మయి ఓర్పుగా నెగ్గుకొస్తూ ఉంటుంది.

***

          ఒక పక్కన తన్మయి తనకు వచ్చిన ప్రమోషన్ ని బెంగుళూరు దగ్గర్లోకి మార్చుకునే ప్రయత్నాల్లో ఉండగానే ఆ సాయంత్రం ప్రభు “గుడ్ న్యూస్” అంటూ పైకి పరుగెత్తుకొచ్చేడు. విషయం వినగానే తన్మయికి చెప్పరాని గొప్ప ఆనందం కలిగింది. ప్రభు సంగతైతే చెప్పనే అవసరం లేదు. పాపని భుజమ్మీద ఎక్కించుకుని గాల్లో తిప్పసాగేడు “అమెరికా వీసా ఎప్రూవ్ అయ్యిందిరా కన్నా” అంటూ. తండ్రి మాట్లాడేది అర్థం కాకపోయినా గాల్లో తిప్పడంతో కిలకిలా నవ్వసాగింది పాపాయి. కనీసం రెండు మూడేళ్లు పడుతుందనుకున్నది అదే సంవత్సరంలో వస్తుందని అస్సలు అనుకోలేదు.

          ప్రభుకి హెచ్1 అప్రూవ్ అయ్యింది. అంటే ప్రభు ఇప్పటికే పనిచేస్తున్న కంపెనీ అమెరికాలోని తమ ఆఫీసులో పనిచేసేటందుకు ప్రభుని ఆహ్వానించింది. అందుకు కావలిసిన వీసా సమస్య కూడా ఇప్పుడు పరిష్కారం అయ్యింది. అంతేకాదు, తనతో బాటూ భార్యా పిల్లల్ని కూడా తీసుకేళ్లే అవకాశం కలిగింది. ఫామిలీకి కూడా వీసాలు అప్లై చేసుకోవడమే తరువాయి.

          “కానీ ఎలారా? సరిగ్గా నీకు మంచి ప్రమోషను వచ్చిన సమయానికి వీసా వచ్చింది. ఇదంతా వదులుకుని మనం యూఎస్ వెళ్లిపోవడం నీకు ఇష్టమేనా మరి” అన్నాడు ప్రభు అంతలోనే తన్మయి వైపు సందేహంగా చూస్తూ.

          తన్మయికి తన కష్టాలు తీరే మార్గం ఒకటి ఇన్నాళ్లకు కనబడినందుకు మనసులో కలుగుతున్న ఆనందం ముందు అసలివేవీ గుర్తుకు రావడం లేదు.

          “ఉహూ, నాకు నీతో ఉండడమే ముఖ్యం. అయినా అక్కడ ఉద్యోగాలు దొరకవా ఏంటి? ఇది కాకపోతే మరొక ఉద్యోగం” అని నవ్వుతూ

          “ఊ…నెక్స్ట్ స్టెప్స్ ఏవిటీ? అంది ఉత్సాహంగా.

          “వీసా అప్రూవల్ లెటర్ రాగానే, ముందు మా ఆఫీసు వాళ్లు వీసా స్టాంపింగు కోసం నా పేపర్ వర్కు పూర్తి చేస్తారనుకుంటా. నాతో బాటూ నీకు, పిల్లల క్కూడా వీసా ఆఫీసు వాళ్లతోనే అప్లై చెయ్యమని చెబుదాం. కాకపోతే ఫామిలీ వీసా ఫీజులు మనమే భరించాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాకా మనం స్టాంపింగుకి మద్రాసు కాన్సొలేట్ కి వెళ్లి రావాల్సి ఉంటుంది. వీసా స్టాంపింగు ఏ అవాంతరం లేకుండా జరిగితే ఆ తర్వాత నేను ముందు బయలుదేరి వెళ్లి కాస్త కుదురుకుని, అక్కడ ఇల్లు వగైరా తీసుకున్నాక నువ్వూ, పిల్లలూ వస్తారన్నమాట” అన్నాడు.

          గాల్లో తేలిపోతున్నట్లున్న మనసులోని సంతోషాన్ని అదిమిపట్టుకుని “ఇవన్నీ జరగడానికి ఎన్నాళ్లు పట్టొచ్చు?” అంది.

          “బహుశా: మరో అయిదారు నెలలు” అన్నాడు సాలోచనగా. తన్మయి గబగబా లెక్కేసుకుంది.

          ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రమోషను తీసుకుంటే తను ఎలా లేదన్నా మరో నెలరోజుల్లో ఎక్కడో ఒకచోట జాయిను కావలసిందే. ఆ తర్వాత అక్కడ పూర్తిగా సెటిల్ కావడానికి మరొక మూడు నెలలు పట్టొచ్చు. ఇంతలో ప్రభు యూ. ఎస్ వెళ్లి ఉద్యోగంలో కుదురుకుంటే ఇక తను, పిల్లలు వెళ్లడానికి మార్గం సుగమం అయినట్టే.

          కానీ ఈ లోగా తను ప్రమోషను తీసుకుని వెళ్లాలా, వద్దా అనేది నిర్ణయించు కోవాలి. ఇప్పుడు ప్రమోషను తీసుకుంటే తను, పిల్లలు వెళ్లి ఆ ఊళ్లో మకాం పెట్టి ఉండవసిందే. ఎంత కాదనుకున్నా మళ్లీ మొత్తం ఒక కొత్త సంసారమే. అంతలోనే మరో రెండు, మూడు నెలల్లో యూ.ఎస్ ప్రయాణం కావాలి. మళ్లీ అక్కడా కొత్త ఇల్లు, ఉద్యోగంతో సహా మళ్లీ జీవితాన్ని పున: ప్రారంభించాలి.

          అలాగని ప్రమోషను వదులుకుంటే, ఒకవేళ అమెరికా నుంచి వెనక్కి ఒక ఏడాదిలో వచ్చెయ్య వలసి వస్తేనో……ఆలోచనలో పడింది తన్మయి.

          “శుభమా అంటూ ఇన్నాళ్లకి జీవితానికి ఒక కొత్త వెలుగు రాబోతూంటే తనకీ మీమాంస ఎందుకు? కానియ్యి, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఏది జరిగినా తన మంచికే అని ఎప్పుడూ విశ్వసిస్తూ వచ్చింది. ఇది కూడా తన మంచికే జరగబోతూంది.” గుండెల నిండా ఊపిరి తీసుకుంది తన్మయి.

          గవర్నమెంటు ఉద్యోగం వదులుకుంటే మళ్లీ దొరకక పోవచ్చు. కానీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనశ్శాంతిగా జీవించడం. అది కరువయ్యి ఇక్కడ జీవించడమా, లేదా ప్రభుతో కలిసి అమెరికా వెళ్లడమా అంటే తనెప్పుడూ రెండోదే ఎంచుకుంటుంది. ప్రభు లేకుండా పిల్లలు, తను ఇక్కడ ప్రభు తల్లిదండ్రులతో కలిసి జీవించడం అయ్యేపని కాదని ఇప్పటికే గట్టిగా అర్థం అయ్యింది. ఇక తను ప్రమోషను తీసుకుని ఇండిపెండెంట్ గా మరెక్కడో ఉండడం వల్ల వాళ్ల బాధ తప్పినా ప్రభు లేకుండా జీవించడమే అవుతుంది. పైగా మళ్లీ ఒంటరిగా కష్టాలు పడడమే. అమెరికా వెళితే ఉద్యోగం ఒక్కటే ఉండదు. మిగతా అన్నీ తన మనసుకి నచ్చే ఉంటాయి. అతి ముఖ్యంగా “తనది” అనే ఇల్లు మళ్లీ సాకారం అవుతుంది. అదృష్టం బావుంటే ఉద్యోగమూ దొరకచ్చు.

          నిర్ణయం తీసుకున్నాక తల్లికి ఫోను చేసింది.

          అట్నుంచి జ్యోతి చాలా సంతోషంగా “పోనీలెమ్మా, ఇప్పటికైనా నీ కష్టాలు తీరే మార్గం ఒకటి దొరికింది. నిశ్చింతగా, హాయిగా వెళ్లు. ఎప్పుడు చూడాలనిపించినా ఈ రోజుల్లో రావడం పెద్ద కష్టం ఏవీ కాదట. మన ఊళ్లో ఒకరిద్దరు అమెరికా వెళ్లిన వాళ్లు ఏడాదికోసారైనా ఇక్కడ కనిపిస్తుంటారు కదా, అవునూ..నిన్ను బాబుని తీసుకెళ్లడానికి ఆ త్రాష్టుడు ఒప్పుకుంటాడంటావా?” అంది.

          “ఆ దిగులేమీ లేదు లేమ్మా. బాబుకి పాసుపోర్టుకి అప్లై చేసినప్పుడే బాబుని ఏ దేశానికైనా, ఎన్నాళ్లయినా తీసుకెళ్లగలిగే లీగల్ అఫిడవిట్ సంతకం కూడా అతన్నించి తీసుకున్నారు లాయరు.” అంది తన్మయి.

          “చెయ్యకేంజేస్తాడు, ఉద్యోగం మాని చేసిన బిజినెస్సులన్నీ లాసులొచ్చి తిండానికే గతిలేకండా ఉన్నాడట. ఇంక పిల్లోడి విషయాలు వొదిలెయ్యకేంజేస్తాడు” అంది జ్యోతి.

          అతని విషయాలు వినడం కూడా ఇష్టం లేని తన్మయి “అవన్నీ సరేగానీ ప్రభు వెళ్ళేకా సెలవులు రాగానే నేను పిల్లల్ని తీసుకుని వచ్చి నీ దగ్గిర వారం రోజులైనా ఉండివెళ్తాను” అంది.

          “హమ్మయ్య, మొదటా పని చెయ్యమ్మా. నాకూ నిన్నూ పిల్లల్ని కాస్త చూసుకున్న ట్టవుతుంది.” అంది జ్యోతి.

***

          తన జీవితం ఎటు నించి ఎటుకి కొట్టుకొచ్చిందో, ఎటు వెళ్లబోతుందో తలచుకుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది!

          ప్రభు తన జీవితానికి లభించిన గొప్ప వరం. తల్చుకోవడానికైనా తనకి దూరంగా బతకాల్సి రావడం అనేది అలవికాని బాధ కలిగించే విషయం. అలాంటి ప్రభు అమెరికా వెళ్తుంటే కూడా వెళ్లకుండా ఉద్యోగం పేరుతో తనిక్కడ ఉండిపోతే అనుక్షణం బాధాతప్తహృదయంతో బతకాల్సిందే. అసలు ప్రభు ప్రేమైక జీవన సాంగత్యం లేకుండా తనకి ధీమాగా బతకడం సాధ్యమేనా? తన పిచ్చిగాని. ఇంత వరకు ఎప్పుడూ ప్రభు కెరీర్ లో ఎదుగుదలని తను సంతోషంగా ప్రోత్సహించిందే కానీ, ఎప్పుడూ నిరుత్సాహపరిచింది లేదు. ప్రభు బెంగుళూరులో నెలకి ఒక వారం ఉండాల్సి రావడం తనకి బాధగా అనిపిస్తున్నా ఏదోలా మనసుకి సర్ది చెప్పుకుంటూం ది అందుకే. విషయం చెప్పడానికి కిందికి వెళ్లిన ప్రభుతో పెద్ద రణరంగం ప్రారంభ మయ్యింది అప్పటికే.

          “అంటే నీ పెళ్ళాన్ని, పిల్లల్ని తీసుకుని అమెరికా ఎల్లిపోడానికే నిచ్చయించీ సుకున్నావన్న మాట, ఇక్కడ మేవందరం ఎలా పోయినా నీకవసరం లేదు” అన్నాడు ప్రభు తండ్రి గుమ్మంలోంచి బయటికి తుపుక్కున ఊస్తూ.

          “మనోణ్ణి అనుకోటం ఎంతుకు? ఆ మామ్మారి మనోణ్ణి మన్నించి ఇడగొట్టనాకి ఏసిన పన్నాగం ఇది. ఈడు దాని వల్లో ఎప్పుడైతే పడ్డాడో అప్పుడే మనకి ఎప్పుడో ఒకప్పుడు ఈ గతి పడతాదని తెలుసు నాకు” అని బేబమ్మ గట్టిగా శోకాలు మొదలు పెట్టింది.

          “ఇప్పుడేవైందని? మీకు ఇక్కడ ఏ లోటూ రాకుండా చూస్తాను కదామ్మా. మేం వెళ్లి అక్కడ పరిస్థితులు కాస్త కుదురుకున్నాక మిమ్మల్ని కూడా అక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తాను కదా.” అనునయంగా అంటున్న ప్రభు మాటలకి కాస్త మెత్తబడి
“మరిప్పుడే తీసుకెళ్లు అమెరికా. ఏం నీ పెళ్ళాం సాటి సెయ్యమా? ఆవిడి కొడుకు సాటి సెయ్యమా?” అంది బేబమ్మ.

          “భార్యాపిల్లలకి తప్ప మరెవరికీ వీసా వెంటనే రాదమ్మా…”

          కొడుకు మాటల్ని మధ్యలోనే ఆపి “ఎవడికో పుట్టిన ఆవిడి కొడుక్కి ఈసా ఎంటనే వచ్చేత్తాది గాని, మాకు రాదా?” అంది.

          “మీకు వీసా వెంటనే వస్తే ఈ సరికే చేస్తాను కదా. అయినా నేను వెళ్లేలోగా మీ అందరికీ పాసుపోర్టులు అప్లై చేస్తాను. వచ్చే ఏడాదికైనా వీసాలు వచ్చేలా ఏర్పాటు చేస్తాను. నేనెక్కడున్నా మీ గురించే ఆలోచిస్తానమ్మా.” అన్నాడు ప్రభు గద్గదంగా.
“అలాగైతే ఈ నెల నించి మామీద ఆవిడి పెత్తనం ఉన్నాకి ఈల్లేదు. మాకు నెలకి పాతిక యేలు ఇచ్చీయాల. ఆవిడి అమెరికా ఎల్లీదాకా ఇంత ముద్ద పడెయ్యమంటే పడేస్తాం. నేపోతే పైనే పొయ్యెట్టుకుని సొయంగా వొండుకోమను……..”

          అప్పుడే పిల్లలకి అన్నాలు పెట్టడానికి కిందికి వచ్చిన తన్మయి మౌనంగా వింటున్న ప్రభుని, అదను చూసుకుని డిమాండ్ చేస్తూ , నోటికొచ్చినట్టల్లా మాట్లాడు తున్న అతని తల్లిదండ్రుల్ని కనీసం ముఖం ఎత్తి చూడాలని కూడా అనిపించక మాట్లాడకుండా మెట్లెక్కి వెళ్ళిపోయింది.

          ఛీ… ఛీ…నోటికి హద్దూ పద్దూ లేని నీచమైన మనుషులు. ఇటువంటి వాళ్ల కడుపున రత్నం లాంటి ప్రభు ఎలా పుట్టేడో అస్సలు అర్థం కాదు. జన్మత: రాని సంస్కారం అతనికి చదువు వల్ల కలగడం ఎంతో మెచ్చుకోదగిన విషయం. కానీ అదీ వాళ్ళ ముందు బలాదూరే. ఇలాంటి మాటలు వినీ, వినీ అతనికున్న విచక్షణత, సంస్కారం కూడా క్రమంగా తగ్గిపోతాయేమో. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లల ముందర ఇలాంటి అనారోగ్యకరమైన సంభాషణలు వాళ్ళ మీద ప్రభావం చూపించ కుండా ఉంటాయా?

          ఇక ఆ క్షణం తన్మయికి మనసులో అమెరికా ప్రయాణం పట్ల ఉన్న కాస్త సందేహం కూడా తొలగిపోయింది.

          పిల్లల్ని నిద్రపుచ్చుతూ “తన వైపు నించి ఎటువంటి ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా అమెరికా వెళ్లిపోవాలి. ఇకమీదటైనా పీడన లేని జీవితాన్ని గడపాలి. భూమ్మీద ఏదో ఓ చోట కాస్త కలోగంజో తాగైనా బతకడానికి తను సిద్ధమే. వీళ్ల మధ్య మాత్రం కాదు. అసలు ఎప్పుడూ తనకి కావాల్సిందల్లా మనశ్శాంతిగా బతకడం. అంతే. అదే దూరం అవుంతుంటే జీవితానికి అర్థం ఏవుంది?

          “మిత్రమా! ఇక్కడి నుండి వెళ్ళేలోగా నాకు బతకగలిగే ధైర్యాన్నివ్వు. అనుకున్న వన్నీ సక్రమంగా జరిగేలా నీ స్నేహ హస్తాన్ని అందించు” అని కళ్ళు మూసుకుని పదే పదే అనుకోసాగింది.

***

          వీసా స్టాంపింగు సజావుగా జరిగే సరికి ఊపిరి పీల్చుకుంది తన్మయి.

          “మరో నెల రోజుల్లో ప్రభుకి టిక్కెట్టు బుక్ చేసేరు వాళ్ల ఆఫీసు వాళ్ళు. మొదటి రెండు వారాలు నాకు అకామడేషను వాళ్ళే ఇస్తున్నారు. ఆ తర్వాత ఇల్లు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇల్లు తీసుకోగానే మీరు వద్దురు గాని…” అని అంటూనే ప్రభు సేవింగ్సు లెక్కవెయ్యసాగేడు.

          “టిక్కెట్లు పోను సరిగ్గా మూడు నెలల వరకు ఇక్కడ మెయింటెనెన్సుకి సరిపోతాయి. ఇక అక్కడ వచ్చే జీతంలో సగం ఇంటద్దెకే పోతుందటున్నారు మా మిత్రులు. వెళ్ళగానే నీకూ ఉద్యోగం ఉండదు. అక్కడ కారు లేకపోతే కుదరదట. వెళ్ళగానే కారు కొనుక్కోవాలన్నా కనీసం ఆరు నెలలు పట్టేటట్టు ఉంది….” ఏవేవో అంటూ మథనపడుతున్న ప్రభుకి తన్మయి ధైర్యం చెప్పింది.

          “అన్నీ ఇప్పుడే ఆలోచించి బాధ పడకు. నువ్వు ముందు వెళ్లి అక్కడ అన్నీ పరిస్థితులు అర్థం చేసుకో. అన్నీ కుదిరిన తర్వాతే నేను, పిల్లలు వస్తాం.” అంది.
లోపల్లోపల బాధగా అనిపిస్తున్నా బాధ్యతలు ఒక్క భుజమ్మీద మోయడంలో ఉన్న కష్టం తను అర్థం చేసుకోగలదు.

          ప్రమోషను గురించి, ఇక్కడ ఉద్యోగం వదిలి వెళ్లడం గురించి మళ్లీ ఆలోచనలో పడింది తన్మయి.

          సిద్దార్థకి ఫోను చేసింది.

          “అంతా విని. కంగ్రాట్యులేషన్స్. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ప్రభు వెంట వీలైనంత త్వరగా మీరు వెళ్లడమే ఉత్తమైన పని. ఇక ఇక్కడ ఉద్యోగం మాట ఎక్కువ ఆలోచించకండి. కాకపోతే రిజైను చెయ్యకుండా దీర్ఘకాలపు సెలవులో వెళ్ళండి. ఒకవేళ అక్కడి నుంచి మీరు వెనక్కి రావాల్సి వస్తే ఇక్కడ ఉద్యోగ భద్రత ఉంటుంది. ఒకవేళ సెలవు అయిపోయినా మీరు రాలేకపోతే అక్కడ మీరు మంచి స్థితిలో ఉన్నారనేగా అర్థం. మీరు ఎంతో చురుకైన వారు, కష్టపడి ఏదైనా సాధించగలిగే పట్టుదల ఉన్నవారు. ఎక్కడికి వెళ్లినా ఉన్నత స్థితికి వెళ్లగలుగుతారు. మీ మీద మీరు నమ్మకముంచుకుని ముందడుగు వెయ్యండి. అంతా మంచి జరుగుతుంది”అన్నాడు.

          సిద్దార్థ మాటలకి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.

          ఉన్నత విద్య కోసమో, ఉద్యోగం కోసం మరేదైనా దేశానికి వెళ్ళడానికి గవర్నమెం టు ఉద్యోగ భద్రతతో సెలవు ఇస్తుందన్న విషయం జ్ఞాపకం వచ్చింది. అయితే ఏదైనా యూనివర్సిటీలో ముందు అడ్మిషన్ సంపాదించే పనిలో పడాలి అర్జెంటుగా. కానీ కాలేజీ అడ్మిషన్లంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అయినా వివరాలు కనుక్కోవ డంలో తప్పులేదేమో.

          అమెరికాలో స్థిరపడి, అంతకు ముందు ఒకసారి బస్సులో కనిపించి మాట్లాడిన లెక్చరరు గారు జ్ఞాపకం వచ్చేరు. ఆయన ఫోను నంబరు, ఈ- మెయిలు కూడా ఇచ్చినట్టు జ్ఞాపకం. అదే చెప్పింది సిద్దార్థతో.

          “మరింకేం. ఆయన్ని అడిగి వివరాలు కనుక్కోండి. మీ కాలేజీ అడ్మిషన్ కి కావలసిన బ్యాంకు షూరిటీ నేనిస్తాను” అన్నాడు.

          తన్మయి ఒక్క క్షణం అసలేమీ మాట్లాడలేకపోయింది.

          “సిద్ధూ…” అని మాత్రం అని గొంతు పూడుకుపోవడంతో ఆగిపోయింది. అడక్కుండానే సాయం చేసే ఇటువంటి గొప్ప మిత్రులు ఎవరికైనా ఉంటారా?
“కమాన్ తన్మయీ. ఒక్కమాట. మీరెంత ఎత్తుకి ఎదిగినా కుచేలుడి లాంటి ఈ మిత్రుణ్ణి మాత్రం మర్చిపోకండేం!” అని నవ్వేడు.

          ఆ మరుసటి వారానికల్లా వివరాలన్నీ కనుక్కున్న తర్వాత తన్మయికి ఒక విషయం బాగా అర్థమయ్యింది. అమెరికా వెళ్లడమంటే జీవితాన్ని మళ్లీ మొదటి నించీ పునఃప్రారంభించడమే. అయినా వెనుతిరగకుండా ముందుకు అడుగు వెయ్యడానికే సిద్ధపడింది తన్మయి.

***

ఉపసంహారం
అప్పటిదాకా తన్మయి కథను చెప్తున్న ఉదయిని కళ్ళల్లోని నీటి చెమ్మలో తన్మయి కనిపించింది సమీరకి. దగ్గరికి వచ్చి ఉదయిని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది. అంతలోనే తేరుకుని చిర్నవ్వు నవ్వుతూ ఉదయిని ఏదో అనబోయేలోగా

          “ఆగండి ఆంటీ! తన్మయి తర్వాతి జీవితం నేను కళ్లారా చూసినట్టు చెప్పగలను. తన్మయి అమెరికాలో ఎమ్మెస్ చేస్తూనే, ఉద్యోగంలో చేరి తన కాళ్ల మీద తను నిలబడింది. భర్తా పిల్లలతో “తనది” అనే ఇంట్లో హాయిగా జీవించడమే కాకుండా ఎందరికో సహాయం కూడా చేస్తూంది.” అంది కొంటెగా నవ్వుతూ.

          “ఊ. ఇంచుమించు అంతే. కానీ ఏ ఒక్క మెట్టూ అంత సులభం కాలేదు. ప్రభు వస్తూనే తన్మయి రావడానికి వీలుపడలేదు. అనుకున్నట్టే అతని జీతంలో సగానికి పైగా ఇంటద్దెకు పోతుందని అతను షేర్డ్ అకామడేషన్ లో గడిపాడు. వచ్చిన ప్రతి డాలరు అతి జాగ్రత్తగా ఖర్చు చేస్తూ వచ్చినా మొదటి ఏడాది కారు వంటివి సమకూర్చుకోవడానికి, కొద్దోగొప్పో నిలదొక్కుకోవడానికి, అతని తలిదండ్రుల గొంతెమ్మ కోరికలు తీర్చడానికి సరిపోయింది. ఆర్థిక కారణాలు వాళ్ళిద్దరినీ సంవత్సరం పాటు దూరం ఉంచాయి. ఇక తన్మయి ఆ సంవత్సర కాలంలో ఒక పక్క వచ్చిన ప్రమోషను వదులుకుని, అదే ఉద్యోగంలో కొనసాగుతూ, ఒక పక్క ప్రత్యక్ష పీడనని అనుభవిస్తూ క్షణమొక యుగంలా దుర్భరంగా గడిపింది.” అని ఒక్క క్షణం ఆగి ఊపిరి తీసుకుని

          “తన్మయి అతి చిన్న వయసులో పది జీవితాల పోరాటాల్ని చెయ్యాల్సి వచ్చింది. ఇక్కడికి రాగానే ఇద్దరు పిల్లలతో కాలేజీ అంత సులభం కాలేదు. పార్ట్ టైం చదువు, పార్ట్ టైం ఉద్యోగం, పిల్లల బాధ్యత, సెలవు దినాలు లేకుండా వారంలో ఏడు రోజులూ కష్టపడడమే. అయినా బొటాబొటిగా కాలేజీ ఫీజుల వరకే సంపాదించగలిగేది. ఎటు చూసినా ఖర్చులే తప్ప ఆదా లేని జీవితం. అయితే నువ్వన్నట్లు “తనది” అనే ఇల్లు భూమికి ఇవతల మూలకి చేరాకే దక్కింది. ప్రభు ప్రేమైక సాంగత్యమూ తోడై ఉన్నంతలో మనశ్శాంతిగా బతకగలిగింది తన్మయి.”

          “అవునూ… అతని తల్లిదండ్రులు కూడా ఏడాదిలోనే ఇక్కడికి రాగలిగేరా?” అంది సమీర.

          లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది ఉదయిని.

          “వాళ్లు రావడం మాట అటుంచు. వచ్చిన అయిదేళ్ల వరకు తన్మయి, ప్రభులకు వెనక్కి వెళ్ళడానికి కూడా సేవింగ్సు లేని కష్టాల్లో గడపవలసి వచ్చింది. అలా ఆర్థిక కష్టాలు రావడం కూడా అందుకు మంచిదే అయ్యింది. ఏదో రకంగా వాళ్ల టిక్కెట్లకు డబ్బులు సర్దిపెట్టి రప్పించేవాడే ప్రభు. కానీ ఉన్న చిన్న సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లో మరొక ఇద్దరు ఆర్నెల్ల పాటు ఉండడానికి సౌకర్యంగా ఉండదని ప్రభు ఆ ఆలోచనని వాయిదా వేసేడు.”

          “మరి వాళ్లు గొడవ పెట్టలేదూ?” అంది సమీర.

          “ఎందుకు పెట్టరు? అయితే పగలు, రాత్రి తేడాల వల్ల క్రమంగా ప్రభు ఆఫీసులో బిజీ అయిపోయి ఫోను తియ్యడం కుదిరేది కాదు. క్రమంగా వాళ్లకు కొడుకు దూరం అవుతున్నాడనే భయం పట్టుకుంది. అందుకే మెల్లమెల్లగా, తెలివిగా తన్మయితో తేనెలొలుకుతున్నట్లు మాట్లాడ్డం మొదలు పెట్టేరు. పైగా ప్రభుకి ఆర్థిక విషయాలు పట్టించుకోవడం కూడా కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాళ్ల ఖర్చులకి తన్మయే పంపుతూ వాళ్ళ బాగోగులన్నీ తనే పట్టించుకునేది. కాబట్టి వాళ్ళ కష్టనష్టాలన్నీ తన్మయికే చెప్పుకోవడం ప్రారంభించేరు. తన్మయి ఇప్పుడు వాళ్ళకొక బంగారుబాతే కాకుండా ఆరాధ్యదేవత అయ్యింది. అదంతా పైపై నాటకమే అని తన్మయికీ తెలిసినా తనని పీడించిన వాళ్లని కూడా గెలవడానికి ప్రేమని సాధనంగా ఎంచుకుందితన్మయి. తనకి ఆనందదాయక జీవితాన్నిచ్చిన ప్రభు సంతోషం కోసం తను, తన పిల్లలు అనే స్వార్థం కూడా లేకుండా బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చసాగింది.” అని ముగించింది ఉదయిని.

          “ఎన్ని అడ్డంకులెదురైనా ఎక్కడా ఆగిపోకుండా లక్ష్యాన్ని చేరుకున్న తన్మయి గాథ గొప్ప స్ఫూర్తిని కలిగించింది ఆంటీ! తన్మయి సమస్యల ముందు నా సమస్య చిన్నదైనా, సమస్యల్ని సంయమనంతో ఎదుర్కోవడం ముఖ్యమనుకుంటా. అన్నిటికన్నా ముందు ధైర్యంగా నా కాళ్లమీద నేను నిలబడడం ఎంత ముఖ్యమో అర్థం అవుతూంది నాకు.” అని ఆగి

          “ఉహూ… సరైనదవునో, కాదో. ఒక విధంగా ఇప్పుడే జీవితం పట్ల సీరియస్ ఆలోచన మొదలయ్యింది నాకు. తన్మయి కథ ద్వారా విడాకుల తర్వాత కలిగే మానసిక క్షోభాలన్నీ అర్థం అయ్యాయి. అసలు విడాకులు తీసుకుని నా బిడ్డకి తండ్రి ప్రేమ లేకుండా ఎందుకు పెంచాలి? అనిపిస్తూంది అంది.

          మళ్లీ తనే “నిజానికి నా అంతట నేనుగా నా బిడ్డని తండ్రికి దూరంగా బాగా పెంచగలిగినా, తండ్రిలాంటి వ్యక్తిని మాత్రం తీసుకురాలేను. అలాగే నేను మళ్లీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఈ బిడ్డని కష్టాల పాలు చెయ్యకుండా ఉండగలనని గేరంటీ కూడా ఇవ్వలేను. అలాగని జీవితమంతా ఒంటరిగా గడిపే ఉద్దేశ్యం నాకు లేదు.” అని

          అద్దాల తలుపుల్లోంచి “సహాయ” అనే అక్షరాలతో అందంగా అమర్చి ఉన్న బయటి లాన్ వైపు చూస్తూ

          “నిజానికి సాయి తన్మయి జీవితంలో ఎదురైన శేఖర్ వంటి దుర్మార్గుడు కాదు. ప్రభులా తల్లిదండ్రుల మాట జవదాటని వాడు. అయితే వాళ్ళు ప్రభు తల్లిదండ్రుల వంటి దారుణమైన మనుషులు కారు. ఏదేమైనా ప్రతి జీవితమూ ఒక పోరాటమే. సాయితో కలిసి ఉంటూనే పోరాటం చేస్తాను…..” దృఢంగా అంటున్న సమీర వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది ఉదయిని.

          కాస్సేపట్లో సమీరని పికప్ చేసుకోవడానికి వచ్చిన సాయి లోపలికి వచ్చేలోగా
సమీర వెనక్కి వచ్చి ఉదయినిని కౌగలించుకుంటూ

          “ఎన్నో ఓటముల మధ్య ధైర్యంగా నిలబడి గెలిచిన తన్మయి గాథ ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న నాలాంటి ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకం ఆంటీ! ఈ ఇతివృత్తంతో కథ రాయకూడదూ మీరు? అన్నట్టు మీ సహాయానికి ఏమివ్వగలను? మీ ప్రాణ స్నేహితురాలైన మా అమ్మ మీకు ఇమ్మని ఇచ్చిన ఇది తప్ప-” అని
పర్సులోనించి

          “..… ప్రియమైన రాజీకి సదా ప్రేమతో- నీ- దయ” అని అందంగా, ముత్యాల్లాంటి అక్షరాల్తో, మొదటిపేజీలో ఎన్నో ఏళ్ల నించి భద్రంగా దాచిన సన్నజాజి పూలమాలతో బాటు రాసి ఉన్న “గీతాంజలి” ని అందించింది.

ఉదయినికి రాజీ ఉరఫ్ వనజ గుర్తుకు వచ్చింది.

“తెలివెన్నెల వేకువ లో తానమాడీ
అడవి దారి మలుపుల్లో అదరి చూసీ
కొండ తిరిగి.. కోన తిరిగి గుసగుసలాడి..
గల గల మువ్వల నవ్వుల నాట్యమాడీ..
తిరనాళ్లకు తరలొచ్చె కన్నెపిల్లలా
మెరుపులతో మెరిసిందీ వానకారూ
నీలిమొయిలు వాలుజడకు చినుకే చేమంతీ
కట్టుకున్న పచ్చదనం పట్టుపరికిణీ…”

          ఆన్ లైన్ మ్యూజిక్ ఛానెల్ లోంచి శ్రీరంగం గోపాల రత్నం గారి గొంతు లోంచి మంద్రంగా, అలల్లా కదిలివస్తూంది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాట.

కథకు తొలి వాక్యం స్ఫురించింది.

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.