
నా జీవన యానంలో- రెండవభాగం- 55
-కె.వరలక్ష్మి
2011 ఆగష్టు 6 నుంచీ 8 వరకూ సాహిత్య అకాడమీ సభలు బొమ్మూరు తెలుగు యూనివర్సిటీలో జరిగాయి. మా ఊళ్లో ఉదయం 8 కి బస్సెక్కి డైరెక్ట్ గా యూనివర్సిటీకి చేరుకున్నాను. ముందు రోజే వచ్చి రాజమండ్రి సూర్యాహోటల్లో ఉన్న అంపశయ్య నవీన్, ఆయన భార్య అనసూయ, అబ్బూరి ఛాయాదేవి, కె.బి.లక్ష్మి, శలాక రఘునాథ శర్మగార్లు సభప్రారంభ సమయానికి వచ్చారు. పుట్ల హేమలత, కోడూరి శ్రీరామమూర్తి గారు ముందే వచ్చి ఉన్నారు. సాహిత్య అకాడమీ సహాయ సంపాదకురాలు మీనలోచని నిజంగా మీనలోచనే. ఆ ప్రత్యేకమైన అందం, స్వరూపం, అడ్మినిష్ట్రేషన్, ఆచీరకట్టు, దేహసౌందర్యం, చిన్ని ముక్కుపుడక మెరుపు ఒక పవిత్రభావాన్ని కలగ జేస్తూ నన్ను చూపు తిప్పుకోనివ్వలేదు. ప్రతిమ ట్రెయిన్ దిగి కొంత ఆలస్యంగా వచ్చింది నాయుడుపేట నుంచి. మధ్యాహ్నం యూనివర్సిటీ కేంటీన్లో భోజనం ఏమీ బాగాలేదు. సి.ఆనందారామం గారు రాక సాయంత్రం కథా సంధ్య కార్యక్రమం జరగ లేదు. ఛాయాదేవి గారి కోరికమేరకు వీరేశలింగం హైస్కూలు, గోదావరి వొడ్డున వేణుగోపాల స్వామి ఆలయం, ఆ వీధిలో చిన్నప్పుడు ఆవిడ నివసించిన ఇల్లు చూసాం. రాత్రికి నాకు సూర్యాహోటల్లోనే ప్రత్యేకంగా ఒక ఏ.సి. డబుల్ రూం ఇచ్చారు. నెం. 108. హాయిగా నిద్రించాను. 7వ తేదీ ఉదయం తొమ్మిదికి మేమున్న హోటల్ కి సమీపంలో ఉన్న దామెర్ల ఆర్ట గేలరీకి వెళ్లొచ్చి, అకాడమీ అరేంజ్ చేసిన కారులో యూనివర్సిటీకి వెళ్లేం, ఆ రోజు ‘అస్మిత’పేరుతో కథల సెషన్. నేను ‘ఊరు‘కథ చదివేను. కార్యక్రమం ముగిసి బైటికొచ్చాక, విద్యార్తులు చాలా మంది నా చుట్టూ మూగి నా కథలోని విషయాల మీద చక్కని డిస్కషన్స్ చేసారు. మధ్యాహ్నం తిరిగొచ్చి హోటల్లో భోజనాలు చేసి, అదే కారులో వెళ్లి కడియం పూల తోటలు, ధవళేశ్వరం బేరేజ్, కాటన్ మ్యూజియం చూసి తిరిగి వచ్చాం, రూమ్స్ కి వస్తున్నప్పుడు ఛాయాదేవి గారు పైట కొంగు అంత పెద్దగా వేసుకోవద్దని సలహా ఇచ్చారు. ‘‘సరేనండి‘‘ అన్నాను. రూమ్ లోకి వెళ్లబోతూండగా కె.బి.లక్ష్మి నా భుజం మీద చెయ్యివేసి ‘‘నువ్వు నాకు ఎంతగానో నచ్చావు వరలక్ష్మీ‘‘ అన్నారు అభినందన పూర్వకంగా. ఎందుకో అర్థం కాకపోయినా ఒక నవ్వు నవ్వేసి థేంక్స్ చెప్పేను.
ఆ మర్నాడు ఉదయం ప్రతిమ స్టాలిన్ గారింటికి రామచంద్రపురం వెళ్దామంది. సభకు డుమ్మాకొట్టి అటు వెళ్లేం బస్సులో. అక్కడి కెళ్లే వరకూ స్టాలిన్ గారూ, భార్య, కొడుకు, కోడలు డాక్టర్లని తెలీదు నాకు. ఆయన్ని ఏవైనా సభల్లో, ముఖ్యంగా ఆవంత్స సోమసుందర్ గారి పుట్టినరోజు సభల్లో కలవడమే. వాళ్లు ముగ్గురూ హాస్పిటల్ కి వెళ్లి పోయారు, మమ్మల్ని చూసి పాపం స్టాలిన్ గారు అవతల రద్దీగా ఉన్న పేషెంట్స్ ని వదిలేసి వచ్చారు. అన్యమనస్కంగా ఉన్నారని తెలిసిపోతోంది. ప్రతిమ సాహిత్యం గురించీ, పుస్తకాల గురించీ ఆత్మీయంగా కబుర్లు చెప్తోంది. ఓ గంట గడిచేక అర్థమైంది అలవికాని వేళలో వెళ్లేమని. నేనే ఆ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక వెళ్తామని లేచేను. డ్రైవర్నిచ్చి కారులో పంపించారు. 10కి వెళ్లిన వాళ్లం 12కి తిరిగొచ్చాం. సాయంకాలం మళ్లీ యూనివర్సిటీలో యు.ఏ. నరసింహమూర్తి గారి ఉపన్యాసం, ఎవర్నీ ఆకట్టుకోలేక పోయింది. నిర్వాహకులు శ్రద్ధవహించక సభకి బైటి జనాలు ఎవరూ రాలేదు. అసలే బొమ్మూరు యూనివర్సిటీ రాజమండ్రికి అవుట్ స్కర్ట్స్ లో ఉంటుంది, అకాడమీ వాళ్లు తెచ్చిన పుస్తకాల కొనుబడి జరగలేదని మీనలోచని కొంత చిన్నబోయారు. అందరం హోటలు కొచ్చి వీడ్కోళ్లు చెప్పుకొన్నాం. రాజమండ్రి నుంచి మా ఊరికి గంట ప్రయాణం. రాత్రి 9 కి ఇంట్లో ఉన్నాను.
సీనియర్ హిందీ నటుడు షమ్మీకపూర్ ఆ ఆగష్టు 14 న కాలం చేసాడు.
అనంతపురం నుంచి శాంతి నారాయణగారు విమలాశాంతి పురస్కారాల ఫైనల్ సెలక్షన్ కోసం 16 కథల సంపుటాలు పంపించారు. ముగ్గురు జడ్జెస్ లో నేనూ ఒకదాన్ని. ఆ సంవత్సరం కాట్రగడ్డ దయానంద్ ‘గుండ్లకమ్మతీరాన’ సెలక్టైంది. ఆ సెప్టెంబర్ 30న గొప్ప రచయిత, పిలాసఫర్, అధ్యయనశీలి శ్రీ నండూరి రామమోహన రావు కాలం చేసారు.
తిరుపతి సభల్లో కలిసి తర్వాతి రోజుల్లో ఫ్రెండై నన్ను అమితంగా అభిమానిం చిన మదనపల్లికి చెందిన పుష్పాంజలి నేను అడిగేనని ఆర్. వసుంధరా దేవి గారి కథల పుస్తకం పంపించారు. చదవడం మొదలుపెడితే ఆపలేనంత గొప్పకథలు. రచనా విధానం గాని, తీసుకన్న కథా వస్తువుగాని నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. ‘అరె, ఇన్నాళ్లూ ఈ కథల్ని ఎలా మిస్సయ్యానబ్బా’ అన్పించింది. కథలన్నీ చదివి ఆ కథలపైన ఒక వ్యాసం రాసేను. దాన్ని పుష్పాంజలికి పంపితే, పుష్పాంజలి ఆవ్యాసాన్ని అమెరికా నుంచి వచ్చి మదనపల్లిలో ఉన్న వసుంధరాదేవి గారికి చూపించిందట. ఆవిడ సంతృప్తి చెందారట. తనతో నాలుగు రోజులు ఉండేలా మదనపల్లి రమ్మనీ, వసుంధరాదేవిగార్ని, తమ ఊరి పరిసరాల్ని చూపిస్తాననీ పుష్పాంజలి మరీమరీ అన్నది, నేనే నాకున్న ప్రయాణాల భయం వల్ల వెళ్లలేకపోయాను. తర్వాతి రోజులో ఏం జరుగుతుందో మనం ఊహించలేం కదా!
ఆ సెప్టెంబరు 6,7 తారీఖుల్లో రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ వారి సెమినార్స్ కి రమ్మని పిలిచారు, అప్పటికింకా యూనివర్సిటీ బిల్డింగ్స్ కట్టలేదు, ఆనెం వెంకటప్పారావు రోడ్డులో అద్దె ఇంట్లో నడుస్తోంది. కోటిపల్లి బస్టాండు ఎదురుగా ఉన్న ఫ్రీడం పార్కు హాలులో సభ. అ ఉదయం నేను బేగ్ తో డైరెక్ట్ గా సభా ప్రాంగణా నికి వెళ్లేను. అరిపిరాల నారాయణరావు గారు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. వీళ్లు పిలవ లేదో వాళ్లు రాలేదో కాని ప్రముఖ రచయితలెవరూ రాలేదు. నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్స్, పిల్లలు వచ్చారు. మా గీతకు ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్, డాక్టరేట్ కి గైడ్ పర్వతేని సుబ్బారావు గారు వచ్చారు. ఆ రోజు మొదటి పేపరు నేనే విన్పించాల్సి వచ్చింది.
ఆ సభలకి బైటి నుంచి వచ్చినదాన్ని నేనొక్కదాన్నే. ఆ నెల వెంకటప్పారావు రోడ్ లో ఉన్ననన్నయ్య యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో రూం ఇచ్చారు. అది ఒక ఇంట్లో త్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్. నేను తప్ప ఎవరూ లేరు. ఎదుట ఉన్న విజయ అమృత హొటల్లో టిఫిన్ తిని వచ్చి నిద్రపోయాను. మర్నాడు బేగ్ తీసుకుని సభాప్రాంగణానికి వెళ్లేను. ఆ రోజు సుబ్బారావు గారి మిసెస్ కూడా వచ్చారు. సాయంకాలం వరకూ ఉపన్యాసాల మధ్య గడిపి రాత్రి 7 కి ఇంటికి చేరుకున్నాను.
నేను అమితంగా ఇష్టపడే గజల్ గాయకుడు జగ్ జీత్ సింగ్ 2011 అక్టోబర్ 10న ముంబైలో కాలంచేసాడు. మనసు బాధతో నిండిపోయింది. సీనియర్ హిందీ నటుడు దేవానంద్ ఆ డిసెంబర్ 4న కాలం చేసాడు.
పుట్ల హేమలత ఎప్పటినుంచో తన విహంగ వెబ్ మేగజైన్ కోసం సీరియల్ ఏదైనా రాయమని అడుగుతోంది, నా బాల్యంతో మొదలు పెట్టి ఆత్మకథలాగా కొన్ని పేజీలు రాసి పంపేను. ఆ డిశంబర్ 17 న ఫోన్ చేసి “చాలా బావుంది. పేరు ఏం పెడదాం“ అంది. నా జీవనయానంలో అని నిర్ణయించేం. కొంతముందు మాటలాగా ఏదైనా రాసి పంపమంది, పంపేను.
“జీవితం అంతసులువైంది కాదు. దాన్ని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. జీవించడం ఒక్కటేకాదు, ఆ జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా జీవించడం ఒక సాహసం“.
ఆ సంవత్సరం :
2011 జనవరి 16-31 ముంబైవన్ మంత్లీలో -బామ్మకబుర్లు
2011 అక్టోబర్ కౌముది వెబ్ మేగజైన్ లో – ప్రహేళిక కథ
2011 అక్టోబర్ చినుకు మంత్లీలో – నాన్న కథ
2011 నవంబర్ – డిసెంబర్ సాహితీ స్రవంతిలో – అన్వేషణ కథ
2011 నవంబర్ విహంగ వెబ్ మేగజైన్ లో కొంతమంది కుర్రవాళ్లు స్కెచ్ వచ్చాయి.
అప్పట్లోనే ఒక పత్రికలో ఒక రచయిత్రి ఏదో పూలపందిరి పేరుతో కాలం రాస్తూండేది. ఒకసారి ఆవిడ తనకాలంలో రైలు ప్రయాణంలో తన ఎదుట కూర్చున్న స్త్రీ వేషభాషల గురించీ, మరోసారి ఒక లావుపాటి డాక్టరమ్మ గురించీ ఎగతాళిగా రాసింది. దానికి పాఠకులెవరో రియాక్టై రాసిన ఉత్తరం కట్ చేసి నా డైరీలో దాచాను. ఎందుకంటే రచయితగా అలాంటి పొరపాట్లు నేను ఎప్పుడూ చెయ్యకూడదని. ఆ ఉత్తరం ఇలా ఉంది:
“మీ పత్రికలో కాలం రాస్తున్న రచయిత్రికి ఎంత అగ్రకుల అహంకారం! రైలు ప్రయాణంలో ఎదుట కూర్చున్న స్త్రీభాష గురించి ఎంత అవమానకరరంగా రాసిందీ! ఈమెకు బ్రాహ్మణ భాషలాగే ఆమెకు అది తనభాష. ఎంత బాగా వేషం వేసింది, తీరా పొట్ట చింపితే ఇలా వొలికింది అని షాకైందట రచయిత్రి. మరోసారి ఆమె కేసి చూడబుద్ధి కాలేదట. ఈవిడ చూడకపోతే ఆమెకేం నష్టం? మరోసారి డాక్టరు రూంబైట వృద్ధురాలు పడిపోతే ఆ నల్లని, లావు డాక్టరమ్మ లేచి వచ్చి లేవదీసిందట, అంతేగాని పక్కనే కూర్చున్న మన రచయిత్రి చూస్తూ కూచున్నట్టుంది. ఇప్పుడిక ఆ డాక్టరమ్మ అందాన్ని చూడ్డానికే లోపలికి వెళ్తోందట. అందరూ వీరికి అందంగా కన్పించాలి. వీరు మాత్రం ఎవరికీ ఏ సాయమూ చెయ్యకుండానే సాహిత్యపీఠాలు నడుపుకొంటుంటారు. ఇంట్లో పనివాళ్లని అది, వాడు అనేవాళ్లు ఇంతకన్నా మంచిగా ఎలా రాయగలరులే! ఎప్పట్లాగే పూలగురించీ, పక్షుల గురించీ రాసుకుంటూ గొప్ప సాహిత్యసేవ చేస్తున్నా మని మురిసిపోండి. మనుషుల జోలికి పోకండి రచయిత్రిగారూ“
2012 జనవరి 2న కాత్యాయనీ విద్మహే ఫోన్ చేసి ఆ నెల 27, 28, 29 తేదీలలో జరగబోయే కాకతీయ యూనివర్సిటీ సెమినార్ లో “గీతాంజలి – ముస్లిం కథలు“ మీద పత్ర సమర్పణ చెయ్యడానికి రమ్మని పిలిచారు, సంక్రాంతికి హైదరాబాద్ రమ్మని మా రవి పిలిచాడు. ఎలాగూ పై కార్యక్రమం ఉంది కదా అని నేను వెళ్లేను, జనవరి 27న శాతవాహన ఎక్స్ ప్రెస్ లో వెళ్లి కాకతీయ 2 గేట్ ఎదుగా ఉన్న కాత్యాయనీ విద్మహే ఇంటికి చేరుకున్నాను. 27 ఉదయానికి “ప్రరవే“ సభ్యులు మల్లీశ్వరి, కొండేపూడి, ఘంటశాల నిర్మలలు, పుట్ల హేమలత మొదలైన వాళ్లంతా వచ్చేసారు. 28 మధ్యాహ్నం సెషన్ లో నా పేపర్ సబ్మిట్ చేసాను. ఆ రోజు సాయంకాలం సెషన్స్ ముగిసేక (ప్ర.ర.వే) ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సమావేశం జరిగింది. కొందరు ఎందుకో సమావేశాల్లో కూడా సవ్యంగా మాట్లాడరు. అవుననీ, కాదనీ కప్పల తక్కెడ చేసి పడేస్తారు. ఇంకొందరు సభకు సంబంధం లేని వ్యంగ్యాలు వొలకబోస్తారు.
29వ తేదీ సెమినార్ కి చివరిరోజు, యూనివర్సిటీకి కాత్యాయని నన్ను తన స్కూటర్ మీద తీసుకెళ్లేరు. మధ్యాహ్నం భోజనాల తర్వాత చాలా మంది వెళ్లి పోయారు. సాయంకాలం ముగింపు సమావేశంలో ఆశాజ్యోతి, కాత్యాయని బాగా మాట్లాడేరు. రాత్రి ఇంటికొచ్చేక కాత్యాయని వేపుడు బియ్యం అన్నం, చిక్కుడు కాయ వేపుడు చేసారు. కాత్యాయని గారి సహచరుడు మంచి స్నేహశీలి. ముగ్గురం కబుర్లు చెప్పుకొంటూ డిన్నర్ ముగించాం. వాళ్లమ్మాయి పెళ్లి ఆల్బమ్ చూసాం. ఇంకెవరి డిస్టర్బెన్స్ లేక రాత్రికి హాయిగా నిద్ర పట్టేసింది. ఉదయం 10.15 కి మర్నాడు కాత్యాయని గారి డ్రైవరు ఖాజీపేట స్టేషన్లో నన్ను కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కించాడు, అంపశయ్యనవీన్ గారు ఇచ్చిన ఆయన సావనీర్ చదువుతూ, ఊళ్లు చూస్తూ పగలు ప్రయాణం బాగా జరిగింది. సాయంత్రం 6కి సామర్లకోటలో దిగి టాక్సీలో ఇంటికి చేరు కున్నాను. మళ్లీ ఒంటరి జీవితం… ఎందుకో విషాదభరితంగా అన్పిస్తూ… ఎక్కడికైనా పారిపోవాలనీ… నేనున్నాననే ఒకతోడు కావాలనీ…. రకరకాలుగా అన్పించసాగింది. ఒకోసారి పెద్ద విషయాలలాగే చిన్న విషయాలు కూడా డిస్టర్బెన్స్ నీ కలిగిస్తాయి. ఆనందాన్నీ కలిగిస్తాయి. అంతా మన మనసు చేసే గారడీ. ‘ఏదీ నీది కాదు. ఏదీ నీ వెంటరాదు. దేనికీ దిగులు పడకు. శాంతిగా ఉండు. అంటూ వేదాంతాన్ని ఆశ్రయిం చడమే. మన జీవితాన్ని మనమే స్క్రీన్ మీద దృశ్యాన్ని చూసినట్టు దూరంగా నిలబడి చూసుకోగలిగితే ఏ సంఘటనలూ మనల్ని బాధించవు. ఎదుటి వాళ్ల అల్పత్వాన్ని అర్థం చేసుకోగల్గుతాం.
2012 జూన్ 6 న ఉదయం 5.20 నుంచి 10.40 వరకూ భూమికి సూర్యునికి మధ్యగా శుక్రగ్రహం ప్రయాణించింది. అది మళ్లీ 117 సంవత్సరాలకు సంభవిస్తుందట.
ఆ జూలై 17న ఒకప్పటి హిందీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ముంబైలో కాలం చేసాడు. వయసు మీద పడి మనల్ని మనంగా ఉండనీయదు. మన మీద మనకే జాలి, ఓ విధమైన నిర్లిప్తత ఆవహిస్తుంది. రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ పదవీ కాలం పూర్తై 14వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎంపికయ్యారు. 2012 జూలై 27 నుంచి లండన్ లో 30వ ఓలింపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి.
ఆగష్టు 17 నుంచి 20 వరకు గురజాడ శతవత్సరోత్సవాలు సాహిత్య అకాడమీ తరఫున కాకినాడ రోటరీ హాల్ లోను, చివరి రోజు సూర్యకళామందిర్ లోనూ జరిగాయి. అకాడమీ ఆహ్వానం మీద నేనూ అటెండయ్యాను. ఇంచుమించు రాష్ట్రంలోని రచయితలు, రచయిత్రులు అంతా అటెండయ్యారు. అందరూ నన్ను ఆప్యాయంగా పలకరించేరు. దగ్గరే కాబట్టి నేను రోజూ బస్సులో ఉదయం వెళ్లి సాయంకాలం ఇంటికి వచ్చేస్తూ వచ్చాను. ఆ సభల వల్ల సీనియర్ అండ్ జూనియర్ రచయితలందర్నీ కలిసే అవకాశం కలిగింది.
సోవియట్ యూనియన్ కు చెందిన యూరీగగారిన్ మొట్టమొదటి వ్యోమగామి. తర్వాత 1969 జూలై 20న మొదటి సారిగా చంద్రుడి మీద అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తన 83వ ఏట 2012 ఆగష్టు 26న కాలంచేసాడు. ఎన్నెన్ని సాధించిన వారికైనా ఈ లోకాన్ని విడిచి నిష్క్రమించకతప్పదు.
2013 సంక్రాంతి ముందు మా చిన్నతమ్ముడి రెండోకొడుకు పెళ్లి జరిగింది. దానికి వచ్చి సంక్రాంతికి మా రవి ఇంట్లో ఉండిపోయాను. మా చిన్న మనవరాలు సవర్ణిక మా రవి తీసిన శీనుగాడు మూవీలో శీనుగాడి చెల్లెలుగా త్రూ అవుట్ కేరెక్టర్ చేసింది. ఆరేళ్ల వయసులోనే ఉత్తమ బాలనటి అవార్డు అందుకుంది. పెద్దమనవలు ముగ్గురూ పదోతరగతి ఫస్ట్ మార్కుల్తో పాసై ఆ ఆనందాన్ని నాతో పంచుకున్నారు.
పెళ్లికొచ్చిన చుట్టాలు – మా పెద్ద చెల్లితో సహా కొందర్ని మా రవి బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికీ, ఎగ్జిబిషన్ కీ తీసుకెళ్లేడు, మరో రోజు నర్సపూర్ దాటి మంగళంపర్తిలో ఉన్న గోశాల చూసివచ్చాం. గోశాల వాళ్లు మాకొక పెద్ద సీసా నిండా ఆవుపాలు ఇచ్చారు. ఇంకోరోజు మా రవి సి.ఈ.ఓ. గా కట్టిస్తున్న దిండిగల్ లోని మేంగో రిసార్ట్ కి వెళ్లం, ఒకరోజు బేక్ పెయిన్ ఎక్కువగా ఉందంటే ప్రగతినగర్ లోని చిన్న క్లినక్ లైఫ్ మెడిక్యూర్ కి పంపించేడు రవి. ఆ హోమియో డాక్టరు సి.హెచ్. శ్రీనివాసరెడ్డి చక్కగా నవ్వుతూ ఒక కౌన్సిలింగ్ లాగా పోజిటివ్ థింకింగ్ గురించి చెప్పేడు. అంతకు ముందే నాకు జరిగిన అనుభవాల గురించి అడిగి తెలుసుకుని “సపోజ్, మనం పట్టుకో మని పాపాయికిచ్చిన వాటర్ బోటిల్ ని కిందపెట్టి ఎవరైనా ఫుట్ బాల్ తన్నినట్టు తన్నినా, మనం ఏ మిరియాలపొడి పేకెట్టో తీసుకుందామంటే చులకనగా కసిరి పడేసినా, ఎంత సీరియస్ మేటర్ కైనా ఫీల్ కావద్దు. అలా ప్రవర్తించిన వాళ్లని చూసి వీళ్ల నైజమిది, ఎంత మూర్ఖులు అని జాలి పడాలి. రకరకాల మూర్ఖులు ఈ లోకంలో. అందరితో హేపీగా ఉండి, మనదగ్గర ఎప్పుడూ ఏడుపు మొహంతో ఉండేవాళ్లు కొందరు. వాళ్లకి మనం దగ్గరుండడం నచ్చదు. ఏదో అసూయతో రగిలిపోతూ ఉంటారు. వీళ్లందరి బాల్యచేష్ఠల్ని చూసి నవ్వుకోవాలి, మనమున్న అగ్రస్థానం నుంచి వాళ్లున్న లోతును జాలిగా చూడాలి. ఒంటరిగా జీవించగల్గడంలోని ప్రశాంతతను ఆస్వాదించగలిగితే అదే అదృష్టం“ అంటూ.
అప్పటికి నాకు ఒక ప్రశాంతత చేకూరినట్టైంది.
*****

కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.