దుర్దశ దృశ్యాలు
-ఎరుకలపూడి గోపీనాథరావు
వ్యాపార వాతావరణ కాలుష్యం
దట్టంగా వ్యాపించిన
బజారు వంటి సమాజంలో
బహు విధాల వస్తువులుగా మార్పిడి చెందుతూ
త్రోసుకుంటూ, రాసుకుంటూ సర్వత్రా
మానవాకృతుల మాదిరి
దివారాత్రులూ దిర దిరా సంచరించే ఆకారాలు
మర తోలు బొమ్మల ఆకృతులే!
అచ్చమైన మానవుని దర్శన భాగ్యం
అందడం అతి కష్టమిక్కడ!
సంబంధాలన్నీ
ఆర్ధిక ప్రయోజనాల అయస్కాంతాల నంటి ఉండే
కఠిన ధాతు శకలాలైన దైన్యం
అంతటా విస్పష్టమిక్కడ!
ఇక్కడి ప్రతి కూడలి
ధనం లావాదేవీల మండలి!
ఎదుటి మనిషి బలహీనతలతో
ఏపుగా బలిసి బులిసే
అవగుణాల భారీ అక్టోపస్
దర్జాగా సంచరిస్తున్న దాఖలాలే దారి నిండా!
సహజ స్వభావాన్ని త్యజించిన సాగరం
తీరాలను కర్కశంగా కబళించినట్లు
మానవత్వాన్ని మంట గలిపిన
స్వార్థ చింతన డ్రాగన్
ధారాళంగా చేస్తున్న దారుణాలే దారి నిండా!
కృష్ణ బిల బల జాలానికి పట్టుబడి
కాంతి వలయం కనుమరుగయినట్లు
పాతక బుద్ది శక్తి పాశానికి చిక్కి
మానవాత్మ మాయమైపోగా
దేవుడు లేని దేవళాల్లా
దేహాలు ఖాళీగా చరిస్తున్న
దారిద్య్రములే దారి నిండా!
*****