
నా అంతరంగ తరంగాలు-33
-మన్నెం శారద
నేను సైతం… (నా చిన్ని చిన్ని జ్ఞాపకాలు!)
ఈ రోజు ఆయన బర్తడే పురస్కరించుకుని ఎన్టీఆర్ గురించి అందరూ ఆయన్ని స్మరిస్తూ రాస్తున్నారు.
అన్నీ చదువుతున్నాను… మనసు ఎందుకో వికలంగా వుంది.
ఎన్నో స్మృతులు మనసులో గిరగిరా తిరిగాయి.
అసలా అందం, రాజసం ఏ నటుడుకయినా ఉందా…???
రాముడయినా, కృష్ణుడయినా, రారాజైన, రావాణాసురుడయినా
రాయలయినా, గిరీశమైనా… ఆయనే!
నాకయితే కృష్ణ దేవరాయలుగా… గిరీశంగా ఆయన రూపం, నటన చాలా చాలా ఇష్టం.
చెన్నై లో వున్నప్పుడు నేను చాలా మంది నటీ నటుల్ని చూసాను కాని ఎన్టీఆర్ ని చూడటం కుదరలేదు.
ఆఁ రోజు సాయంత్రం గోపాలకృష్ణ అనే కాంట్రాక్టర్ హడావుడిగా నా సీట్ దగ్గరకొచ్చి “మేడం ఇక్కడ పంజాగుట్ట మీద ఎన్టీఆర్ తో షూటింగ్ వుంది, ఆయన్ను చూపిస్తాను రండి.” అన్నాడు.
అంతకు ముందు రోజే ఆయన టెండర్ నా సీట్ నుండి accept అయ్యింది. ఆయన ప్రొడక్షన్ లో భాగస్వామీ అట!
పంజగుట్ట మా ఆఫీస్ కు దగ్గరే!
అయినా నేనంత ఉత్సాహం చూపించలేదు.
కారణం అప్పటికే ఆయన రూపు రేఖలు మారిపోయాయి.
బెల్ బాటమ్స్, పెద్ద పెద్ద విగ్గులు.. వద్దులెండి అన్నాను.
కానీ నా పక్కనే వున్న నా కొలీగ్ ‘ వెళ్దాం వెళ్దాం’ అని ఒకటే గొడవ చేసింది.
సరే… అని వెళ్ళాం.
పంజగుట్ట రాళ్ళ మీద ఒక బిల్డింగ్ వుంది.
అక్కడ నుండి ఒక సన్ సెట్ దృశ్యం షూట్ చేశారు.
మేమూ, ఆయన ఒక్కసారే ఎంటరయ్యేమ్.
ముందు ఆయన, వెనుక మేం.
కొద్దిగా ఆయన తలతిప్పి మమ్మల్ని గమనిస్తున్నారు.
విరామంలో ఆయన ముందు కూర్చున్నారు.
మేం సరిగ్గా ఆయన వెనకాల కూర్చున్నాం.
పలకరించే ధైర్యం లేదు మాకు.
మంజుల హీరోయిన్ అని గుర్తు!
మొత్తానికి చూసి పలకరించకుండానే వచ్చేసాం.
తర్వాత ఒక విప్లవాన్ని సృష్టిస్తూ ఆయన సియం అయ్యారు.
కొన్ని విప్లవత్మాకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
కిలో రెండురూపాయాలకు బియ్యం, ఆడ పిల్లలకు ఆస్తి హక్కు, 30%ఉద్యోగాలలో ఆడవారికీ రిజర్వేషన్… సారా నిషేధం.. అలా! (7.30 కి ఆఫీసులు పెట్టడమే మాకు నచ్చనిది. త్వరలోనే ఫెయిల్ కూడా అయ్యింది.)
1984 లో నాకు ఆళ్ళ గడ్డలో సన్మానం జరిగింది. గాంధేయ వాది అయిన ఆఁస్కూల్ హెడ్మాస్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు సన్మానకర్త! ఆఁ సన్మానానికి ఆనాటి ఆళ్ళ గడ్డ ఎమ్మెల్యే SV సుబ్బారెడ్డి గారు అధ్యక్షత వహించారు. మేము కారాలు తినలేకపోతుంటే ఆయనే మాకు ఇంటినుండి భోజనం , అహోబిలం చూడటానికి వెహికల్ ఇచ్చారు.
ఆ తర్వాత మాస్టారు ఆయన శ్రీమతికి ఆరోగ్యం బాగోక ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వున్నారు.
మా ఇంటి ఓనర్ నీళ్లు ఇవ్వకుండా బంద్ చేసి బాధిస్తుంటే …మాటల సందర్బంలో నేను ఎర్రమాంజిల్ కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్స్ కోసం ప్రయత్తిస్తున్న సంగతి చెప్పాను.
ఆఁ పవర్స్ సీఎంకే ఉంటాయని తెలుసుకుని మాస్టారు SV సుబ్బారెడ్డి గారికి చెప్పి నా రిక్వెస్ట్ అప్లికేషన్ ఆయన చేతికిచ్చారు.
SV అంటే ఆఁ రోజుల్లో ఎన్టీఆర్ కి చాలా గౌరవం. “మీరు కళాకారులు, ఆమె రచయిత్రి. ఆమెకు హెల్త్ ప్రాబ్లెమ్ వుంది. ఆఫీస్ పక్కనే వుండాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు “అని చెప్పగానే ఆయన వెంటనే ఏమీ ఆలోచించకుండా అలాట్ చేసేసారు. అ విషయం ఆనాటి GAD ( General Administration )సెక్రటరీ బ్రహ్మ గారికి కోపం కూడా తెప్పించింది. ఫైల్ తన నుండి సీఎం కి వెళ్ళాలిసింది పైనుండి ఆర్దర్స్ పడి తన దగ్గరకు వచ్చిందని.
థాంక్స్ చెప్పడానికి CM ఛాంబార్ కి వెళ్లాను. గంభీరమైన విగ్రహం చూసి భయం వేసి వణుకుతూ థాంక్స్ చెప్పాను.
ఆయన తన స్టయిల్ లో నవ్వి ” సంతోషమే కదా… ఇక హాయిగా పని చేసుకోండి!” అన్నారు. నేను తల ఊపి బయట పడి ఊపిరి పీల్చుకున్నాను.
ఆఁ రోజు చాలా దుర్దినం. బేగంపేట్ లోని దర్శకుడు బీరం మస్తాన్ రావు గారింటినుండి వస్తున్నాను, ఆయన శ్రీమతి లక్ష్మి గారు కూడా నటే. ఆయన అప్పట్లో జెమిని టీవీ లో సీరియల్స్ కి కథలు సెలెక్ట్ చేసే విభాగంలో పని చేస్తున్నారు. ఏదో కథ కోసం పిలిపిస్తే వెళ్లి వస్తున్నాను.
“అమ్మా, అడిగో… ఎన్టీఆర్ ” అని అరిచాడు ఆటో డ్రైవర్.
నేను ఉలిక్కి పడి చూసి “ఎక్కడా? ” అనడిగాను.
“అదేం అమ్మా. చైతన్య రధం మీద వస్తుంటే… ” అన్నాడు.
అప్పుడు చూసాను.
రోడ్డు నిర్మానుష్యంగా వుంది. బాగా ఎండగాకూడా వుంది. ఒంటరిగా పక్కనే లక్ష్మి పార్వతితో. ఆయన మొహం ఎర్రగా చెక్కిన కందగడ్డలా వుంది. ఇంకెవ్వరూ ఆయన కూడా లేరు… ఇంటికి వచ్చాక జరిగిన విషయం టీవీ చూపించింది. తర్వాత సంగతులు మనకు తెలిసినవే ” అటువంటి అందగాడు, నటుడు, ప్రజాభిమానం వెల్లువలా సంపాదించినవాడు, భోళా శంకరుడు మరి వుండరు.
ఒకే ఒక్కడు ఆయన. ఇంకెవరినీ ఆయనతో పోల్చలేము. ఇది నా అభిప్రాయం .
*****
(సశేషం)

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
