
నా అంతరంగ తరంగాలు-34
-మన్నెం శారద
నా జీవితంలో కొన్ని అపూర్వ సంఘటనలు!
1984లో అనుకుంటాను. నేను రాసిన “చిగురాకు రెపరెపలు ” నవల ( నా బాల్యం మీద రాసింది కాదు. వనితాజ్యోతి స్త్రీ ల మాసపత్రికలో అదే పేరు తో రాసిన మరో నవల ) బుక్ ఆవిష్కరణ సభ కోటిలోని శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయంలో జరిగింది. పోతుకూచి సాంబ శివరావు గారి ఆధ్వర్యంలో దాశరధి రంగాచార్యులవారు అధ్యక్షత వహించారు.
శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారు, శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారు వక్తలుగా విచ్చేసారు.
ఆ నవలలోని ఒకానొక సందర్భంలో తప్పు దారిన నడచిన కథానాయిక, ఆమెకోసం ఆస్తిపాస్తులన్నీ వదలుకొని పెళ్లి చేసుకున్న భర్తని మోసగించి చివరకు పశ్చాత్తాపంతో అతని కాళ్ల మీద పడిన సంఘటన మల్లాది సుబ్బమ్మ గారికి ఏ మాత్రం నచ్చలేదు.
ఆమె అగ్గిమీద గుగ్గిలమైపోయి ” ఒకమగవాడి కాళ్ళమీద స్త్రీని పడేసి స్త్రీజాతిని కించపరుస్తావా? “అని చెలరేగి దుమ్మేత్తిపోశారు.
ఆమె ఆవేశం చూసి నేను నిజంగా బెదరి పోయాను.
అప్పుడే కొత్తకొత్తగా రాస్తున్న రచయిత్రిని కదా!
అప్పుడు రంగాచార్యులవారు తాను అధ్యక్షోపన్యాసంలో మాట్లాడుతూ “అమ్మా మల్లాది సుబ్బమ్మగారూ, ఈ నవల నేను పూర్తిగా చదివాను. కొత్తగా రాస్తున్నా శారదగారు బాగా రాస్తున్నారు. ఇందులో మీరు చూడవలసింది ఒక చెడు మంచికి తలవంచిందని కాని స్త్రీ పురుషుడికి తలవంచిందని కాదు.” అంటూ నచ్చచెప్పాక సుబ్బమ్మ గారు శాంతించారు.
తర్వాత ఆమె నాదగ్గర కొచ్చి నవ్వుతూ పలకరించి “నా గొంతు అంతే… బెదరిపోయావా? ” అని పలకరించారు. అలా ఆ సభ ముగిసింది.
ఈ రోజు రంగాచార్యులవారి జయంతి సందర్బంగా ఆ సంఘటన జ్ఞప్తికి వచ్చింది. వారికి నా హృదయ పూర్వక నమస్సులు
*****
(సశేషం)

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
