వాలుతున్న ఎండ

उतरती धूप

హిందీ మూలం – – డా. రమాకాంత శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

సెలవురోజు. విపరీతమైన చలిగా ఉంది. చేతులు-కాళ్ళు చైతన్యరహితం అయిపోతున్నాయి. భోజనం చేసిన తరువాత అయితే ఒంట్లో చలి ఇంకా ఎక్కువ బాధ పెట్టసాగింది. వేడినీళ్ళతో చేతులు కడుక్కున్న తరువాత కొన్ని క్షణాలకి ఆమెకి ఊరట అనిపించింది. కాని మళ్ళీ వేళ్ళు కొంకరపోసాగాయి. ఆమె తొందరగానే పని ముగించుకుంది. శాలువ కప్పుకుంది. ఆపైన వెళ్ళి డాబా మీద వేసుకున్న మంచం మీద కూర్చుంది. ఎండ ఆమెకి చాలా బాగుంది. కొంచెం సేపట్లోనే ఆమె శాలువా తీసిపెట్టింది. తన శరీరాన్ని ఎండవేడి కాచుకోవడానికి వదిలిపెట్టింది.

అమ్మ తనతో ఉన్నప్పుడు ఆమె సెలవురోజును చలికాలపు మధ్యాహ్నం అమ్మతోనే డాబామీదనే గడిపేది. ఇద్దరూ ఎండలో చక్కగా కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకునేవారు. సమయం ఎలా గడిచిపోయేదో అసలు తెలిసేదికాదు. అమ్మ వేసే ఒక ప్రశ్నకి తను రోజూ జవాబు చెప్పుకోవలసివచ్చేది –“తల్లీ, నువ్వు ఎవరినైనా చూసివుంటే చెప్పు. లేకపోతే ఇన్ని సంబంధాలు వస్తున్నాయి. నువ్వు నాకు చెబితే ఎవరితోనైనా మాట కదుపుతాను.”

తను చెప్పేది- “అమ్మా, ఈలోకంలో పెళ్ళిఒక్కటే కాక ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. ప్రస్తుతం నేను నా కెరియర్ గురించి ఆలోచిస్తున్నాను. ప్రతిరోజూ నువ్వడిగే ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్పను?” అమ్మ తనలో తానే గొణుక్కుంటూ మెట్లు దిగి తన గదిలోకి వెళ్ళిపోయేది,

నిజానికి తను అమ్మకి ఏం జవాబు చెప్పేది? తనలో ప్రజ్వలిస్తున్న అగ్నిగుండం గురించి అమ్మ సానుభూతి తనకి లభించవచ్చునేమోకాని, దాని మంట తగ్గడం అనేది జరగదు. ఆ అగ్నితో మరుగుతూ పొంగుతున్న ఉష్ణజలం ఆవిరిగా మారి తన మనస్సునుండి, శరీరంనుండి శాశ్వతంగా తొలిగిపోతే ఎంత బాగుండును. ఇప్పుడయితే ఆ ప్రశ్నించే అమ్మకూడా తన దగ్గర లేదు. రోజూ అదే ప్రశ్న వింటూ ఒకరోజున తను చిరాకు పడింది. అమ్మతో తన వాగ్వాదం పెద్దదై అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. మర్నాడే తన సామాను పెట్టెలో సర్దుకుని తను పిలుచుకునే చెల్లెలు శారద యింటికి వాళ్ళ వూరు వెళ్ళింది. తనుకూడా కోపంలో అమ్మని ఆపుజేయలేదు. అమ్మ తన ఏకైక కుమార్తెని విడిచిపెట్టి దూరంగా చాలా రోజులు ఉండలేదని, ఏదో ఒక రోజున హఠాత్తుగా వచ్చి ఇంటి తలుపు తట్టి తనను చేతుల్లో చుట్టివేసుకుంటుందని  తను అనుకుంది. కాని, రోజులు నెలలలో దొర్లిపోయాయి. అయినా అమ్మ తిరిగి రాలేదు. తను ఎలావున్నదన్నది కనుక్కోలేదు కూడా. అమ్మ ఇంత కఠినహృదయంతో ఉంటే అమ్మని శాంతింపజేయడానికి వెళ్ళకూడదని తను కూడా నిర్ణయించుకుంది.

ఇప్పుడు ఆమె అవాంఛితంగా మథిస్తున్న కొన్ని ప్రశ్నలు తనను తానే అడుగుతూ ఉంటుంది. వాటికి జవాబులు లభించి ఈ బాధనుండి తను విముక్తురాలయితే ఎంత బాగుండును.

హేమేంద్ర మరో నగరం నుండి ట్రాన్స్ ఫర్ అయి వచ్చాడు. పని గురించి మాత్రమే అతనితో ఆమె మాట్లాడేది. అతను మాట్లాడే పద్ధతి ఆమెకి బాగా నచ్చింది. కాని, హేమేంద్రతో ఉన్న ఫార్మాలిటీ వల్ల ఆమె ఒక హద్దులో కట్టుబడి ఉంది.

ఒకసారి అనుకోకుండా అనారోగ్యం కారణంగా ఆమె నాలుగైదు రోజులు సెలవులో ఉన్న తరువాత ఆఫీసుకి చేరుకుంది. హేమేంద్ర తప్ప మిగిలిన అందరూ ఆమె ఆరోగ్యం ఎలావుందని అడిగారు. ఇందులో తప్పు పట్టుకునే కారణం ఏమీ లేనప్పటికీ ఆమెకి ఇది నచ్చలేదు. ఆమె కూడా అతనివంక చూడకుండానే తన పనిలో నిమగ్నమయింది. లంచ్ సమయంలో మొత్తం డిపార్టుమెంటు అంతా ఖాళీ అయిపోయినప్పుడు హేమేంద్ర లేచి ఆమె డస్కు దగ్గరికి వచ్చి ఆమె టేబిలు మీద ఒక కాగితం పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె ఉత్సుకతతో దాన్ని తీసి చూసింది. అందులో ఇలా రాసి వుంది –“వ్వును డుమూ-గులునా లుజురో డక్కఇ వులే, కునా వ్వును లాచా కంపజ్ఞా వుచ్చావ”. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. చాలా సార్లు ఆమె దాన్ని ఇటూ-అటూ తిప్పి చూసింది. ఇంక చేసేదేమీ లేక దాన్ని చింపి పారేయబోయింది.

అప్పుడే హేమేంద్ర త్వరగా లేచి ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు –“దీన్ని చింపేయకు. నేను పదాలలోని అక్షరాలు తలక్రిందులుగా రాశాను. మరెవరి చేతిలోనైనా పడితే వాళ్ళు దీన్ని చదవకుండా ఉండాలని.” ఈ మాట చెప్పి అతను అదే వేగంతో వెళ్ళి తన డస్కు దగ్గర కూర్చున్నాడు.

దాన్ని తలక్రిందులుగా చదివినప్పుడు ఆమె ఉత్సుకతకి హద్దు లేకపోయింది – “నువ్వు మూడు-నాలుగు రోజులు ఇక్కడ లేవు, నాకు నువ్వు చాలా జ్ఞాపకం వచ్చావు.” ఆమె వెంటనే ఆకాగితాన్ని మడిచి తన పర్సులో పెట్టుకుంది.

ఆమె కూడా మళ్ళీ తిరగేసిన భాషలో వ్రాసి జవాబిచ్చింది –“వ్వును న్నున స్ మి వుశాచే, కునా దిగుంబా.” నువ్వు నన్ను మిస్ చేశావు. నాకు బాగుంది. ఆ తరువాత వారి మధ్య ఇటువంటి చిన్న-చిన్న చీటీలు ఇచ్చిపుచ్చుకోవడం మొదలయింది. ఇద్దరూ వాటిని ఉత్సుకతతో తెరిచి చదువుకుని నవ్వుకునేవారు.

నెమ్మదిగా ఇద్దరూ పరస్పరం దగ్గర కాసాగారు. కలిసి తినడంతో మొదలైనది కలిసి తిరగడం వరకూ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీసుకి రాసాగారు. ఆమె ఆఫీసుకి రావడానికి బస్సు పట్టుకునే బస్సుస్టాప్ దగ్గరికి హేమేంద్ర చేరుకునేవాడు. ఇద్దరూ ఎప్పటికీ అంతంకాని మాటలు మాట్లాడుకుంటూ బస్సులో అరగంట చేసే ప్రయాణం కొన్ని నిమిషాలలో పూర్తి చేసేవారు. ఒకరికోసం మరొకరి ప్రేమ ఇంతింతగా ఎక్కువై రాత్రులు శాంతిలేకుండా గడిచేవి. ఉదయం కాగానే ఇద్దరూ కలుసుకునే క్షణం వరకూ నిరీక్షణ ప్రారంభమయ్యేది.

ఆరోజు ఆమె పుట్టినరోజు. హేమేంద్ర ఆమెతో అన్నాడు- “నీ బర్త్ డే మనం ఇద్దరమే కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.” ఆమె పులకరించిపోయింది. ఇద్దరూ ఆఫీసునుంచి సెలవు తీసుకున్నారు. చేతుల్లో చేతులు వేసుకొని ఎక్కడెక్కడో తిరిగారు. లంచ్ సమయానికి హేమేంద్ర ఆమెను ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మూలన ఉన్న సీటులో కూర్చున్నారు.

ఆమె హేమేంద్రతో అంది –“ఇవాళ ట్రీట్ నేనిస్తాను. ఏం తింటావో చెప్పు.” అతను చెప్పే జవాబుకోసం ఆమె ఎదురుచూస్తూ ఉండగానే వెయిటర్ బాగా అలంకరించిన ఒక కేక్ తీసుకువచ్చాడు. వారిద్దరిమధ్య దాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళలో ఉదయిస్తున్న ప్రశ్నకి జవాబుగా హేమేంద్ర నవ్వి ఆమెవంక చూస్తూ అన్నాడు –“ఇది నీకోసం. నేను నిన్ననే దీనికి ఆర్డరు ఇచ్చాను.” హేమేంద్ర ఇలా అనడంతో ఆమె ప్రభావితురాలైంది. మనస్సులోనే గత ఎన్ని రోజులుగానో తనలో రేకెత్తుతూ బయటికి రాలేని ఆ ప్రశ్నను ఆమె ఆరోజు అడిగేయాలని నిర్ణయించుకుంది.

లంచ్ అయినతర్వాత కాఫీ సిప్ చేస్తూ ఆమె హేమేంద్ర కళ్ళలోకి తొంగిచూసింది. అతని కళ్ళలో కదలాడుతున్న తన ప్రతిబింబాన్ని ఏకాగ్రంగా చూస్తూ ఆమె అంది –  “హేమేంద్రా, నేను ఇవాళ పూర్తిగా ఇరవైయేడేళ్ళ దాన్ని అయాను. ఇప్పుడు మనం పెళ్ళి చేసుకోవాలని నీకనిపించడం లేదా.”

“పెళ్ళి కూడా చేసుకుందాం. దానికి తొందరేముంది”– ఆమె రెండు చేతులనూ తన గుప్పిళ్లలోకి తీసుకుంటూ అతను అన్నాడు.

ఆమె అతని ముఖం వంక చూసింది. అతను ఇటువంటి జవాబిస్తాడని ఆమె అశించలేదు. కాని, ఆ క్షణంలో వున్న ఆనందాన్ని కోల్పోవడం తనకి ఇష్టంలేక మౌనంగా ఉండిపోయింది.

ఆరోజు అమె తన డస్కు దగ్గర కూర్చుని వేగంగా తన పని చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. హేమేంద్ర మూడురోజుల ట్రైనింగుకోసం మరో నగరానికి వెళ్ళాడు. అయినా, అలవాటు ప్రకారం ఆమె కళ్ళు మధ్య-మధ్యలో అతని డస్కువైపుకి చూస్తున్నాయి. ఆమె మూడు రోజులపాటు అతను లేకుండా గడపాలి.

ఈసారి ఆమె చూపులు హేమేంద్ర డస్కువైపు మరలినప్పుడు అక్కడ ఒక కుర్రవాడు నిలబడి ఆదుర్దాగా ఇటూ-అటూ చూస్తున్నాడు. ఆమె అక్కడినుంచే పిలిచి గట్టిగా అడిగింది – “ఏమిటి సంగతి? ఎవరు కావాలి?”

జవాబుగా ఆ అబ్బాయి ఆమెదగ్గరికి వస్తూ అన్నాడు –“నేను హేమేంద్ర అన్నయ్యని కలుసుకోవాలి. ఇక్కడే కూర్చుంటాడని ప్యూన్ చెప్పాడు.”

“అవును. ఇక్కడే కూర్చుంటారాయన. కాని ట్రైనింగ్ మీద బయటికి వెళ్ళారు. ఏమన్నా పనుందా ఆయనతో?”

“నేను ఆయన తమ్ముడు హిమాంశుని. కాలేజీ టూరుతో ఇక్కడికి వచ్చాను. హఠాత్తుగా వచ్చి ఆయన్ని సర్ ప్రయిజ్ చేద్దామనుకున్నాను. కాని ఆయనే నన్ను సర్ ప్రయిజ్ చేశాడనిపిస్తోంది. మేము రేపే తిరిగి వెళ్ళిపోతున్నాము. ఆయన్ని కలుసుకోవడం కూడా వీలుపడేలా లేదు.”

ఆ అబ్బాయి హేమేంద్ర తమ్ముడని తెలియగానే ఆమె వెంటనే కుర్చీ లాగి అతన్ని కూర్చోమని అంది –“కూర్చో. నీకోసం చాయ్ తెప్పిస్తాను.”

“వద్దు. అదేమీ ఇప్పుడొద్దు. ఇంక నేను వెడతాను. ఒక చిన్న ప్యాకెట్ ఉంది అన్నయ్యకోసం. వదిన పంపించింది. ఆయనకి మీరు ఇచ్చేస్తారా?”

ఆమె చేయి చాస్తూ అంది – “ఎందుకివ్వను? కాని ఆయనతో ఏ వదిన పంపించిందని చెప్పను?”

ఆమాట విని ఆ అబ్బాయి నవ్వాడు –“ఏ వదిన ఏమిటి? ఎవరూ ఆయన వదిన కాదు. నా వదిన. హేమేంద్రన్నయ్య భార్య.”

అతను చెప్పింది విని ఆమె నిశ్చేష్టురాలయింది. చేత్తో పట్టుకున్న ప్యాకెట్టు కింద పడిపోయింది. ఆమె వణుకుతున్న గొంతుకతో అడిగింది – “ఎప్పుడయింది వాళ్ళ పెళ్ళి?”

“అదే, ఇంచుమించు మూడేళ్ళయింది. ఒక చక్కటి కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళకి. వాడిని మేమంతా హేమేంద్ర జూనియర్ అని పిలుస్తాం.”

ఆమె మౌనంగా ఉండటం చూసి అతను అడిగాడు –“సరే, అయితే మరి నేను వెళ్ళనా? మీరు మీ పేరు చెప్పలేదు.”

అతి కష్టం మీద ఆమె నోట్లోంచి వెలువడింది –“మేఘ.”

“థాంక్స్ మేఘగారూ. రాగానే ఈ ప్యాకెట్ హేమేంద్ర అన్నయ్యకి ఇవ్వండి. వదిన ఏదో అవసరమైన వస్తువు పంపించింది.” ఆమె సరే అనే లోగానే హిమాంశు బయటికి వెళ్ళే గేటు దాకా చేరుకున్నాడు.

ఆమె అసలు నమ్మలేకపోతోంది. తను ఏదయినా పీడకల చూడలేదు కదా? కానిచేతిలోవున్న ప్యాకెట్టు వాస్తవానికి సాక్ష్యం చెబుతోంది. ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్లు, కడుపులో దేవుతున్నట్లు అనిపించింది. ఆమె ప్యాకెట్టుని టేబిల్ మీద పెట్టింది. లేచి వాష్ రూంకి వెళ్లింది. ఎంత ఆపుకున్నా దుఃఖం ఆగలేదు. చాలా సేపు వెక్కి-వెక్కి ఏడుస్తూ వుంది. కొంచెం సర్దుకున్న తర్వాత వచ్చి తన డస్కు దగ్గర కూర్చుంది. పనిలో ఆమె మనస్సు లగ్నం కావడం లేదు. ఒక భయంకరమైన నిజం ఆమె ఎదురుగా తల యెత్తి నిలబడివుంది. ఆమెకి లేచి ఎక్కడికయినా పారిపోవాలని, వేగంగా వీచే గాలిలో గట్టిగా శ్వాస తీసుకుని తనలో ఉప్పొంగుతున్న మిశ్రిత భావాలని బయటికి నెట్టేద్దామని అనిపించింది.

తరువాత రెండు రోజులపాటు ఆమె ఆఫీసుకి రాలేదు. పక్కమీద విరామంలేకుండా బోర్లా పడుకుని వుండటం చూసి అమ్మ అడిగింది –“ఏమ్మా, ఒంట్లో ఎలావుంది?”

“కాస్త తలనొప్పిగా వుందమ్మా.”

తల్లి ఆమె ఒళ్ళు స్పృశించి చూసింది. జ్వరం లేదు. తలనొప్పి బిళ్ళ ఒకటి ఆమె చేతిలో పెట్టి ఆవిడ ఇంటి పనులు చేసుకునేందుకు వెళ్ళిపోయింది.

ఆరోజు హేమేంద్ర ట్రైనింగ్ నుంచి తిరిగి వస్తాడు. తనకి ఆఫీసుకి వెళ్ళాలని అసలు అనిపించడంలేదు. అతడు బస్సుస్టాండ్ దగ్గర నిలబడి ఎప్పటిలాగానే ఆమెకోసం ఎదురు చూస్తూ ఉంటాడని తనకి తెలుసు. కాని, ఇంట్లోంచి బయటికి రాగానే, ఆమె ఆఫీసుకి వెళ్లడానికి టాక్సీ చేయించుకుంది. కొద్దిసేపట్లోనే ఆమె మొబైల్ మోగసాగింది. స్క్రీన్ మీద హేమేంద్ర పేరు మెరుస్తోంది. ఒకప్పుడైతే అతని కాల్ కోసం తను ఎంతో ఆత్రుతగా ఉండేది. అతని పేరు చూడగానే వెంటనే దాన్ని ఎత్తి చేతిలోకి తీసుకునేది. కాని ఆరోజు ఆమె దాన్ని నిర్లిప్తంగా చూసి మొబైల్ ఆఫ్ చేసి పర్సులో పెట్టుకుంది.

టాక్సీలో ఆమె సమయానికి ముందుగానే ఆఫీసుకి చేరుకుంది. తను లోలోపల ఎంత అస్థిరంగా ఉన్నా, పైకి మాత్రం అంతే స్థిరంగా ఉండి తన సీటులో కూర్చుని పని చేసుకోసాగింది.

హేమేంద్ర తన సీటు దగ్గరికి వెళ్ళకుండా తిన్నగా ఆమెవద్దకి వచ్చి కోపంతో మిశ్రితమైన స్వరంలో అన్నాడు- “నేనక్కడ నిలబడి నీకోసం ఎదురు చూస్తూవుంటే నువ్విక్కడికి వచ్చి కూర్చున్నావు. నా ఫోన్ కి కూడా జవాబివ్వలేదు. ఏమయింది?”

“ఏం లేదు”– అతని వంక చూడకుండానే డ్రాయరు తెరిచి ప్యాకెట్ అతనివైపు చూపిస్తూ అంది –“నీ తమ్ముడు హిమాంశు కాలేజీ టూరుతో రెండు రోజులు ముందు ఇక్కడికి వచ్చాడు. ఈ ప్యాకెట్ ఇచ్చాడు. నీ వైఫ్ పంపించింది.”

ప్యాకెట్ అందుకుంటూ హేమేంద్ర చెయ్యి అమితంగా వణికింది. అతడు ఆశ్చర్యంగా ఆమెను చూడసాగాడు. కొన్ని క్షణాలపాటు అతడు ఆ ప్యాకెట్ తన చేతిలో పట్టుకుని అలాగే నిలబడివున్నాడు. తరువాత కొంచెం ఆగి-ఆగి అన్నాడు –“మేఘా, నేను నీకు అంతా చెప్పాలనే అనుకున్నాను. కాని ఎప్పుడూ దీనికి అవకాశం దొరకలేదు.”

ఆమె మధ్యలోనే అతన్ని ఆపుజేస్తూ అంది –“మిస్టర్ హేమేంద్రా, నీ అసలు స్వరూపం అంతా బయటపడింది. నువ్వు నాకు ఏం చెప్పేవాడివి, నీకు పెళ్ళి అయిందని, నీకో కొడుకు కూడా ఉన్నాడని, అంతే కదా. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నన్నా, నీ భార్యనా లేక నీ ఆత్మనా?”

“నా మాట విను మేఘా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం నేను ఎవరినైనా విడిచిపెట్టగలను. నా భార్యని కూడా….”

ఆమె గట్టిగా అరిచింది –“సిగ్గు లేదా నీకు? ఈరోజే కాదు, ఈ క్షణంనుంచి ఎప్పుడూ నా పేరు కూడా ఉచ్చరించవద్దు.”

ఆమె బిగ్గరగా చెబుతున్నదానికి ఆఫీసులో అప్పటివరకు అక్కడికి వచ్చిన చాలామంది ఆమె వంక తిరిగి చూడసాగారు. హేమేంద్ర వెంటనే తన సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు.

తరువాత హేమేంద్ర ఎన్నోసార్లు ఆమెను కలుసుకునేందుకూ, ఆమెతో మాట్లాడటానికీ ప్రయత్నించాడు. కాని ఆమె మాత్రం తన జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది, కాని పసుపుకుంకుమలతో హేమేంద్ర కోసం ఎదురు చూసే ఆ అమాయకురాలి జీవితం తను నాశనం కానివ్వకూడదని నిశ్చయించుకుంది. ఆ తరువాత ఆమె చాలా ప్రయత్నం చేసి ఈ వూరికి తన ట్రాన్స్ ఫర్ చేయించుకుంది.

మరో వూరికి వచ్చి కూడా ఆమె మనస్సుకి శాంతి లభించడంలేదు. ఒంటరిగా ఉన్నప్పుడల్లా మనస్సులోనే మొత్తం గతం అంతా జ్ఞాపకం వస్తుంది. భగవంతుడు తనపట్ల ఇదంతా ఎందుకు చేశాడు. తను హేమేంద్రని తన జీవితంలోంచి తొలగించినా కూడా, తను ఎంత ప్రయత్నించినప్పటికీ అతడు తనకి ఎదురుగా నిలబడి కనిపిస్తున్నాడు. తను ఎన్నిసార్లో ఏడ్చింది. అలిసిపోయింది. ఆమె కన్నీళ్ళు ఇంకిపోయాయి. అయినా తను గతాన్ని తన మనస్సులోంచి తొలగించలేకపోతోంది. తను అమ్మకి ఏం చెబుతుంది?  తను ఎవరినైతే మనసారా ప్రేమించిందో అతను పెళ్ళి అయినవాడని, అతను కావాలనే తనని మోసం చేశాడనా. తను ఈ మోసం లోంచి ఎప్పటికీ తేరుకోలేననీ, జీవితంలో ఇంక ఏ వ్యక్తిపైన విశ్వాసం ఉంచలేననా. తను ఎప్పటికీ ఎవరినీ పెళ్ళి చేసుకోననా. ఆఫీసులో తనపట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకుంటూ, ప్రతిసారి తను కాదన్నప్పటికీ ఎటువంటి ప్రశ్నలు వెయ్యకుండా, నిరుత్సాహపడకుండా తనముందు మళ్ళీపెళ్ళిప్రస్తావన తీసుకువచ్చే వికాస్ ని కూడా.

ఆమెకి కొంచెం చలిగా అనిపించింది. ఎండ ఆమె మంచాన్ని విడిచిపెట్టి ముందుకి జరిగింది. ఆమె లేచి మంచాన్ని ఇంకా ఎండ వున్న చోటికి జరుపుకుంది. ఎండవేడి ఆమెకి ఊరటనిచ్చింది. ఆమె మళ్ళీ మంచం మీద నడుం వాల్చింది. తనకి అమ్మ జ్ఞాపకం బాధిస్తోంది. తను అమ్మకి వాస్తవం అంతా చెప్పి వుండవలసింది. కాని, ఎప్పటికీ పెళ్ళి చేసుకోకూడదన్న తన సంకల్పం గురించి అమ్మకి ఎంత మాత్రం కూడా తెలియడం తనకి ఇష్టం లేదు. ఇది తెలిస్తే ఆవిడ కుంగిపోతుంది.  అందువల్లనే బహుశా తను ఆవిడ కోపాన్ని, దూరంగా ఉండటాన్ని సహించుకుంది.

ఎండ వేగంగా దొర్లిపోసాగింది. దాని వెలుగు క్రమంగా తగ్గింది. కొద్దిసేపట్లోనే ఎండ ఆమె మంచం వేసుకున్న చోటునుంచికూడా మరింత జరిగి ముందుకి వచ్చింది. మంచానికి చివర కొంచెం ఎండ మిగిలింది. ఆమె లేచి వెళ్ళి అక్కడ కూర్చుంది.

కొన్ని రోజుల క్రిందటనే వికాస్ తల్లిగారు కాలం చేసింది. తను వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళలేకపోయింది. వికాస్ మళ్ళీ ఆఫీసుకి తిరిగి వచ్చినప్పుడు తను ఓదార్పుగా రెండు మాటలు చెప్పింది. అతను వెక్కివెక్కి ఏడ్చాడు –“మా అమ్మ తను బ్రతికి ఉండగా నా పెళ్ళిని చూడాలని ఎంతగానో ఆశించింది. నువ్వు అంగీకరించి వుంటే ఎంతబాగుండేది మేఘా.”

ఆమె చిరుకోపంతో అంది –“ఎందరో ఆడపిల్లలున్నారు. ఎవరినైనా పెళ్ళిచేసుకుని మీ అమ్మగారి కోరిక నెరవేర్చి ఉండవచ్చుకదా.”

“నీకు అర్ధం కాదు మేఘా. సరే, అదంతా విడిచిపెట్టు. చిన్నదైన జీవితం. ఎప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో తెలియదు. ప్రతి వ్యక్తి తన కోరికలు తీర్చుకునే ఈ లోకంనుంచి నిష్క్రమించడం అవసరమా.”  ఆమె ఏమీ మాట్లాడకుండా అతని దగ్గరినుంచి లేచి వచ్చేసింది.

ఇప్పుడిప్పుడే ఒక చల్లని గాలివిసురు ఆమెని స్పృశించి వెళ్లింది. ఆమె కూర్చున్నచోట నుంచి కూడా ఎండ జరిగిపోయింది. దాని శకలం ఒకటి గోడ దగ్గర నిలబడి ఆగింది. ఆమె త్వరగా శాలువ కప్పుకుంది. గోడమీద అతుక్కునివున్న, అక్కడినుండి కూడా వెళ్ళిపోవడానికి త్వరపడుతున్న ఆ ఎండలోని భాగం దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆ ఎండలోని అంశాన్ని తన గుప్పిట్లో నింపుకుని ఎప్పటికీ తనదగ్గర ఉంచుకో గలిగితే ఎంత బాగుండును. చలితో వణుకుతున్న ఆమె దేహం, లోపలి పొరల్లో గడ్డకట్టిన మంచుతో కంపిస్తున్న ఆమె మనస్సు వేగంగా విచలితం కాసాగింది. జీవితంలోని ఎండ కూడా నెమ్మదిగా తన చేతుల్లోంచి జారిపోవడాన్ని చూసి ఆమె నిశ్చేష్టురాలయింది. కాలం గతిని ఎవరు ఆపుచేయగలిగారు, అంతేకాక కాలం అనేది ఎవరికోసం ఆగింది. జీవితంలోని ఎండ ఎప్పుడు సాయంత్రంగా, ఎప్పుడు రాత్రిగా మారుతుందో ఎవరు తెలుసుకోగలరు.

ఎండలోని ఆ భాగం గోడ పైనుండి ఎక్కడో అనంతవిశ్వంలో కలిసిపోయే ప్రయత్నంలో ఉంది. ఆమె దాన్ని అక్కడే విడిచిపెట్టి కిందికి వచ్చేసింది. ఆమె మనస్సులో వికాస్ చెప్పిన మాట పరిభ్రమిస్తోంది –“చిన్నదైన జీవితం. ఎప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో తెలియదు.”  జీవితంలోని ఎండ పూర్తిగా జరిగిపోయేలోగా అమ్మ వాత్సల్యానికి, వికాస్ ప్రేమకి చెందిన వెచ్చదనాన్ని గుప్పిట్లో భద్రంగా ఉంచుకోవాలి. అప్రయత్నంగానే ఆమె పెదవులమీద ఆ ఎండ శకలం లాంటి మెరుస్తున్న మందహాసం తొంగిచూసింది.

***

డా. రమాకాంత శర్మ – పరిచయం

1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత శర్మ 100కి పైగా కథలు వ్రాశారు. పది కథాసంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, ఎనిమిది నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాలపైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.