నాన్నని పోగొట్టుకుని !    

– రేణుక అయోల  

  1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –

      ప్రవాహంలో నాన్న జీవితం –

      పాదాలని కడుగుతూన్న గోదావరి 

      అలలకి నా దుఃఖం వో చినుకు 

     నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం 

     ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో 

     అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది 

     నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం 

     ఇప్పుడది ఎముకలు ,బూడిద  అనుకుంటే 

     దుఃఖం గొంతులోనే ఉంది చినుకులా  రాలకుండా –

     మెత్తటి చేతుల జ్జాపకం మెడచుట్టు  అల్లుకున్నాయి 

     నువ్వు నదివి , గాలివి ,నేలవి అనుకోవడం  కష్టంగా ఉంది 

 

   2    ఇల్లు ఖాళీగా లేదు 

       వో చీకటి గుహ దేహంలోకి  ప్రవేశించినట్టు ఉంది  

       చిన్న వెల్తురు చొరబడని అడవిలా ఉంది 

       నువ్వు  గతం అనుకోవడానికి  భయంగా ఉంది 

       ఎన్నో సార్లు  ఒక్కమాటతో పొందిన ధైర్యం 

       ఇప్పుడు లేదు బెంగ మాత్రమే  రేపటిలోకి తొంగి చూస్తోంది 

       ఇంటి గేటుకి  తాళం వెయ్యాలి 

       దారి   దొరకని అడుగులు  తడబడ్డాయి 

       వెనక్కి వెనక్కి తిరిగి చూడాలి అనుకుంటే 

       నొప్పి పుండులా సలుపుతోం ది 

       నవ్వుతున్న రూపాన్ని కంటి పలకలపై చెక్కుకుని 

      రెప్పపడినా  కరగని ప్రేమతో బాధతో వో చినుకుని  దాచుకున్నాను 

 

      3  మట్టి దుప్పటితో జీవితాన్ని ముగించేసి 

         ఆకుపచ్చని  చిగురులు చేత్తో పట్టుకుని  ఎగురుతున్న సరే 

          నాన్నని పోగొట్టుకుని !

          ఈ  అక్షరం ఇక్కడ ఇమడక 

         పొడి నేలమీద రాలిన పెద్దచినుకులా నన్ను తడిమింది ….  

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *